వేలి ముద్రలు
- ఆచంట హైమవతి

 


గత సంచిక తరువాయి »

పది రోజులు గడిచి పోయాయి. పైడెమ్మకి విద్య నేర్పటం గురించిన ప్రయత్నం మొదట్లోనే సందికొట్టింది.

పైడెమ్మ పుట్టింటి వారామెకు ఒక ఎకరం పొలం ఇచ్చారు. ఆమె భర్త పోలయ్య తల్లిదండ్రులనుంచి సంక్రమించిన రెండెకరాలకి తోడుగా వైష్ణవి తండ్రి రామనాధయ్యగారి దగ్గర ఏడెకరాల భూమి కౌలుకి తీసుకుని, మొత్తం పదెకరాలు సాగు చేస్తున్నారు.

భార్య, భర్త, పద్ధెనిమిదేళ్ళ కొడుకు, పదిహేనేళ్ళ కూతురు అందరూ కష్టించి పని చేస్తారు. తుపాను తాకిడి-నీటి ఎద్దడి లేకపోతే పంటల బాపతు 'కౌలు' తీర్చేయగా- ఆకుటుంబం ఎక్కువ ఇబ్బందులు లేకుండా బాగానే రోజులు గడుపుతున్నారు.

పైడెమ్మ అప్పుడే కోడలు కోసం-అల్లుడి కోసం కలలు కనేస్తోంది.

రామనాధయ్యగారు "అంత తొందరగా పిల్లలకి  పెళ్ళిళ్ళు చేస్తే 'సర్కారు' నిన్ను, నీమొగుణ్ణి కూడా జైల్లో పారేస్తుంది" అని బెదిరించి ఆపారు గాని...లేకపోతే పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు ఏనాడో జరిగిపోయి ఉండేవి.

ఆవేళ ఉదయం రామనాధయ్య పొరుగూరు వెళ్ళబోతూ "ఈఫారాలమీద ఇంటూ గుర్తున్నచోట్ల పోలిగాడి చేత వేలిముద్రలేయించు"అని చెప్పి వైష్ణవికి కొన్ని కాగితాలు ఇచ్చి వెళ్ళారు. అవి పోలయ్య పొలం పనులకి కావాల్సిన డబ్బుకోసం 'బ్యాంకు'లో లోన్ పొందేందుకు పూర్తిచేసిన ఫారాలు.

ఆఫారాలని చూసేసరికి ఒక ఆలోచన వచ్చింది వైష్ణవికి. అచ్చుఅక్షరాలు ఉన్న కొన్ని కాగితాలు ఏరి అప్లికేషన్ ఫారాలలాగ తయారు చేసింది. వాటిమీద ఖాళీ జాగాల్లో పోలయ్య 'ఆస్తంతా' వైష్ణవికి చెందుతుందనీ...పోలయ్యే స్వయంగా వ్రాయించి ఇచ్చినట్లుగా వ్రాసి ఉంచింది. బ్యాంక్ అప్లికేషన్ ఫారాలతో బాటు తను తయారు చేసిన కాగితాల మీద కూడా పోలయ్యచేత వేలిముద్రలు  వేయించింది.

అప్పటికి చెయ్యాల్సిన పనులన్నీ పూర్తిచేసి ఒక పక్కగా నిలబడ్డాడు పోలయ్య.

"నువ్వు వేలిముద్రలు వేసిన కాగితాల మీద ఏమి వ్రాసుందో నీకు తెలుసునా పోలయ్యా?" తీరికగా కుర్చీలోకూచుని అదిగింది వైష్ణవి.

"పొలం పనులకి బేంకీ లో అప్పు ఇమ్మని ఉంటదండి'' ధీమాగా చెప్పాడు పోలయ్య.

"అది సరేలే ...వాటితోబాటు ఇంకా కొన్ని కాగితాలమీద నువ్వు నీ ఆస్తంతా నాకు బహుమతిగా ఇచ్చేసినట్లు వ్రాశాను. నీకు సంతకం పెట్టటం రాదు గదా! వేలిముద్రలు వేశావు! ఈ క్షణం నుంచీ నీ ఆస్తి మొత్తం అంతా నాదన్నమాట! ...తెలిసిందా?" అంటూ రెండు, మూడుసార్లు తను వ్రాసిన విషయాలు పైకి చదివి, వివరించి చెప్పింది వైష్ణవి.

మొదట్లో హాస్యం అనుకున్నాడు గాని, తేడాల్లేకుండా రెండు-మూడు సార్లు ఒకేలా చదవటంతో నమ్మకతప్పలేదు.

లబో-దిబో మన్నాడు పోలయ్య. "అమ్మాయిగారూ మీకిది నాయం గాదు. మీ నానగోరు దరమమూత్తులు. ఆరితో సెప్తా!" అన్నాడు పోలయ్య కన్నీరాపుకుంటూ!

''నాన్నగారు ఊరు వెళ్ళారుగదా! ఆయన వచ్చేలోగా నీ పొలం నాదైపోతోందే?! అని బొంకి...''నీకు దిక్కున్న చోట చెప్పుకో ఫో!'' అంది వైష్ణవి.

