వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 63


- అన్నే లెనిన్

Vikshanam


నవంబరు 12, 2017 న ఫ్రీమౌంట్ లోని శ్రీ పిల్లలమఱ్ఱి  కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
శ్రీ మృత్యుంజయుడు తాటిపామల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పాడుగు శ్రీ చరణ్ "రఘువంశ ప్రశస్తి" లోని కొన్ని శ్లోకాలను టీకా తాత్పర్య సహితంగా ఉదహరిస్తూ అత్యంత రమణీయంగా ఉపన్యసించారు. 17 సర్గల రఘువంశ చరిత్రను సూక్ష్మంగా వివరించారు. దిలీపుడు, సగరుడు, భగీరధుడు, హరిశ్చంద్రుడు గొప్పవారైనా రఘువు పేరు మీదుగానే వంశం వర్థిల్లడానికి కారణాలు వివరించారు. మల్లినాథ సూరి గారి సంజీవని వ్యాఖ్యావిశేషాల్ని, కాళిదాసు, పోతన పద్య సారూప్యతలను వివరించారు.

తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావు "ఆధునిక కవిత్వం" అనే అంశం మీద ఉపన్యసిస్తూ సాహితీ సభల లోని రకాలను హాస్యస్ఫోరకంగా వివరించారు. తాను ఇంతవరకు పాల్గొన్న సభలన్నిటిలో వీక్షణం ప్రత్యేకమైనదని అభిమానాన్ని వ్యక్తం చేసారు. నన్నయ్య చెప్పినట్లు విశ్వ శ్రేయస్సుని కోరేదే కవిత్వం అన్నారు. కవిత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వక్కాణించిన నిర్వచనాల్ని వివరించారు. విశ్వానికి కవి కన్ను వంటి వాడు అనీ, కవిత్వం పాఠకుణ్ణి చేరినపుడే సంపూర్ణమవుతుందనీ అంటూ, కవి, పాఠకుడు కలిసి రాసేదే కవిత్వం అన్నారు.

ఎప్పటిలానే అత్యంత రసవత్తరంగా కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన సాహితీ క్విజ్ జరిగింది.

చివరగా పిల్లలమఱ్ఱి  కృష్ణ కుమార్ గారి "దేవాలయాలకు ఎందుకు వెళతాం?" అనే పరిశోధనాత్మక ప్రసంగంతో వీక్షణం ఉల్లాసంగా ముగిసింది. ఈ ప్రసంగంలో వాస్తు శాస్త్రాన్ని క్షుణ్ణంగా సభకు పరిచయం చేసారు కృష్ణ కుమార్.

ఈ సభలో శ్రీ సత్యనారాయణ, శ్రీ లెనిన్, శ్రీ వికాస, శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ రవి కుమార్ వల్లూరి, శ్రీమతి రత్న కుమారి, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి జయమాల, శ్రీమతి శాంతికుమారి, డా||కె. గీత మొ.న వారు పాల్గొన్నారు.

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దానగుణం సమస్తగుణాలకు అవధిలాంటిది – చాణక్య సూత్రం