అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల

← గత భాగము

ఆ పున్నమినాటి  పండువెన్నెలలో - ఏదో ఆలోచనలో ఉండి, చెక్కిలికి చెయ్యి చేర్చుకుని ఆకాశం వంక చూస్తూ, శిల్పులు చెక్కిన శిలావిగ్రహంలా బట్టలుతికే రాయిమీద కదులూ మెదులూ లేకుండా కూర్చుని ఉన్న కన్నయ్య కనిపించాడు ఎల్లమ్మకి. కొడుకును చూడగానే ఎల్లమ్మకు కడంటిపోయిన ప్రాణం లేచివచ్చింది. ఒక్క ఉదుటున అతని దగ్గరకు నడిచింది. కొడుకు దిగులేమిటో ఆమెకు తెలుసు. దానికి పరిహారమేమిటో కూడా ఆమెకు తెలుసు. కానీ అలా జరగాలంటే, దానికి కాలం,కర్మమ్ కలిసిరావాలికదా – అనుకుంది ఆమె. కన్నయ్య ఇంకా బారెడు దూరంలో ఉండగానే, ప్రేమ ఉట్టిపడేలా ఎలుగెత్తి, “కన్నయ్యా!” అని పిలిచింది.  ఎటూకాని ఇటువంటి వేళలో తనని పిలిచేది ఎవరో వెంటనే గుర్తించలేక, ఉలికిపడ్డాడు కన్నయ్య.

అంతలో ఎల్లమ్మ దగరగా వచ్చి, కొడుకు బుజమ్ మీద చెయ్యేసి, “ఇదేందిరా, ఈడ కూకుండిపోయావు” అని అడిగింది. ఆమె కంఠస్వరంలో ధ్వనించిన ఆర్తి సూటిగా అతని హృదయాన్ని తాకింది.   

“సందమాటేల ఏదో కూంతoత తిని, పిసరంత నల్లమందు మింగి, ఒళ్ళు తెలియకుండా నిద్దరోయి, మల్లీ నాను ఏటకి బయలెళ్లే ముందు లేపితేగాని లెగవని అమ్మకి, ఇయ్యేలిలా - ఇంకా శానా రేత్తిరి ఉండగానే మెలకువ వచ్చినా దంటే, ఆయమ్మ తలలోకూడా ఏయో సముద్దరాలు ఉబికి ఉప్పెనౌతున్నాయని అర్దం సేసుకోవచ్చు” అనుకున్నాడు కన్నయ్య కలవెళ పడుతూ.

ఆప్యాయంగా తల్లీమీద వాలి, “అమ్మా” అంటూ ఆర్తిగా పిలిచాడు. ఎల్లమ్మ కొడుకుని దగ్గరగా తీసుకుని, అతని జబ్బకు కట్టిన తాయెత్తుని తడుముతూ, “ ఎంత సిక్కిపోయినావురా కొడకా! నా కసలు బుద్దిలేదు, పదిరూపాయీలకు మొగం జూసుకుని శాన్నాళ్ళు ఆలీసమ్ శేసాను. దేవుడమ్మ నన్ను బాగా సీవాట్లేసిందిలే, “నువ్వో ఎర్రి నాపసానివి కాపోతే ఏంటీ, ఇంతాలీసెమ్ శేసావు? నీ కొడుకు తొక్కుడు తొక్కి శాన్నాళ్ళైనాది. ఇంకొన్ని రోజులు గీని ఆలీశమ్ సేసివుంటే గోరమైపోయీది, తిప్పికొట్టడం ఇక నా వొల్లనయ్యీదికాదు. నీ గేశారమ్ బావుండి ఇప్పుడైనా వొచ్చావు”  అని ఆమెయిని కూకలేసిందిరా! ఒక్కగానొక్క బిడ్డడివి, ఏంటయ్యీదో ఏమో! ఇప్పటికైనా ఎల్లాగనక సరిపోయింది.” అలా అంటూన్నప్పుడు ఎల్లమ్మ కంఠం దుఃఖంతో ఒణికింది.

తల్లికి తనపై నున్న ప్రేమ, ఆమె తనకోసం పడుతున్న ఆరాటం కన్నయ్య మనసును కుదిపేసింది. తనింతవరకు తన బాధను గురించే ఆలోచిస్తున్నాడుగానీ, తనతల్లి పడుతున్న బాధను గురించి ఆలోచించడంలేదు - అలా అనుకూనీసరికి అతనికి ఒక్కసారిగా ఏడుపు పొంగివచ్చింది. “ అమ్మా! నేను శానా పెద్ద తప్పు సేశానమ్మా... ఎంతసేపూనా యిసయమే ఆలోసించానేగాని, నువ్వు పడుతున్న బాదను గురించి ఆలోసించనే లేదమ్మా! నా నేడిస్తే నువ్వు ఏడుస్తావు, నాను నవ్వితే నువ్వు నవ్వుతావు. నీ ప్రేణాలన్నీ నామీనే ఎట్టుకుని బతుకుతున్నావు. నాకే గేనమ్ లేకపోయిందమ్మా , నన్ను ఛమించమ్మా, ఛమించు” అంటూ నేలమీదికంతా జారి తల్లి కాళ్ళు పట్టుకున్నాడు కన్నయ్య.

