Teneloluku


గత సంచిక తరువాయి »

మన తెలుగు భాష మాధుర్యాన్ని గురించి, మనం తెలుగువారం అని చెప్పుకుంటుంటే కలిగే కించిత్ గర్వం మనలను తప్పక మాతృ భాషలోనే మాట్లాడేటట్లు చేస్తుంది. 

ఈ మధ్యకాలంలో ఉచిత అంతర్జాల సామాజిక మాధ్యమాలలో మన తెలుగు భాష గురించిన చర్చ చాలా వేడిగా, సజీవంగా జరుగుతున్నది. ముఖ్యంగా మన తెలుగు వార్తా పత్రికలలో వస్తున్న కథానికల మీద విశ్లేషణ తో కూడిన అభిప్రాయాలు మరియు  ఆ కథానికలు వ్రాసిన వ్యక్తుల మీద కూడా విమర్శనాత్మక చర్చలు ఉంటున్నాయి. 

ఈ సామాజిక బృందాలలో ఉన్న సభ్యులందరూ భాష మీది మమకారం, సాహిత్య పటిమ ఉన్నవారే కనుక అమృతభాష ఐన తెలుగు భాష మృతభాష అయిపోతుందని ఆవేదన ఉండటంలో తప్పు లేదు. అయితే తెలుగు భాష ఇతర ముఖ్య భారతీయ భాషలలాగే ప్రపంచ భాషల్లోకి చేరింది. అలాగే మన తెలుగు భాష ఉనికిని, అనేక దేశాలలో వివిధ రూపాలలో మనం చూడటం జరుగుతున్నది. కొన్ని ఉత్తర అమెరికా విశ్వవిద్యాలయాల్లో కూడా మన తెలుగు భాషను నేర్చుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కువ మంది మాట్లాడే  భాషల్లో తెలుగు కూడా స్థానాన్ని సంపాదించుకొంది.  ఇతర బాషలతో అనుసంధానం చేసే విధానమూ ఏర్పడింది. అలాగే అనువాదం చేసే అవకాశం ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానంతో వచ్చింది.  తెలుగు లిపిని కూడా సులువుగా నేర్చుకునే విధానాలను బోధించే సూత్రాలు మనకు అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతున్నాయి. కనుక తెలుగు భాష మరుగున పడిపోతున్నది అనే చర్చతో పాటు అనవసర ఆవేదనకు అర్థం లేదు.

తెలుగు భాష మీద నిజమైన అభిమానం, మమకారం ఉన్న మనందరం మాటలు మాని చేతలలో మన సాహిత్యసేవను కొనసాగిద్దాం.

============

ఆగష్టు సిరిమల్లె లో కొన్ని ఉచ్చారణదోషాలు, వాటి ఫలితాలను చూసాము. ఈసంచికలో మఱి కొన్ని చూద్దామా?

తెలుగుభాష లో శ, ష, స అనే అక్షరాలు ఉన్నాయి. వీటిలో దేని ఉచ్చారణ దానిదే. కాని ఈ మధ్యకాలంలో కొందరు ప్రబుద్ధులు వీటి ఉచ్చారణ మార్చి పలకడం గొప్పఅనుకుని ఏమి చేస్తున్నారో చూడండి.

 1. “శ్రీగణేశాయనమ:” కు బదులు “శ్రీగణేషాయనమ:” అని ఒకాయన పలకడమేకాక చక్కగా గణేశుని చిత్రము ప్రక్కన వ్రాయించి మొత్తాన్ని అచ్చువేసి ఎన్నో ప్రతులు పంచిపెట్టాడు.  సర్వవిద్యలకు గురువైన వినాయకునికే ఇది సంభవిస్తే ఇక మిగతావారి సంగతేమిటి?
 2. అలాగే “షనివారం కలుద్దాం. షుక్రవారం కుదరదు.”
  అసలు పలకవలసింది “శనివారం కలుద్దాం. శుక్రవారం కుదరదు.”
 3. శౌరి అంటే విష్ణువు. మఱి  సౌరి అంటే సూర్యుని కొడుకు అయిన యముడు.
  చిన్న ఉచ్చారణ భేదంతో ఎంత తేడా? శౌరిపురానికి బదులు సౌరిపురానికి చేరితే ఎలా ఉంటుంది?
 4. “సిద్ధం చేసారా?” కి బదులు “షిద్ధం చేసారా?” అంటే ఎలా?
  “శుద్ధమైన ఉప్పా?” లేక “షుద్ధమైన ఉప్పా?” మీరే చెప్పండి.
 5. “ఓం నమశ్శివాయ” బదులు “ఓం నమస్సివాయ”  అంటే శివ శబ్దానికి ఉన్న శుభప్రదమైన అర్థం మాయమైపోతుంది.

ఇలాఎన్నో?  ఎన్నెన్నో?
అక్టోబరు నెలలో  తిరిగి కలుసుకుందాం.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్