adarshamoorthulu


అపర గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామానుజన్

Ramanujan


“పుణ్యభూమి నా దేశం నమో నమామి! నన్ను కన్న నా దేశం సదా స్మరామి!”

ఇది నిజంగా అక్షరసత్యం. మన భారతదేశ చరిత్ర పుటలు ఎన్నో గొప్ప విషయాలు, సత్యాలతో నిండి ఉండాలి కానీ, కొన్ని విషయాలు మాత్రమే మనకు గోచరిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గణిత శాస్త్రాలకు ఆయువుపట్టై, నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక సాంకేతిక కంప్యూటర్ పరిజ్ఞానానికి మూలం అయిన సంఖ్య ‘సున్నా’ అని ఎంతమందికి తెలుసు? అంతేకాదు ఆ ‘సున్నాను’ కనుగొన్నది మన భారతీయుడు అని ఎంతమందికి తెలుసు? పిన్న వయసులోనే ఎంతో ప్రజ్ఞా పాటవాలను కలిగి గణితశాస్త్రం లో ఒక ముఖ్యభాగమైన త్రికోణమితి యొక్క ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన అపర మేధావి మన భారతీయుడని ఎంతమందికి తెలుసు? భౌతిక శాస్త్రంలో, వృక్ష శాస్త్రంలో భారతీయ శాస్త్రవేత్తల మేధాసంపత్తి అనిర్వచనీయమని మనలో ఎంతమందికి విదితం. అయితే ఈ మధ్య కాలంలో అంతర్జాల పరిజ్ఞాన సహాయంతో మనందరం గర్వపడే రీతిలో ఎన్నెన్నో స్ఫూర్తిని రగిలించే విషయాలు తెలుస్తున్నాయి.

మన మేధస్సుకు పదునుపెట్టి పాశ్చాత్యులు, బాహ్యప్రపంచానికి ఎన్నో నూతన విషయాలను పరిచయం చేశారు. కానీ భారత దేశ చరిత్ర పుటలలో అంతటి మేధావులకు సరైన గుర్తింపు లభించలేదని నా అభిప్రాయం. ఎందుకంటే, దైనందిన జీవన పోరాటంతో సతమతమవుతున్న సగటు మనుషులతో నిండిన మన సమాజం, ఓపికగా, తీరికగా కూర్చొని చరిత్రను తిరగేసే సాహసం చెయ్యదు. అందుకే మన భారతీయ మేధావులకు భారతదేశంలో లేని, దొరకని గుర్తింపు ప్రపంచంలో లభిస్తున్నది. శాస్త్రపరిజ్ఞానం, మేధాసంపత్తి వలస పోవడానికి అది కూడా ఒక కారణం.
గణితంలో అపరమేధావియై పిన్న వయసులోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘ఫెలో అఫ్ రాయల్ సొసైటీ’ పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్ నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

1887 డిశంబరు 22న, మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో ఒక పేద కుటుంబంలో శ్రీనివాస రామానుజన్ జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది.

Mathచిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు. ముఖ్యంగా గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై విపరీతమైన ఆసక్తి కనబరచి మిగిలిన అంశాలను అంతగా పట్టించుకునేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌లో అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. అయినను తన పట్టుదలను సడలించక తన ఆలోచనలనన్నీ గణిత శాస్త్రం మీదే ఉంచి  సదా సంఖ్యా ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. రామానుజన్ మేధా సంపత్తికి మచ్చుకి  తార్కాణం ఈ చమత్కార పూరిత చతురస్రం. ఇటువంటి సంఖ్యా సిద్దాంతాలు ఎన్నో తన పన్నెండో ఏటనే ప్రతిపాదించాడు.

అయితే ఆకలి ఎటువంటి వారినైనా ఆందోళనకు గురిచేస్తుంది. పేదరికం వెంటాడుతుంటే తప్పని పరిస్థితిలో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు, కానీ తన సిద్ధాంతాలకు సరైన గుర్తింపు లభించలేదనే బెంగ ఎప్పుడూ ఉండేది. అందుకే అప్పటికే గణితశాస్త్రంలో పండితులై, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శాస్త్రవేత్తలకు తను ప్రతిపాదించిన సిద్దాంతాలు పంపేవాడు. కాలం కలిసొచ్చి హార్వే అంతటి గణిత మేధావి దృష్టిని ఆకర్షించాడు. 1914 సంవత్సరంలో రామానుజన్ ఇంగ్లండుకు వెళ్లే బృహత్తర అవకాశం వచ్చింది. ‘ఫెలో అఫ్ రాయల్ సొసైటీ’ సభ్యత్వాన్ని మరియు వేతనాన్ని పొందాడు. ఇంగ్లాండ్ వెళ్లి ఆచార్య హార్వే మార్గదర్శకత్వంలో నిద్రాహారాలు మాని కఠోర పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు.

సంప్రదాయ ఆచార వ్యవహారాలూ, శాకాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లండులో స్వయంపాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన తీవ్రమైన అనారోగ్యానికి గురైనాడు. అయితే ఆ సమయంలో తనను కలవడానికి ట్యాక్సీ లో వచ్చిన హార్డీకి ఆ ట్యాక్సీ నెంబరు అయిన 1729 సంఖ్యను గుర్తించి  ‘ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య; రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది’ అని దాని ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం.

Ramanujan


అంతటి ప్రతిభావంతుడైన రామానుజన్ సదా గణిత ప్రపంచంలో మునిగిపోయి తన సొంత ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కూడా నిర్ల్యక్షం చేశాడు. చివరకు అతి చిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని వీడి సుదూర ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. కానీ గణితశాస్త్రంలో ఆయన అందించిన ఆ మధురఫలాలు నేటికీ ఎంతో మంది విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రతిసంవత్సరం డిసెంబర్ 22 వ తేదీని జాతీయ గణితదినోత్సవంగా జరుపుకుంటూ ఆ మాహా మనీషి పుట్టినరోజును గుర్తుచేసుకోవడం నిజంగా ఎంతో ఆనందదాయకం. ఈ మధ్యకాలంలో ఆయన జీవిత చరిత్రను అంతర్జాతీయ చలన చిత్రంగా రూపొందించి నేటి తరానికి కూడా ఆయన ఉనికిని చూపిన నిర్మాత దర్శకులు నిజంగా అభినందనీయులు.

 

divider

 

Source1, Source2, Source3, Source4, Source5

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్