“ మన మద్దెన ఛమించడాలేంట్రా ఆబ్బయా! నా న్నీ అమ్మనుగానా” అంటూ, మనసంతా నిండిన ప్రేమతో ఎల్లమ్మ కొడుకుని లేవదీసుకుని, తన మంచం దగ్గరకి నడిపించుకుని పోయింది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు.

కొంతసేపు ఇద్దరూ ఏమీ మాటాడుకోకుండా ఉండిపోయారు. కొంతసేపయ్యాక ముందుగా ఎల్లమ్మే మాటాడింది. “కన్నయ్యా! నీ బాద నాకు తెలుసురా... ఎన్నాల్లిలా ఒంటిగా ఉంటావురా! లచ్చిమి సెప్పింది, ఆళ్ళ పింతల్లి కూతురు పెల్లికున్నాదంట. ఆళ్ళకి ఓలి మరీ అంతసేటు నిక్కచ్చేం కాదంట! శాత్తరానికి రెండో, మూడో వందలిత్తే శానంట. “దగ్గరలో ఉన్న మూర్తానికే పెళ్లి జరిపించేద్దారి”  అందిరా లచ్చిమి. ఓలికని దాసిన సొమ్ము ఏపాటుందో ఓపాలి లెక్కేసి సూడు, పిల్లని సూసొద్దారి. అన్నీ సరిపోతే అప్పటికప్పుడు పసువూకుంకా లుచ్చేసుకుందారి. ఇక ఆలీసమ్ వద్దు, ఏటంటావు” అని అడిగింది ఎల్లమ్మ. కన్నయ్యకు ఏంమాటాడాలో తోచక తల వాల్చుకుని ఉండిపోయాడు.  మళ్ళీ ఎల్లమ్మే అందుకుంది, “ ఈ తలికే ఊళ్ళో అంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు, “ఇంకా ఎన్నాల్లే అప్పా! కీళ్లనెప్పులతో నీకీ తగులాటమ్? కోడలు నట్టoట కాలెడితే నీకీ ఇరకాటబ్బతుకు తప్పుద్ది గందా! నిన్నది కూకోమెట్టి, ఎచ్చెచ్చని కూడు ఇస్తరిలో ఎట్టదా ఏంటీ” అంటన్నారు. రోజురోజుకీ నాను కూకున్నసోటినుండి లేగలేకపోతున్నాను. నువ్వు “సై” అంటేశాను లచ్చిమి ఆళ్ళకు కబురెడతానంది. ఏటంటావు?”

ఇబ్బందిగా కదిలాడు కన్నయ్య, “అమ్మా! ఈ జలమలో నాకు మనువాశ తీరదే! అది నా నొసట రాయలేదు ఆ బగమంతుడు. నన్నొగ్గెయ్యమ్మా, మనువు కావాలనుకుంటే నాను మరో జనమమెత్తాల్సిందే!”

ఎల్లమ్మ నొచ్చుకుంది, “ అదేంట్రా బుల్లోడా! అయ్యేమ్ ఊసులు? అలా అరిపేద ఊసులు సెప్పడానికి నీకేం తక్కువంట! నీకాడ అయిదారొందలుంటే సాను, లచ్చనంగా నీ పెల్లైపోద్ది. నికార్సయిన పిల్లను పెళ్లాడిన మొగోడికి ఆయుస్సు, అదురుట్టమూకూడా సక్కగా పెరుగుతాయి. తెగింపుగా కెరటాలకు ఎదురెల్లి, సముద్దరమ్ మీన ఏటసేసీ మొగోన్ని కాపాడి, ఒడ్డుకు సేర్చేది, మంచి మూర్తoలో  పెల్లాo మెడలో కట్టిన పసుపుతాడేరా! అసలు - నీమీన ప్రేణాలన్నీ ఎట్టుకుని, ఒడ్డున ఒక మణిసి  నీకోసం ఎదురుకాపులు కాస్తా ఉందంటే, ఆ ఆలోశన సముద్దరo మీనున్న నీకు ఎంత సత్తువ నిస్తాదో ఎరికేనా? ఆ సూపులే ఆపదవచ్చినప్పుడు ఇంటికి దారి సూపిస్తాయి. ఎరుక సేసుకుంటే - నీ భారియా మెడలో నువు కట్టిన తాళిబొట్టే నీకు శీరామరఛ్ఛౌద్ది. ఒప్పుకోరా, నువ్వు “సరే” అన్నావని లచ్చిమికి సేవితే ఎంటనే లచ్చిమి ఆళ్ళకి కాబూరెడతాది.”

