అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల

← గత భాగము

“టక్, టక్, టక్” – వేళ్ళు ముడిచి ముడుకులతో తలుపుమీద కొట్టింది అనూరాధ. అచ్చంగా వడ్రంగిపిట్ట ముక్కుతో మానుపైన కొట్టినట్లు చప్పుడయ్యింది. అది ఆ స్నేహితురాళ్ళిద్దరూ కుదుర్చుకున్న ఒప్పందం. తలుపు తెరవకముందే వచ్చినది ఎవరో తెలుసుకునేందుకు ఏర్పరచుకున్న సంకేతమది. అనూరాధ, కాంచనలమధ్య ఈనాడు కొత్తగా పుట్టిన స్నేహం కాదది, ఓనమాలు దిడ్డుకున్ననాటినుండీ ఉన్న పరిచయం. వాళ్ళిద్దరూ ఒకేరోజున, ఒకే క్లాసులో, ఒకే బడిలో జేరారు. ఆనాడు మొదలైన స్నేహం ఈ నాటివరకూ కొనసాగుతూనే ఉంది. కానీ కాలేజి దగ్గర వాళ్ళిద్దరిమధ్య ఎడం వచ్చింది. ఇద్దరూ టెంత్ మంచి మార్కులతో పేసయ్యారు. కాంచన కాలేజీలో చేరింది, అనూరాధను తండ్రి చదువు మాన్పించాడు. అనూరాధ ఇల్లుపట్టి రెండే ళ్ళయ్యింది. కాంచన ఇంటర్ పూర్తిచేసి, బి.ఎస్సీ లో చేరింది. వాళ్ళిద్దరూ ఇదివరకులా రోజూ కలుసుకోలేకపోయినా, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఆనాటి స్నేహాన్ని అలాగే నిలుపుకున్నారు.

“రేపు “శివరాత్రి” కదా - లక్ష్మణేశ్వరతీర్థంలో గొప్ప తిరణాల జరుగుతుంది, కాలేజీ అమ్మాయిలమందరమూ కలిసి రేపు ఆ తీర్థానికి వెళ్ళాలనుకుంటున్నాము, నువ్వుకూడా రావే” అంటూ,  కాంచన కాలేజీకి వెళ్ళుతూ దారిలో అనూరాధ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి, చెప్పివెళ్ళింది. అనూరాధ తండ్రి ఊళ్ళో లేడు. తీర్థానికి వెళ్ళడానికి తల్లిని అనుమతి అడిగింది అనూరాధ. తల్లి వెంటనే ఒప్పుకుంది, అనూరాధ తన  స్నేహితురాలితో కలిసి లక్ష్మణేశ్వరం వెళ్ళడానికి. అనూరాధకు బ్రహ్మానందమయ్యింది.

“సరిగా సమయానికి నాన్న ఊళ్ళో లేకపోవడం నిజంగా నా అదృష్టం, ఉంటే ఒక్కనాటికి నన్ను పంపీవారు కాదు” అనుకుంది అనూరాధ.

అనూరాధ తండ్రి శేషగిరి నిరంకుశుడు. ఆయన అనుమతి లేకుండా ఆ ఇంటిలో ఎవరు ఏమి చేసినా ఆయన ఊరుకోడు. తల్లి జానకి భర్తకు పూర్తిగా వ్యతిరేకం. పాలుతాగి పోతున్న పిల్లినికూడా గట్టిగా అదలించని శుద్ధ సాత్వికురాలు ఆమె. కూతురు అనుమతి అడగగానే, “పోనీ పాపం! ఈ ఒక్కరోజుకీ సరదాగా వెళ్ళి వస్తుంది. తండ్రి ఊళ్ళో ఉంటే ఎలాగా వెళ్ళనిచ్చీవారుకాదు. వెళ్ళీది అమ్మాయిలతోనే కదా, అభ్యంతరమెందుకు” అనుకుంది జానకి.

తను తిరణాలకు వస్తున్న విషయం కాంచనకు చెప్పివస్తా - నంటూ తల్లికి చెప్పి, కాంచన వాళ్ళ ఇంటికి బయలుదేరింది అనూరాధ.

ఎన్నిసార్లు కొట్టినా తలుపు తెరవబడకపోయేసరికి అనూరాధకు విసుకొచ్చింది. “తల్లీ, కూతురూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారనుకోడానికైనా గుమ్మానికి తాళం వేసిలేదు.  వీళ్ళేమైపోయినట్లు” అనుకుంది.

సరిగా ఆ సమయంలో దేవుడి ఊరేగింపు జరుగుతోంది ఆ వీధి వెంట. బాజా భజంత్రీలతో బ్రహ్మాండంగా సాగుతోందది. అనూరాధ వెనక్కి తిరిగి తలుపునానుకుని ఆ ఊఱేగింపును చూస్తూ నిలబడింది. అంతలో హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. తలుపు నానుకునివున్న అనూరాధ పరాకుగా ఉండడంతో, నిలదొక్కుకోలేక తూలి పడిపోబోయింది. అకస్మాత్తుగా రెండు చల్లని చేతులు ఆమెను పడిపోనీకుండా పట్టుకుని ఆపాయి. అతిచల్లని స్పర్శ! అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటనకు అనూరాధ ఒళ్ళు జలదరించింది.

అనూరాధను పడిపోకుండా పట్టుకున్న వ్యక్తి పేరు శ్రీనివాస్, కాంచనకు పెద్దమ్మ కొడుకు. చిన్నప్పుడు, అప్పుడప్పుడు అతన్ని కాంచన వాళ్ళ ఇంట్లో చూసిన గుర్తుంది అనూరాధకు. కలిసి ఆడుకునీవారు. అతడు అప్పుడు కుర్రాడు. ఇప్పుడు సుమారుగా పాతికేళ్ళ యువకుడు. స్నానం చేసి, తలైనా తుడుచుకోకుండా లుంగీ కట్టుకుని, బుజాలమీదుగా తువ్వాలు కప్పుకుని ఉన్నాడు. అంతలా ఆగకుండా తలుపు కొడుతున్న దెవరో చూడాలని హడావిడిగా వచ్చాడేమో, అతనికి తలతుడుచుకునే వ్యవధి లేకపోయింది. అతని తలనుండి కారుతున్న నీటితో అనూరాధ బట్టలు కూడా తడిశాయి.

అనూరాధ కంగారుపడింది. అతని చేతులనుండి విడిపించుకుని దూరంగా వెళ్ళి నిలబడి అడిగింది, “క – క – క – క్కాంఛన ఏమయ్యింది?” కంగారుపడడం వల్ల అనూరాధకు మాట తడబడింది.

అతడు చిరునవ్వు నవ్వాడు. “ ఐతే మా కాంచన చెప్పిన డియరెస్టు అండ్ బెస్టు ఫ్రెండువి నువ్వేనన్నమాట! నీ పేరు అనూరాధ కదూ? హలో! నాపేరు శ్రీనివాస్. కాంచనపెద్దమ్మ కొడుకుని. ఈ ఊరికి  ఇంటర్వ్యూ కోసం వచ్చా, కాలేజీలో లెక్చరర్ పోస్టుకి”  అన్నాడు.

“ముందు నాకు కాంచన ఏమయ్యిందో చెప్పండి, నన్ను రమ్మని, తనిలా మొహం చాటెయ్యడం ఏమీ బాగాలేదు” అంది అనూరాధ.

“నిజంగానే ఏమీ బాగాలేదు. అసలా టెలిగ్రామ్ రావడమే బాగాలేదు. కానీ వచ్చింది! కాంచన అక్కకి నెలలు నిండకముందే నొప్పులు వచ్చాయిట! వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఉన్నబడంగా మా పిన్నీ, కూతురూ బయలుదేరి వెళ్ళాల్సివచ్చింది. ఒక్కసారి ఆగండి, నేను బట్టలు మార్చుకుని వచ్చి తక్కిన విషయాలు చెపుతా. అంతవరకు మీరిలా కూర్చోండి” అంటూ హాల్లో - అక్కడే ఉన్న కుర్చీ చూపించాడు.

అప్పుడు గమనించింది అనూరాధ, అతడు స్నానం చేసి, తలా, ఒళ్ళూ తుడుచుకోకుండా కంగారుగా వచ్చాడని. తన బట్టలకు అంటిన తడిని చూసి నవ్వుకుంది. ఆ తడి ఆరేవరకూ తను ఇంటికివెళ్ళడం ఎలాగా కుదరదు. తనిక్కడ కొంతసేపు ఉండక తప్పదు మరి” అనుకుని, ఫాన్ వేసి వచ్చి కుర్చీలో కూర్చుంది.

కొంతసేపట్లో అతడు తెల్లని పైజామా లాల్చీలు తొడుక్కుని, తల తుడుచుకుని క్రాపింగ్ నీటుగా దువ్వుకుని వచ్చి అనూరాధ కూర్చున్న చోటుకి కొంచెం ఎడంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. “ఇప్పుడు చెపుతున్నా వినండి కాంచన ఏమందో...” అంటూ కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “నన్నుమాత్రం తప్పుపట్టకూడదు మరి” అన్నాడు.

“మిమ్మల్నేమీ తప్పుపట్టనులేండి, చెప్పండి, ఫరవాలేదు” అంది అనూరాధ.

“ఐతే వినండి... “ తిరణాళకు వెళ్ళడం కోసం రేపు ఒక నల్లపిల్ల పాపం! ఎంతో ఆశగా వస్తుంది, దాని మనసు నొచ్చుకోకుండా జాగ్రత్తగా ఈ విషయం చెప్పు- నేనిలా తప్పనిసరి పరిస్థితిలో అమ్మతో వెడుతున్నానని” అంటూ ఎంతో ఇదిగా చెప్పి వెళ్ళింది. తిరిగిరాగానే తప్పకుండా వచ్చి కలుస్తానని కూడా చెప్పమంది.” ఒక్క సేకన్ ఆగి అన్నాడు మళ్ళీ , "మీరు నాకు నల్లపిల్లని అనిపించడం లేదు మరి, కాంచన అలా ఎందుకంది?"

"మిల్కీవైట్ కాంచేన ముందు నేను నలుపే కదా! అప్పుడప్పుడు అలా అంటుంది నన్ను కాంచన, నాకేం కోపం రాదు. సరే, ఇక నేనేమనుకుంటాను... అలాంటి తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు! నాకే ప్రాప్తం లేదు అనుకుంటా. "జన్మకో శివరాత్రి" అనుకున్నా! ఇప్పుడు నాప్రాప్తం ఇంతేనని సరిపెట్టుకుంటా... మళ్ళీ నా జన్మలో ఇటువంటి మంచి అవకాశం వస్తుందనుకోను” అంటూ బాధగా నిట్టూర్చింది అనూరాధ.

శ్రీనివాస్ నొచ్చుకున్నాడు, “రేపు నేను ఎలాగా తిరణాలకు వెళ్ళాలనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే మా చెల్లెలి బదులు మీకు నేను తోడుంటా.”

అనూరాధ తలపైకెత్తి అతనిముఖంలోకి సూటిగా చూసింది. ఆ చూపును చదవగలిగాడు శ్రీను.

“ఏమంత పరిచయముందని ఇతనితో వెళ్ళడం - అని మీ కనిపిస్తే ఎవరిదారిన వాళ్ళం వెడదాము. ఒకళ్ళతో ఒకళ్ళo కనీసం ఒక్క మాటకూడా మాటాడుకోవద్దు. కానీ ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి. వెంటనే నేను పలుకుతా. అంతవరకూ పక్కపక్కల నడుస్తున్నా మీరెవరో, నేనెవరో అన్నట్లుగా ఉందాము. సరా” అని, “నా ఐడియా బాగుందికదూ” అని అడిగాడు అతడు.

