adarshamoorthulu


స్వామి వివేకానంద

Vivekananda“ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని భగవానుడు చెప్పినట్లు, సనాతన ధర్మాలను పరిరక్షించుటకు  ఆయన అంశం ఏ రూపంలోనైనా అవతరించవచ్చు. సర్వమానవాళికి బోధనల ద్వారా అర్థమయ్యే విధంగా ఆ ధర్మాలను నేర్పించేందుకు జన్మతః పరిపూర్ణ విజ్ఞానంతో కొంతమంది మహాపురుషులు జన్మిస్తుంటారు. తమ ప్రసంగాలు, నిబద్ధతతో కూడిన జీవనవిధానంతో, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, ప్రపంచశాంతిని నెలకొల్పి ఉత్కృష్టమైన మానవ జన్మ యొక్క సార్థకతను అందరికీ తెలియజెప్పడమే వీరి ప్రధాన బాధ్యత. అటువంటి మహత్తర కార్యంతో, మనిషిలోని అంతర్గత ఆత్మ వికాసం కొఱకు, సర్వమత సామరస్య ప్రధాన సూత్రంతో, అతి ప్రాచీనమైన మన వేదాలలోని ధర్మ సూత్రాలను ప్రపంచం అంతటా విదేశీయులకు వారి భాషలోనే విడమరిచి వివరించిన మహాపురుషుడు, మన భారతీయుడు,  స్వామి వివేకానంద నేటి మన ఆదర్శమూర్తి.

భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్‌ దత్‌ దంపతులకు మన స్వామి వివేకానంద జనవరి 12, 1863వ సంవత్సరంలో కలకత్తాలో జన్మించారు. వీరి అసలుపేరు నరేంద్రనాథ్‌ దత్‌.

సర్వమత సామరస్యమే హిందూమత తత్వం. అందుకే నిశ్చలమైన, స్థిరమైన విలువలతో ఎన్నో వేల సంవత్సరాలుగా  వెలుగొందుతున్నది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, మన సౌలభ్యం కొఱకు ఎన్ని మతాలను సృష్టించినను, అన్నింటికీ మూలం ఒకటే అదే పరమాత్మ. ఆ పరమాత్మ అంశం ప్రతి జీవిలోనూ ఉంది. సాటి మనిషిని, తన హోదాను చూసి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను చూసి ప్రేమించే మనస్తత్వం ఉండాలని చెబుతుంది.

వివిధ మత సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుంటూ రామకృష్ణ పరమహంస శిష్యునిగా ఉంటూ కొంత కాలం బ్రహ్మసమాజ ప్రభావంలో గడిపిన పిమ్మట 1887వ సంవత్సరంలో, రామకృష్ణ పరమహంస మరణానంతరం, ఆయన ఆశయాలను ప్రపంచానికి చాటేందుకు తన తోటి స్నేహితులతో కలిసి సన్యాసం స్వీకరించి హిమాలయాలకు వెళ్ళి ఆరేళ్ళపాటు ధ్యానంలో గడిపాడు మన నరేంద్రనాథ్. తదుపరి భావితరాలకు, ముఖ్యంగా భారతీయులకు తన గురువు అందించాలనుకొన్న భోధనలను, తనదైన శైలిలో వివరిస్తూ వివేకానందుడయ్యాడు.

Vivekanandaమనిషి జీవితాన్ని ఆదర్శప్రాయంగా మార్చుకొనుటకు ఆత్మవికాసమే ముఖ్యమని ప్రభోదించిన దేవదూత మన వివేకానందుడు. తన ఆత్మప్రభోదంతో, గురువు రామకృష్ణ పరమహంస నిర్దేశాలతో తన జీవితాన్ని పూర్తిగా సరైన మానవ జీవనసరళి కొఱకు ధారబోసిన ఈ మహామనిషి, దైవాంశసంభూతుడు కాక మరేమిటి? వివేకానందుడు తన సందేశాలను, సంబోధనను ప్రపంచానికి వినిపించే వాహకంగా రామకృష్ణ పరమహంస గ్రహించాడు. కనుకనే వివేకానందునిలో ఆత్మప్రభోదం కలిగించి తన జీవన మార్గాన్ని నిర్దేశించాడు.

ramakrishnaధ్యానసాధనం ద్వారా ఆత్మ వికాసం కలిగి తద్వారా మనోనిగ్రహంతో మనసును కేంద్రీకరించి మనం అనుకున్న పనులను నిర్విఘ్నంగా సాధించవచ్చని తను పాటించి నిరూపించాడు వివేకానందుడు. అదే అందరికీ బోధించాడు. యోగా ప్రక్రియ ద్వారా దేహాన్ని అన్ని రుగ్మతలనునుండి కాపాడుకొని మంచి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చని చెప్పాడు.

Vivekanandaనాటి భారతీయత దైన్యానికి, నికృష్టమైన జీవన విధానానికి ముఖ్యకారణం బడుగు ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడమే అని గ్రహించి, తన ప్రభోదనల ద్వారా ముందుగా బడుగు ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాడు వివేకానందుడు. వారిలో ఆత్మనిగ్రహాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసి తద్వారా వారి జీవన విధానాలలో నూతనత్వాన్ని కలిగించారు. “జీవితంలో సాహసం చేయాలి. గెలిస్తే చేయి అందించవచ్చు. ఓడిపోతే దారి చూపించవచ్చు”, ఈ ఒక్క సందేశం చాలు ఆయనకున్న సామాజిక వికాసాన్ని నిర్వచించడానికి. తన సిద్ధాంతాలను అందరికీ పంచేందుకు ఒక వేదికగా రామకృష్ణమిషన్‌ అనే సంస్థను స్థాపించాడు. నేటికీ ఆ సంస్థ కనుసన్నలలో ఎన్నో సామాజిక సంస్థలు పనిచేస్తూ ఆయన సూచించిన ధార్మిక మరియు సామాజిక సిద్ధాంతాలను అమలుచేస్తున్నాయి.

Vivekananda1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూమత ప్రతినిధి గా హాజరయ్యారు స్వామి వివేకానంద. విదేశీగడ్డ మీద అనర్గళంగా ఆంగ్లంలో మన హిందూ ధర్మాన్ని అందరూ సంమోహితులయ్యే విధంగా మాట్లాడిన ఏకైక వ్యక్తిగా, మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు వివేకానందుడు. ఆ తరువాత ఇంగ్లాండ్‌, శ్రీలంక, స్టిట్జర్లాండ్‌ మొదలైన దేశాలు పర్య టించి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎంతో మంది విదేశీయులు ఆయన ప్రసంగాలకు ఆకర్షితులై, ఆయన శిష్యులుగా మారారు. చికాగోలో ఆయన ప్రసంగం సందర్భంగా తన ఫోటో మీద వివేకానందుడు సంతకం చేస్తూ, బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు - "ఒక అనంతమైన స్వచ్ఛమైన మరియు పవిత్రమైనది, ఆలోచనకి మరియు నాణ్యత ప్రమాణాల పరిధి దాటిన దైనదానికి నేను నమస్కరిస్తున్నాను". ఈ వాక్యం ఆయన ఎవరి అంశంగా, ఈ కార్యం నిర్వర్తించుటకు ఇక్కడకు వచ్చాడో తెలుపుతున్నది.

ఆ మహానుభావుడి ప్రవచనాలను, తద్వారా మనలో కలిగిన కలుగుతున్న మానసిక చైతన్యాలను గురించి చెప్పుకుంటే ఒక పెద్ద గ్రంధం అవుతుంది. ఎందుకంటే ఆయన చూపిన మార్గం నేటికీ ఆచరణయోగ్యం. ‘రాజయోగం’ మొదలైన గ్రంథాలను రచించాడు. కలకత్తా సమీపంలోని బేలూరులో జులై 4, 1902వ సంవత్సరంలో ఆయన భగవంతునిలో ఐక్యం అయ్యారు. కానీ, ఆయన ఆత్మ మాత్రం ఆయన సందేశాలు, ప్రవచనాల రూపంలో మనతోనే ఉంటూ మనలను రక్షిస్తూ ఉన్నది. మనకు మంచి మార్గాన్ని చూపుతున్నది.

 

 

Source1, Source2, Source3, Source4

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