“నువు సెప్పిందంతా బావుం దమ్మా! కానీ, ఇప్పుడు మనకాడ అయిదొందలు కాదుగదా, ఐదు రూపాయిలు కూడా లేవు. కరుసైపోయాయి.”

నిర్ఘాంతపోయింది ఎల్లమ్మ. అప్రయత్నంగా ఆమె కంఠం పెరిగింది. “ఏందిర అబ్బయా! నీ పెళ్ళికోసమని కట్టపడి నోరుకట్టుకుని, పైసాపైసా కూడబెట్టి దాసిన సొమ్మురా అది! ఎలా కరుసైనాది?”

 “ఇస్! గట్టిగా అరవబోకే, ఆయమ్మ లేగిసిందంటే బాగోదు. ఇనుకో , సెవుతా - ఆసుపత్తిరోళ్ళు, మీరు తెచ్చిన పేసంటు సావుబతుకుల మద్దెనుంది, ఖరీదైన మందులు పడితేగాని బతకదు, అయి మాకాడలేవు , మీరు కొనితెస్తే మేం వైద్యం సేత్తాము - అన్నారు. రకతం శానా పోయిందన్నారు. రకతమ్ కూడా కొనాల్సొచ్చింది. ఒక మణిసి ప్రేణమ్ ముక్యిమా , డబ్బు ముక్యిమా – నువ్వు సెప్పు ” అని ఎదురడిగాడు తల్లిని కన్నయ్య. 

తెల్లబోయింది ఎల్లమ్మ. కొడుకు ప్రశ్నకు ఔననీ, కాదనీ – ఏమీ చెప్పకుండా, “అసలు నువ్వా ఆసుపత్తిరికి ఎందుకెల్లేవురా? ఇంతమందుండగా నీకెందుకురా ఈ లేనిపోని తగులాటమ్? ఇగ శివరిమాట ఏంటంటే - నా మొగానికి కోడల్ని కళ్ల జూసుకునే రాత రాసిలేదు, అది అంతే” అంటూ ఏడవసాగింది.

“అసలా ఆసుపత్తిరికి ఎందుకెల్లేవురా” అని అడుగుతున్న తల్లి మాటకు కన్నయ్య ఏమని జవాబు చెప్పగలడు? “ఆ అమ్మని బతికించి పున్నెంగట్టుకో కన్నయ్యా, ఆ పున్నెం మనిద్దరినీ మళ్ళీ జలమలోనైనా కలుపుద్దేమో” అన్న చుక్క ఆశ గురించి తాను ఎవరికి చెప్పగలడు! చుక్క ఇచ్చిన పిడతలోని డబ్బు చాలకపోతే, ఓలికని తను దాచివుంచిన డబ్బుకూడా ఖర్చుపెట్టక తప్పలేదు. చుక్క తనది కానప్పుడు తనకింక మనువెందుకులే – అనుకుని దాచిన డబ్బంతా ఖర్చు చేసేశాడు కన్నయ్య. ఆమె బ్రతికినందుకు సంతోషించాడు. కానీ ఇప్పుడిలా తను ఇరకాటంలో పడతాడని అనుకోలేదు. తన తల్లి కోరిక తీర్చాలంటే తనకు డబ్బు కావాలి. కానీ, ఎలా?

ఇదంతా తను తల్లికి చెప్పినా ప్రయోజనం లేదు. ఆమె అర్ధం చేసుకోలేదు. ఆమెకు ఒక తియ్యని మాట చెప్పి, ఓదార్చాలి! ఈ రోజిలా గడిస్తే చాలు, రేపటిసంగతి రేపు ఆలోచించుకోవచ్చు - అనుకున్నాడు కన్నయ్య. “అమ్మా! నువ్వు మరీ అంత ఇదవ్వబాకే. సేసిన పున్నెం ఎప్పుడూ ఉత్తినేపోదు. ఓపాలి జరిగిపోయినది మళ్ళీ ఎనక్కిరాదు. నువ్విలా గోలసేత్తే ఆ యమ్మ లెగుస్తాది. మన ఊసులు ఆ యమ్మ గీని విన్నాదoటే, మనసు కట్టపెట్టుకుంటాది. మరో రెన్నాళ్ళు పోతే ఆ యమ్మ ఆళ్ళింటికి ఎలిపోద్ది, సెడ్డమాటే మిగిలిపోద్ది. నువ్వింక నిదరోయే అమ్మా! తొoదరగానే నే న్నీకో కోడల్ని అట్టుకొత్తాగా” అన్నాడు కన్నయ్య బెల్లింపుగా.

