Teneloluku


గత సంచిక తరువాయి »

ప్రపంచవ్యాప్తంగా పరిపూర్ణత కలిగిన భాషల్లో తెలుగుభాష ఒకటి! ఎన్నెన్నో అమూల్యమైన భావాలను, శబ్దాలను ప్రస్ఫుటంగా, అనాయాసంగా ప్రకటించే శక్తి ఉన్న గొప్పభాష  మన మాతృభాష! ఎవరైనా సరే  పరాయిభాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, వారి వారి అభిరుచిని బట్టి ఆయా భాషల్ని అభ్యసించవచ్చు. కానీ తనదైన "తల్లిభాష" ను తృణీకరించడం మాని మన భాషను కాపాడుకోవడం మనకు విధాయకం.

అంత గొప్ప ఉనికిని చాటుతున్న మన తెలుగు భాషలో వేలాది సామెతలు ఉన్నాయి. కొన్ని ఇతర భాషల్లో కూడా, ఈ సామెతల ప్రక్రియ ఉంటే ఉండవచ్చు. కానీ తెలుగు సామెతలు పొందినంత ప్రాచుర్యం, మరే భాషలో మనకు కనపడదు అన్నది నిర్వివాదాంశం. మన తెలుగు కమ్మనైన భాష! చిన్న పదాలతో ఎన్నో నీతిమంతమైన అర్థాలు చెప్పగలిగిన భాష. ఇది తెలుగువారమని గర్వంగా చెప్పుకునే మనందరికీ ఎఱుకే.

మన పూర్వులు మనకోసం సంఘటితపరచిన అమూల్య జ్ఞాన సంపద ఈ సామెతలు. లోకజ్ఞానానికి ఇవి ప్రతీకలు! మనకు అయాచితంగా సంక్రమించిన తరతరాల అమూల్య విజ్ఞానం - అన్నది మనం ఎన్నటికీ మరచిపోకూడదు. వీటిని పోగొట్టుకుంటే మనకంటే నిర్భాగ్యులు మరొకరు ఉండరు.  వీటిలో జ్ఞానమే కాక భాషను ప్రాసల  సోయగాలతో నేర్పే పదాలు దర్శనమిస్తాయి.  ఉదాహరణకి ... “అత్తమీద కోపం దుత్త మీద చూపించినట్లు.”  దుత్త అనే పదాన్ని మనం సామాన్యంగా వినం కాని ఇది అత్తకు ప్రాసను చేకూర్చే తెలుగు పదం. దీని అర్థం “కుండ”.

-----------

అక్టోబరు సిరిమల్లె లో కొన్ని ఉచ్చారణ దోషాలను చూసాము. ఈసంచికలో మఱి కొన్ని చూద్దాము.

  1. “తత్క్షణము” అంటే ‘వెంటనే’ అనేదానికి బదులు “తక్షణము” అని వ్రాస్తున్నారు. దీని అర్థం  ‘చెక్కడము’. ఎంత తేడా?
  2. “షష్టి” అంటే 60. మరి “షష్ఠి” అంటే 6. గట్టిగా నొక్కి పలికితే విలువ పెరగదు కదా తగ్గి పోతుంది.
  3. “కృష్ణుడు” కొంత మంది అతితెలివి వలన “క్రుష్ణుడు”గాను “ఋషులు” “రుషులు” గాను మారకముందే జాగ్రత్త పడాలి.
  4. ‘అదృష్టము’ ను ‘అద్రుష్టము’ అని నొక్కి పలుకుతున్నారు. ఇలాంటివారు పొరపాటున కవిత్వము జోలికిపోతే ఇక కష్టాలే కష్టాలు. మొదటి లఘువు గురువుగా మారిపోయి ఛందస్సు చెదిరిపోయి భాషావాహనము దారి తప్పుతుంది.
  5. “నీరు” అంటే జలము, “నీఱు” అంటే నిప్పు మీదనున్న నుసి. ఉచ్చారణలో భేదము తక్కువ అయినా అర్థము పూర్తిగా మారిపోతుంది.

డిసెంబర్ నెలలో  తిరిగి కలుసుకుందాం.

స్వస్తి.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)