నోరూరించే రుచి

 

శ్రీమతి వెంపటి హేమ గారు అందిస్తున్న తెలుగింటి సంప్రదాయ వంటకాలలో భాగంగా వంకాయలతో చేయగల మరికొన్ని రుచికరమైన వంటలను గురించి తెలుసుకొందామా?

తెలుగింటి వంటకాలు

వంకాయతో కలగలుపు కూరలు

వంకాయ, చిక్కుడుకాయ :

పావుకిలో చిక్కుడుకాయల్ని అరంగుళం ముక్కలుగా తు౦చుకుని, వాటిని అరకప్పు నీళ్ళతో పొయ్యిమీద పెట్టి ½ tsp ఉప్పువేసి ఉడికించాలి. అవి కొద్దిగా ఉడికాక 1/2 కిలో వంకాయల్ని ముక్కలుగా వాటిలో వేసి, మరి ½ tsp ఉప్పు, చిటికెడు పసుపు వేసి, కలిపి  ఉడికించాలి. చిక్కుడు గి౦జలని బయటికి తీసి నొక్కి చూసి, కూర ఉడికి౦దో  లేదో తెలుసుకోవాలి. ఉడికిన కూరను కి౦దకుది౦పి పక్కన ఉంచుకోవాలి. గిన్నెలోగాని, బాణలిలోగాని పోపు వేసి, ఈ కూరను అందులో వేసి, నీరు ఇగిరి, కూరకు పోపు అ౦టే వరకూ అప్పుడప్పుడు అట్లకాడతో కలపుతూ ఇగరనిచ్చి దింపాలి.

కొంతమంది ఈ కూరల్ని కమ్మగా ఇష్టపడతారు. అలాంటివారు ఈ కలగలుపు కూరలకు కూడా పోపు “వంకాయ కమ్మటి కూర”కు వేసినదే వెయ్యాలి.  మరికొందరు పుల్లగా ఉంటే ఇష్టపడతారు.ఈ కలగలుపు కూరలకు కూడా వాళ్ళు కూర పోపులో వేసినప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జును చేర్చి, పోపును “వంకాయ సంతర్పణ కూర”కి వేసినట్లుగా వేస్తారు. దేని రుచి దానిది.

ఇదే రకంగా - వంకాయ బీన్సు, వంకాయ - బంగాళా  దుంప, వంకాయ - టమోటా, వంకాయ - అరటికాయ, వంకాయ - బటానీలు, వంకాయ - నానిన సెనగలు (సెనగ పప్పుతో కూడా చేసుకోవచ్చు) ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఈ కూరలన్నిం టి లోనూ కూడా కొందరు పోపులో ఒక అరకప్పు ఉల్లిపాయముక్కలు కూడా వేసి, మగ్గనిచ్చి వండుకుంటారు. టమోటా తో వండిన కూరలో కొత్తిమీర వేస్తె రుచిని పెంచుతుంది. వంకాయ సెనగపప్పుతో వండిన కూరలో కొందరు 1 tsp గరం మసాలా కూడా చేరుస్తారు.

వంకాయతో పూరీలలోకి కూర :

అరకిలో వంకాయలకు పావుకిలో ఉల్లిపాయలు, పావుకిలో టమోటాలు కావాలి. ఈ మూడింటినీ విడివిడిగా తరిగి ఉంచుకోవాలి. అలాగే అరంగుళం క్యూబ్ అల్లం, మూడు పచ్చిమిరపకాయలూ కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. పావుకిలో పచ్చి బటానీలు ఒలిచి పెట్టుకోవాలి. పోపుకి 1 tsp సెనగపప్పు, 1 tsp మినప్పప్పు, 1 tsp కి కొంచెం తక్కువగా ఆవాలు వేసి, 3 TbSp నూనెతో పోపు వెయ్యాలి. ఆవాలు చిటపట మన్నాక దానిలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఆతరవాత బటానీలు వేసి, కొంచెంసేపు వేయించి, ఆపై ఉల్లిపాయముక్కలు వేసి, అవి గాజులా ట్రాన్స్పరెంటుగా మారాక టమోటా ముక్కలు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అప్పుడు వంకాయముక్కలు వేసి కలిపి మూతపెట్టి మీడియం సెగ పైన ఉడకనివ్వాలి. ముక్కలన్నీ ఉడికాయన్న నమ్మకం కుదిరాక మూత  తీసి, దానిలో 1 tsp కారం, 1 TbSp సెనగపిండి వేసి, పిండి ఉండలు కట్టకుండా కలపాలి. వాటినలా మరో 3 నిముషాలు అప్పుడప్పుడు కదుపుతూ ఉడకనిచ్చి, ఆపై స్టౌ ఆర్పి, పావుకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేడిగా ఉండగానే కూరలో వేసి, కలిపి మూతపెట్టాలి. ఈ కూర అన్నంలోకీ, రొట్టెలలోకీ కూడా బాగుంటుంది. 

 

.... వంకాయలతో వంటలు సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

సోమరితనం అనేది ఒక రాచవ్యాధి. ఒకసారి అది సోకిందంటే, యింక ఆ రోగి ఎన్నటికీ బాగుపడలేడు – ప్రేంచంద్