“నువ్వు సేసిన పున్నెం నిన్నెలా కాపాడుద్దో ఆ బగమంతుడికే తెలియాల” అంది ఎల్లమ్మ విరక్తిగా. కన్నయ్య ఏమీ మాట్లాడలేదు.  ఎల్లమ్మ నిస్త్రాణగా మంచం మీద పడుకుండిపోయింది. మనసులోని బాధను సంబాళీంచుకోలేక సణుగుతూ, గొణుగుతూ, ముక్కుతూ మూల్లుగుతూ కాసేపు అటూ ఇటూ దొల్లి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఎల్లమ్మ. కాసేపట్లో సన్నగా గుర్రు మొదలయ్యింది. తల్లిని సద్ది, సరిగాపడుకోబెట్టి, దుప్పటీకప్పాడు కన్నయ్య. అతనికింక నిద్రపోవాలనిపించలేడు. నెమ్మదిగా సముద్రంవయిపుగా నడవడం మొదలుపెట్టాడు.

ఆరోజు పూర్ణిమ కావడంతో, సముద్రపుటలలకు హుషారు హెచ్చింది. చంద్రుని అందుకోడానికన్నట్లు ఆకాశపుటెత్తుకి లేచీ ప్రయత్నంలో ఉన్నాయవి. తరగల వంచల్లో ఉన్న తుంపురులు ఆ వెన్నెలవెలుగులో వెండి రంగులో మెరుస్తున్నాయి. సముద్రం ఎన్ని చమత్కారాలు చేసినా, అందకుండా ఎత్తుగా ఉండి, విజయ్యగర్వంతో నవ్వుతూన్నట్లుగా వెండి వెన్నెలలు కురిపిస్తున్నాడు చందమామ.. ఆ సుధాపూరంలో ఓలలాడుతూ పరవశించిపోతోంది ప్రకృతి. మత్తుగా వీస్తోంది సముద్రపు గాలి. మనోహరంగా ఉండి వాతావరణం. కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు కన్నయ్య. కడుపులో బడబాగ్నిని దాచుకుని కూడా ఈ సముద్ర్రం ఇంతిలా హాయిగా ఎగిరెగిరి పడుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోందే, దానికి అదెలా సాధ్యపడుతోందీ అని ఆలోచిస్తూ, సముద్రంలోని తరగల్నీ, వాటిపై తేలే నురగల్నీ చూస్తూ అక్కడున్న బండరాయి మీద కూర్చున్నాడు కన్నయ్య. అంతలో “క్వాక్” మని కేకపెడుతూ  నారాయణ పక్షి(heron) ఒకటి అతని తల పైనుండి ఎగిరిపోయింది. దూరంగా ఉన్న పొలాల్లోనుండి నక్కల ఊళాలు వినిపిస్తున్నాయి. శల్యూష సమయం దగ్గరపడినడానికి గుర్తుగా గాలి చల్లబడింది. అంతలో ఆకాశంలో భ్రాహ్మీముహూర్తాన్ని సూచిస్తూ ఒక అలౌకికకాంతి పుట్టిoది. వెన్నెల మరింత వెల్లనయ్యింది. అంతవరకు స్పష్టాస్పష్టంగా ఉన్న వస్తువులుకూడా స్పష్టంగా కనిపించ సాగాయి.

నిద్రపట్టక మెలకువగా ఉన్న రాధమ్మ తల్లీ కొడుకుల సంభాషణ మొత్తం వింది. ఆమెకు పరిస్థితి అంతా అర్థమయ్యింది.  కన్నయ్య పెళ్ళికని దాచిన డబ్బు మొత్తం తన వైద్యానికి ఖర్చైపోయింది – అని ఆమె అర్థం చేసుకుంది. మళ్ళీ అంత డబ్బు సంపాదిస్తేగాని కన్నయ్యకి పెళ్ళి జరగదు. కానీ అంత సంపాదించడానికి ఎంతకాలం పడుతుందో! అంతవరకూ ముసలి ఎల్లమ్మ ఆశ తీరే దారి లేదుకదా - అనుకుంది ఆమె మనసులో. కానీ తానిప్పుడున్న స్థితిలో వాళ్ళకి తనే విధంగా సహాయపడగలదు? ఆలోచనలో పడింది ఆమె.

పంచలో పడుకున్న ఎల్లమ్మ గుర్రు తమాషాగా వినిపిస్తోంది.  రాధమ్మ మెల్లగా పక్కమీదనుండి లేచింది. తలుపు ఓరవాకిలిగా చేసి తొంగిచూసింది. దూరంగా సముద్రం వైపుకి వెడుతున్న కన్నయ్య కనిపించాడు. భయంతో ఒణికింది ఆమె.    

“కన్నయ్య సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోబోతున్నాడా ఏమిటి” అన్న ఆలోచన వచ్చీ సరికి ఆమె నిలునా నీరుకారిపోయిoది. “వీల్లేదు, ఒక్కనాటికి అలా జరగడానికి వీల్లేదు” అనుకుంటూ మనసులోనే ఆక్రోశించింది ఆమె.  నెమ్మదిగా తడిక తలుపు తెరుచుకుని, తానూ పరుగులాంటి నడకతో కన్నయ్యని అనుసరించింది.

వెన్నెల వెలుగులో వెండిలా మెరిసే అలలతో అందంగా, బహు సందడిగా ఉంది ఆ జలనిధి! అల్లంత దూరాన సముద్రపుటలలపై తేలుతూ నిద్రపోతోంది ఒక పక్షిగుంపు. పవలంతా అలలపై ఎగురుతూ, నీటిపై వాలుతూ చేపలను  వేటాడి పొట్టలు నింపుకుని, రాత్రి అయ్యాక ఆ అలలపైనే వాలి ఉయ్యాలలూగుతూ  నిద్రిస్తాయి ఆ పిట్టలు. గాఢనిద్రలో ఉన్న ఆ పక్షులగుంపు అకస్మాత్తుగా ఎందుకనో అలజడిపడి, ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. నీటిలో తపతపా రెక్కలు కొట్టుకుంటున్న చప్పుడు వినిపించి అంతలోనే సద్దుమణిగిపోయింది. ఏదో పెద్దచేప వచ్చి పక్షినిపట్టి ఫలహారం చేసేసింది కాబోలు! మృత్యువునుండి తప్పించుకోడానికి గాలిలోకి లేచిన పక్షుల గుంపు మళ్ళీ నీటిమీద వాలి, స్థిమితపడి అంతలోనే నిద్రపోయాయి. క్షణం క్రితమే తమ గుంపులోని ఒక జీవి దుర్మరణం పాలయ్యిందన్న స్పృహే లేదు వాటికి! జంతువులు, పక్షులు కేవలం  వర్తమాన కాలాన్ని మాత్రమే పట్టించుకుంటాయి. జీవరాశులన్నిటిలోనూ మనిషి ఒక్కడే భూతభవిష్యద్వర్తమానకాలాల్ని మూడింటినీ శోధించి, పద్ధతిగా బ్రతకాలని చూస్తాడు. అందుకే మనిషి బ్రతుకులో ప్రశాంతత తక్కువ. మనిషికి మనసే తీరని శిక్ష – అన్నారు అండుకే!

వాతావరణం ప్రశాంతoగా, చల్లగా ఉన్నా కన్నయ్య మనసుమాత్రం పరిపరి విధాలైన ఆలోచనలతో కల్లోలిత సాగరoలా ఉంది. అతని ఆలోచన, రాధమ్మ మీదకు పోయింది, “ఆ యమ్మ సముద్దరంలో తేలివచ్చిందంటే , ఇంటోవోళ్ళతో ఇరోదమొచ్చి కావాలని సముద్దరంలో పడ్డాదో, లేక పగోళ్ళెవరైనా తలమీదకొట్టి, మైకoలోఉన్న మణిసిని సముద్దరంలో ఇసిరి పారేశారో! పాపం, ఎనకటి బతుకు పూర్తిగా మరిసిపోయినాది! ఇప్పుడామె నెక్కడ దిగవిడిసిరావాలో ఏమో. ఇక్కడే ఉండిపోవాలంటే ఎలా వీలౌద్ది! గొప్ప సిక్కొచ్చిపడ్డాదే ...” అనుకున్నాడు దిగులుగా. అంతలో మనసు మరోవైపుకి పోయింది...

తానూ ఇప్పుడు కష్టంలోనే ఉన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన చుక్క ఇప్పుడు పరాయివాడి భార్య! పరాయివాడి పెళ్ళాం చెల్లెలితో సమానంట! అదంతా  తలుచుకుంటే ఎవరికైనా చచ్చిపోవాలనిపిస్తుంది.  కానీ, తను చచ్చిపోడానికి వీలులేదు. తనుపోతే తన ముసలి తల్లిని ఎవరు చూసుకుంటారు! మనసు కుదురు చేసుకుని ఆయమ్మ కోరినట్లు పెళ్లిచేసుకుని అందరిలాగే తానూ ఉండాలంటే ఓలికి చాలిన డబ్బు కూడా తనదగ్గర లేదు. కుంటిదైనా, గుడ్డిదైనా గాని ఎంతో కొంత ఓలి అడక్క మానరు. అది శాస్త్రమంటారు. ఇప్పుడు తనేం చెయ్యాలి?     “ఓ బగమంతుడా! ముందు నుయ్యి, వెనకాతల గొయ్యిలా ఉంది నాబతుకు! నా నేం సెయ్యాలిప్పుడు? నన్ను నువ్వే రచ్చించాల” అనుకున్నాడు కన్నయ్య బాధగా.

సముద్రంలో రెక్కలచేపల గుంపు వెన్నెల విహారానికి వచ్చాయి గావును! ఉండుండి ఒక చేప పైకంతా ఎగిరి, గాలిలో తేలి తిరిగి నీటిలో పడుతోంది. వెన్నెల వెలుగులో ఆ చేపలపొట్టలు తళతళా మెరిసి కళ్ళు మిరిమిట్లు అయ్యీలా చేస్తున్నాయి. కెరటాలకు దూరంగా ఒడ్డుమీద మొలిచిన పొదలలో రాత్రి చరించే జంతువులేవో తమ ఇళ్ళకు వెళ్ళే సందడి వినిపిస్తోంది. అంతవరకూ ఇసకలో దూరి నిద్రిస్తున్న కీచురాయి నిద్రలేచింది కాబోలు, గీరు బారుమంటూ కర్ణకఠోరంగా “గీ” పెడుతోంది. పెద్ద కెరటం ఒకటి ఒడ్డుమీదికంతా ఎక్కివచ్చి విరిగి వెనక్కి వెళ్ళిపోయింది. కన్నయ్య ఉన్నచోటు నుండి లేచివెళ్ళి, కెరటాలకు అందనంత దూరాన బోర్లించివున్న పడవదగ్గరకు నడిచి, ఆ పడవనానుకుని నిలబడి, నిరాసక్తంగా సముద్రం వైపు చూస్తూ తన ఆలోచనలలో తాను ఉండిపోయాడు. అంతలో “కన్నయ్యా!” అంటూ మృదుస్వరంతో ఎవరో తన పేరుని పిలిచినట్లుగా వినిపించి ఉలిక్కిపడ్డాడు. ఈ సమయంలో ఎవరా తనను పిలిచినది అనుకుని ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూశాడు.

వెన్నెలవెలుగులో కన్నయ్య, తనకు ఎదురుగా రాధమ్మ కనిపించేసరికి నిర్ఘాంతపోయాడు. “ఇలా ఈ ఏళకాని ఏళలో అమ్మాయిగోరూ! ఇటచ్చినాఱేంటండీ” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.

“నా పేరు రాధమ్మ! అమ్మాయిగోరు కాదు.”

“అమ్మాయిగోరూ” అంటూ కంగారుపడ్డాడు కన్నయ్య.

“ఒక ముఖ్యమైన విషయం నీతో మాటాడాలని వచ్చా కన్నయ్యా! ఇకనుండీ నన్ను రాధ - అని పిలు, నాకదే ఇష్టం” అంది రాధమ్మ

“అదేంటి! అదెలా కుదురుద్ది? అమ్మాయిగోరూ! మన మద్దెన పరాసికాలొద్దండి” అన్నాడు కన్నయ్య.
“పరాచికం కాదు, ఇది పచ్చి నిజం! మనం పెళ్ళిచేసుకుందాం కన్నయ్యా!” ఏ ఉపోద్ఘాతం లేకుండా చల్లగా తన మనసులోని మాటను బయటపెట్టింది రాధమ్మ.

త్రుళ్ళిపడ్డాడు కన్నయ్య. “అమ్మాయిగోరూ!” కెవ్వుమన్నట్లుగా ఉండి ఆ పిలుపు. “తమరు తెలివిగా ఉండే అంటున్నారాండి ఆమాట. మీరేమో గొప్పింటి బిడ్డ, నానేమో మరకాళ్ళ కన్నయ్యని! మన మద్యెన సాపత్తెమెక్కడ! సాపత్తెమేలేనికాడ మను వెలా కుదురుద్ది? తప్పండి, ఇంకెప్పుడూ అలా అనమోకండి” అన్నాడు కఠినంగా కన్నయ్య.

రాధమ్మ రెండడుగులు ముందుకువేసి, అతనికి ఎదురుగా నిలబడింది. చిక్కి సగమైన ఆమె ముఖం లోని విశాల నేత్రాలు వింత కాంతితో మెరుస్తున్నాయి. గులాబీ రేకుల్లాంటి ఆమె లేతపెదవులు ఉద్వేగంతో ఒణుకుతున్నాయి. “కన్నయ్యా! నా గురించి చెప్పాలంటే -  నేనెవరో,  ఎక్కడినుండి వచ్చానో – గొప్పో, బీదో నాకూ తెలియదు, నీకూ తెలియదు. కానీ, నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు నేనెవరినీ కాకపోయినా, నువ్వు పెద్దమనసుతో నాకు వైద్యం చేయించి బ్రతికించావు. దానికై పెళ్ళికోసం నువ్వు దాచుకున్న డబ్బంతా ఖర్చుచేసేశావు. ఇదినాకు పునర్జన్మ. ఈ పుణ్యమూ నీదే, నా ప్రాణమూ నీదే! ఈ రాధమ్మ నీ స్వంతం. మన సమస్యలన్నింటికీ ఇదే పరిష్కారం ఔతుంది. కాదనకు కన్నయ్యా!“ ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది రాధమ్మ.

