Ankurarpana


ఈ సృష్టి ఎంతో అద్భుతమైనది ... పశుపక్ష్యాదులు .. జీవనదులు … పంచభూతములు … సూర్యచంద్రులు ... వీటన్నింటి మధ్య మానవులు. ఇది ఇంకా అద్భుతము కదూ! ఆ భగవంతుడు సృష్టించిన మానవులలో ఆడ, మగ ఇది ఎంతో అపురూపము. ఆదేవుడు ఇరువురికీ సమానమైన హక్కులు, శక్తి సామర్ధ్యాలు ఇచ్చాడు. అయితే తాను సృష్టించిన ఈ అందమైన లోకము కొనసాగాలంటే ఆడ, మగ మధ్య ఆకర్షణ ఉండాలి. కనుక అమ్మాయికి అందాన్ని ఆభరణముగా ఇచ్చి, ఆమెను అతివను చేశాడు. అబ్బాయికి శరీర ధారుడ్యాన్ని, శక్తినీ, సంతాన సామర్ధ్యాన్ని ఇచ్చి, మగవాడిగా చేశాడు. అతివకు ఇంటిని చక్క దిద్ది, పిల్లలను కనే వరాన్ని ప్రసాదించి, ఇల్లాలిని, ‘అమ్మ’ ని చేశాడు. అబ్బాయికి కుటుంబాన్ని పోషించే శక్తిని ప్రసాదించి, ఇంటి యజమానిగా, ‘నాన్న’గా మలిచాడు. ఈవిధముగా అతడు..ఆమెను సంసారము అనే బంధం లో బంధించి, అమ్మా-నాన్న, కొడుకు - కోడలు, కూతురు - అల్లుడు, తాతా - బామ్మ ఇలా అందమైన బంధుత్వాలను ఏర్పరచి .. ఆడ, మగ మధ్య ఎటువంటి తారతమ్యాలు, పక్షపాతము లేకుండా ఈ సృష్టిని ఆ భగవంతుడు కొనసాగిస్తున్నాడు.

అయితే కాలానుగుణంగా మనిషి జీవన పథంలో ఎన్నో మార్పులు చోటుచేసుకొని నేటి పరిస్థితి ఇందుకు భిన్నముగా ఉన్నది.  మగవాళ్ళతో మాకూ సమాన హక్కులు కావాలి అని మహిళలు పోరాటాలు చేస్తున్నారు.  ఆ భగవంతుడే మనకి సమానమైన హక్కులు ప్రసాదించినపుడు ఇంక ప్రత్యేకమైన పోరాటము ఎందుకు? ఒక ప్రక్క మేము మగవాళ్ళతో ఎందులోనూ తీసిపోము అని అన్ని  వర్గాలలోను దూసుకు పోతున్న మహిళలు.. మరో ప్రక్క మగవారి చేతిలో బలి అయిపోతున్న అమ్మాయిలు.. ఎటువైపు పయనిస్తుంది మన వ్యవస్థ? భర్త చేతిలో బాధింపబడుతున్న భార్య.. భార్యా బాధితుడిగా నమోదవుతున్న భర్త.. అత్యాచారానికి గురియవుతున్న అమ్మాయిలు...అత్తని సాధిస్తున్న కోడలు...కోడల్ని రాచిరంపాన పెడుతున్న అత్త...ఇలా ఎన్నో అరాచకాలను వింటున్నాము..చూస్తున్నాము...దేశం నలుమూలలా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. అసలు వ్యవస్థ ఎందుకు ఇలా తయారు అయ్యింది? ఏనాడయినా ఆలోచించారా? అసలు ఈ సమస్యకి మూలము కనుగొన్నారా ఎవరైనా?

తల్లి గర్భములో బీజానికి అంకురార్పణ జరిగినపుడు ఆబిడ్డ ఈ లోకములోకి వచ్చినపుడు ఆ భగవంతుని సృష్టి అందరి పిల్లలలో ఒకేలా ఉంటుంది. కానీ ఆ బిడ్డ పెరిగే వాతావరణములోనే కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిడ్డ పుట్టినప్పటినుండి తల్లీ తండ్రీ వాళ్ళకి సరైన నడవడిక నేర్పితే ఈ సమస్య రాదు. ఎందుకు కొంత మంది పిల్లలు సంస్కారవంతులుగా, కొందరు ఆకతాయిలుగా, మరికొందరు నేరస్తులుగా తయారవుతున్నారు? నేను ఇక్కడ తల్లితండ్రులను తప్పుబట్టడములేదు కానీ, ప్రతి తల్లీ, తండ్రీ ఎంతో బాధ్యతతో తమ పిల్లలను పెంచాలి, మంచి నడవడికను నేర్పాలి. ఎంతో ఓర్పుగా వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దితే నేడు దేశములో ఇన్ని అనర్ధాలు ఎందుకు జరుగుతాయి? ఒక ధనవంతుడైన తండ్రి తన బిడ్డలకు కష్టము, సుఖము అన్నీ తెలిసేటట్లు పెంచాలి. అలా కాకుండా గారాబముగా ఏ కష్టము తెలియకుండా పెంచితే జీవితములో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను ఎదుర్కొనలేక ఇబ్బంది పడతారు, నలుగురిని కూడా ఇబ్బంది పెడతారు. తల్లిగా అమ్మాయికి అన్ని అణుకువలు, మెళకువలు నేర్పాలి. అలాగే అబ్బాయికి కూడా అన్ని సంసార బాధ్యతలు తెలియచెప్పాలి లేదంటే సంసార సాగరములో పయనించలేక వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి.

 

తరువాయి భాగం »

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్