"కరణం, మున్సబు లను పిల్సుకొత్తాను'' అంటూ పరగెత్తాడు పోలయ్య.

పోలయ్య వాళ్ళిద్దర్నీ పిల్చుకొచ్చేలోగా...రెండు కాగితాల మీద "నేను పోలయ్యలాంటి వాళ్ళని అక్షరాశ్యులుగా చేయటానికి పన్నిన పన్నాగం ఇది! ...అంతే! వారికి చదువువల్ల ఉండే లాభాలు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు, అర్ధంచేసుకోరు! ఆ కారణంగానే...నేను ఈఎత్తు వెయ్యవలసి వచ్చింది. వాళ్ళు చదువు మొదలు పెట్టేవరకు మాత్రమే ఈ'పధకం'. మీరు గ్రామాభివృద్ధి కోరుకునే పెద్దలు కనుక నా చిన్న దొంగాటకంలో సహకరించమని ప్రార్ధన'' అని వ్రాసి ఉంచుకుంది వైష్ణవి. 

పోలయ్య లోని అవిద్య అలవరచిన అమ్మయకత్వాన్ని తల్చుకుంటూ కొంటెగా నవ్వుకుంది వైష్ణవి.

ఆశ్చర్యపడ్తూ కరణం, మున్సబ్ పోలయ్య వెనకాలే పరుగెత్తుకొచ్చారు.

వాళ్ళనాహ్వానింఛి కుచోపెట్టి మర్యాద చేసింది. "దస్తావేజులు తెస్తాను - ఈ లోగా మీరిద్దరూ వీటిని చదవండి" అంటూ తను వ్రాసి ఉంచిన కాగితాలు వారికిచ్చి లోపలికి వెళ్ళింది వైష్ణవి.

ఆమె ఇచ్చిన కాగితాలు చదివి, వారిరువురూ సాభిప్రాయంగా చూసుకున్నారు. ఇంతలో పత్రాలు తెచ్చి వారికిచ్చింది వైష్ణవి. ఆమె ఇచ్చిన పత్రాలు చూసి అవి అబద్ధపు చిత్తుకాగితాలని గమనించారు.

"పత్రాలపై వ్రాసి ఉన్నవి తెలుసుకోకుండా బొటన వేలున్నది ...వేలిముద్రలు వెయ్యటానికే అన్నట్లు-వేలిముద్రలేసేసి ఉన్న పొలం కాస్తా - పోగొట్టుకున్నావ్! దానికి మేమే౦ చెయ్యగల౦? మమ్మల్నడిగి వేశావా-వేలిముద్రలు?" అంటూ గట్టిగా కేకలేశాడు కరణం.

"నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోండ్రా...అంటే -నీలుగుతారు. ఒళ్లట్టినంత చాకిరీ చెయ్యటం, కడుపట్టి నంత తిండి తినటం ...తప్ప-బుఱ్ఱ ఉపయోగించలేని సన్నాసివి. కూలి చేసిన రూపాయిలు లెక్కపెట్టగలిగినంత మాత్రాన న్యాయంగా కాలం పోతుందనుకున్నావా? ఆవిడ రాసింది నువ్వేలిముద్రేశావ్! ఇప్పుడు మేం  చెయ్యగలిగినదేం ఉంది? కోర్ట్ కెళ్ళినా ప్రయోజనం ఉండదు'' అంటూ కాస్సేపు అరచి, రామనాధయ్యగారొచ్చాక ఆయనకాళ్ళట్టుకో...ఏదైనా ఉపాయం చెప్తారేమో...!'' అనేసి వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు.

వైష్ణవి చేసిన పనికి పోలయ్యకి ఒకపక్క దిగులుగాఉన్నా, "మనమ్మాయ్ గారింత పని చేశారా?" అని ఆశ్చర్యంగా కూడా ఉంది. కాళ్ళూ-చేతులూ ఆడటం లేదు పోలయ్యకి.

"పైడికి దైర్నెం జాస్తి. వైట్నవమ్మని బెదిరిచ్చి...ఎలాగోలా --- ఆ పత్తరాలు లాగేస్కోగల్దు'' అనుకుంటున్నాడొకసారి.

"పైడికి కోపం శానా ఎక్వ! నోటికొచ్చినట్టు వాగితే మొదటికే మోసం వచ్చుద్ది" అనుకున్నాడు మళ్లీ.

"అయ్యగోరే నాకు సాయం సేయ్యాల. అయ్యగోరోచ్చేదాకా ఈణ్నే ఇలాగే కూకుంతాను" అనుకుంటూ కూచుని కునుకు పాట్లు పడుతున్నాడు పోలయ్య.

"నీ భూమెక్కడికి పొతుంది పోలయ్యా! మళ్లీ నీకే కౌలుకి ఇప్పిస్తాలే!'' అంటూ యజ్ఞాగ్నిలో మరో సమిధ వేసింది వైష్ణవి. ఆ మాట వింటూనే ... విలవిల్లాడిపోయింది పోలయ్య మనసు.