కన్నయ్య మనసు కదిలింది. గాఢంగా ఆలోచించాడు. రాధమ్మ చెప్పిన దానిలో సబవు ఉందనిపించింది. కానీ ఇంకా ఏదో భయం, మరేదో సంశయమ్ - మనసునుపట్టి పీడిస్తూండడంతో, “రాదమ్మా!” అని పిలిచాడేగానీ, మరోమాట మాటాడలేకపోయాడు. రాధమ్మే మాటాడింది మళ్ళీ ...

“కన్నయ్యా! దయ ఉంచి నన్ను నీ ఇల్లాలిగా చేసుకో. నావాళ్ళెవరో, నేనెక్కడికి వెళ్ళాలో తెలియని నాకు నీ హృదయంలో రవంత చోటిస్తే చాలు, నీ నీడలో హాయిగా బ్రతికేస్తా. బ్రతికున్నన్నినాళ్ళూ నీకు విశ్వాసంగా ఉంటా” అంది రాధమ్మ.

“ఇదేం ఊసు రాదమ్మా? సరిగా ఆలోసించే మాటాడతన్నావా? లేపొతే, తలకి దెబ్బతగిలి నీ మతిగీని సెలించినాదా ఏంటి? నువ్వెవరో నాకు తెలవదు గాని నాను మాత్తరం మరకోణ్ణి. సముద్దరమ్ మీదికెల్లి సేపల్నిపట్టడమే నా కులవురిత్తి. నన్ను పెళ్లాడితే అండరూ నిన్నుకూడా మరక్కత్తెవనే అంటారు. తోటి మరక్కత్తెలందరితోపాటు నువ్వుకూడా సేపలమ్ముకురావాల! లేపోతే ఇల్లు సజావుగా నడవాదు. గబ్బు గలీజు భరిస్తా, ఉప్పు సేపలు, ఎండురొయ్యలు తయారు సెయ్యాల! ఇయ్యన్నీ నీవొల్లనయ్యీ పనులేనా? లేనిపోని ఇసయాలు వద్దు. నీకు గ్నాపకం రాగానే నిన్ను తీసుకెళ్లి బద్దరంగా మీ ఇంటికాడ అప్పగిత్తా. ఇప్పుడు పోయి తొంగో, నీరసంగున్నావు.”

“మనసు లొంగితే మార్గం దొరక్కపోదు. నేను మరక్కత్తెలు చేసీ పనులన్నీ నేర్చుకుంటా. ఎబ్బెరికం ఉంచుకోను. మరకాడిని మనువాడి నేనూ మరక్కత్తెనౌతాను. నన్ను బ్రతికించిన నువ్వే నాకు బ్రతికే దారి కూడా చూపించాలి. నువ్వు కాదంటే నేనేమైపోవాలి? ఎన్నాళ్ళిలా నేను మీకు అతిధిగా ఉండాలి? ఎప్పుడో ఒకప్పుడు నాకు గడిచినరోజులు గుర్తు రావచ్చు, అసలు ఎప్పటికీ రాకపోనూవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి గమనించు కన్నాయా! మనం పెళ్ళి చేసుకుంటే, ఉండడానికి నాకొక స్తిరమైన చోటు దొరుకుతుంది, మీ అమ్మకు కోడలు, నీకు భారియా దొరుకుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. సరిగా అర్థం చేసుకో కన్నయ్యా! రేపు నాకు అంతా గుర్తొచ్చినా నేను నీకు ఎప్పటికీ భార్యగానే ఉంటా, మాటతప్పను. చావైనా, బ్రతుకైనా నీ తోటే! నన్ను నమ్మ.”

అప్రయత్నంగా కన్నయ్య బుర్ర గోక్కున్నాడు. “నువ్వేంటో పెద్దపెద్ద మాటలు సెప్పావుగాని, ఆయన్నీ నా కెరుకే కాలేదు. నేను మొరటోణ్ణి. కండలు కరిగించి బతికేటోన్ని. ఎంత కట్టం సేసినా సాలీశాలని బతుకులు మాయి. నాతో నువ్వేం సుకపడగలవు రాదమ్మా. గట్టిగా ఆలోసించి సూడు.”

“నేను బాగా ఆలోచించే మాటాడుతున్నా. నువ్వు మనిషివి మోటు కావచ్చు, కానీ నీ మనసు వెన్న! నీ చల్లని నీడలో నువ్వు నాకింత చోటు ఇస్తివా, నేనెప్పడూ నీకు బాధకలిగించే పనేదీ చెయ్యను, నా మనస్సాక్షి తోడుగా చెపుతున్నా. నన్ను నీ భార్యగా చేసుకో కన్నయ్యా!” అంది రాధమ్మ అర్ధింపుగా.

కన్నయ్యకు రాధమ్మ మాటల్లోని సబవు అర్థమయ్యింది. అతని మనసు మెత్తబడింది. కళ్ళు నులుముకుని రాధమ్మవైపు మరీమరీ చూసి అన్నాడు, “రాదమ్మా! ఇదంతా నిజమా, కలా? నమ్మలేకపోయున్నా” అన్నాడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ.

అతని చేయందుకుని చేతిలో చెయ్యి వేసింది రాధమ్మ. “ఒట్టు కన్నయ్యా! నువ్వు నమ్ముకున్న ఈ సముద్రం సాక్షిగా ఈ రాధమ్మ నీది. ఇది నిజం! నువ్వు లేకుంటే ఈ రాధమ్మా ఉండదు. నన్ను నమ్మి నీదాన్ని చేసుకో కన్నయ్యా!”

కన్నయ్య మనసులో అనుకున్నాడు, “మా యమ్మకు కోడలు కావాల, ఈ రాదమ్మకి తోడు కావాల, అచ్చమ్మత్త సెప్పినట్లు చుక్క సుకంగుండాలంటే నాకు పెళ్ళికావాల! రాదమ్మ సెప్పిందానికి ఒప్పేసుకుంటే ఈ తసనాలన్నీ ఒకేపాలి తీరిపోతయ్. ఇదేదో అందరికీ మంచి చేసీదిగానే ఆపడతా ఉంది” అనుకున్నాడు.

కన్నయ్య జవాబుకోసం ఎదురుచూస్తూ అతనివైపే దృష్టి ఉంచుకున్న రాధామ్మకు చూస్తూండగా అతని ముఖంలో వికాసం కనిపించింది.

“సత్తెప్రెమానికంగా నీకు నన్ను పెళ్లి చేసుకోడం ఇట్టమేనా రాదమ్మా” అని అడుగుతూ ఎడమ చెయ్యి తలమీద ఉంచుకుని కుడిచెయ్య ముండుకు చాపాడు కన్నయ్య.

“ఆ! సత్యప్రమాణికంగా నాకు ఇష్టమే” అంటూ తనుకూడా ఒక చెయ్యి తలమీద ఉంచుకుని, అతని చేతిలో కుడిచెయ్యి ఉంచి ప్రమాణం చేసింది రాధమ్మ.

రివ్వున వీచిన గాలికి చివ్వున లేచిన కెరటం విసురుగా వచ్చి ఒడ్డునుతాకింది. వెన్నెల వెలుగులో తళతళా మెరుస్తూ జల్లుగా వచ్చిన తుంపురులు ఆ యువజంటకు ముత్యాల తలంబ్రాలయ్యాయి. ఆనందంతో పులకించిన ఆ తనువులు మరుక్షణంలో గాఢపరిష్వంగంతో పెనవేసుకున్నాయి. బాధాతప్త హృదయాలు రెండూ పరస్పరం ఓదార్చుకున్నాయి. దుర్బలమైన ఆమె శరీరం, బలిష్టమైన అతని కౌగిలిలో సేదదీరింది. మదిలోని గుబులుతీరా గాఢంగా నిట్టూర్చాడు కన్నయ్య.

వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నదానిలా తూరుపుదిక్కు రాగరంజితమయ్యింది. కౌగిలి నుండి విడివడి ఆ ఇద్దరూ చేయీ చేయీ కలుపుకుని ఇంటివైపుగా నడవసాగేరు.  

==========

సూర్యోదయం కాకముందే నిద్రలేచిన ఎల్లమ్మ చీపురుకట్ట తీసుకుని, మూలుగుతూ - ముక్కుతూ పాచి పని చెయ్యడం మొదలుపెట్టింది. ఇంటిముందున్న వాకిలంతా తుడిచి, కళాపి చల్లి, బలవంతంగా ఒంగి ముగ్గు వేస్తున్నదల్లా వెనకబాటుగా “అమ్మా” అన్న ఆర్ధ్రమైన పిలుపు వినిపించేసరికి ఆదాటుగా వెనక్కి తిరిగి చూసింది ఎల్లమ్మ. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె చేష్టలుదక్కి, నిలువుగుడ్లేసుకుని చూస్తూ నిలబడి పోయింది.

“అమ్మా! నీకు కోడల్ని తెచ్చా, ఇదిగో సూడు” అంటూ ఒంగి తల్లి కాళ్ళoటి నమస్కరించాడు కన్నయ్య. వెంటనే తానూ ఒంగి అత్తగారి పాదాలకు దణ్ణం పెట్టింది రాధమ్మకూడా. సంతోషం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బై పోయింది ఎల్లమ్మ. అప్రయత్నంగా చెమర్చిన ఆమె కళ్ళునుండి జారిన ఆనందభాష్పాలు , ఆ యువజంట తలలపైన అక్షతల్లా పడ్డాయి! వాళ్ళిద్దరినీ మనసులోనే తనివితీరా ఆశీర్వదించి ఎల్లమ్మ వాళ్ళని లేవదీసుకుని, గుండెలకు హత్తుకుని మురిసిపోయింది. మరుక్షణంలో ఆమె తన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనుకుంది.

 

తరువాయి భాగం »

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్