adarshamoorthulu


శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి

Kosarajuకత్తి కంటే కలం గొప్పది. కలం నుండి జాలువారే మాటల తూటాలు నేరుగా మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి.  పిమ్మట, మనిషి ఆలోచనలలో మార్పులు జరగడం సంభవిస్తుంది. కనుకనే రవి గాంచని చోటును కూడా కవి కాంచగలడు. రచయితలు తమ అమూల్యమైన రచనలద్వారా మనిషిని ఉత్తేజపరిచి, నూతన తలంపులను రేకెత్తించి తద్వారా జనస్రవంతిలో ఎన్నో వినూత్న మార్పులను, సమాజంలో మంచికి మరో మార్గాన్ని రూపకల్పన చేసే అవకాశం కలుగుతుంది. అందులో మాధ్యమాల పాత్ర కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా చలనచిత్ర రంగం. సాధారణంగా ఒక చిత్రం అధిక ప్రజాదరణ పొందిందంటే అందుకు కారణం అయిన రెండు అంశాలు, కథ మరియు సంగీత ప్రధానమై అందరికీ దగ్గరైన పాటలు.  మరి అటువంటి రంగంలో ఉండి ఎన్నో అపూర్వమైన జనపదాలతో తన పాటల అక్షరమాలను తడిపి ఆ పాటలన్నీ తమని ఉద్దేశించే వ్రాశారని సామాన్య జనాలు అనుకునే భావన కలిగించిన అభినవ సాంఘీక పాటల రచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి నేటి మన ఆదర్శమూర్తి.

గుంటూరు జిల్లా లోని అప్పికట్ల గ్రామంలో జూన్ 23,1905 న మన కొసరాజు గారు జన్మించారు. చిన్న వయసు నుండే తెలుగు భాష మీద ఆసక్తి ఏర్పడి ప్రబంధాలు, పురాణాలు చదివి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదటినుండీ గ్రామీణ వాతావరణం అంటే ఎనలేని మక్కువ ఏర్పడింది. సామాన్య జనజీవితాలను అతి దగ్గరగా చూస్తూ ఆ అనుభవాలను తన రచనలలో ప్రతిబింబింప చేసేవాడు. అందుకే ఆయన రచించిన పాటలలో చాలావరకు జనపదాలు మనకు కనపడతాయి. 12ఏళ్ళకే కవిత్వం రాయడంమొదలుపెట్టారు. వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. యుక్తవయస్సు వచ్చేసరికి అష్టావధాన, శతావధానాలు సునాయాసంగా చేశారు. రామాయణం ప్రదర్శనలో రాముడి వేషం వేసి శ్రావ్యమైన గొంతుతో పాడి అందరి మన్ననలు అందుకున్నారు.

కొసరాజు గారు రైతు పత్రికకు పత్రికా రచయితగా తన మొదటి ఉగ్యోగాన్ని ప్రారంభించాడు. పిమ్మట చిత్రరంగం మీది ఆసక్తితో 1939 వ సంవత్సరంలో రైతుబిడ్డ సినిమాలో నాయకుడి పాత్రను పోషించి సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే నటుడిగా అంతగా రాణించలేకపోయాడు. అందుకే, మొదటినుండి తన అత్యంత ఇష్టమైన రచనా రంగంలోని రాణించదలచి మంచి మంచి పాటలతో అతి తక్కువ కాలంలోనే సినీ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు.

ఈయన పాటలు అంతగా ప్రజాదరణను పొందటానికి కారణం పాటల్లో ఆయన వాడిన పదజాలమే. నాటి (ఈనాటికీ) సాంఘీక అంశాలను ప్రస్తావిస్తూ వాటి లోటుపాట్లను వాస్తవిక కోణంలో తన పాటలలో చూపేవారు. ఉదాహరణకు “సరదా సరదా సిగిరెట్టు, ఇది దొరల్దాగు సిగిరెట్టూ’ అని చెబుతూ నాడు సిగిరెట్టు తాగడం ఒక గొప్ప హోదా అనే అపోహలో జనాలు ఉన్నారు అని చురక వేశారు. అట్లాగే “ధియేటర్ లో నిషేధించారు అని అంటే ‘కలక్షన్లు లేవందుకే” అని నాటి ప్రజలు సిగిరెట్టు మీద ఎంత మక్కువ కలిగివున్నారో తెలిపారు.

