Sahithi Pudota

భాస్కర శతకము

 

కట్టడదప్పి తాము చెడు | కార్యముఁజేయుచునుండి రేనిఁదో
బుట్టినవారినైన విడి | పోవుట కార్యము;దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురుని | తో నెడబాసి విభీషణాఖ్యుఁడా
పట్టున రాముఁజేరి చిర | పట్టము గట్టుకొనండె భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! దశకంఠుడగు రావణుడు చెడు బుద్ధిచే కలిగిన గ్రుడ్డితనము చేత దుష్టకార్యము చేయగా అతని యొక్క సోదరుడైన విభీషణుడు వెనువెంటనే అన్నను వదిలివేసి శ్రీ రామచంద్రమూర్తికి నేస్తమై ఆయన చేత శాశ్వతమైన లంకా నగరాధిపత్యము పొందెను. అట్లే చెడ్డపనులు చేసినచో సోదరుడైననూ వానిని విడిచిపెట్టుట కర్తవ్యముగా భావించవలెను.

 

 

కట్టడయైన యట్టి నిజ | కర్మము చుట్టుచు వచ్చి యేగతిం
బెత్తునొ పెట్టినట్లనుభ | వింపక తీరదు; కాళ్ళు మీఁదుగాఁ
గిట్టక వ్రేలుఁడంచుఁదల | క్రిందుగఁగట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ | జేరిన కర్మముగాక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! గబ్బిలములు ఇతరులెవ్వరునూ తమ్ము తలక్రిందుగా చెట్టునకు వ్రేలాడగట్టకున్ననూ తమ పూర్వజన్మ కర్మచే అట్లు వ్రేలాడుచుండును. అట్లే విధి విహితమైన పురాకృత కర్మము తన్నావరించి ఉన్నచో ఎటువంటి కష్టములైననూ అనుభవించక తప్పదు.

 

 

కట్టడ లేని కాలమునఁ | గాదు శుభం బొరులెంత వారు చే
పట్టిననైన మర్త్యునకు | భాగ్యమురాదనుటెల్లఁగల్ల, కా
దెట్టని పల్కినన్; దశర | ధేశవశిష్ఠులు రామమూర్తికిన్ 
బట్టము కట్టగోరి రది | పాయక చేకుఱె నోటు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! దశరథ మహారాజు, వశిష్ఠ మహాముని శ్రీరామ చంద్రమూర్తికి పట్టము కట్టుటకు ఎంతో ప్రయత్నము చేసిననూ, విధి వక్రించి ఆ పట్టాభిషేకము జరగలేదు గదా! అదే విధముగా మానవ ప్రయత్నమునకు దైవ బలము తోడుకానిచో ఎంత ప్రయత్నము చేసినను అది ఫలించదని భావము.

 

 

కానగ చేరఁబోలఁదతి | కర్ముఁడు నమ్మికలెన్ని చేసినం
దా నది నమ్మి వానికడ | డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చోనది యెట్లనం;గొఱఁకు | చూపుచు నొడ్డినబోను మేలుగాఁ
బోనని కాన కాసపడి | పోవుచుఁగూలదెఁకొక్కు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! పందికొక్కు తనను చంపుటకొరకే చక్కటి విధానముతో బోను ఏర్పాటుచేయబడినదని గ్రహించక తన ఆహారము బోనుయందున్నదని గ్రహించక, తినుటకు వెళ్లి, దాని యందే చచ్చును. అట్లే నమ్మకము లెన్ని చూపినను, పాపాత్ముని దగ్గరకు వెళ్లి స్నేహము చేసినచో హాని సంభవించగలదని భావము.

 

 

కాని ప్రయోజనంబు స | మగట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడు | కైననదెట్లు;మహేశు పట్టివి
ద్యానిధి సర్వవిద్యలకుఁ | దానె గురుండు వినాయకుండుఁదా
నేనుఁగు రీతి నుండియున | దేమిటి కాడడు పెండ్లి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! సర్వ కార్యాలకు, సర్వవిద్యలకు అధిపతి, శివుని కుమారుడు, ఏనుగంతటి బలము గలవాడగు గణేశుడు పెండ్లిని చేసుకోనలేకపోయెను. అట్లే మనుష్యుడు ఎంతటి విద్యావంతుడైననూ, రాజకుమారుడైననూ దైవము అనుకూలింపనిచో తనకు కావలిసిన పనులను సిద్ధింపచేసికొనలేడని భావము.


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం