Sahithi Pudota

భాస్కర శతకము

 

అనఘునికైనఁ జేకుఱున|నర్హుని గూడి చరించునంతలో
మనమెరియంగనప్పుఁడవ|మానము కీడు ధరిత్రియందు నే
యనువుననైనఁదప్పవు య|ధార్ధము తానది ఎట్టులన్నచో
నినుమును గూర్చి యగ్నినల|యింపదె సమ్మెట పెట్టు భాస్కరా!

తా: భాస్కరా!ఇనుముతో కలిసియున్న అగ్నికి సమ్మెట పోటు తప్పదన్నట్లుగా, లోకమందు తగనివానితో స్నేహము చేయుచూ సంచరించిన యెడల ఎంతటి సద్గుణ వంతునకైననూ ఎదో ఒక సమయాన అవమానము, హాని కలుగును.

 

 

ఆదర మింతలేక నరుఁ|డాత్మబలోన్నతి మంచివారికిన్
ఖేదము చేయుటం దనదు|పేర్మికిఁగీడగు మూలమె: ట్లమ
ర్యాద హిరణ్య పూర్వకశి|పన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుజేసి ప్రళ|యంబును బొందఁడె మున్ను భాస్కరా!

తా: భాస్కరా! దుర్గుణ చేష్టలచే, నీతిని ఎరుగని రాక్షసుడగు హిరణ్యకశిపుడు తన బలమునే ప్రధానముగా నమ్ముకొని గుణవంతుడైన తన కుమారుడగు ప్రహ్లాదునకు కీడు తలపెట్టి తానే స్వయంగా నశించెను. అట్లే తనకు గొప్ప బలమున్నను, ఆ బలమునే నమ్ముకొని, కొంచెమైన ప్రేమ లేకుండా మంచి వారిని బాధించినచో తప్పక నశించును.

 

 

ఆరయ నెంత నేరుపరి|యై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పఁగూర్చునుప|కారి మనుష్యుడు లేక మేలు చే
కూఱదదెట్లు;హత్తుగడ|గూడునె చూడఁబదాఱుబం
గారములోననైన వెలి|గారము కూడకయున్న భాస్కరా!

తా: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియకున్నచో అతుకు అతకదు. అట్లే మనుష్యుడెంత గొప్పవాడైనను, వాని దగ్గర ఘనతను కూర్చు ఉపకారియగు మనుష్యుడు సమీపము నందు ఉంటే మంచి కలుగును. లేనిచో, కార్యములను సాధించుటకు వీలుకాదు.

 

 

ఈక్షితి నర్ధకాంక్షమది|నెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షుకుడైన సత్ప్రభుని|రాకలుగోరుదు రెందుఁ;జంద్రికా
పేక్షఁజెలంగి చంద్రుఁడుద|యించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదుర|పారముదంబును బూని భాస్కరా!

తా: భాస్కరా! భూమి యందు నివసించెడు మానవులు సంపదపై యందు కాపాడునట్టి రాజు రాక కొఱకు ఎదురు చూచుదురు. అది ఎట్లనగా చకోర పక్షులు తమకు వెన్నెల వలన లభించు అంతులేని ఆనందమును అనుభవించుట కొరకు రాత్రి యందు చంద్రుడు ఉదయించుట కొరకై ఎదురు చూచుచుండును. (చకోర పక్షి చంద్ర కిరణములను తినును అని కవి సమయము).

 

 

ఈ జగమందు దామనుజుఁ|డెంత మహాత్మఁకుడైన దైవమా
తేజము తప్పఁజూచునెడఁ|ద్రిమ్మరి కోల్పడు;నేతలన న్మహా
రాజకుమారుఁడైన రఘు|రాముఁడు గాల్నగఁగాయలాకులున్
భోజనమై తగన్వనికిఁ|బోయి చరింపఁడెమున్ను భాస్కరా!

తా: భాస్కరా! మానవుడు ఎంత గొప్ప వాడైనను దైవము అతనిని సరిగా చూడని ఎడల ఆ గొప్పతనమంతయునూ తగ్గిపోయి, దేశసంచారియై తిరుగవలసిన స్థితి ఏర్పడవచ్చును. ఎట్లనగా శ్రీ రామచంద్రుడు దశరథ మహారాజు కుమారుడైనను, దైవము వాని తేజము తప్పునట్లు చేయుటచేత కాలి నడకతో అడవికి పోయి ఆకులు, కాయలు భుజించి, అడవి యందు తిరుగవలసి వచ్చినది కదా!


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్