నేడు చిత్రరంగంలో ఉన్నట్టుగా, ఆయన స్వరకల్పన చేసిన పిదప పాటలు వ్రాయలేదు. ఆయన వ్రాసిన తరువాతే ఆ పాటలకు బాణీలు కట్టడం జరిగింది. కనుకనే ఆ పాటల లోని సాహిత్య పటిమ ఏ మాత్రం జారిపోలేదు.
తన జీవితంలో ప్రత్యక్షంగా చూసిన జీవిత ఘట్టాలలోని వాస్తవికతను అతిలలితంగా వ్యంగ్యం, హాస్యం కలిపి తన పాటల ఒరవడిలో చూపేవాడు. అందుకే అటువంటి పాట ఒకటైనా తమ సినిమాలో వుండాలని ఎందరో దర్శక నిర్మాతలు అప్పట్లో కొసరాజును కోరేవారు.

పంట పండి చేతికి వచ్చే దాకా రైతన్న పడుతున్న కష్టాన్ని గుర్తిస్తూ, అతనిలో ఉత్సాహాన్ని రేపే విధంగా ‘రోజులు మారాయి’ చిత్రం కోసం కొసరాజు గారు ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ పాటను వ్రాశారు. ఈ పాటలో రెండో చరణంలో పలికిన పదాలను నిశితంగా పరిశీలిస్తే, ‘‘పడమట దిక్కున వరదగుడేస్తే’’ అని ఉంటుంది. మరి దానర్ధం గమనిస్తే “ఒక చక్కని పడమటి సంధ్యా సమయంలో వర్షం కురిసి వెలసిన తరువాత పడమటి వైపు ఆకాశంలో చూడముచ్చటగా ఇంధ్రధనస్సు కనపడుతుంది. అట్టి ఇంధ్రధనస్సుకు చక్కని తెనుగుమాట ‘‘వరదగుడి’’. చంద్రుని చుట్టూ ఏర్పడే కాంతివలయాన్ని వరదగుడిగా వ్యవహరించడం రాయలసీమ మాండలికము. ఆ విధమైన పద ప్రయోగాలను అన్ని మాండలీకాలలోనూ అవలీలగా చేయగల పద బ్రహ్మ మన కొసరాజు గారు. ఆ విధంగా సగటు కష్టజీవికి అర్థమయ్యే రీతిలో రాయడం వలన ఆ పాట సజీవమై శాశ్వతంగా నిలిచింది.

అలాగే ‘శ్రీ కృష్ణపాండవీయం’  చిత్రంలో పాండవుల వనవాస సమయంలో, లక్క ఇంటికి కాపలా కాయకుండా హాయిగా కునుకు తీస్తున్న భీముడిని ఉద్దేశించి శ్రీ కృష్ణుడు మాయా రూపంలో కట్టెదుట నిల్చి, నిజరూపంలో చెట్టు చాటున వుండి హెచ్చరికగా పాడే "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా" పాట.  జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనకుండా బద్ధకంగా కాలం వెళ్ళబుచ్చుతున్న వారికి ఒక హెచ్చరిక గా ఈ పాటను రచించారు.  ఇలా ఎన్నో విభిన్న అంశాల ప్రాతిపదికన శ్రీ కొసరాజు గారు వ్రాసిన పాటలు ఆయన పేరును తెలుగువారందరికీ సుపరిచితుణ్ణి చేశాయి.

దాదాపు నాలుగు దశాబ్దాలు తెలుగు రచనలతో, విరాజిల్లిన కొసరాజు గారు, 600 చిత్రాలకు దాదాపు 800 పాటలు రచించారు. ఈయన జానపద కవి సార్వభౌముడు మరియు కవి రత్న బిరుదాంకితుడు. రఘుపతి వెంకయ్య అవార్డ్ గ్రహీత. ఆయన వ్రాసిన ప్రతి పాట, గీతం, గేయం ఏదైనా మన తెలుగు వారికి మరువలేని ఒక నిజజీవిత సందేశం గానే గోచరిస్తుంది. తన పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచి చూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపగలిగిన ఈ అభినవ జానపద బ్రహ్మ అక్టోబరు 27, 1986న తన 81 ఏట పరమపదించారు. కానీ ఆయన పాటలు మాత్రం మనకు ఎల్లప్పుడూ గుర్తుండి ఆయనను మనకు గుర్తుచేస్తుంటాయి.

 

divider

 

Source1, Source2

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)