సామెతల ఆమెతలు
- సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

ఎంత చెట్టుకి అంత గాలి.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా
రాశి కంటే వాసి ముఖ్యం.
తింటే గారెలే తినాలి, వింటే భాగవతమే వినాలి.
కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు?
కాకి పిల్ల కాకికి ముద్దు.

ఇలా మన భాషలో లెక్కకి మిక్కిలిగా అర్థవంతమైన సామెతలు ఉన్నాయి. చాలా సామెతల్లో శబ్ద చమత్కృతి, అర్థగాంభీర్యము, యతి నిబద్దత,  ప్రాసల నియమాలూ - అన్నిటినీ మించి, ఆ ఒక్కపంక్తిలో ఇమిడిఉన్న అపరిమిత లోకానుభవం మనలను అబ్బురపరుస్తాయి. ఇన్ని రుచులతో విరాజిల్లుతున్నఈ సామెతలు, భాషాబిమానులకు ఆమెతలు(విందు భోజనాలు)గా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు.

కథలు, నవలలు, పద్యాలూ, పాటలూ, వ్యాసాలూ , నాటకాలూ .....  ఇలా ఏ సాహిత్య ప్రక్రియలోనైనా సరే, సందర్భోచితంగా సామెతల్ని వాడడం వల్ల, అక్కడ వ్యక్తమైయున్న భావానికి పటిష్టత ఏర్పడమే కాకుండా,  రచనకు హొయలు పెరగడం కూడా జరుగుతుంది. సందర్భానికి తగిన సామెతని జోడించడం వల్ల మనం ప్రస్ఫుట పరచిన భావాన్ని అది బలపరిచి, చదువరుల మనసులకు పట్టేలా చేస్తుంది. అందుకే తగు మోతాదులో సామెతల్ని వాడడం వల్ల, మన రచనకు మనం అనుకోని అందం వస్తుంది.

సామెతలు సాధారణంగా  రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి ఉపమానము, రెండు ఉపమేయము.  అరుదుగా కొన్నింటికి ఉపమానం మాత్రమే ఉంటుంది.  ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఉపమేయాన్ని సమకూర్చడం అన్నది మన బాధ్యత ఔతుంది . ఒక్కొక్కప్పుడు ఉపమేయం మనకు స్ఫురించి అప్రయత్నంగా సామెత పూర్తి ఔతుంది. 

ఒక్కొక్కప్పుడు ఒక చిన్న సామెత - వినగానే, ఒక పెద్ద గాధనే స్ఫురింపజేస్తుంది.   

ఉదా :-  చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు ......

ఇది ఒక సామెత! దీన్ని వినగానే మనకు రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టం, హనుమంతుడు చేసిన లంకా దహనం, గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగినది కూడా దానితో సమానమైనదిగా మనకు  తోస్తుంది. దానికీ దీనికీ ఉన్న పోలిక కూడా కళ్ళకు కడుతుంది.
చాలా భాషల్లో చాలా చాలా సామెతలు ఉన్నయి. భాషకు ఎల్లలు ఉన్నాయిగాని, భావానికి హద్దులు లేవు. సామెతలు సర్వకాల సర్వావస్థలలోనూ, సకలజనులకూ సంబంధించినవి అయ్యి ఉంటాయి. ఇవి ఏ ఒక్కరికీ స్వంతంకావు, అందరివీ ఇవి. తరతరాలుగా జనుల జీవితానుభవాలను క్రోడీకరించుకుంటూ పుట్టి పెరిగినవి.  పుట్టినదాది ఎందరి నోళ్ళలోనో నాని నలుగుతూ; విభిన్న సన్నివేశాలకు మౌలిక వ్యాఖ్యలుగా నిలదొక్కుకున్నాయి సామెతలు! తరతరాలుగా మన పూర్వులు మనకి ఇచ్చిపోయిన అమూల్య సంపద ఇది. మన పెద్దవారి జీవితానుభవసారం ఈ సామెత లనడమేమీ అతిశయోక్తి కాదు.

సామెతలు ఏ భాషలో ఉన్నా అవి ఆభాషకూ  ఆమెతలే ఔతాయి. కొద్దిపాటి అక్షర సముదాయంలో అఖండ అర్థసంపదను ఇముడ్చుకొని ఉండడం అన్నది ఒక అద్భుతమే అని అనిపించకపోదు.
మన భాషకు సాహిత్యం ఒక అమూల్యమైన సంపద అనుకుంటే, ఆ సాహిత్యానికి నిండుతనాన్నిచ్చే ఆమెతలు (విందులు) సామెతలు - అని మనం అనుకోవచ్చు.  అనాదినుండీ మానవ జీవితాల్ని పట్టి కుదుపే పరస్పర విరుద్ధాలైన మంచి చెడ్డలు, సుఖ దు:ఖాలు, కలిమిలేములు లాంటి ద్వంద్వాల మధ్య చిక్కుకుని నిరంతరం కొట్టుమిట్టాడే జనజీవన విధానంలోని ఒడిదుడుకుల ఉరవడిలో పుట్టి, తరువాతి తరాలకు నోటిమాటగా వ్యాప్తిపొంది, క్రమంగా భాషకు వన్నెతెచ్చే నుడికారపు సొగసులుగా గుర్తింపు పొందాయి సామెతలు! జనుల జీవితానుభవసారం నుండి పుట్టినవే కావడం వల్ల, ఇవి వారికి  సమయానికి కావలసిన స్ఫూర్తినిచ్చేవిగా , ఒక్కొక్కప్పుడు మార్గ నిర్దేశకాలుగా ఉంటూ జనుల మనసులకు చేరువై, హృదయాలకి హత్తుకుని జనుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాయి సామెతలు!

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్