Sravanthi

 

వింతవేదిక

(‘రైల్వేప్లాట్ఫారం’ను వేదికగా ఊహించి వాస్తవాలను చిత్రీకరించిన కవిత)

   
కం.

హితులున్ సన్నిహితులు స్నే
హితులున్ పరిచయము లేని ఎందఱొ ఒకచో
సతమతముకాగ బహుసం
స్కృతులకు దర్పణముపట్టు దృశ్యము చూపున్ !

   
కం.

నిలయంబియ్యది జగతిని
కల వస్తుచయంబు ఎందు కానని రీతిన్
వెల పెంచి అమ్ముటకు దొం
గల కరలాఘవమునకును కళవళమునకున్

   
కం.

కోరినవారల కూరిమి
చేరగ తనువెల్ల కనులు చేసికొని అదే
తీరుగ వెదకుచు ‘అదిగది
గో ! రమ్మ’ని పరుగుతీయు కొందఱు కనుమా

   
తే.గీ.

కన్నబిడ్డల పంపుచు కన్నవారు
సతిని పంపుచు పతియును పతిని పంపు
సతియు పలుమార్లు జాకరూకతల తెలిపి
గుండె దిటవుగ నిల్పివీడ్కోలు తెలుపు

   
కం.

ఎందఱి విడదీసినదో
కొందలపడి చేతులూపి కొనదాక కనన్
తొందరపడువారల క్షణ
మందున కనుమఱగుచేసి ఆర్ద్రత నింపున్

   
కం.

కడుభారమ్ముల తలపై
నిడి చేతుల కొన్నిపట్టి  ఇటునుండి అటున్
కడువేగమ్మున నడిచెడి
బడుగులకు ఉపాధి ఇచ్చు బహిరంగ మిదే

   
కం.

దొరికిన చాలని పరుగిడి
గరువమునన్ తిరిగి వచ్చి కాంతామణికిన్
త్వరత్వర ఇడు వస్తువులను
కరువో అన, కాలు మెదిపి కదలనివారున్

   
కం.

వచ్చెడి శకటము సమయుము
వచ్చిన రాకున్న చూడవలె పసిపిల్లల్
హెచ్చుశ్రుతి ఏడ్వ తల్లుల
వెచ్చని ఓదార్పు లెందు వినలేని గతిన్

   
తే.గీ.

కనుల బాష్పాలు చాటుమాటున అడంచు
కొనుచు ధైర్యంబు చెప్పెద రనిశ మిచట
వివిధరీతుల పయనమై వెడలువారి
వీడజాలని చూపుల వెఱ్రు లగుచు

   
కం.

‘పద ఇక పోదమ’ టంచున్
పదపడి వెనుదిరిగి బరువుపదముల చనువా
రదిగో తృటిలో మఱలన్
ప్రిదులని () కలకలము వెలయు వేదిక ఇదియే
        () తగ్గని

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం