అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

శ్రీనివాస్ ని క్షణమైనా మరిచిపోలేకపోతోంది అనూరాధ. ప్రతి క్షణం ఆమెకు అతడే గుర్తు వస్తున్నాడు. ఎల్లవేళలా అతని ఆలోచనలే! అతని గురించిన ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడల్లా ఆమెకు గిలిగింతలు పెట్టినట్లు ఉక్కిరిబిక్కిరిగా ఉంటోంది. తల్లికి జరిగిందంతా చెప్పేసి, ఆమెను, తండ్రితో మాటాడి తనకు శ్రీనివాసుతో పెళ్ళి జరిపించమని అడగాలనుకుంది. కానీ అనారోగ్యంతో నరకయాతన పడుతున్న తల్లిని చూశాక తన గురించి చెప్పి, ఆమెను మరింత యాతనకు గురిచెయ్యాలని అనిపించలేదు ఆమెకు.

అనారోగ్యంతో తన తల్లి పడుతున్న బాధను చూడలేకపోతోంది అనూరాధ. తండ్రితో పోరాడైనా తల్లిని డాక్టర్ కి చూపించాలన్న తపన ఎక్కువయ్యింది ఆమెకు. వైద్యం మొదలై అమ్మకి కొంచెం నయమయ్యాక తనసంగతి చెప్పొచ్చునులే, అంతలో పోయేదేముందిలే - అని మనసు సరిపెట్టుకుని ఊరకుండిపోయింది.

ఆ రోజు తండ్రికి భోజనం వడ్డిస్తూ అనూరాధ తల్లి అనారోగ్యం గురించి చెప్పింది. “అమ్మ చాలా బాధపడుతోంది నాన్నా! ఒకసారి ఆమెను డాక్టర్ దగరకి తీసుకెళ్ళడం అవసరం నాన్నా!” అంది భయపడుతూనే.

ఏ కళనున్నాడో, ఏమోగాని శేషగిరి వెంటనే ఒప్పుకున్నాడు. ఆరోజు సాయంకాలమే ఆమెను దగ్గరలోనే ఉన్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లోని లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు తండ్రీ, కూతురూ కలిసి. అక్కడ ఆమెకు రకరకాల టెస్టులు జరిగాయి. చివరకు వాళ్ళు తేల్చిచెప్పిన విషయం ప్రేమున్నవారి గుండెల్ని బద్దలుచేసీదిగా ఉంది . జానకికి వచ్చిన జబ్బు “కేన్సర్‌” అని తేల్చి చెప్పేశారు డాక్టర్లు.

“లేదు, లేదు! నేను నమ్మను” అంటూ గగ్గోలుపడింది అనూరాధ.

కానీ, పెద్ద డాక్టర్ శేషగిరిని పక్కకి పిలిచి, ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు...

“ఆమెకు వచ్చింది మామూలుజబ్బు కాదు, “యుటరస్ కేన్సర్!” అదీ బాగా ముదిరిపోయి , లింఫ్ గ్లాండ్సులోకంతా వ్యాపించిపోయి, లాస్టుస్టేజస్ లోకి వచ్చేసింది. సాధారణంగా ఈ జబ్బు బాగా అడ్వాన్సు అయ్యాకగానీ దాని లక్షణాలు బయటపడవు. ఈమెకు జబ్బు చాలా ముదిరి పోయింది, ఈ దశలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ఐనా మన ప్రయత్నం మనం చెయ్యాలికదా... వెంటనే ఆపరేషన్ కి ఏర్పాటు చేద్దాం, డబ్బుకట్టి రిసీట్ తీసుకోండి. త్వరలో ఆమెను హాస్పిటల్లో చేర్పించడం మంచిది” అని, అని వెళ్ళాడు ఆ డాక్టరు.

వెంటనే శేషగిరికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది, “అంత ముదిరిపోయాక ఇంక ఎంత వైద్యం చేయించినా పెద్ద ఫలితం ఏమీ ఉండదు. మహా ఐతే మరో కొద్ది రోజులు ఎక్కువ బ్రతుకుతుంది, అంతే కదా! ఇంతోటి దానికోసం లక్షలు ఖర్చు ఎందుకు“ అనుకున్నాడు మనసులో.

“ఇంటికివెళ్ళి సామాను సద్దుకుని, డబ్బుతీసుకుని మళ్ళీవస్తా”మంటూ ఆసుపత్రినుండి భార్యను తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఆరోజు తీసుకున్నఫీజుకు ప్రతిఫలంగా డాక్టర్ , జానకికి నెప్పి తెలియకుండా ఉండేందుకు, తిన్నతిండి అరగడానికి, నిద్ర పట్టడానికీ కావలసిన మందులు రాసి ఇచ్చాడు. దారిలో ఆ మందులు కొని జానకికి ఇచ్చి, తన బాధ్యతను అక్కడితో మర్చిపోయాడు శేషగిరి.

జానకి అనారోగ్యపు లక్షణాలు ఏనాడో బయటపడ్డాయి. అప్పుడు శేషగిరి  వైద్యం చేయించడానికి బదులుగా అసహ్యించుకుని ఆమెను దూరంగా నెట్టేశాడు. భార్యాభర్తల గదులు వేరయ్యాయి. పలకరింపులు ముభావంగా మారాయి. భర్త నిర్లక్ష్యానికి బాధపడిన జానకి మనసులో ఒక విధమైన విరక్తిభావన చోటుచేసుకోడంతో తన అనారోగ్యాన్ని గురించి తనే  పట్టించుకోడం మానేసి, మౌనంగా బాధను భరించసాగింది. ఉసూరుమంటూ రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడది, “చినికి చినికి గాలివానయ్యింది!" జానకికి చివరిరోజులు దగ్గరలోకి వచ్చేశాయి.
పెళ్ళికెదిగిన కూతురుకి తనుండగానే పెళ్ళిజరిగితే బాగుంటుందని అనుకుంది జానకి. ఆమెకు కొడుకును గురించిన దిగులు లేదు. కొడుకు బాధ్యత తండ్రి చూసుకుంటాడన్న నమ్మకం ఉంది ఆమెకు. ఇకపోతే, కూతుర్ని గురించే ఆమె  బెంగంతా...  తను చనిపోతే తన కూతుర్ని పట్టించుకునీవాళ్ళు ఎవరూ ఉండరన్నది ఆమెకు తెలుసు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక ఆమె భర్త గదిలోకి వెళ్ళింది, కూతురు పెళ్ళి సంగతి భర్తతో మాట్లాడడానికి. తనుండగానే పెళ్ళిచేసి కూతుర్ని అత్తవారింటికి పంపిచేస్తే, ఆ తరవాత ఆమె బాగోగులు వాళ్ళు చూసుకుంటారు కదా – అనుకున్న జానకి, అనూరాధ పెళ్ళి విషయం ఆ రాత్రి భర్తతో ప్రస్తావించింది.