ఏమీ జవాబు చెప్పకుండా అనూరాధ ఆలోచనలో పడింది. “ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. నేను దీనిని చేజేతులా జారవిడుచుకుంటే మళ్ళీ ఈ జన్మకి మరో అవకాశం చచ్చీదాకా కూడా రాకపోవచ్చు. ఇతను చెప్పినట్లు చేస్తేసరి, మనిషి మంచివాడనే అనిపిస్తున్నాడు. అయినా, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళాడమే కదా” అనుకుంది అనూరాధ. ఎట్టి పరిస్థితిలోనూ ఆయాచితంగా వచ్చిన తిరణాలకు వెళ్ళే అవకాశాన్ని జారవిడుచుకోవాలనుకోలేదు ఆమె. అందుకే అన్నారు పెద్దలు, “బుద్ధిః కర్మానుసారిణీ” అని!

“రేపు నేను పెండరాళే భోజనం చేసి వచ్చేస్తా, మీరూ సిద్ధంగా ఉండండి. ఇద్దరం ఎవరిదారినవాళ్ళమ్ కలిసి వెడదాము” అంటూ నవ్వింది అనూరాధ.

“ఓ. కే. ” అంటూ అతడూ నవ్వాడు. “రేపు తొమ్మిదయ్యీసరికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు రాగానే బయలుదేరుదాము. బై ది బై! దొడ్లో మల్లిపందిరి విరబూసింది. కావాలనుకుంటే  కోసుకువెళ్ళండి, ఈలోగా మీ బట్టలకంటిన తడి కూడా ఆరిపోతుంది” అన్నాడు శ్రీను. వెంటనే అనూ మొహం విప్పారింది. అంతా తెలిసిన చోటే కనుక లేచి దొడ్డివైపుకి పరుగెట్టింది, మల్లెమొగ్గలు కోసుకోడానికి. మల్లెల మీద ఆశలేని మగువలుంటారా ఈ భూమి మీద!

వెనకాలే వెళ్ళాడు శ్రీను. క్రిందిబారు మొగ్గలు అనూ కోస్తూంటే, ఎత్తుగా ఉన్నవి శ్రీను కొయ్యసాగాడు. ఇద్దరూ అలా ఆ మల్లెపందిరి చుట్టూ తిరుగుతూ మల్లెమొగ్గలు కోస్తూ క్రమంగా కబుర్లు చెప్పుకోడం మొదలుపెట్టారు. “కలిసి ఏడడుగులు వేస్తే చాలు స్నేహితులౌతారు” అంటారు. అలాంటిది వాళ్ళు ఆ మల్లిపందిరి చుట్టూ తిరుగుతూ అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువే అడుగులు వేశారు. కలిసి అన్ని అడుగులు నడిచాక వాళ్ళిద్దరిమధ్య స్నేహం కలిసిపోడంలో ఆశ్చర్యమేముంది! మల్లెమొగ్గలు కొయ్యడం పూర్తి అయ్యేసరికి వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారడమేకాడు, ఒకరినొకరు “అనూ” అంటే, “శ్రీనూ“ అంటూ పేర్లుపెట్టి పిలుచుకోసాగారు.

######

మరునాడు లేచింది లగాయితూ తిరణాలకు వెళ్ళీ సమయం కోసం తహతహలాడుతూ ఎదురుచూడసాగింది అనూరాధ. నిలుచున్నచోట నిలబడకుండా ఇల్లంతా అల్లంగమ్ తిరుగుతున్న కూతుర్ని చూసి మూసిముసిగా నవ్వుకుంది జానకి, అనూరాధ తల్లి. ఆమెకు తన చిన్నతనం గుర్తొచ్చింది. తమ ఊళ్ళో దసరా పండుగ అమ్మవారి గుడిలో గొప్పగా జరిగేది. అమ్మవారికి రోజుకో రూపంగా ముస్తాబు చేసీవారు. ఆరోజుల్లో తానూ గుడికి వెళ్ళడం కోసం ఇలాగే తహతహలాడేది ఆ పదిరోజులూ - గుడికివెళ్ళి ఆ రోజు అమ్మవారిని ఎలా అలంకరించారో చూడాలని!

“అనూరాధను బడి మానిపించాక, ఆమె ఇల్లుకదిలి ఎక్కడికీ వెళ్ళిందిలేదు. తండ్రి ఊళ్ళో ఉంటే ఆమెకు ఈ వేళ కాంచనతో కలిసి తీర్థానికి వెళ్ళే ఈ అవకాశం దక్కేది కాదు. పాపం, వెర్రిపిల్ల! జన్మకో శివరాత్రి! వెళ్ళిరానీ” అనుకుంది జానకి, ఆ  తరువాతి కాలంలో కాంచన ఉనికిలో వచ్చిన మార్పులేమీ ఆమెకు తెలియకపోవడంవల్ల.

కాంచన ఊళ్ళో లేదన్న విషయం అనూరాధ తల్లికి చెప్పలేదు.

భయంకరమైన కట్టడిలో పెరిగిన పిల్లలు, ఏమాత్రం అవకాశం దొరికినా ఆ కట్లు తెంపుకుని స్వేఛ్ఛా విహంగాలై వినీలాకాశంలో విహరించాలని అనుకోవడం సహజం. అనూరాధకి ఈరోజు అటువంటి అవకాశం దొరికింది. దాని నామె సంపూర్ణంగా వినియోగించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. కన్నతల్లిని మోసగిస్తున్నదన్న ఆలోచనే రాలేదు ఆమెకు! “అవశ్య మనుభోక్తవ్యo కృతం కర్మ శుభాశుభం” అన్నారు పెద్దలు!

తొమ్మిదయ్యే సరికల్లా భోజనం చేసి, చక్కగా ముస్తాబై, బారుగా జడల్లుకుని, తలలో మల్లిపూలుచెండు పెట్టుకుని తల్లి ఎదుట నిలబడింది అనూరాధ, సెలవు అడగడం కోసం. పదహారణాలా తెలుగింటి అమ్మాయిలా ముస్తాబై వచ్చిన తన కూతుర్ని చూసి ఆ తల్లి మురిసిపోయింది.  “కాంచనంత తెలుపు కాకపోవచ్చు గాని, దీనికున్న చక్కదనం కాంచనకేదీ” అనుకుంది మనసులో.

