Sravanthi

 

మహేశ్వరుడు

   
కం.

హరునకు అక్షరునకు పుర  
హరునకు అగజామనోఽబ్జహరునకు గంగా
ధరునకు నతసురునకు ఈ 
శ్వరునకు అర్పింతునాదు వందనశతముల్

   
ఉత్సాహము
 

బాలచంద్రశేఖరా! అపారతేజ! దేవతా
జాలవందితాంఘ్రియుగ్మ! సర్వలోకపాలకా!
వ్యాలనికరభూషితా! అనంగగర్వహారకా!
కాలకంఠ! మౌనివినుత! కావరా దయామయా!

   
ఉత్సాహము
 

రజతగిరినివాస! శైలరాజజామనోహరా!
విజితశత్రునివహ! జాహ్నవీలసజ్జటాధరా!
భుజగరాజశయనమిత్ర! భూతసంఘనాయకా!
గజనిశాటరాడ్విదార! కరుణ జూడు మీశ్వరా

   
పంచచామరము
 

ధరాధరాత్మజాతనూలతాప్రతీతభూరుహా!  
సురాసురాశ్రయా! జటాప్రసూనసోమశోభితా! చరాచరాన్వితప్రపంచసర్వభూతశాసనా!
పరాత్పరా! నమో లయప్రబద్ధతాండవప్రియా!

   
సీ.

ప్రణుతతాండవకేళి రాజరాజితమౌళి
     ఫణికలాపకలాపు భవ్యరూపు
శైలరాట్పుత్రీశు కైలాసగిరివాసు
     భూతవ్రజాధీశు వ్యోమకేశు
భస్మదిగ్ధసుదేహు ఫాలేక్షణోద్భవా
     దభ్రాగ్నిదగ్ధకందర్పదేహు
కలుషౌఘపరిహారకమనీయగంగాత
     రంగరంగజ్జటారాశిధరుని

   
తే.

మత్తదంతావలాజినాంబరుని హరుని
అమరమౌనీంద్రహృత్సారసాలి శూలి
నిత్యభక్తావనోత్కంఠు నీలకంఠు
సతతభవ్యార్థినై మదిన్ సన్నుతింతు

   

శివకేశవులు

సీ.

పురహరుండీతండు మురహరుండాతండు
     గజభేది(1) ఇతడు రక్షకు(2)  డతండు
చర్మాంబరు డితండు భర్మాంబరు(3) డతండు
     స్వర్ణదీశు(4) డితండు జనకు డతడు
నీలకంఠు డితండు నీలకాయు డతండు
     సర్పభూషు డితండు శయను(5) డతడు
బర్హినేత్రు(6)డితండు బర్హిపింఛు(7) డతండు
     గిరిధన్వు(8) డీతండు ధరు(9) డతండు

   
తే.

శ్వశురగృహధాము(10) లిర్వురు పతితపావ
నాహ్వయులు భవాబ్ధితరు లనంతు లజులు  
అట్టిశివకేశవుల మది ఆశ్రయింప
కలుగు భాగ్యంబు వర్ణింప అలవియగునె?

(1) గజాసురసంహారి (2) గజేంద్రుని మొసలి నుండి కాపాడినవాడు
(3) బంగారు బట్ట ధరించినవాడు (4) ఆకాశగంగకి భర్త (5) పాముపై శయనించినవాడు (6) అగ్ని నేత్రుడు (7) నెమలి పింఛమువాడు
(8) కొండను ధనుస్సుగ చేసికొనినవాడు (9) కొండను ధరించినవాడు
(10) అత్తవారింట్లో కాపురమున్నవారు – హిమపర్వతము, సాగరము

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)