"ఎప్పుడనగా తిన్నావో అన్నం! ఇది తాగు పోలయ్యా! అంటూ అల్యూమినియం గ్లాసుతో మజ్జిగ తెచ్చిచ్చింది వైష్ణవి తల్లి. మనసు పౌరుషంతో ఎదురు తిరుగుతున్నా...ఎండిన గొంతు చేస్తున్న కరకరకి తట్టుకోలేక అయిష్టంగానే ఆ మజ్జిగ తాగాడు పోలయ్య.

రాత్రి రామనాధయ్యగారు రాగానే ఏడుస్తూ, ఆయన కాళ్ళ మీద పడిపోయాడు పోలయ్య. "నా తప్పు కాయండయ్యా! నన్నన్నాయం సెయ్యమాకండి బాబో..." అని ఏడుస్తూ చెప్పినదంతా విని ఆలోచనలో పడ్డారు రామనాధయ్యగారు.

వైష్ణవి-పోలయ్య పొలం... తనపేర రాయించేసుకుందా?! పోలయ్య దస్తావేజులమీద వేలి.. ముద్ర.. లేశాడా?"..ఫకాలున నవ్వారాయన. ఆగి, ఆగి, మళ్లీ... నవ్వుతూండగ

పోలయ్య మళ్లీ అంతా చెప్పి, నిజాయితీగా కరణం-మున్సబు అన్నమాటలు కూడా చెప్పాడు.

"కాపాడండయ్యా! సదూలేనోన్ని సూత్తే అందరికీ లోకువేనయ్యా! తమరు కూడా నవ్వుతుండారు'' అన్నాడు ఉక్రోషంగా.

పోలయ్య అమాయకత్వానికి జాలి కలిగింది రామనాధయ్యకి. పోలయ్య మాటల్లోని చివరి వాక్యాల్ని మళ్లీ, మళ్లీ చెప్పించాడు.

"అలా మోసపోకూడదంటే...అందరూ చదువుకోవాలి మరి! చదవటం రానందువల్లనే గదా పత్రాలలోది తెలియకపోవటం, వేలిముద్రలేసేయటం లాంటివి జరిగి-వాటివల్ల వచ్చిపడే కష్ట-నష్టాలు అర్ధంఅయ్యాయిగదా! మీకు బుద్ధి చెప్పటానికే నీ పొలం అంతా వైష్ణవి రాయించేసుకుంది. మీరందరూ శ్రద్ధగా చదువుకుంటానంటే...అంతా మళ్లీ మీకే ఇచ్చేస్తుంది. కదమ్మా-వైష్ణవీ...!!" మురిపెంగా కూతుర్ని చూస్తూ అడిగారాయన.

"అవున్నాన్నా! వాళ్ళింట్లో అందరూ చదువుకోవటానికి ఒప్పుకుంటారో-మరి...పొలం ఒదులుకుంటారో అడగండి మీ పోలయ్యని" గంభీరంగా అంది వైష్ణవి.

విషయమంతా తెలిసి పరుగెత్తుకొచ్చిన పైడెమ్మ "క్షమించ' మన్నట్లుగా దీనంగా మొహంపెట్టి భర్తపక్కన నక్కి నుoచుంది. ఆమె అతివినయాన్ని ఓరగా చూసి-ముసి, ముసిగా నవ్వుకుంది వైష్ణవి.

"నువ్వు అనవసరంగా మాటాడొద్దు...'' అన్నట్లు భార్యని పక్కకి నెట్టి, గబ గబ కళ్ళు తుడుచుకున్నాడు పోలయ్య.

రామనాధయ్య గారి దొడ్లో...అందరూ సాయంకాలం చదువుకోటానికి సంతోషంగా ఒప్పేసుకున్నాడు పోలయ్య. మర్నాడు సాయంకాలమే వాళ్ళ చదువు మొదలైంది.

పోలయ్య కుటుంబాన్ని చూసి మరికొందరు పెద్దవాళ్ళు కూడా చదువుకోవటానికి రావటం మొదలుపెట్టారు. పిల్లలతో సమానమైన చురుకుతనం తెచ్చుకుని పెద్దవారు కూడా పోటీ పడసాగారు. నెల్లాళ్ళు దాటేసరికి  అచ్చులు, హల్లులు పూర్తై-గుడింతాలు వరకూ వచ్చారు. అంకెలు, కూడిక, తీసివేత, భాగహారము, ఎక్కాలు కూడా నేర్చుకుంటున్నారు.

తెప్పించిన ఒకటవ తరగతి పుస్తకాలు అందరికీ పంచింది వైష్ణవి. పుస్తకంలో రంగు-రంగుల బొమ్మల్ని చూసి చిన్నపిల్లాడిలా పోలయ్య సంబరపడుతుంటే...వైష్ణవికి తన ప్రయత్నం సార్ధకమైనట్లు అనిపించింది.

తృప్తితో కూడిన ఆనందం కలిగిందామెకు.   

…. అయిపోయింది ....

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్