అనూరాధకు పెళ్ళి కుదిరిపోయిందనీ, తన “బాసే” తనకు అతిత్వరలో అల్లుడు కాబోతున్నాడనీ, అతడు తమకంటే ఎన్నోరెట్లు ధనవంతుడనీ, త్వరలోనే పెళ్ళి చేసేద్దామనీ తెగ సంతోషపడుతూ వపోోీబోకహ చెప్పాడు శేషగిరి. జానకి వివరాలడిగితే మాత్రం విసుక్కున్నాడు, ఏమీ చెప్పలేదు.

భర్త మంచి మూడ్లో ఉన్నాడు కదాని పనిలోపనిగా తనకు ఒకసారి కొడుకును చూడాలని ఆశగా ఉందని చెప్పింది జానకి. వెంటనే, “అలాగే” అన్నాడేకానీ, చదువు పాడౌతుందని భయపడిన శేషగిరి, కొడుకుని ఇంటికి రమ్మనలేదు సరికదా తల్లి అనారోగ్య విషయం కూడా కొడుక్కి అసలు తెలియనీయకూడదని నిశ్చయించుకున్నాడు మనసులో.

మరునాడు ఉదయం తనకు కాఫీ అందిస్తున్న కూతురితో చెప్పింది జానకి, ఆమె పెళ్ళిని గురించి రాత్రి భర్త తనతో చెప్పిన సంగతి. త్రుళ్ళిపడింది అనూరాధ. తన తండ్రి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంక ఎవరు చెప్పినా మార్చుకోడన్నది ఆమెకు అనుభవమే. కానీ తను ...?  తను ఆ తండ్రికి కూతురు కాదా! తానూ అంతే, ఒకసారి గట్టిగా అనుకుంటే ఇక తిరుగులేదు! చావనైనా చస్తుందిగాని, తను శ్రీనుని తప్ప ఇంకొకర్ని పెళ్ళి చేసుకోదు. తనకి శ్రీనుతోవున్న అనుబంధం అటువంటిది మరి! “ఇక దాచకూడదు, అమ్మతో అంతా చెప్పెయ్యాలి” అనుకుంది అనూరాధ.

కొంచెం స్థిమితంగా ఉన్న సమయంచూసి, శ్రీనివాసుని గురించి, తనకు అతనితో ఉన్న అనుబంధాన్ని గురించి - అంతా తల్లితో చెప్పాలనుకుంది అనూరాధ. ఆపై, “నాన్న కుదిర్చిన సంబంధం నేను ఎట్టి పరిస్థితిలోనూ చేసుకోలేనమ్మా, శ్రీనును నేను మనసారా ప్రేమించా, అతనే నా భర్త! ఎలాగైనా నాన్నను ఒప్పించి, మా పెళ్ళి జరిపించమ్మా. నీకు పుణ్యం ఉంటుంది” అని తల్లిని అడగాలని కూడా అనుకుంది అనూరాధ. కానీ జానకి పడుతున్న నరక యాతన చూస్తూ, ఆమెతో తన ప్రణయగాధ చెప్పడానికి నోరు పెగలలేడు అనూరాధకి.
నిరాసక్తంగా రోజులు గడిచిపోతున్నాయి. చూస్తూండగా,ఆమె తిరణాలకు వెళ్ళివచ్చి నెల దాటింది - చాపక్రింది నీరులా -తెలియకుండా గడిచిపోయాయి రోజులు. ఇంతవరకు శ్రీనివాస్ నుండి ఏ వార్తా లేదు. అతని మౌనం ఆమె భరించలేకపోతోంది. ఇక ఉండబట్టలేక పద్దాలుకి ఆశచూపి, ఒకసారి వెళ్ళి కాంచనను పిలుచుకురమ్మని చెప్పి, వాళ్ళింటికి పంపింది; కాలేజీకి వెళ్ళే కాంచన ఈ సరికి తప్పకుండా తిరిగి వచ్చేసి ఉంటుందన్న ఆశతో. కానీ, పద్దాలు తిరిగివచ్చి చెప్పిన విషయం ఆమెను హతాశురాలిని చేసింది. ప్రాణ స్నేహితురాలైన కాంచనకు విషయమంతా చెప్పి, ఆమెద్వారా శ్రీనివాసుని గురించి తెలుసుకోవాలనుకున్న అనూరాధ ఆశ అడియాస అయ్యింది. అంతేకాదు, పద్దాలు వెళ్ళి, ఇరుగుపోరుగులనుండి సేకరించి తెచ్చిన వార్తలు ఆమెను మరింత కుంగదీసేవిగా ఉండడంతో మిన్నువిరిగి మీదపడినట్లై అనూరాధ కుప్పకూలిపోయింది.

పురిటి సమయంలో వచ్చిన కాంప్లికేషన్ల వల్ల కాంచన అక్క, బిడ్డను కని మరణించిందనీ; ఆ పసివాడి శ్రేయస్సు కోరి, పెద్దవాళ్ళంతా కూడి, అక్క చనిపోయి నెల గడవగానే కాంచనని వాళ్ళ బావకిచ్చి పెళ్ళిచేసేశారనీ, వారం క్రితం కాంచన అమ్మగారు వచ్చి, సామాను తీసుకుని, ఇల్లు ఖాళీ చేసి, స్వంత ఊరుకి వెళ్ళిపోయారనీ – తను తెలుసుకుని వచ్చిన విషయాలు నాలుగూ పూసలు గుచ్చినట్లు ఒకదాని తరవాత ఒకటిగా వివరంగా ఏకరువు పెట్టింది పద్దాలు.

############

రోజురోజుకీ బాధలు ఎక్కువై, నానాటికీ జానకి మంచం దిగడానికి కష్టపడుతూండడంతో ఇంటిపని మొత్తం అనూరాధమీద పడింది. ఆ రోజు మంచినీళ్ళ బిందెలు తోమడానికి పద్దాలుకి చింతపండు ఇస్తూ గమ్మున కొంచెం తీసి నోట్లో వేసుకుంది అనూరాధ. అది చూసిన పద్దాలు పకపకా నవ్వింది.... .

"ఏంటమ్మోవ్! పనిమాలా, ఏగిళ్ళ పేరంటాల్లా పొద్దుగాలే సింతపండు తింటన్నవు, ఏంటీ ఈశేసమ్" అంటూ పద్దాలు నవ్వుతూ చనువుగా మేలమాడింది.

తనను చూసి ఏమేమో అంటూ,  ఎగతాళిగా నవ్వుతున్నందుకు అనూరాధకు పద్దాలుమీద కోపం వచ్చింది.“ చెప్పైనా నవ్వు లేదా నవ్వైనా చెప్పు, ఏమిటా వెకిలితనం? ఏగిళ్ళుట – ఏగిళ్ళు! ఏగిళ్ళంటే ఏమిటి?” అంటూ కోపంగా అడిగింది అనూరాధ.

“ఏగిళ్ళంటే - అంటే...”  ఏం చెప్పాలో, వివరంగా ఎలా  చెప్పాలో తెలియక తబ్బిబ్బై బుర్ర గోక్కుంది పద్దాలు. కానీ ఊరుకోకుండా దాని లక్షణాలన్నీ ఏకబిగిని ఏకరువు పెట్టింది.

వాటినిబట్టి అనూరాధకి ఆమె చెపుతున్నదేమిటో అర్థమయ్యింది.

“ఓసి నిన్ను పొడిచెయ్యా!” అంటూ పద్దాలు మాటలకు అడ్డొచ్చింది అనూరాధ. “ఏగిళ్ళంటే ఏమిటో అనుకున్నా! వేవిళ్ళనడానికి వచ్చిన పాట్లా! బాగుంది. ఐనా అదేం హాస్యం? నన్ననవలసిన మాటేనా అది? నిన్నేమిచేసినా పాపంలేదు! ఇక నీ నవ్వు ఆపు” అంది అనూరాధ కోపంగా పడ్డాలువైపు ఉరిమి చూస్తూ.

అమ్మాయిగారి కోపం చూసి భయపడింది పద్దాలు. కానీ, పద్దాలు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. సరిగా అప్పుడే తల్లి పిలుపు వినిపించడంతో లోపలకు వెళ్ళిపోయింది అనూరాధ.

############

తల్లికి కాఫీ ఇచ్చి వచ్చి, వంటగదిలో చేరి బ్రేక్ఫాస్టుకి ఏర్పాటు చేస్తున్న అనూరాధకు, స్టౌ మీద కాగుతున్న పాల వాసన భరించరానిదయ్యింది. అకస్మాత్తుగా వెలపరం రావడంతో వేగంగా బాత్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకుని వచ్చింది. అకస్మాత్తుగా ఆమెకు పద్దాలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పద్దాలు చెప్పిన ఏగిళ్ళ లక్షణాలు చాలావరకూ నిజంగానే తనకు ఉన్నాయనిపించింది అనూరాధకి. “ఏమిటి! నేను గర్భవతినా!?” ఆశ్చర్యంగా తనని తాను ప్రశ్నించుకుంది. వెంటనే మిన్ను విరిగి మీద పడ్డట్లు అనిపించింది ఆమెకు. ఆ ఆలోచన ఆమెకు ఒణుకు తెప్పించింది. తొలిసారిగా శ్రీనివాసు మీద - అతడు తనను మోసం చేశాడేమోనన్న అనుమానంవచ్చి తల్లడిల్లిపోయింది అనూరాధ. కానీ, అతడు ఒక్కనాటికి అలాంటివాడు కాడు - అంది ఆమె అంతరాత్మ.

“సరేలే! ఇక ఏది ఏమైనా - ఇంతవరకూ వచ్చాక ఇంకా కన్నతల్లికి చెప్పకపోడం అన్నది చాలా పెద్ద తప్పు ఔతుంది” అనుకుంది అనూరాధ.

జానకి కూతురు ఇచ్చిన కాఫీ త్రాగి, మందులు వేసుకుని విశ్రాంతిగా మంచం మీద పడుకుని ఉంది. అనూరాధ నెమ్మదిగా తల్లి దగ్గర చేరింది. తల్లి కాళ్ళమీద చెయ్యివేసి, “ అమ్మా! నేను ఎట్టి పరిస్థితిలోనూ నాన్న కుదిర్చిన పెళ్ళి చేసుకోలేను, నన్ను క్షమించమ్మా” అంది ఉపోద్ఘాతంగా.

ఎప్పుడూ తండ్రి మాటకు ఎదురుచెప్పని కూతురు ఈ వేళ ఇలా అనేసరికి ఆశ్చర్యంతో జానకి కళ్ళు విశాలమయ్యాయి. విస్తుబోయి వింతగా చూసింది కూతురువైపు. తలవంచుకునే తాను చెప్పదలచిన మాటలు తల్లికి చెప్పేసి, “నేను, శ్రీను మనసారా ప్రేమించుకుంటూన్నాము. అమ్మా! నీకు పుణ్యముంటుంది, మా పెళ్ళి జరిగీలా చూడమ్మా!” అంది ప్రాధేయ పడుతూ. కూతురు మాటలు విన్న జానకి, షాక్ తగిలినట్లు కొంతసేపు మ్రాన్పడి స్తబ్దంగా ఉండిపోయింది. నెమ్మదిగా తేరుకుని, ఎలుగురాసిన కంఠస్వరంతో అంది ...

“నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, పెళ్ళికాని ఏ ఆడపిల్లా చెయ్యకూడని తప్పది ! ఎవడే ఆ శ్రీనివాసూ? ఎక్కడ దొరికాడే వాడు నీకు” అంటూ వాపోయింది జానకి.

“శ్రీనివాస్ పరాయివాడేమీ కాదమ్మా, మనకు బంధువే! కాంచనకి పెద్దమ్మ కొడుకు. నన్ను పెళ్ళి చేసుకుంటా నన్నాడు. వాళ్ళ అమ్మా నాన్మ చాలా మంచి వాళ్ళుట! తను ఏదడిగినా ఎప్పుడూ కాదనరుట ... అమ్మా! నేను శ్రీనివాసుని తప్పించి వేరెవరినీ భర్తగా అంగీకరించ లేనమ్మా!” కళ్ళనిండా కన్నీళ్ళతో తల్లి ముఖం లోకి ప్రాధేయపడుతూ దీనంగా చూసింది అనూరాధ.

దీనంగా ఉన్న కూతురి మొహం చూస్తూంటే జానకీలోని తల్లిపేగు విలవిలలాడింది. కూతురు కోరిక సమంజసమైనదే అనిపించింది ఆమెకు. "సంఘంలో పరువు నిలబడాలంటే, విషయం బయటపడకముందే వాళ్ళ పెళ్ళి జరిగిపోవాలి. వెంటనే నేను ఆయనతో ఈ విషయం ప్రస్థావించి తీరాలి, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది. ఆయనతో ఎంత తొందరగా చెపితే అంత మంచిది" అనుకుంది.

############

శేషగిరి ఊరెళ్ళి ఈవేళకి అప్పుడే నాలుగో రోజు. ఈ రోజు రాత్రికి అతడు రావచ్చునన్న ఆశతో, కూతురు   సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నకోరికతో, ఆ రాత్రి నిద్రమాత్ర వేసుకోకుండా బాధను ఓర్చుకుంటూ, భర్త రాక కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది జానకి. డేటు మారిందే తప్ప శేషగిరి ఇంటికి రాలేదు. ఇక ఈ రాత్రికి రాడని అర్ధంచేసుకుని, అప్పుడు వెళ్ళి జానకి నిద్రమాత్ర ఒకటి వేసుకుని పడుకుంది.
తన గదిలో మంచం మీద కళ్ళు మూసుకుని పడుకున్నా కూడా నిద్రపట్టక, మెలకువగా ఉండి అంతా గమనిస్తున్న అనూరాధ ఉసూరుమంది. రోజులతరబడి అలా చెప్పాపెట్టాకుండా “గైర్హాజర్” కావడం అన్నది శేషగిరికి మామూలే!

############

మరుసటి రోజు ఉదయం వీధిగుమ్మం కడిగి ముగ్గువేస్తున్న పద్దాలు ఆదాటుగా ముగ్గుచిప్ప క్రింద పడేసి, పరుగుపరుగున లోనికి వచ్చేసింది. “సూడండి అమ్మాయిగోరూ! బొత్తిగా కలికాలం కాపోతే ఏంటీ సెప్పండి? బిడ్డలగన్న తల్లినన్న గేనమ్ కూడా లేదాడికి! ఇందాకటినుండీ సూత్తన్నా,  రోడ్డుకి ఆవలిపక్క నీలమడి ఆదేమెయిని ఆడు ఇటే, నన్నే సూత్తన్నాడు! సూడ్డానికి మళ్ళీ దొరబాబులాగున్నాడు, టిప్ టాప్ గా! మా మావకుగీని సెప్పానంటేసాలు, ఆడి మక్కెలిరగదీస్తాడు, ఏటనుకుంటన్నాడో! తమాసాగా ఉందిగావును!” రొప్పుతూ పెద్ద దండకమే చదివింది పద్దాలు.

హాల్లోనే ఉన్న అనూరాధ కుతూహలం పట్టలేక ఒకడుగు ముందుకు వేసి, వీధిలోకి తొంగిచూసింది. వెంటనే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు మెరిశాయి. “పిచ్చిమొద్దూ! ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన ఈ ఇంటికి కాబోయే అల్లుడు! ఆయన చూస్తున్నది నీ కేసికాదు, ఈ ఇంటికేసి! ఇది మన ఇల్లు ఔనా, కాదా – అని! వెళ్ళు, వెళ్ళి మర్యాదగా లోపలకు పిలు, ఈ లోగా నేను అమ్మకి చెప్పివస్తా” అంటూ, పద్దాలుని బయటికిపంపి, తానేమో లోపలకు పరుగెట్టింది అనూరాధ.

శ్రీనివాసుని చూడాలని ఆత్రంగా హాల్లోకి వచ్చింది జానకి. ఆమెను చూసి లేచి నిలబడి నమస్కరించాడు శ్రీనివాసు. చూడగానే అతడు ఆమెకు బాగా నచ్చాడు. తెలివితేటలు ఉట్టిపడే అతని స్ఫురద్రూపమ్, వినయంతో కూడిన ప్రవర్తన ఆమెకు బాగా నచ్చాయి. చక్కని జోడీ ఔతుందనిపించి సంతోశించింది ఆమె.

అతడు ఆమెకు క్షమాపణ చెప్పాడు. తను ఎప్పుడో తన తల్లిదండ్రులతో తనకు అనూరాధకు మధ్య ఏర్పడిన అనుబంధాన్ని గురించి చెప్పాననీ, వెంటనే వాళ్ళు సంబంధం మాట్లాడడానికి ఇక్కడకు రావాలనుకున్నారనీ, సరిగా అప్పుడే కాంచన అక్క అంటే వాళ్ళ పిన్నికూతురు చనిపోవడంతో ఆమె చెల్లెలికి తోడుగా వుండడం కోసం తన తల్లి అక్కడకు వెళ్లడం, ఆపై కాంచన పెళ్ళి – అలా, అలా తెలియకుండా రోజులు గడిచిపోడంతో ఆలస్యమై పోయిందనీ వినయంగా సంజాయిషీ చెప్పుకున్నాడు,

ఆ పూట అక్కడే గడిపి, తల్లితండ్రులతో కలిసి త్వరలోనే మళ్ళీ వస్తానని చెప్పి, జానకిదగ్గర సెలవడిగి  వెళ్ళిపోయాడు శ్రీనివాసు. తన పంచప్రాణాలూ అతని వెంట వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూండగా అతనికి తప్పనిసరిగా వీడ్కోలు చెప్పింది అనూరాధ. కనిపించినంతవరకు అతనిని కళ్ళతోనే సాగనంపి, అతను కనుమరుగైనాక వెనుదిరిగి ఇంట్లోకి నడిచింది.

############

కూతురు పెళ్ళి కాకుండానే గర్భవతి అయ్యిందన్న సంగతి తెలిశాక, సాంప్రదాయిక కుటుంబంలో పుట్టి పెరిగిన జానకి ఒకపట్టాన మనసు సరిపెట్టుకోలేకపోయింది. ఆమె మనసులోకి పరిపరివిధాలైన ఆలోచనలు వచ్చాయి. వివాహితురాలు గర్భం ధరించినప్పుడు పండుగ చేసిన వాళ్లే, అవివాహిత గర్భవతి ఐతే వెలివేసి, ఆరడిపెట్టి సంఘం నుండి బహిష్కరిస్తారు. అటువంటి కళంకం రాకూడదనుకుంటే విషయం బయటపడకముందే ఆ అబ్బాయికే కూతుర్నిచ్చి త్వరలో పెళ్ళి జరిపించెయ్యాలి. అలాగైతే సంఘంలో అంతగా అపవాదు రాదు. నాల్గురోజులు చెప్పుకున్నా, పెద్ద తప్పుగా అనిపించ దెవరికీ. భర్తకు నచ్చజెప్పి సాధ్యమైనంత త్వరగా ఈ పెళ్ళి జరిగిపోయీలా చూడాలి – అనుకుంది.

ఆ రాత్రికి దైవికంగా శేషగిరి తిరిగి వచ్చాడు. భోజనంచేసి గదిలో విశ్రాంతిగా పడుకుని ఉన్న శేషగిరి దగ్గరకు నడిచింది జానకి. నెమ్మదిగా అనూరాధ ప్రేమకథను భర్తకు వినిపించి, ఈ పరిస్థితిలో ఆమెను శ్రీనివాసుకిచ్చి పెళ్ళిచెయ్యడమే బాగుంటుందని అంది. కానీ, శేషగిరి మండిపడ్డాడు, “చిన్నపిల్ల, దానిష్టమే నేమిటి? దాని కేమి తెలుసునని! "ఎవరైనా, ఎద్దునడిగి కడతారా ఏమిటి గంటలు?” నోరుమూసుకు పడుండమను. పెద్దమనిషితో పని! మాటిచ్చేశాను మా బాసుకి. ఆయనతో వ్యవహారమంటే అంత తేలిక విషయం కాదు, మాటతప్పితే పుచ్చె లెగిరిపోతాయి, ఏమిటనుకుంటున్నావో! ఒకసారి ఔననీ, మరోసారి కాదనీ అంటే... బాసు చాలా నిక్కచ్చి మనిషి, మాటలతో ఊరుకోడు.”

“అది కాదండీ! పిల్ల ఇష్టం కూడా చూడాలికదా! అదిప్పుడు గర్భవతి కూడా! ఆ అబ్బాయికే ఇచ్చి చెయ్యడం మంచి దౌతుంది కదా! త్వరలో వాళ్ళ పెళ్ళి జరిపించేస్తేనే మనకి మాటదక్కుతుంది. సాటివాళ్ళలో మనకింక ఏ అపవాదూ ఉండదు."

మాట పూర్తిచేసి, భర్త సమ్మతికోసం తలెత్తి అతని మొహం లోకి చూసిన జానకి భయంతో ఒణికింది. శేషగిరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతడు కోపంతో రగిలిపోతున్నాడు. ఒక్క ఉదుటున గదిలోంచి హాల్లోకి వచ్చి, “అనూరాధా!” అంటూ పెద్దగా అరిచాడు. వంటిల్లు సద్దుకుంటున్న అనూరాధ ఎక్కడపని అక్కడవదిలి, భయపడుతూ వచ్చి తండ్రికి ఎదురుగా నిలబడింది.

చింత నిప్పుల్లాంటి కళ్ళతో కూతురువైపు గుడ్లురిమి చూస్తూ, గాండ్రించినట్లుగా అడిగాడు, “ఏమిటే? నేను విన్నదంతా నిజమే నంటావా?"

కానీ, జవాబుకోసం వేచిచూడకుండానే, అనూరాధ జుట్టు పట్టుకుని ఆమెను ఎడా పెడా చెంపలమీద కొట్టసాగాడు శేషగిరి. జానకి పరుగున వచ్చి కూతురుకి అడ్డునిలిచింది. “ఎదిగిన ఆడపిల్లమీద చెయ్యిచేసుకోడం తప్పండీ, ఆపండీ” అంటూ అతన్ని ఆపాలని ప్రయత్నించింది.

ఉగ్రుడైన శేషగిరి యుక్తాయుక్తాలు మరిచిపోయాడు. “దానికి ఎన్ని గుండెలున్నాయిట, ఇలా చెయ్యడానికి? ఇదంతా నువ్విచ్చిన అలుసు కాదా” అంటూ జానకిని ఇవతలకి లాగి, శక్తికొద్దీ విసురుగా నెట్టేశాడు.

అసలే దుర్బలురాలైన జానకి ఆ విసురుకి తట్టుకోలేకపోయింది. వేగంగావెళ్ళి అక్కడున్న టీపాయి మీద పడింది. దాని మూలకోణం ఆమెకు ముచ్చిలి గుంటలో బలంగా గుచ్చుకుంది, వెంటనే స్పృహ తప్పి, నిలువునా నేలమీద పడిపోయింది జానకి. పడ్డ అదురుకి ఆమె కడుపు కదిలిపోయి రక్తం వరదలయ్యింది. అనుకోని ఈ పరిణామానికి బెంబేలుపడి, అనూరాధని వదిలేశాడు శేషగిరి. సిగ్గుతో భయంతో, దుఃఖంతో అవమానంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అనూరాధ వెళ్ళి, అచేతనంగా ఉన్న తల్లిమీద పడి ఏడవసాగింది. అదే సమయంలో ఏదోపనిమీద అక్కడకు వచ్చిన పద్దాలు అది చూసి భయంతో పెద్దపెద్ద కేకలుపెడుతూ వీధినపడింది...

“ఓలమ్మోయి! ఓర్ణాయనోయ్! రగ్తమ్, కుండలుకుండలు రగ్తమ్” అంటూ. ఆమె కేకలు విని నెమ్మదిగా చుట్టుపక్కల జనం పోగుపడసాగారు.

వరదలౌతున్న రక్తాన్ని చూడగానే శేషగిరికీ మతిపోయింది. వెంటనే పద్దాలు మొగుణ్ణి పిలిచి, అంబులెన్సు కోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి కబురుపెట్టాడు.

అంబులెన్సుతో వచ్చిన “పేరామెడిక్సు", దెబ్బ తగలగానే ఆమె ప్రాణం పోయింది - అని తేల్చి చెప్పి, ఇది సహజమరణం కాదని గొడవచేసి, శేషగిరి దగ్గర వాళ్ళకు రావలసినది రాబట్టుకుని, వచ్చిన దారినే వెళ్ళిపోయారు.

తలవెనక భాగంలో జానకికైన బలమైన గాయానికి శేషగిరి సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. ఆమె చావు “ప్యూర్ కేన్సర్ డెత్తు” గా చెప్పడానికీ, పోలీసు కేసు కాకుండా ఉండడానికీ శేషగిరి చాలా సొమ్ము ఖర్చుచెయ్యక తప్పలేదు. దీనికంతకీ మూలకారణం అనూరాధేనని ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు శేషగిరి. తల్లి మరణంతో దిక్కుతెలియక కంటికీ, మంటికీ ఏకధారగా ఏడుస్తున్న అనూరాధను అతడు మాటవరసకైనా పలకరించలేదు.

############

ఒక ఇల్లాలికి, శాస్త్రరీత్యా తలకొరివి పెట్టే హక్కు ఉన్నది కొడుకుకే గాని భర్తకు లేకపోవడంతో ఉన్నబడంగా తమ కొడుకైన ఆదిత్యని వెంటబెట్టుకుని రమ్మని మనిషిని పంపక తప్పలేదు శేషగిరికి. కొడుకు వచ్చేవరకు, జానకి శవాన్ని "మార్చుయరీ"లో ఉంచారు. చిన్నవాడైనా, కొడుకువచ్చి భక్తి శ్రద్ధలతో యధావిధిగా తల్లి కర్మకాండలు జరిపించాడు, తనను కన్నతల్లికి ఉత్తరగతులు సద్గతులు కావాలన్న కోరికతో. కర్మకాండలన్నీ ముగిసిన వెంటనే ఎక్కడి బంధువు లక్కడకు వెళ్ళిపోయారు. బోర్డింగ్ స్కూల్లో ఉండి చదువుకుంటున్న ఆదిత్య కూడా వెళ్ళడానికి సామాను సద్దుకోడం మొదలుపెట్టాడు.

ఆరోజు ఉదయమే 9గంటల బండికి ఆదిత్య ప్రయాణం. మరీ చిన్నప్పటినుండి చదువు పేరుతో పొరుగూరిలో బ్రతుకుతున్న తమ్ముడితో అనూరాధకు అంతగా సాన్నిహిత్యం లేకపోయినా, తమ్ముడు వెళ్ళిపోతాడంటే మాత్రం ఆమెకు దిగులు మొదలయ్యింది.

వంటవాడు ఇంకారాలేదు ఎందుకనో! కానీ, తమ్ముడిని పరగడుపుతో, కాఫీ ఐనా ఇవ్వకుండా పంపించలేకపోయింది అనూరాధ. లేచినది మొదలు వికారంగా ఉండడంతో కళ్ళుమూసుకుని మంచం మీద పడుకునివున్న అనూరాధ బలవంతంగా లేచి, ఎంతో కష్టంమీద ఉప్మా చేసి, కాఫీ కలిపి; తండ్రికి, తమ్ముడుకి ఇవ్వడంకోసం తీసుకువెళ్ళింది. తమ్ముడు, తండ్రి తన తల్లి గదిలో ఉన్నారు. గదిలోంచి మాటలు వినిపిస్తూండడంతో ట్రే పట్టుకుని గుమ్మం బయటే నిలబడిపోయింది అనూరాధ.

“అమ్మకు అంత జబ్బుచేస్తే, నాకు కబురైనా పెట్టావు కావేమిటి నాన్నా? అమ్మ కడసారపు చూపులైనా దక్కలేదు కదా నాకు!” పదిహేడేళ్ళ తమ్ముడు తండ్రిని నిలదీసి అడుగుతున్నాడు. తండ్రి ఎదుట నిలబడి అలా ధైర్యంగా మాటాడే చనువు వాడొక్కడికే ఉంది. తండ్రి ఏం జవాబు చెపుతాడో వినాలనుకుంది అనూరాధ.

గాఢంగా నిట్టూర్చాడు శేషగిరి, “ఏం చెప్పనురా! ఇదంతా కూడా - చెప్పానుకదా - మీ అక్క చేసిన నిర్వాకం! మీ అమ్మ ఇంత తొందరగా పోతుందనుకోలేదు. “ఎలాగా పరీక్షలయ్యి నువ్వు ఇంటికి వస్తావుకదా, ఈలోగా ఆ సంగతి చెప్పి నీ చదువు పాడుచెయ్యడం ఎందుకులే - అనుకున్నా. మీ అమ్మ కావాలంటే నిన్ను పిలిపించి ఉండేవాడిని, ఆమే అడగలేదు. మ్చు! తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. ఏం చెయ్యను నేను!”

“నాన్నా! నువ్వు ఇలాంటి తప్పు ఎలా చేశావు? అక్క కోరుకున్న వరునికిచ్చి అక్కకి పెళ్ళి చేస్తే అసలు ఏ సమస్యా ఉండేదికాదు కదా! అమ్మా మనకు దక్కేది, అక్కా సంతోషంగా ఉండేది." ఆదిత్య సబవు మాటాడాడు. ఆదిత్య ఇదివరకే పద్దాలు వల్ల జరిగిన సంగతులన్నీ విని ఉండడంతో సరైన సబవు చెప్పగలిగాడు. కానీ కొడుక్కి నిజం తెలిసిపోయిందన్న సంగతి శేషగిరి ఊహించనైనా లేదు.

ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఒక్క క్షణం. ఏమీ మాటాడలేదు శేషగిరి. అంతలోనే సద్దుకుని అన్నాడు, “అసలు, ఆ అబ్బాయంటే ఇష్టం లేనిది మీ అమ్మకే!"

”అబద్ధం, అబద్ధం" అని గట్టిగా అరవాలనిపించింది అనూరాధకి. అరవకుండా నోరు నొక్కుకుని బలవంతంగా నిగ్రహించుకుంది. ఆదిత్యకు అంతా తెలిసీ కూడా మౌనంగా తండ్రి మాటలు వింటూ ఉండిపోయాడు.

పోయిన మనిషిమీద ఎడాపెడా అబద్ధాలు చెపుతున్నాడు తన తండ్రి! ఆమె తిరిగివచ్చి నిజమేమిటో చెప్పలేదనే కదా ధైర్యం – అనుకుంది అనూరాధ. ఇక తండ్రిచెప్పే అబద్ధాలు వినలేక, గుమ్మం బయట నిలబడివున్న అనూరాధ, “కాఫీ” అని కేకపెట్టింది.

“అక్కడున్న టేబులుమీద పెట్టు” అని అదే టోన్లో గదిలోనుండి గట్టిగా కేకపెట్టాడు శేషగిరి. చేతులోని ట్రే టేబులుమీద ఉంచి, తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుంది అనూరాధ. మూసిఉన్న ఆమె కళ్ళనుండి కన్నీరు ధారలు కట్టింది.

############

కొడుకును రైలెక్కించి వచ్చిన శేషగిరి ముందుగా చేసిన పని - అంతవరకు ఉన్న వంటమనిషిని మానిపించడం! ఆ తరవాత అతడు, "వంటమనిషి" అన్న పేరుతో, తన చిన్నిoటి చింతామణి రత్నకుమారిని పెద్దింటికి తీసుకురావడం! తల్లి పోయిందన్న దుఃఖానికి శ్రీనివాసునుండి ఏ కబురూ రాలేదన్న విచారం కూడా తోడవ్వడంతో ఏర్పడిన మహావేదనలో నిండా మునిగివున్న అనూరాధ ఇంటి విషయాల్లో కల్పించుకోకుండా తన లోకంలో తాను ఉండిపోయింది. రత్నకుమారి తన సామానంతా వెంటతెచ్చుకుని, ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకుని, ఇంటి బాధ్యతలను తనమీద వేసుకుంది. ఆమెను అడ్డుకునీవారెవరూ లేకపోవడంతో, క్రమంగా, ఆ యిల్లు తనదే అన్నట్లు ఇంటిపెత్తనం చేతిలోకి తీసుకుంది.

అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు దుఃఖసముద్రంలో ఈదులాడుతున్న అనూరాధ. కానీ, మనస్తితి ఎలావున్నా, ఆమె దేహంలో మాత్రం ఆమె స్థితికి సహజమైన మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.  ఆమె శరీరపు వన్నె పెరిగింది, కురులకు నిగారింపు వచ్చింది. ముఖంలోని కళ హెచ్చింది. అదృష్టవశాత్తూ వేవిళ్ళు అంతగా లేకపోవడంతో, జానకి దశదిన కర్మలకు వచ్చిన బంధువులకు తన గురించి ఏ అనుమానం రాకుండా ఎంతో కష్టం మీద గుట్టుగా గడపగలిగింది అనూరాధ. కానీ నిత్యం వెంట ఉండి చూస్తున్న రత్నకుమారి కళ్ళు కప్పడం ఆమెకు సాధ్యమవ్వలేదు. రత్నకుమారి ఒకరోజు అనూరాధను నిలదీసి అడగనే అడిగింది ...

"ఏందమ్మోవ్! ఏంటీ ఇశేసం? రోజురోజుకూ అంతలా కలకల లాడిపోతన్నావు,  ఇదంతా పెళ్ళికళే అనుకోమంటావా? నేను నమ్మను" అంది సూటిగా.

"ఏమో! అవేమిటో నీకే తెలియాలి" అంది అనూరాధ నిరీహతో.

"ఓలమ్మో! మా దొడ్డ ఊసే చెప్పావులే! పెళ్ళికళ - అన్న మాట విన్నాగాని నిజానికి పెళ్ళoదాలు మాకేలా తెలుస్తాయి! అది సరేగాని, ఈ పున్నమి ఎలిపోగానే నీకు పెళ్లంటగా - మీ అయ్యా సెప్పినాడు. అదురుస్టమంటే నీదేనంటగా! దేనికైనా పెట్టిపుట్టాల... ఆ యబ్బి శానా గొప్ప భాగ్గియమంతుడంట! నువ్వు అత్తోరింటి కెళ్ళినాక ఈ ఆరిపేద రత్తాలుని మరిసిపోమోకేం..."

అనూరాధ మనసులో ఏదో తలాతోకాలేని ఆశ ఒకటి పొడజూపింది...

ఈ పున్నమి వెళ్ళగానే తనకు పెళ్ళా! అంటే - ఒకవేళ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, తన తండ్రితో ఇంటి బయటే మంతనాలు జరిపి, శ్రీనివాసు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడా - అని. మరుక్షణంలోనే తన ఊహ తనకే నవ్వుతాలుగా తోచింది ఆమెకు.

మళ్ళీ తానే అనుకుంది, "ఇది అసంభవం! అలా జరిగి ఉండదు. శ్రీనివాసు తల్లిదండ్రులు నన్ను కలుసుకోకుండా ఒక్కనాటికి వెళ్ళిపోరు" అనుకుంది. అకస్మాత్తుగా ఆమె మనసులో భయం చోటుచేసుకుంది, "నాన్న ఎంతకైనా తగినవాడే, ఇందులో ఏదో తిరకాసు ఉండకుండా ఉండదు" అనుకుంది మళ్ళీ.

అనూరాధ మనస్థితిని గురించి ఏమీ తెలియని రత్తాలు తనధోరణిలో తాను చెప్పుకుంటూ పోయింది, "నేనా యబ్బిని సూసిందిలేదు, అన్నీ మీ అయ్యా సెప్పిన మాటలే... "పసుకుంకాలు ఎప్పు"డని అడిగా! దానికి మీ అయ్య "పీనిగెల్లిన ఇంట పసుకుంకాలు పుచ్చుకోడం సుబము కాదు, అందుకే ఆ తంతు మొత్తం ఎత్తేశాం - అన్నాడు. ముహూర్తం నాడు ఏకంగా గుడి కాడి కెళ్ళిపోయి లగ్గమ్ జరిపించెయ్యడమేనంట! పెళ్లికొడుకుని గురించి అడిగా, దానికి మీ అయ్యా సెప్పాడూ... ఆ యబ్బి వొయసు నలభై దాటినా, ముఫ్ఫై ఏళ్ల వాడిలా  దిట్టంగా ఉంటాడంట! రంగుకూడా మరీ నలుపేమీ కాదుట! మీ అయ్య మాటలు వింటా ఉంటే నాకనిపించిందీ, నీకూ ఆయబ్బికీ ఇరవై ఏళ్ళకుపైనే వార ఉంటదనిపించింది. మీ అయ్య సెవుతూంటే నాకే ఏదోలా ఉండి, ఆయబ్బితో పెళ్ళికి నువ్వేలా ఒప్పుకున్నావమ్మా! నువ్వసలు ఆ యబ్బిని చూశావా?"

అనూరాధకి అంతా అర్థమైపోయింది, తన తండ్రి అతని బాసుతోనే తన పెళ్ళి నిశ్చయం చేశాడు. పున్నమి వెళ్ళగానే ఆ పెళ్ళి!

"ఏమైపోయావు శ్రీనూ! నువ్వెప్పుడొస్తావు నాకోసం శ్రీనూ" అంటూ అనూరాధ మనసులోనే ఆక్రోశించింది.  అప్రయత్నంగా ఆమెకళ్ళు జలజలా వర్షించాయి.

తన పెళ్ళి తల్లి లేకుండా జరుగుతున్నందుకు ఆమె అలా దుఃఖిస్తోందనుకున్న రత్తాలు నొచ్చుకుంది. "అనూరాదమ్మా! ఏడవమోకమ్మా! సొరగం నుండి మీయమ్మ గమనిస్తానే ఉంటాదిలే నీ పెళ్లి, దిగులెట్టుకోమోక. నువ్వలా సీటికీమాటికీ గుడ్లనీరెట్టుకుంటే సొర్గంలో ఉన్న మీ యమ్మకు సుకముండదు" అంటూ సానుభూతితో అనూరాధను దగ్గరకు తీసుకుని తన కొంగుతో ఆమె కళ్ళు తుడిచింది రత్నకుమారి.

############

ఆరోజు నిద్ర లేస్తూనే బాత్రూలోకివెళ్ళి సాధ్యమైనంత నిశ్శబ్దంగా వాంతి చేసుకుంది అనూరాధ. శరీరంలో పుట్టిన అలజడి తగ్గేవరకూ కొంచెం సేపు విశ్రాంతిగా ఉండడం కోసం గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది.

అకస్మాత్తుగా, నీటిలో చేపపిల్ల బుటకవేసినట్లుగా అనూరాధకు పొత్తికడుపులో ఒక చిన్న కదలిక తోచింది! "ఇది గర్భవతికి వచ్చే ఒక అనుభవమా..." ఆశ్చర్యంగా అనుకుంది ఆమె.

ఔనో, కాదో అడిగి తెలుసుకోడానికి తనకు తల్లి లేదుకదా -  అన్న ఆలోచన రావడంతో ఉసూరుమంది అనూరాధ!  మానని గాయం రేగి, మళ్ళీ రక్తం కారినట్లు, ఆమె మనసుకైన గాయం రేగి ఆమెకు మళ్ళీ కన్నీరు తెప్పించింది. ఆ కన్నీరు అటుగావచ్చిన రత్నకుమారి కళ్ళబడింది. వెంటనే అనూరాధవైపు గుడ్లురిమి చూసింది. మళ్ళీ అంతలోనే సద్దుకుని, "ఏటమ్మోవ్! ఇదంతా అమ్మమీద పొంగుకొచ్చిన ప్రేమేనా ఏంటీ, ఇడ్డూరమ్! ఆడకూతురు ఇలా అస్తమానూ నట్టింట గుడ్లనీరెట్టుకుని ఏడుస్తా ఉంటే, ఇంటికి అరిస్టం సుట్టుకుంటాదంట! నీకు తెలవడా ఏంటీ? సోజ్జమాని" అంది కటువుగా.

రోజు రోజుకీ మారిపోతోంది రత్నకుమారి. తానే ఆ ఇంటి యజమానురాలైనట్లు, అందరిమీదా పెత్తనం చెలాయిస్తోంది. అనూరాధ తన దుఃఖంలో తాను ముణిగి ఉండడంతో అది గమనించీ కూడా నిరాసక్తంగా ఉండిపోయింది. పద్దాలుకి అది కంటగింపుగా ఉంది. కానీ ఏమీ అనలేని స్థితి ఆమెది.

############

శేషగిరి ఎప్పటిలాగే ఏదో పనిమీద కేంప్ కి వెళ్ళాడు. ఆ రోజు సాయంకాలం నాలుగయ్యింది. మల్లెపూలు, పనిలోపనిగా ఇంట్లోకి కావలసిన కూరాలూ కొని తేవడంకోసం రత్నకుమారి బజారుకి వెళ్ళింది. అనూరాధ ఒక్కటే ఉంది ఇంట్లో. కందిరీగల్లా మూసిరే రకరకాల ఆలోచనలతో సతాయిస్తున్న మనసును సముదాయించడం కోసం హాల్లోని సోఫాలో ఏదో  పాత మేగజైన్ చూస్తూ కూర్చుంది. అంతలో "అనూ" అన్న అతిపరిచితమైన పిలుపు వినిపించింది. ఆశ్ఛర్యంతో తల పైకెత్తి చూసిన అనూరాధకి వీధి గుమ్మంలోంచి లోపలకి అడుగుపెడుతున్న కాంచన కనిపించింది.

 

తరువాయి భాగం »

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం