Sahithi Pudota

భాస్కర శతకము

 

ఏగతిఁ బాగుపడ్డఁగల | దే భువి నల్సునకున్ సమగ్రతా
భోగం భాగ్యరేఖ గల | పున్యునకుంబలె ; భూరి సత్త్వసం
యోగమదేభకుంభ యుగ | ళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు! సింహము ద | లంచినఁజేకుఱుగాక! భాస్కరా!

తా: భాస్కరా! మదించిన ఏనుగు యొక్క కుంభస్థలమందున్న మాంసమును సింహము కోరినచో లభించును. గాని ఎంతో ఎక్కువ శ్రమ పడిననూ నక్కపిల్లకు లభించదు. అట్లే సంపూర్ణ సౌఖ్యము భోగభాగ్యముల సంపద, భాగ్యరేఖ గల అదృష్టవంతునకు కలుగును గానీ, ఎంత శ్రమపడిననూ అల్పునకు దొరకదు.

 

 

ఏడ ననర్హుఁడుండు నట|కేఁగు ననర్హుఁడు; నర్హుఁడున్న చోఁ
జూడగఁనొల్ల డెట్లన; న | శుద్ధ గునస్థితి నీఁగ పూయముం
గూడిన పుంటిపై నిలువ | గోరిన యట్టులు నిల్వనేర్చునే
సూడిదఁబెట్టు నెన్నుదుటి | చొక్కపుగస్తురి  మీఁద భాస్కరా!

తా: భాస్కరా! ఈగ సువాసన గల కస్తూరి మీద వ్రాలక, చెడు వాసనతో చీము పట్టిన వ్రణము మీద వ్రాలును. అట్లే అయోగ్యుడు మంచి వాని వద్దకు చెరక అయోగ్యుని వద్దకే చేరును కానీ యోగ్యుడైన వాని వద్దకు చేరుటకు ఇష్టపడడు.

 

 

ఏల సమస్త విద్యల నో|కించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేక మార్గముల | సన్నుతికెక్కనదెట్లొకో యనన్
ఱాలకు నేడవిద్యలు తి |రంబుగ దేవర రూపు చేసెనన్
వ్రాలి నమస్కరించి ప్రస | వంబులు పెట్టరె మీద భాస్కరా!

తా: భాస్కరా! ఎచ్చటను రాళ్ళు విద్యలు నేర్వక యున్ననూ వాటి యదృష్టముచే దేవతా ప్రతిమలుగా చెక్కగా జనులు ఆ ప్రతిమలకు సాష్టాంగనమస్కారము చేసి పూలతో అర్చనలు, పూజలు చేసి తరించెదరు. ఆ విధముగానే విద్య లేకపోయిననూ అదృష్టరేఖ ఉండినచో సమాజము నందు కీర్తి ప్రతిష్ఠలతో అదృష్టవంతులుగా కొందరు విరాజిల్లుదురు.

 

 

ఒక్కఁడెచాలు నిశ్చల బ | లోన్నతుఁడెంతటి కార్యమైనఁదాఁ
జక్కనొనర్ప  గౌరవుల | సంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కఁగానీక తత్ప్రబాల | సేన ననేక శిలీ ముఖంబులన్
మొక్కపడంగఁజేసి తుద | ముట్టఁడె యొక్క కిరీటి భాస్కరా!

తా: భాస్కరా! కురువంశీయులైన దుర్యోధనాదులు గొప్ప సేనతో కూడి విరాట రాజు యొక్క ఆవుల మందను తన వశము చేసుకొని తోలుకొని పోవుచుండగా అర్జునుడొక్కడే అనేక బాణములతో యుద్ధము చేసి వారిపై బాణములు వేసి, జయించి గోవులను మరలించుకొని పోయెను. అదే విధముగా స్థిరమైన బలవంతుడెంతటి కార్యమునైననూ తాను ఒక్కడే చేయుటకు సమర్థుడుగా ఉండును.

 

 

ఎప్పుడదృష్టతా మహిమ | యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచునుండుఁగా కయది |యొప్పని పిమ్మట రూపుమాయఁగా
నిప్పన నంటియున్నయతి | నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పినయట్టి బొగ్గునకుఁ | దా నలుపెంతయుఁబుట్టు భాస్కరా!

తా: భాస్కరా! బొగ్గులు అగ్నితో కూడియున్నచో స్వచ్ఛమైన కాంతులతో ప్రకాశించును. అగ్ని సంబంధము తొలగినచో కాంతులు తగ్గి నలుపు ఎక్కువగుచుండును. అట్లే మానవుడు అదృష్టము కలిసి వస్తున్న కొద్దీ కళకళ లాడుచూ ప్రకాశించును. అదృష్టము పోవుచున్న కొద్దీ క్షీణదశను పొందుచూ దిగులుగా ఉండును.


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)