Teneloluku


గత సంచిక తరువాయి »

తెలుగు భాష పరిరక్షణ కొఱకు ఎంతో మంది ఔత్సాహికులు అనేక విధాలుగా పరిశ్రమిస్తున్నారు. మన సంకల్పం స్వచ్ఛమైనదైతే, మన ఆవేశాలకు కాకుండా ఆలోచనలకు పదునుపెడితే, సారాంశం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అపర సంజీవిని అయిన తెలుగు భాషను మృత భాష అని అనేక సామాజిక మాధ్యమాలలో పదే పదే వల్లిస్తున్నారు. ఇటువంటి పదాలను వాడటం ఎంతవరకు సమంజసం? ఇక్కడ తమను అందరూ గుర్తించాలనే తపన కనపడుతున్నది తప్ప మంచి ఏమీ గోచరించడం లేదు.

అమ్మ భాష అమృత భాష అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలంటే మనం ఏమిచేయాలి? అందరిదీ ఒకే మాట ‘మన తెలుగు, మన శ్వాస, మన మనుగడ’ అంటూ మన ఇంటిలోనుండే ఆ నుడికారం దిద్దుతాం. ముఖ్యంగా మనం పరిశ్రమించాల్సింది మన తెలుగులో ఉన్న లాలిత్యాన్ని వెలికితీసి అందరికీ అర్థం అయ్యేరీతిలో ఉంచితే ప్రజల మనోభావాలను మార్చడం ఏమంత కష్టం కాదు.

మన దేశంలో వివిధ మాండలీకాలను కలుపుకొని 900 పైచిలుకు భాషలు ఉన్నాయి. మరి ఆ భాషలన్నింటినీ కలపాలంటే, పరిపాలించాలంటే బ్రిటీష్ వారికి వారి భాషను మనపై రుద్దక తప్పలేదు. మనవారు దానిని అవకాశంగా మలుచుకొని మన పాఠ్యాంశాలలో చొప్పించారు. వెఱసి ఆంగ్లం మన జీవితాలలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించింది.

మిగిలిన భారతీయ భాషల ఉనికి కొఱకు ఆ ప్రాంత సాహితీవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మన తెలుగు భాష విషయంలో నేమిలేటి గారు అన్నట్లు "జీవించడానికి మాతృభాష నేర్వాలి, జీతం కోసం ఆంగ్లాన్ని నేర్వాలన్న- పెద్దలమాటను పాటిస్తే మంచిది.” మనలో ఎంతోమంది ఉత్సాహంతో తెలుగు భాష పరిరక్షణ ఉద్యమాలు చేపట్టారు, చేపడుతున్నారు. అయితే ముందుగా అందరిలో సంఘీభావం కనపడాలి. మేము తెలుగువారమని,  తెలుగు ఆ విధాత వరమని సగర్వంగా చెప్పుకోగలగాలి. తెలుగులో మాట్లాడడానికి సంకోచించకూడదు. అందరిదీ ఒకే మాటగా వినపడాలి. అప్పుడే పాలకులు, ప్రభుత్వం మన భాష ఉనికి కొఱకు అనువైన అవకాశాలను పరిశీలిస్తారు, కల్పిస్తారు.

---------------

వివిధపరిమళాల వెదజల్లు విరులెల్ల
వెదకివెదకి మధువు వెలికిదీయు
తేటి కెఱుక లేమి తెలుగు పద్దియములు
తియ్యదనము నిండి తేనె లొలుకు

తెలుగు పదాలలోని తియ్యదనము తేనెటీగకి తెలియదు కాని మనకి తెలుసుకదా! అందుకే తప్పులులేని తెలుగులో మాట్లాడదాం.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం