Ankurarpana


← గత భాగము

పిల్లల పర్యవేక్షణ

పెరుగుతున్న ధరల కారణముగానో...ఆర్ధిక పరిస్థితులవలనో...విలాసవంతమైన జీవితాన్ని గడపడానికో..కారణము ఏదయినా కావచ్చు కానీ, నేడు భార్య భర్త ఇద్దరూ సంపాదించవలసిన పరిస్థితి నెలకొంటున్నది..మరి పిల్లల ఆలనా పాలనా ఆయాల వశమవుతున్న తరుణములో.. పిల్లల నడవడికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి..ముక్కుపచ్చలారని ఆ చిన్నారులు చేసిన నేరమేమి?.. ఆ వయస్సులో వాళ్ళు తల్లిదండ్రుల నుండి పొందవలసిన అనురాగ ఆప్యాయత అనే మమకారపు లాలిత్యాన్ని దూరము చేసేస్తున్నాము..అమ్మ ఒడిలో ఉండే కమ్మదనము ఆయాల వద్ద...డే కేర్ సెంటర్ లలో ఉంటుందా? ఆయాల చేతిలో అగచాట్లు పడుతున్న పసివాళ్ళ  గురించి ఎన్నో వింటున్నాము..అయినా గత్యంతరము లేక వారివద్దే పిల్లలను వదిలేస్తున్నాము...ఈ మధ్య నా స్నేహితురాలి ఇంటిలో జరిగిన సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది...నా స్నేహితురాలు తన రెండేళ్ల బిడ్డని గతి లేక ఆయా చేతిలో పెట్టి ఉధ్యోగానికి వెళ్లింది. వెళ్ళిన రెండు గంటలకే ఇంటి వద్దనుండి కాల్ వచ్చింది..పరుగుపరుగున ఇంటికి వచ్చిన తనకు, లేత పాదములు రెండు ఎర్రగా బొబ్బలతో...మంటకి తాళలేక విలవిలలాడుతున్న తన రెండేళ్ల చిన్నారి ఎదురయ్యాడు...ఇంక ఆతల్లి మనస్సు ఎంత విలవిలలాడి ఉంటుందో మీకు ఈపాటికే విశిదమైవుంటుంది. ఇంతకీ జరిగినది ఏమిటంటే...బాబుకి స్నానం చేయించడానికి ఆ ఆయా బాబుని బాత్రూమ్ వద్ద పెట్టి...బాబుకి స్నానం చేయించే టబ్ లో సలసల కాగుతున్న వేడి నీటీని పోసి...చల్లటి నీటిని అందులో పోయడము మరిచి..ఈ లోపున ఏదో మరిచిపోయిన కారణముగా వంటగదిలోకి వెళ్లింది..అదే సమయములో బాబు రోజూ తను స్నానము చేసే టబ్ ని చూడగానే సరదాగా...(అందులో వేడి నీళ్లు ఉన్నట్లు తెలియదు కదా) కాలు పెట్టి అందులోకి దిగాడు...పాపం వేడి తట్టుకోలేక అమ్మా! అని గట్టిగా అరిచాడు. వంట గదిలోకి వెళ్ళి బాబు విషయం మరిచిపోయిన ఆయా బాబు కేక విని పరుగెత్తుకుని వచ్చి...బాబుని టబ్బు నుండి బయటకు తీసినా అప్పటికే జరగవలసిన అనర్దము జరిగిపోయింది. బాబు రెండు లేత పాదములు ఎర్రగా కాలిపోయి బొబ్బలు కూడా వచ్చాయి...ఇందులో బాబు తప్పేముంది! ఆయా నిర్లక్ష్యం  వలన...పసివాడు బాధపడ్డాడు...ఇక బాబు పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు సమయం పట్టింది..ఇటువంటివి ఎన్నో జరుగుతుంటాయి...

ఇక్కడ ఎవరినీ తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు...కానీ ఆయాలకి ప్రత్యామ్నాయము ఆలోచించాలి..ఇంటిలో ఇదివరకు పెద్దవాళ్ళు ఉండి అన్నీ చూసుకునే వారు...ఇప్పుడు ఒంటరి కాపురాలు అయిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు అనే తీరులో వున్నాయి అందరి బ్రతుకులు..మన అమ్మానాన్నలనో..అత్తామామలనో మన వద్దే ఉంచుకుంటే...మనకి ఒక పెద్దదిక్కు ఉంటుంది... పిల్లలకు నాన్నమ్మ ..అమ్మమ్మ ..తాత్యయ్య ల ముచ్చట తీరుతుంది...పెద్దవాళ్ళకి పిల్లలున్నారనే ఆనందము దక్కుతుంది..ఇప్పుడున్న పరిస్థితులలో...పెద్దలకీ, పిల్లలకీ కొంచెం మనస్పర్ధలు వస్తాయి.. సర్దుబాటు కష్టమే...నేను కాదనను..కానీ ఒక్క విషయం ఆలోచించాలి మనం. చిన్న చిన్నత్యాగాలు.. సర్దుబాట్లు చేసుకుంటే.. అది మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది. పెద్ద వాళ్ళ అనుభవాలు పిల్లల ప్రగతికి సోపానాలు. ఆ అంకురార్పణ మనతోనే జరగాలి. రండి అందరం కలిసి నూతన పథానికి నాంది పలుకుదాం.

 

తరువాయి భాగం »

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)