aalayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

ఐహోల్ దేవాలయ ప్రాంగణం, కర్నాటక రాష్ట్రం

Temple


ఈ ఐహోల్  దేవాలయ ప్రాంగణం, భారతదేశం లో ఉన్న అతిపురాతనమైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ దొరికిన సంస్కృత శాసనాల ప్రకారం ఈ ప్రాంగణం లోని ఆలయాలను క్రీ.శ. 470 నిర్మించడం మొదలుపెట్టారు. మొదట ఇక్కడ శివుని ఆలయం నిర్మించారు. ఆ తరువాత మిగిలిన ఆలయాల నిర్మాణం మొదలైంది. క్రింద చూపిన ఏడవ శతాబ్దం నాటి శిలాశాసనం ఈ ప్రాంగణంలోనే లభించింది. పూర్తిగా సంస్కృత లిపిలో ఉంది. ఇది చాలు ఈ దేవాలయల వైభవం ఎంత పురాతనమైనదో చెప్పడానికి.

temple


మన సిరిమల్లె ఫిబ్రవరి 2016 సంచిక ఆలయసిరిలో,  ప్రాంబనన్ త్రిమూర్తుల ఆలయం, జావా, ఇండోనేషియా గురించి వ్రాయడం జరిగింది. అది క్రీ.శ. 9వ శతాబ్దంలో, నేటి ఇండోనేషియా దేశం లోని జావా ద్వీపంలో నిర్మించిన త్రిమూర్తుల ఆలయం గురించిన సమాచారం. భాషా శాస్త్రజ్ఞులను అనుసరించి జావా భాషలో ‘ప్రాంబనన్’ అంటే ‘పరబ్రహ్మ’ అని అర్ధం. హిందూ పురాణాలలో చెప్పిన భూర్లోక, భువర్లోక, సువర్లోకాల వర్ణనలకు అనుగుణంగా మండల వాస్తుశైలిని పాటించి 224 దేవాలయాలను అక్కడ నిర్మించారు. అయితే మన దేశంలో అంతకు మునుపే ఐదు కిలోమీటర్ల పరిధిలో నిర్మించిన ఈ ఐహోల్ ప్రాంగణంలో దాదాపు 70 ఆలయాలవరకు నిర్మించారని పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా. కొన్ని ఆలయాలలో నేటికీ ఇక్కడ నిత్యపూజలతో పాటు అనేకరకమైన ఉత్సవాలు ఇంకా జరుగుతున్నాయి.


ఇక్కడ రెండు రకాల శైలి కనపడుతుంది. ఒకటి చాళుక్యుల నిర్మాణ శైలి మరొకటి రాష్ట్రకూటుల శైలి. అలాగే ఈ ప్రాంగణం లోని దేవాలయాలను రెండు వర్గాలుగా విభజించారు. ఒకటి కొంటిగుడి రెండవది గలగనాథ. ఈ కొంటిగుడి వర్గానికి చెంది, మొట్టమొదట అంటే క్రీ.శ ఐదవ శతాబ్దంలో కట్టిన శివుని ఆలయ ప్రాంగణమే తరువాతి కాలంలో లడఖాన్ గా ప్రసిద్ధిగాంచినది.

ఇక్కడ బ్రహ్మ, శివుడు, విష్ణువు, దుర్గా అమ్మవార్ల ఆలయాల ఉంటే మరి మహమ్మదీయుల లడఖాన్  పేరుతో ఉంది అని చిన్న సందేహం రావచ్చు. నిజమే. మొదట్లో హిందూ ప్రాంగణమే అయితే లడఖాన్ అనే బీజాపూర్ సుల్తాన్ యువరాజు ఆ ప్రాంతాన్ని నివాసంగా చేసుకొని కొన్ని సంవత్సరాలు పాలించాడు, అందుకే ఆ పేరు స్థిరపడిపోయింది.  అలాగే మిగిలిన దేవతామూర్తుల పేర్లతోనే ఆ ఆ ఆలయ సమూహాలను మనం ఈ ఐహోల్  ప్రాంగణంలో చూడవచ్చు


కొండను త్రవ్వి గుహలను ఏర్పరచి అందులో దేవతలను ప్రతిష్టించారు. అందుకు ఎంతో నిబద్దతతో కూడిన ప్రణాళిక అవసరం. అది కూడా పూర్తిగా రాతి కట్టడం. నేటి నిర్మాణాలలో వాడుతున్న సిమెంట్ అనే పదార్ధం నాడు లేదు. మరి రాళ్ళు ఎలా ఒకదానిమీద ఒకటి నేటికీ నిలిచివున్నాయి అంటే అదే నాటి ప్రామాణికత. అంతే కాదు కేవలం ఉలి, సుత్తి తదితర పనిముట్లతో రాతిశిల్పాలను చెక్కడం అంటే ఎంతో ప్రయాసతో కూడిన పని. ఏమాత్రం పొరపాటు జరిగినా మరలా మొదటినుండి చెక్కడం చేయాలి.


ఈ ప్రాంగణం లోనే మనం బౌద్ధమత ఆరామాలు మరియు జైన దేవాలయాల ఆనవాళ్ళను కూడా చూడవచ్చు. అయితే ప్రస్తుతం అన్నీ కట్టడాలు శిధిలావస్థకు చేరుకొన్నాయి.


ఈ ఐహోల్ ప్రదేశం ఉత్తర కర్నాటక లోని ప్రముఖ కేంద్రమైన బాదామికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెల్గాంకు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

divider

 

Source1, Source2, Source3, Source4

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)