aalayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

సూర్య దేవాలయం, సూర్యకుండ్, గుజరాత్, ఇండియా

Temple


“సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం తం సూర్యం ప్రణమామ్యహం...”

ఆది నుండీ, మన భారతీయుల మేధాసంపత్తి, వైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతో గొప్పది. అందుకు సరైన నిర్వచనం వందల ఏళ్ల పూర్వమే మనవాళ్ళు అందమైన  శిల్పకళా నైపుణ్యంతో ఒకటికొకటి అనురూపముగా నిర్మించిన అద్భుత కట్టడాలు. అటువంటి అపురూపమైన శిల్పకళా చాతుర్యంతో, చక్కటి ఆకృతితో, వేలమంది ఒకేచోట కూడి ఏ కార్యాన్నైనా సులువుగా నిర్వహించుకునే వీలుతో నిర్మించిన ఈ సూర్యకుండ్, అదే సూర్య దేవాలయం, నేటి మన ఆలయసిరి.

Temple


ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో అంటే క్రీ.శ 1026-27 మధ్య కాలంలో నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ ఉన్న కోనేరు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. చాళుక్యుల నిర్మాణ శైలి అయిన మరు-గుర్జరా (Maru-Gurjara style) శైలి లోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది.  ఈ కోనేరులోని మెట్లు అన్నీ చక్కటి రేఖాకృతిని కలిగి ఉండి ఎంతో అందంగా కనిపిస్తాయి. ప్రతి మెట్టు మీదా చక్కటి ఆకృతితో నిర్మించిన గోపురాలు మంచి శిల్ప సంపదతో అందరినీ ఇట్టే ఆకట్టుకొంటాయి. అంతేకాక ఈ కట్టడాలలో కొన్ని వందల సంవత్సరాలు భౌగోళిక మార్పులను, వాతావరణ వత్తిడులను తట్టుకొని నిలబడుతున్నాయి అంటే నాటి పనిలో చూపిన నాణ్యత ఎంత గొప్పదో అర్థమౌతుంది.

Temple


ఈ ప్రాంగణం మూడు భాగాలుగా ఉంది.

ఒకటి, గుడి మండపం; ఇందులో ప్రధాన గర్భగుడి మరియు ఉత్సవాలకు ఒక మండపం ఉండేవి.

ఆకాలంలోనే సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్ ఆదిత్యుని పాదాలను తాకే విధంగా వాస్తు నిర్మాణం జరిగింది. ఈ ప్రధాన ఆలయం యొక్క ఆకృతి బోర్లించిన పద్మం వలే ఉంటుంది.

రెండు, సభా మంటపం; ఇక్కడే అన్ని రకాల సమావేశాలు జరిగేవి.

మూడు, కోనేరు (కుండ్) ప్రాంగణం; ఇక్కడ ప్రధాన క్రతులు మరియు సామూహిక ప్రార్థనలు జరుగుతుండేవి. ఈ కోనేరు మెట్లమీదే వివిధ దేవతామూర్తుల ఆలయాలు ఉండేవి.

ఈ మూడు భాగాలు విడివిడిగా ఉన్ననూ అన్నింటినీ కలుపుతూ నడవా ఉండేది.

Temple


ప్రధాన ఆలయం మంచి శిల్పాకృతిని కలిగి ఎంతో అందంగా ఉండేది. అందులో ఎంతో హృద్యంగా గజరాజుల ప్రతిమలు, మనిషి జీవితంలోని వివిధ దశలను తెలిపే జీవిత చక్రాలను చెక్కారు. ఈ ప్రదేశంలో మాత్రమే 12 రకాల సూర్యుని ప్రతిమలను మనం చూడగలము.

Temple


వందలమంది ఒకేచోట కూర్చుని ప్రశాంతంగా యోగా చేసుకునేందుకు అనువుగా ఉన్న ఈ సుందర ప్రాచీన ప్రదేశం మరెక్కడా కానరాదు. ఉదయభానుని అరుణ కిరణాలు ప్రతిఒక్కరి మీద పుష్కలంగా పడుతున్నాయి.

ఇక్కడ నిత్యపూజలు మాత్రం జరుగుటలేదు. ఈ ప్రదేశం ప్రస్తుతం పురావస్తుశాఖ వారి పరిరక్షణలో ఉన్నది.

దురదృష్టవశాత్తూ మన చరిత్రలో, మాయని మచ్చగా మిగిలి మనలను నేటికీ కలచివేస్తున్న పరదేశి మరియు స్వదేశి శత్రు రాజుల దండయాత్రలు, వారు ధ్వంసం చేసిన అనేక శిల్ప కళాఖండాలు, నేటికీ మనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ మహా కట్టడం కూడా 15వ శతాబ్దంలో పలు మార్లు ఆ దాడిలో దెబ్బతింది. రాతి కట్టడాలకు కాలపరిమితి లేదంటారు కానీ మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు ఈ కట్టడం పతనానికి దోహదపడ్డాయి.

ఈ సుందర పురాతన కట్టడం గురించిన మరిన్ని విశేషాలు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
https://youtu.be/kGz_qIyQBig?t=5

ఈ సూర్యదేవాలయం ఉన్న మధేరా గ్రామం గుజరాత్ రాష్ట్ర రాజధాని అయిన అహ్మదాబాద్ కు 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని రకాల రవాణా సౌకర్యం ఉంది.

 

Source1, Source2, Source3

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