నోరూరించే రుచి

 

శ్రీమతి వెంపటి హేమ గారు అందిస్తున్న తెలుగింటి సంప్రదాయ వంటకాలలో భాగంగా వంకాయలతో చేయగల మరికొన్ని రుచికరమైన వంటలను గురించి తెలుసుకొందామా?

తెలుగింటి వంటకాలు

వంకాయను కాల్చి చేసీ వంటలు

వంకాయ ఇగురు పచ్చడి:

కాల్చిన వంకాయను తొక్క ఒలిచి, ముచ్చికను౦డి గుజ్జును వేరుచేసి ఒక బౌల్ లో వెయ్యాలి. దానిలో ఒకటిన్నర    tsp ఉప్పు కలిపి ఉంచాలి. ౩ TbSp సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దానిలో వెయ్యాలి.

పోపు కోసం : 2 ఎండు మిరపకాయల ముక్కలు, 1 TbSp సెనగపప్పు, 1Tb మినప్పప్పు, ½ tsp జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 tsp సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. దోరగా వేగిన పోపును వంకాయ ముద్దలో వేసి కలపాలి. ఉల్లి పాయలు ఇష్టమున్నవారు ఒక 1/3  కప్పు సన్నని ఉల్లిపాయముక్కలు కూడా దోరగా వేయించి కలుపుకోవచ్చు. పులుపు ఇష్టమైతే దీనిలో నిమ్మరసం పి౦డుకోవాలి. నిమ్మరసానికి చాలినంత ఉప్పును కూడా చేర్చాలి. దీన్ని సింపుల్గా వంకాయ ఇగురు అనికూడా అంటారు. ఇది అన్నంలోకి బాగుంటుంది. దీనిలో న౦చుకోడానికి బూడిదగుమ్మడి వడియాలు బాగుంటాయి.

బండ పచ్చడి :

దీనిని మిక్సీలో వేసి మరీ మెత్తగా పేస్టులాగా చేస్తే బాగుండదు. రోటిలో వేసి, పచ్చడిబండతో నూరినప్పుడే దీనికి సరైన రుచి వస్తుంది. దీనిని చెయ్యడంలో రెండు రకాల పోపులు (తాలింపులు) ఉన్నాయి. ఏదైనా సరే బాగుంటుంది.

ఒకటో రకం :

పది పచ్చిమిరపకాయలని రెండు రెండుగా ముక్కలుగా చెయ్యాలి.  ½ tsp ఆవాలు, 1/3 tsp మెంతులు, 1tsp మినప్పప్పు, ¼ tspఇంగువ పొడి – 3 tsp నూనెలో వేయించి, పక్కన పెట్టాలి, తరవాత అదే గిన్నెలో పచ్చి మిరపకాయల్ని, 1 tsp నూనెలో ఒక మాదిరిగా వేయించి తియ్యాలి. పోపుని పోడిగాచేసి, దానిలో వేగిన పచ్చి మిరపకాయల్ని , 2TbSp చింతపండు గుజ్జు, 1 TbSp ఉప్పు ఆపై, ఒక చిన్న కొత్తిమీర కట్టా తుంచి వేసి,  దంచి, అది మెత్తబడ్డాక దానిలో కాల్చిన వంకాయ గుజ్జు కూడా వేసి కలిపి, అన్నింటి మిశ్రమాన్ని బాగా కలిసేలా బండతో  నూరాలి. పచ్చడి బండ లేకపోతే మిక్సీలో వేసి మెత్తగా చేసి, అన్నీ ఒక గిన్నేలో వేసి వంకాయ గుజ్జుతో కలిపి బరువైన గరిటతో నూరి, బాగా కలిపి తీసినా బాగుంటుంది. మరీ పేస్టులా చెయ్యకూడదు. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.

మరో రకం :

నాలుగు ఎ౦డుమిరపకాయలు, 1/2 tsp ఆవాలు 1/3 tsp మెంతులు, 1 tsp మినప్పప్పు, ¼ tsp ఇంగువ వేసి పోపు వేయించి తియ్యాలి. దానిని మిక్సీ లో వేసి పొడిగా చేసి, 1 1/2 TbSp చింతపండు గుజ్జు, 2 పచ్చిమిరపకాయలు వేసి, పచ్చిమిర్చి నలిగి చిన్నచిన్న ముక్కలు అయ్యీ వరకూ తిప్పాలి. అప్పుడు ఆ పోపునంతటినీ ఒక గిన్నెలోకి తీసి, దానికి కాల్చిన వంకాయ గుజ్జుని చేర్చి, తగినంత ఉప్పు కలిపి బందతోగాని, బరువైన గరిటతోగాని నూరాలి. మిక్సీలో వేసి పేస్టులా చేస్తే బాగుండదు. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు.

ఈ రెండు రకాల లో కూడా, గట్టిగా ఉన్న దోసకాయ చెక్కులు తీసి, చేదు లేకుండా చూసి, సన్నని ముక్కలుగా తరిగి కలపవచ్చు. మరిచిపోకుండా ఈ ముక్కలకు చాలిన ఉప్పు కూడా వెయ్యాలి. అంతేకాదు, ఇలా ముక్కలు కలపాలనుకున్నప్పుడు పోపు కూడా ఎక్కువ వెయ్యాల్సి ఉంటుంది.

ఈ రెండు రకాలలోనూ పులుపు కోసం చి౦తపండుకు బదులుగా మామిడికాయ ముక్కలు వాడొచ్చు.

.... వంకాయలతో వంటలు సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

నిరాశ చెందకుండా మనిషి ప్రయత్నిస్తూ పోవాలే గాని, ఏదో ఒక రోజున సర్వసుఖాలు వరించి తీరుతాయి – థామస్ జె వాట్సన్ (సీనియర్)