“అప్పుడే బయలుదేరాలా? ఇవిగో వందరూపాయిలు, సరిపోతాయిగా...  జాగ్రత్తగా వెళ్ళిరా. కాంచన అమ్మగారిని అడిగానని చెప్పు, మర్చిపోకేం! అందరూ కలిసికట్టుగా ఉండండి. విడిపోతే దారి తప్పిపోతారు. చీకటి మూసుకులో ఘోరాలు దాగి ఉంటాయి, చీకటి పడకముందే ఇల్లు చేరాలి సుమీ!“ కూతురు ఇల్లుదాటి వెళ్ళేవరకూ అలా ఏవేవో జాగ్రత్తలు చెపుతూనేవుంది ఆ తల్లి.

######

గగన వీధిని మేఘాలు పరుగులుపెడుతున్నాయి. చల్లనిగాలి మెల్లమెల్లగా వీస్తూ ఎండని వేడేక్కనీయడంలేదు. ఆహ్లాదకరంగా ఉందనిపిస్తోంది వాతావరణం. బిరబిరా  నడుచుకుంటూ కాంచన ఇంటికి చేరింది అనూరాధ. అప్పటికే తయారై అనూరాధ రాకకోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్, అల్లంత దూరంలో ఆమె కనిపించగానే ఇంటికి తాళం వేసి, గబగబా గుమ్మాలుదిగి వీధిలోకి వచ్చేశాడు. ముందురోజు చేసుకున్న నిర్ణయం ప్రకారం ఒకరినొకరు పలకరించుకోకుండా, ఇద్దరిమధ్యా అసలు పరిచయమే లేనట్లుగా, ఎవరిదారిన వాళ్ళు నడవసాగారు.  శ్రీనివాసుకు ఆ ఊరినిగురించి ఏమీ తెలియకపోయినా అనూరాధకి కొంచెంగా తెలుసు - కాలేజీ పక్కనుండి గోదావరి వారగా వెళ్ళే రోడ్డు నేరుగా లక్ష్మణేశ్వరం వెడుతుందని ఎవరో అనగా ఆమె విని ఉంది. అంతేకాదు, ఆ దారి వెంట తండోప తండాలుగా నడిచి లక్ష్మణేశ్వరమ్ వెడుతున్న భక్తులు కనిపించారు. ఇక దారికోసం తడుముకోవలసిన అవసరం లేకపోయింది. వారితోపాటుగా తామూ నడవసాగారు అనూ, శ్రీనూ కూడా.

జనసందోహాన్ని చూసిన శ్రీనివాస్ కి భయం పుట్టింది, తనదీ అనూది చెరోదారీ అయిపోతుందేమోనని. వెంటనే అతడు ఆమె పక్కకొచ్చి నడవసాగాడు. ఇంకా కొంతదూరం నడిచేసరికి ఇద్దరూ ఒకేచోట ఉండాలంటే అదికూడా సరిపోదనిపించడంతో, వెనక ఏర్పరచుకున్న నిబంధనలన్నీ మర్చిపోయి, చేయీ  చేయీ  కలుపుకుని నడవసాగారు. అలా వాళ్ళు జంటగా నడిచి నడిచి ప్రభలున్నమైదానాన్ని చేరుకున్నారు. గుడి దగ్గరకి వచ్చేసరికి వాళ్ళు, ఒకరికొకరు అత్యంత ఆత్మీయులుగా మారిపోయారు.

లక్ష్మణేశ్వరం పశ్చిమగోదావరి జిల్లాలో, గోదావరీ పాయల్లో ఒకటియైన వశిష్ట నదీ తీరానవున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం. శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలోని  గోదావరీ తీరంలో సంచరిస్తున్నప్పుడు శివరాత్రీ పుణ్యకాలం సమీపించింది. అప్పుడు లక్ష్మణుడు గోదావరీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, పూజకు ఏర్పాట్లు చేశాడుట. ఆ శివలింగానికి శివరాత్రి రోజున, అవతారమూర్తులైన  వారు ముగ్గురూ తొలిసారిగా భక్తిశ్రద్ధలతో పూజ చేశారని స్థలపురాణం చెపుతోంది. లక్ష్మణునిచే ప్రతిష్ఠిoచబడిన శివలింగం కనుక అక్కడ స్వామి లక్ష్మణేశ్వరస్వామిగా ప్రసిద్ధిపొందాడు. ప్రతి శివరాత్రికి ప్రత్యేకంగా అక్కడ గొప్ప పండుగ జరుపుతారు.

సీతారామలక్ష్మణులచేత పూజింపబడిన ఆ లింగాన్ని తాముకూడా పూజించి తరించాలని భక్తజనులు దేశం నలుమూలలనుండీ ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడికి తండోపతండాలుగా తరలివస్తారు. ప్రతి ఏటా శివరాత్రినాడు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని జనం నడిచే వెడతారు దైవ దర్శనానికి.

అనూరాధా శ్రీనివాసులు ముందుగా పళ్ళు, కొబ్బరికాయ పూజా సామగ్రి కొనుక్కుని దైవదర్శనానికి వెళ్ళారు. దైవానికి పళ్ళు, కొబ్బరికాయ సమర్పించి ప్రసాదం తీసుకున్నారు ఇద్దరూ. శివునికి లక్షపత్రి పూజ జరుగుతోంది. వేద పండితులు చదువుతున్న మంత్రాలు శ్రవణ పేయంగా వినిపిస్తున్నాయి. గుడి మండపంలో లక్షపత్రి పూజాకై మారేడుదళాలు గుట్టగా పోసి ఉన్నాయి. కొంతమంది భక్తులు వాటిని శుభ్రం చేస్తున్నారు. భక్తులు ఒకరొకరుగా వచ్చి గుడిగంటను మొగిస్తుoడడంతో గంటానాదం అవిశ్రాంతంగా వినిపిస్తోంది.  అనూ, శ్రీను గుడి మండపంలో ఒక వారగా కూర్చుని ప్రసాదాలు పంచుకు తిన్నారు. ఇద్దరూ ఇలా కలిసి తిరగడం, ప్రసాదాలు పంచుకు తినడం - ఇదంతా ఒక నూతనానుభవంగా ఉండి, గగుర్పాటు కలిగిస్తోంది వాళ్ళిద్దరికీ కూడా. అంతలో “అనూరాదమ్మగారూ” అంటూ ఎవరో తనను పేరుపెట్టి పిలిచినట్లై తలెత్తి చూసి, గతుక్కుమంది అనూరాధ.

ఎదురుగా తన తండ్రి నడుపుతున్న ఫాన్సీ షాపులో పనిచేసే గణపతి కనిపించాడు. అతడు దగ్గరగా వస్తూ, “అయ్యబాబోయ్! ఎవరో అనుకున్నానండి అమ్మాయిగారూ, మీరేనాండీ” అన్నాడు ఆశ్చర్యపోతూ.

అనూరాధ తడబడింది. అంతలోనే సద్దుకుని, “ఔను, బంధువులతో కలిసి తిరణాలకొచ్చాను. ఈయన వాళ్ళ అబ్బాయి. నేను దారితప్పిపోతే, నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఈయన. మీవాళ్ళెక్కడ? వాళ్ళు మీతోరాలేదా'"అని మాటమార్చి అడిగింది అనూరాధ. ఆమె అలా అబద్ధం ఎందుకు చెప్పిండో అర్ధం చేసుకోలేని శ్రీనివాస్ తెల్లమొహం వేశాడు, కానీ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.

"ఎవరూ రాలేదమ్మా. పిల్లాడికి ఒళ్ళుబాగోలేదు, తల్లి కొడుకుని కనిపెట్టుకుని ఉంది. నేను పిల్లాడి ఆరోగ్యం కోసం వాడిపేరున పూజ చేయిద్దామని ఇటు వచ్చా. ఇక ఉంటానమ్మా! వెడతా బాబూ"అంటూ అతడు వెళ్ళిపోయాడు.

అనూరాధ శ్రీనుకి సంజాయిషీ చెప్పుకుంది, “ఏం చెయ్యను చెప్పు, వీడొట్టి తంపులమారి తెంపి! మా నాన్నకి నమ్మిన బంటు. ఆయనతో ఏం చెపుతాడోనన్న భయంతో, పెద్దవాళ్ళతో కలిసివచ్చాననుకోడం కోసం అలా అబద్దమాడా. ఇంకా నాకు నమ్మకం లేదు, వీడు మా నాన్నకు పితూరీ చెయ్యకుండా ఊరుకుంటాడని.”

“వెళ్ళిపోయాడుగా. ఇంక అతన్ని తలుచుకోవద్దు. మనం కాసేపు అటూ ఇటూ తిరిగి ఎంజాయ్ చేద్దామ్, పద” అంటూ లేచాడు శ్రీను. అతన్ని అనుసరించింది అను.

ఆ తరవాత వెళ్ళి వాళ్ళు “ఫ్లైయ్యింగ్ వ్వీల్”, “రోలర్ కోస్టర్” ఎక్కారు, ఎన్నెన్నో గేముల్లో పాల్గొన్నారు, తిరణాల మొత్తం తిరిగి చూశారు. తిరిగితిరిగి అలిసిపోయారు. టీ తాగడం కోసం ఒక “టీ స్టాల్” దగ్గర ఆగారు వాళ్ళు.

పొద్దు పడమటకి వాలింది. అకస్మాత్తుగా వాతావరణంలో ఏదో మార్పు చోటుచేసుకుంది. అప్పటికే చాలామంది యాత్రీకులు తిరుగుప్రయాణమై వెళ్ళిపోతున్నారు. శ్రీను, అనూలకు  మాత్రం ఇంకా తనివితీరినట్లు అనిపించడంలేదు. కానీ, ప్రకృతి వాళ్ళకు సహకరించలేదు.

గాలి జోరుగా వీయసాగింది. మేఘాలు గుమిగూడి సూర్యుణ్ణి కమ్మెయ్యడంతో పొద్దు తెలియలేదు ఎవరికీ. “బంగాళాఖాతంలో “అల్పపీడనద్రోణి” ఏర్పడిందని రేడియోలు ఘోషించాయని జనం చెప్పుకోడం మొదలుపెట్టారు. ఏ క్షణం లోనైనా వాన కురిసేలా ఉంది వాతావరణం. తొందరగా ఇళ్ళు చేరాలని టోందరపడసాగారు జనం. షాపులు పెట్టుకున్నవాళ్ళ కంగారు చెప్పనలవి కాకుండాఉంది. అనూ, శ్రీను కూడా తప్పనిసరిగా తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదివరకులా ఇప్పుడు మందితో కలసి నడిచేందుకు కుదరదు. వచ్చీటప్పుడు అందరి గమ్యమూ ఒకటే - అది లక్ష్మణేశ్వరము. కానీ ఇప్పుడు వేరువేరు ఊళ్ళనుండి వచ్చిన జనం వేరువేరు దారులు పట్టుకుని తిరిగి వెడుతున్నారు. తాము ఏ దారిని వచ్చారన్నది వాళ్ళు గుర్తించలేకపోయారు. ఒక కుటుంబం గుంపుగా వెడుతూంటే వాళ్ళని ఆపి, దారి అడిగారు.

ఆ కుటుంబంలో పెద్దావిడ వీళ్ళవైపు పరిశీలనగా చూసి, “చక్కగా ఉంది మీ జోడీ! ఇదిగో అమ్మాయీ , మీకు పెళ్ళాయ్యి ఎన్నాళ్ళయ్యింది” అని అడిగింది.

ఆమె అలా అడిగేసరికి అనూ సిగ్గుపడి తలదించుకుంది. శ్రీను ఆమెను చెయ్యిపట్టుకుని వేరేచోటికి తీసుకెళ్ళిపోయాడు. కానీ, ఆ పెద్దామె మాటలు వాళ్ళ మనసులో ఏవేవో కొత్త ఊహలు రేపాయి. వాళ్ళకు ఇంతవర కెప్పుడూ ఎరుగని కొత్తకొత్త ఆలోచనలు రావడం మొదలుపెట్టాయి. వాళ్ళ హృదయాల్లో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. ఇదివరకులా స్వేచ్ఛగా ఒకరినొకరు చూసుకోలేక వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు దొంగచూపులు చూసుకోసాగారు.

శ్రీనివాస్ మరో వ్యక్తిని అడిగాడు దారి. అతడు ఆ ఊరివాడే కావడంతో వాళ్ళను చూసి జాలిపడ్డాడు. “ వానొచ్చేలా ఉంది, తొందరగా వెళ్ళండి. రోడ్డుదారైతే చుట్టు. ఉత్తరంగా కొంతదూరం వేడితే తూరుపుపడమరలుగా ప్రవహిస్తున్న కాలవ ఒకటి కనిపిస్తుంది.  ఆ కాలవ గట్టుమీద తూరుపుగా నడిస్తే - అది అడ్డదారి, మీ ఊరు తొందరగా చేరుకుంటారు. ఆకాశాన్ని చూస్తే మీరు తడిసిపోక తప్పదనిపిస్తోంది. తొందరగా నడవండి” అంటూ అతడు సానుభూతితో మాట్లాడాడు. అతనికి ధన్యవాదాలు చెప్పి, అతడు చెప్పిన దారివెంట వేగంగా నడివసాగారు వాళ్ళు. ముందు శ్రీను, అతనివెనుక అనూ! ఒక కిలోమీటరైనా నడిచారోలేదో సన్నగా  చినుకులు మొదలయ్యాయి. వాళ్ళు అతడు చెప్పిన కాలవగట్టు వెంబడి నడవసాగారు.

కొద్దిసేపట్లో గాలి జోరు పెరిగింది, వానహోరు హెచ్చింది. తరచూ మెరుస్తూ, ఉరుముతూ బీభత్సంగా ఉంది ఆకాశం.  కాలువకి ఇటూ అటూ ఉన్న పంటపొలాలు గాలికి అలలు అలలుగా అందంగా కదులుతున్నాయి. పొలాలకు ఆవలగా మట్టిదిబ్బలపై నాటిన సరుగుడుమొక్కలలో చేరి గాలి ఈలలు వేస్తోoది. చూస్తూండగా వాన కుండపోతగా కురవసాగింది. వర్షధారలమాటున ప్రకృతి మసగబారి, కళ్ళకు ఏమీ సరిగా కనిపించడం లేదు. నీటిధారలు మీదపడి సూదుల్లా గుచ్చుకోడం మొదలుపెట్టాయి. ఉరుముల మెరుపుల జోరు పెరిగింది. పెద్దగా మెరిసిన మెరుపుకాంతిలో కాలవపక్కనున్న కొబ్బరి తోటలో ఒక చిన్న పాక కనిపించింది. వాన ఉధృతం తగ్గీవరకు అందులో తలదాచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అటు పరుగెత్తారు. మరో మెరుపు వెలుగులో ఆ పాకలో ఒక వారగా బోలెడు వట్టిగడ్డి కుప్పగా వేసి ఉంది. ఆ పాకలో పశువులు లేవు. కానీ, ఆ గడ్డిమీద రెండు పెద్దపెద్ద పాములు చెర్లాడుతూండడం మెరుపుల వెలుగులో కనిపించింది. రెండడుగులు ముందుకు వేసిన అనూరాధ కెవ్వున అరిచి వెనక్కి వచ్చి భయంతో ఒణుకుతూ  శ్రీనుని అల్లుకుపోయింది. ఆ పాములు రెండూ ఆ అలజడికి జడిసి చెరోపక్కకీ పారిపోయాయి.

విపరీతమైన భయంతో తనను వాటేసుకున్న అనూరాధను చేరదీసుకుని ఆమెకు ధైర్యం చెప్పాడు శ్రీనివాసు. "భయంలేదు అనూ, అకస్మాత్తుగా చూడగానే రెండూ ఒకేపోలికగా కనిపించడంతో జనం వీటిని చూసి త్రాచుపాములనుకుని భయపడి చంపుతారుగాని, త్రాచుకున్నట్లు వీటికి పడగ గాని, విషమున్న కోరలుగానీ ఉండవు. ఇదొట్టి పిరికిగొడ్డు. పేరు జెర్రిగొడ్డు! అలికిడి తెలియగానే ఆమడదూరం దౌడు తీస్తుంది గాని కరవడానికి ఎంతమాత్రం ప్రయత్నించదు. చూడు, మనం రాగానే  అవి ఎలా పారిపోయాయో! వీటిని చూసి భయపడనక్కరలేదు. పైగా ఇవి పొలంలోని ఎలకల్ని పట్టి, రైతులకు మేలుచేస్తాయి కూడా."

అతని మాటలు విన్నాక అనూరాధ భయం తగ్గిందిగాని, ఆ కౌగిలి సడలలేదు. పరస్పర పరిష్వంగంలో మైమరచి వాళ్ళు తామున్న స్థితిని, పరిసరాల్ని పూర్తిగా మర్చిపోయారు. పరువానికివచ్చిన వయసుకావడంతో వాళ్ళకు తాము చూసిన పాములజంట అద్భుతవిన్యాసం ప్రేరణ అయ్యింది. చలిగా ఉన్న వాతావరణం, అరుదైన ఏకాంతం దానికి తోడయ్యి వాళ్ళని హద్దుమీరేలా చేసింది. పాకలో పరుచుకుని ఉన్న వట్టిగడ్డి వాళ్ళకు పానుపయ్యింది. పాముల కలయిక వాళ్ళకు పాఠాలు నేర్పింది. జరగరాని తప్పు జరిగిపోయింది.

“నిద్ర సుఖమెరుగదు” అంటారు. అలసి సొలసిన ఆ యువజంటకు నిద్ర ముంచుకురావడంతో, ఆ గడ్డిమీదపడుకుని, అలాగే నిద్రపోయారు. వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనేవుంది ఆ రాత్రంతా. ఏ తెల్లారుఝాముకో గాని తెరిపినివ్వలేదు ఆ వాన.

వానమేఘాలు తొలగిపోడంతో యధాప్రకారం, శల్యూష సమయమయ్యేసరికి ఆకాశం ఒక విధమైన అలౌకిక కాంతితో నిండిపోయింది. అదే బ్రాహ్మీముహూర్తం!

రాత్రులందు సంచరించే జంతువులన్నీ తిరిగి తమతమ నివాసాలకు చేరుకునే సమయమది. పొలాల్లో సంచరించి, రాత్రంతా ఆహారం కోసం వేటాడిన గుంటనక్కలు, బొరియల్లో దూరబోతూ, మూకుమ్మడిగా అన్నీకలిసి గట్టిగా ఊళలు వెయ్యసాగాయి. రాత్రంతా వేటాడిన గుడ్లగూబ వేటముగించి గూటికి మళ్ళబోతూ కఠోరస్వరంతో పలికింది. ఆ సందడికి అనూరాధకు మెలకువవచ్చింది. ఆ కనువెలుగులో తను ఉన్న చోటును, తన పక్కనే ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆమెకు జరిగినవన్నీ గుర్తుకువచ్చి కంగారుపడింది. పశ్చాత్తాపంతో భోరున ఏడ్చిoది,  ఆ సందడికి శ్రీనివాసుకి కూడా మెలకువ వచ్చింది. “ఏమయ్యిందని అనూ! అంతలా ఏడుస్తున్నావు, ఎండుకని” అని అడిగాడు, ఆమెను ఓదార్పుగా దగ్గరకు తీసుకుని. అతని కౌగిలిని విడిపించుకుని దూరంగా తొలగి నిలబడింది అనూరాధ...

“ఏమయ్యింది” అంటూ నెమ్మదిగా అడుగుతున్నావా? పెళ్ళికాకముందు ఏ జంటా చెయ్యకూడని తప్పు మనం చేశాము. దీనివల్ల  ముందుముందు ఏమేమి అనర్ధాలు రానున్నాయో” అంటూ ఏడ్చిoది అనూరాధ.

శ్రీనివాస్ నొచ్చుకున్నాడు. “అలా అనొద్దు, మన మిద్దరం త్వరలోనే పెళ్ళిచేసుకుందాం. ఐ లవ్ యూ అనూ! మా అమ్మా నాన్న నా మాట కాదనరు. ఇంటికెళ్ళగానే వాళ్ళకు అంతా చెప్పి, మీవాళ్ళ దగ్గరకు పంపుతా పెళ్ళిమాటలకు. నన్ను నమ్ము అనూ.”

“మనకు పెళ్ళి జరగాలంటే మానాన్నకూడా ఒప్పుకోవాలికదా! ఆయన బుద్ధి ఎప్పుడు ఎలా పని చేస్తుందో ఆయనకే తెలియదు. అయ్యో! నేనింత మతిమాలినదాన్ని అయ్యానేమిటో” అంటూ ఆమె మరింతగా ఏడ్చింది. దిగ్భ్రాంతుడయ్యాడు శ్రీనివాస్.

అకస్మాత్తుగా తెలివితెచ్చుకున్నదానిలా అనూరాధ, తనను చుట్టివున్న శ్రీనివాస్ చేతులనుండి విడిపించుకుని, లేడిపిల్లలా మహా వేగంతో ఇంటివైపుగా పరుగుపెట్టింది. తెల్లబోయాడు శ్రీనివాస్. ఇక చేసేదేమీలేక ఆమె వెనకాల తానూ శీఘ్రంగా బయలుదేరాడు. వాళ్ళు తిరణాలలో కొన్న వాటిని గురించి వాళ్ళిద్దరూకూడా పట్టించుకోకపోడంతో అవి ఆ పాకలోని గడ్డిలో పడి ఉన్నాయి.

######

అనూరాధ ఇంటిని సమీపించేసరికి తెల్లారింది కానీ ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. ఔట్ హౌస్ లో కాపురముంటూన్న పనిమనిషి పద్దాలు, వీధిగుమ్మం కడిగి ముగ్గు వేస్తోంది. అనూరాధ ఇల్లు చేరింది. ఆ అలికిడికి తలెత్తి చూసింది పద్దాలు.

“అమ్మయ్య ! లేచారాండీ అమ్మాయిగారూ! ఈ చుక్కలు ఎలా కలపాలో మర్చిపోయా. కాస్త కలిపి చూపించండమ్మా” అంటూ ముగ్గుచిప్ప ఆమె చేతిలోఉంచి, పక్కన నిలబడింది. ముగ్గురంధిలో పడి అనూరాధ వీధిలోంచి వచ్చిందన్నది గమనించనేలేదు పద్దాలు.

ఆ ముగ్గు ఎలా కలిపాలో పద్దాలుకి చెప్పి, అనూరాధ గప్ చుప్గా తనదగ్గరున్న తాళంతో తలుపుతెరిచింది. ఇంట్లో ప్రవేశించగానే ఆమెకి గదిలోంచి తల్లి మూలుగు వినిపించింది. వేగంగా వెళ్ళి తలారా స్నానం చేసి, పొడిబట్టలు కట్టుకుని తలకి పిడప చుట్టుకుని తల్లిదగ్గరకు వచ్చింది అనూరాధ. బాధతో మూలుగుతూ కళ్ళుమూసుకుని పడుకున్న తల్లి ఒంటిమీద చెయ్యివేసి, “అమ్మా! బాధగావుందా” అని ప్రేమగా అడిగింది. కూతురు పిలుపువిని కళ్ళుతెరిచింది జానకి. “ నిన్న సాయంకాలం బాధమొదలయ్యింది. భరించలేక రెండు నిద్రమాత్రలు మింగి ఆరుగంటలకే పడుకుండిపోయా. నీకు తాళం ఇచ్చి పంపించడం మంచిదయ్యింది.” అంది జానకి.

తల్లి తను రాత్రే ఇంటికి వచ్చినట్లు అనుకుంటున్నదని అర్థం చేసుకున్న అనూరాధ లోలోన సిగ్గుతో చితికిపోయింది. కానీ పైకి తల్లితో ఏమీ అనలేదు. నిన్ననే తల్లి అనారోగ్యంగా కనిపించినా, తిరణాలకు వెళ్ళే బులబాటంలో ఆ సంగతిని పట్టిoచుకోలేదు తను. తల్లి కోసం తను తిరణాలకు వెళ్ళకుండా ఆగి ఉంటే ఏ సమస్యాలేకుండా ఎంత బాగుండేదో...  కానీ, గతజల సేతుబంధనంతో ప్రయోజనమేముంది - అనుకుంది అనూరాధ.

మ్లానమై యున్న కూతురు ముఖం చూసి నొచ్చుకుంది తల్లి. ఆ బాధoతా తన అనారోగ్యం వల్ల వచ్చినదే - అనుకుంది. “ఫరవాలేదు, మరీ అంత యిడవ్వకు. రేపటికి తగ్గిపోతుందిలే” అంది ఓదార్పుగా. తన అనారోగ్యమే కూతురి దుఃఖానికంటకీ కారణమనుకున్న జానకి.

“అలా అనకమ్మా! ఎన్నాళ్ళని పడతావిలా? ఒకసారి డాక్టర్ కి చూపించడం బాగుంటుంది.”

“ఔను, నేనూ ఈ బాధ పడలేకపోతున్నాను, నాన్నరాగానే తీసుకెళ్ళామంటా. ఈలోగా నువ్వు నాకోకప్పు కాఫీ చేసి ఇవ్వు. రాత్రి తిండి తినలేదేమో, చాలా నీరసంగా ఉంది” అంది జానకి.
కాఫీ తయారు చెయ్యడం కోసం లోపలకు వెళ్ళింది అనూరాధ. తల్లి ఏప్రశ్నలూ వెయ్యకపోడంతో కొంతవరకు మనసు తేలికపడింది ఆమెకు.

మౌనంగా బాధను ఓర్చుకుంటూ ప్రశాంతంగా కనిపించే ప్రయత్నంలో ఉన్న జానకికి మరే విషయాలూ స్పురించలేదు. అంతలో వీధిగుమ్మంలో కారు ఆగిన చప్పుడు వినిపించింది.

అనూరాధ తండ్రి శేషగిరి బిజినెస్ పనిమీద తరచూ ఊళ్ళుపట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అతనికి  సంసారం మీదున్న ప్రేమ కంటే తన బిజినెస్సు మీదే మక్కువ ఎక్కువ. ఇంట్లో ఎవరి మీదైనా అతనికి ప్రేమలాంటిది ఏదైనా ఉందంటే అది కొడుకు ఒక్కడిమీద మాత్రమే. కొడుకు చాలా పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగం చేస్తూ, గొప్పగా బ్రతకాలన్న కోరికతో, కొడుకునొక ప్రత్యేకమైన పద్ధతిలో పెంచాలనుకున్నాడు. పదేళ్ళ వయసులోనే కొడుకును ఇంటినుండి దూరం చేసి, ఎక్కడోదూరంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి చదివించసాగాడు. కూతురంటే అతనికి ఎప్పుడూ చిన్నచూపే! దండగమారి పని – ఆని అనూరాధ ఎంత ప్రాధేయపడినా ఆమెను కాలేజీలో చేర్పించలేదు. శేషగిరికి బజారు వీధిలో ఉన్న ఫాన్సీ షాపు మాత్రమే కాదు, ఇంకా ఏవేవో బిజినెస్సులు కూడా ఉన్నాయి. బిజినెస్ పనిమీద పొరుగూరువెళ్ళిన శేషగిరి మరో మనిషినికూడా వెంట తీసుకువచ్చాడు. వచ్చినతన్ని హాల్లోని సోఫాలో కూర్చోబెట్టి, “రెండు కాఫీలు పంపు” అంటూ భార్యనుద్దేశించి కేకపెట్టాడు.

జానకి లేవలేని స్థితిలోఉంది. పద్దాలు మంచంపట్టిన తండ్రిని చూసి సాయంకాలానికి వస్తానంటూ, పక్క ఊళ్ళోని పుట్టినింటికి వెళ్ళింది. ఇక ఇప్పుడు ఆ కాఫీలు కలిపే బాధ్యత అనూరాధ దయ్యింది. కాఫీ కలిపి రెండుకప్పుల్లో పోసుకుని, ట్రేలో ఉంచి హాల్లోకి తీసుకువెళ్ళింది అనూరాధ.

నిన్నపడ్డ శ్రమతో అలసిన అనూరాధ కళ్ళు అరమోడ్పులుగా ఉన్నాయి. ఫేన్ గాలికి చెదిరిన ముంగురులు నుదుటిపై అందంగా కదులుతున్నాయి. ఎడతెగని పనివల్ల పరికిణీ కుచ్చిళ్ళు పైకి దోపుకోడంతో పరికిణీ అంచుచాటునుండి చీలమండల్ని అలంకరించివున్న జాలరు పట్టాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ వచ్చిన వ్యక్తికి ట్రే పట్టుకుని నిలబడిన ఆమె రూపం ముగ్ధమోహనంగా కనిపించడంతో, ఆమెను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆకలిగొన్న తోడేలు చూపుల్లాంటి ఆ చూపులు అనూరాధకు కoపరం పుట్టించాయి. ఇక తండ్రి మాటకోసం ఎదురు చూడకుండా ట్రేని, టీపాయ్ మీద ఉంచి అక్కడనుండి వెళ్ళిపోయింది అనూరాధ.

ఆమెకు వెనకనుండి తండ్రి మాటలు వినిపించాయి, “అది నా కూతురు అనూరాధ!”

 

తరువాయి భాగం »

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)