adarshamoorthulu


సర్ శ్రీ చంద్రశేఖర వెంకటరామన్

CV Ramanసర్వసాధారణంగా మేధావుల పేర్లు ప్రపంచానికి తెలిసిన తరువాత వారు సాధించిన అంశాలు, సమాజం మీద వాటి ప్రభావం తదితర విషయాలు తెలుస్తాయి. కానీ, కొంతమంది, అతిముఖ్యంగా శాస్త్రవేత్తలు, తమ మేధస్సుతో సాధించిన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానానికి తమ పేర్లను జోడించి తద్వారా సమాజానికి తమను పరిచయం చేసుకుంటారు. అటువంటి కోవకే చెంది, విజ్ఞాన రంగంలో నోబెల్ పురస్కారాన్ని గ్రహించిన మొట్టమొదటి భారతీయుడు సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్,  మన సిరిమల్లె డిసెంబర్ సంచిక ఆదర్శమూర్తి.

Raman Effectప్రపంచవ్యాప్తంగా రామన్ ఎఫెక్ట్ అంటే తెలియని విజ్ఞాన శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్ర విద్యార్థులు ఉండరు. అయితే సి వి రామన్ అని అంటే ఆయన ఎవరు అని అంటారు. కానీ ఆయన కనుగొన్న కాంతి యొక్క ప్రత్యేక ధర్మాన్ని రామన్ ఎఫెక్టు లేక రామన్ ప్రభావం అని యావత్ ప్రపంచానికి తెలుసు. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం ద్వారా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా తేజోవికిరణత చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుంది. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా వెలుతురును వెదజల్లుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు.

కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. దానర్ధం కాంతి కిరణాల్లోని ఫోటాన్‌ కణాలు, ఆ మాధ్యమంలోని పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుందన్నమాట. ఇదే రామన్‌ ఎఫెక్ట్‌. ఈ ‘రామన్‌ ఎఫెక్ట్‌’ అనే ప్రక్రియ నేడు అనేక విధాలుగా వివిధ పరిశోధనా అంశాలు నిర్ధారించుటకు ఉపయోగపడుతున్నది. ముఖ్యంగా వైద్య రంగంలో ఈ రామన్ ఎఫెక్ట్ యొక్క అవసరం నిజంగా అద్వితీయం.

CV Raman1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. కానీ, ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మన తెలుగునాడు అయిన విశాఖపట్నంలో జరిగింది. కనుక ఒకవిధంగా ఆయన మన తెలుగువాడే. తల్లి తండ్రులు ఇద్దరూ అధ్యాపక వృత్తిలో ఉన్నందున సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల ఒకింత ఆసక్తిని చూపేవారు. ముఖ్యంగా భౌతికశాస్త్రం అంటే మరింత కుతూహలం చూపేవారు. బాల్యంనుండే మంచి తెలివితేటలతో, చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో విశ్వవిద్యాలయం ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధనా వ్యాసాన్ని లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురించి ఆనాడే భౌతికశాస్త్రంలో ఉద్దండులైన శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించారు.

CV Ramamబతుకుతెరువు కోసం అకౌంట్స్ జనరల్ గా ఉద్యోగం చేస్తున్నను తన అభిరుచి, అత్యంత ఇష్టమైన పరిశోధనా ప్రక్రియను వదలలేదు. అదృష్టవశాత్తు తనకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (IACS) లో పరిశోధన చేసుకునేందుకు అనుమతి లభించింది. ఇక రోజూ సాయంత్రం, రాత్రి సమయాన్ని పూర్తిగా పరిశోధనలకే కేటాయించేవాడు. ఎప్పుడూ ఆ ఆలోచనలతోనే గడుపుతూ తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని పూర్తి సమయాన్ని తన పరిశోధనాశాలలోనే గడిపేవాడు. తరువాత చివరకు కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరి భోధన చేస్తున్ననూ IACS లోనే తన పరిశోధనలు కొనసాగించాడు.

మొదట ఆయన పరిశోధన అంతా ధ్వని తరంగాల మీదే సాగింది. మన సంప్రదాయ వాయిద్యాలైన తబలా, మృదంగం, వీణ లలో మాధుర్యమైన స్వరాలు పలకడానికి గల కారణం ఏమిటి అని పరిశోధన మొదలుపెట్టాడు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. పిమ్మట తన దృష్టిని శబ్దశాస్త్రం నుంచి కాంతి శాస్త్రం వైపు మరల్చి, ‘ఆకాశం ఎందుకు నీలం రంగులో ఉంటుంది. కాంప్టన్ ఫలితం ఎక్సరేస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా’ అనే రెండు స్ఫూర్తిదాయక ఆలోచనల పుట్టుకతో తన పరిశోధనలను మరింత ఉధృతం చేయడం ద్వారా 1928 ఫిబ్రవరి మాసంలో, నేడు మనం అన్ని పరిశోధనా రంగాలలో ఉపయోగిస్తున్న రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయాన్ని కనుగొన్నాడు. ఆ రామన్ ప్రక్రియను కనుగొన్నందుకు 1930లో నోబెల్‌ బహుమతి పురస్కారంతో ప్రపంచం సత్కరించింది. 1929 రాయల్ సొసైటీ కూడా నైట్ హుడ్ అనే బిరుదుతో ఆయనను గుర్తించి సొసైటీలో శాశ్వత సభ్యత్వం ఇచ్చింది.

CV Raman Stampవిజ్ఞాన శాస్త్రంలో ఆ మహనీయుని సేవలను గుర్తించి, భారత ప్రభుత్వం 1954లో 'భారతరత్న' అవార్డును బహుకరించింది. 1928లో ఫిబ్రవరి 28న సి.వి. రామన్ గారు మనకు రామన్ ఎఫెక్టును పరిచయం చేసిన సందర్భానికి గుర్తుగా భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా భారత తంతి తపాల శాఖ ఆయన స్మృతికి గుర్తుగా పోస్టల్ స్టాంప్ ను ముద్రించింది.

విజ్ఞాన శాస్త్రంలో భారతదేశానికి ఒక గుర్తింపునిచ్చి శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా, 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అంటూ భారతరత్న పురస్కారాన్ని అందుకున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసం మనకు సదా స్ఫూర్తిగా నిలవాలి.

 

divider

 

Source1, Source2, Source3, Source4

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం