అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

ఒక్క ఉదుటున లేచి నిలబడింది అనూరాధ. ఆర్తనాదం లాంటి ఎలుగుతో "కాంచనా" అని పిలుస్తూ, చేతులు రెండూ ముందుకు చాపి, గుమ్మందాటి లోనికి వస్తున్న స్నేహితురాలి వైపుగా పరుగెట్టింది. గాయపడిన హృదయాలు రెండూ ఏకమై పరస్పరం ఓదార్చుకునే ప్రయత్నంలో ఒకరినొకరు కౌగిలించుకుని భోరున ఏడవసాగారు. ఒకేసారి ఇద్దరూ ఆత్మీయుల్ని పోగొట్టుకున్న దుఃఖమూ, ఇక కలవలేము - అనుకున్న తరవాత ఆబాల్య మిత్రులిద్దరూ కలుసుకోగలిగినందుకు వచ్చిన సంతోషమూ ఏకమై, ఉక్కిరిబిక్కిరికాగా వెక్కివెక్కి ఏడవసాగారు వాళ్ళు ఇద్దరూ. అలా వాళ్ళు ఎంతసేపు ఏడుస్తూ ఉండేవారోగాని, "కేర్" మన్న పసివాడి ఆకలి కేక వాళ్ళను ప్రస్తుతంలోనికి బలవంతంగా తీసుకువచ్చింది. అక్కడితో ఇద్దరికీ తప్పనిసరిగా విడిపడి ఏడుపును దిగమింగుకునీ ప్రయత్నంలో పడక తప్పలేదు.

కాంచన పసివాడికి పాలు కలిపి, సీసాలోపోసి, తన వెంటవచ్చిన ఆయా చేతుల్లోనుండి పసివాడిని అందుకుని, వాడికి పాలుపట్టే ప్రయత్నంలో పడింది. అనూరాధ ఆమెను ఆశ్చర్యంగా చూడసాగింది. కాంచనకది నచ్చలేదు. అది ఆమె కదోవిధమైన గిలిగింతగా తోచింది.

"అలా చూడకే అనూ! వీడు నా కొడుకేనే! కష్టమంతా తను పడి, వీడిని కని, నా ఒడిలో పడేసి మా అక్క స్వర్గానికి చక్కాపోయింది. వీడికి మంచి భవిష్యత్తు ఉండాలని మా బావకు నన్నిచ్చి పెళ్ళిచేశారు పెద్దవాళ్ళు. అన్నీ చకచకా ఒకదాని వెంట ఒకటిగా - అలాఅలా -  అలవోకగా జరిగిపోయాయి. చూస్తూండగా అప్పుడే వీడికి నాలుగు నెలలు నిండబోతున్నాయి, తెలుసా! నువ్వలా చూస్తూ ఉండగానే వీడు నాకో కోడల్ని కూడా తీసుకొచ్చేస్తాడెమో" అంది, కాంచన తనకు సహజమైన హాస్యధోరణిలో. అలా అంటూనే బాగా ఒంగి, సీసాలోని పాలు కుడుచుకుంటూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆ పసివాడి చిరుబుగ్గమీద చిన్న ముద్దు పెట్టుకుంది.

వెంటనే అనూరాధ తన కడుపుపైన చేయి ఉంచుకుని తనలో తానే అనుకుంది ... "ఔను, చూస్తూండగా అప్పుడే నాలుగు నెలలు గడిచిపోయాయి కదూ" అని.

తను పసివాడిపైన వేసిన “జోకు”కి అనూరాధ స్పందన ఎలా ఉందో చూడాలని తలెత్తిన కాంచనకి, ముప్పిరిగొన్న మనోవేదనతో దీనంగా ముడుచుకుని ఉన్న అనూరాధ ముఖం కనిపించడంతో కంగు తిని మాట మార్చింది.

అనూరాధకు తల్లితో ఉన్న అనుబంధం కాంచనకు తెలుసు. అందుకే ఆ బాధంతా అనూరాధకు, తల్లి మరణం వల్ల వచ్చిన దుఃఖమే - అనుకుంది కాంచన.

“అనూ! నే నిప్పుడు ఇక్కడికి ఎలా రాగలిగానో తెలుసా... పాలకొల్లులోవున్న మా పెద్దాడపడుచు కోడలికి సీమంతమని మా అత్తగారు వస్తూ, నన్నుకూడా తనతో తీసుకుని వచ్చారు. పాలకొల్లు వచ్చాక తెలిసింది, జానకీ ఆంటీ పోయారన్న విషయం. ఇక నా ప్రాణం నిలవలేదు నిన్ను చూడకుండా ఉండడానికి. మా అత్తగారిని పర్మిషన్ అడిగి వచ్చానిలా. చీకటి పడకముందే తిరిగి తన దగ్గరవుండాలని కండిషన్  పెట్టి పంపారు నన్ను. మధ్యాహ్నం భోజనాలవ్వగానే - నీకు చూపించాలనిపించి, వీడిని చంకనెత్తుకుని, ఆయాని వెంటతీసుకుని వెంటనే కారెక్కేశా.

మమ్మల్ని ఇక్కడ దింపి, అయిదయ్యేసరికి వచ్చేస్తానని చెప్పి, డ్రైవరు, ఈ ఊళ్ళోనే వున్న వాళ్ళ చుట్టాలని చూడడానికి వెళ్ళాడు. అతను రాగానే నేను బయలుదేరాలి” అంది.

అనూరాధకి అతిధిమర్యాదలు గుర్తు రావడంతో కళ్ళు పైట కొంగుతో నొక్కి తుడుచుకుని, “ఉండవే, క్షణంలో బ్రూ కలిపి తెస్తా” నంటూ లేచింది అనూరాధ. పసివాడు పాలుతాగడం పూర్తవ్వడంతో వాడికి బట్టలు మార్చమని చెప్పి, వాడిని ఆయాకిచ్చి అనూరాధ వెంట వంట గదిలోకి నడిచింది కాంచన.

శ్రీనివాసుని గురించి కాంచనని అడగాలి అనుకునీ కూడా మొదట్లో సిగ్గుపడి కొంతసేపు తటపటాయించింది అనూరాధ. ఎలా మొదలుపెట్టాలో ఆమెకు తెలియలేదు. కానీ, తనకు ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాకపోవచ్చు నన్నది అర్థమయ్యిoది. తండ్రి ఊళ్ళో లేడు. రత్నకుమారి కూడా ఇంట్లో లేదు, ఇంటికి కావలసిన సరుకులు కొనితెస్తానంటూ, మూడవ్వగానే నిద్ర లేచి తయారై బజారుకు వెళ్ళింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనుకుంది అనూరాధ.

“అనూ! నీ ఫిల్టర్ కాఫీ బ్రహ్మాoడమ్! భవిష్యత్తులోమళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో, అసలు ఈ జన్మలో కలుసుకోడమే పడదో - ఏమో, ఏం చెప్పగలమ్! వచ్చిన అవకాశం వదులుకో కూడదు. కొంచెం ఆలస్యమైనా ఫరవాలేదు, ఫిల్టర్ వెయ్యి” అంటూ అడిగి, అక్కడున్న స్టూలు మీద కూర్చుండిపోయింది కాంచన. శ్రీనివాస్ గురించి అడగడానికి ఇదే సరైన అదుననుకుంది అనూరాధ.

ఎంతో కష్టంమీద అదిరే మనసును కుదురుపరుచుకుని, బలవంతంగా ధైర్యం తెచ్చుకుని స్నేహితురాలిని అడిగింది అనూరాధ. “కాంచనా! మీ శ్రీనన్నయ్యకి ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిందా” అంటూ మొదలెట్టింది ఉపోద్ఘాతంగా.

ఉలికిపడ్డట్టు అదిరిపడి, అనూరాధ మొహంలోకి చూసి, “మా సీనన్న నీకేలా తెలుసు” అని నిలదీసింది కాంచన.

ఒక్కక్షణం ఏం చెప్పాలో తోచక తబ్బిబ్బు పడింది అనూరాధ. నిజానికి, ఉన్నదున్నట్లుగా నిజం చెప్పడమే తేలిక. అబద్ధాలు చెప్పి నిలదొక్కుకోడానికి చాలా తెలివి ఉండాలి. అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే, ఒకసారి చెప్పిన మాటే మరోసారి చెప్పకబోతే, మొదట చెప్పినదానికీ, రెండవసారి చెప్పినదానికీ పొంతన కుదరక మనిషి అవమానాల పాలుగాక తప్పదు. ఐనా, ప్రాణస్నేహితురాలితో తను అబద్ధాలు ఎలా చెప్పగలదు! అలాగని, జరిగినదంతా "తు - చ" తప్పకుండా చెప్పాలన్నా కష్టమే! అందుకే అంతా వివరించి చెప్పకపోయినా, ఎంతోకొంత - అవసరమైనంతవరకు నిజమే చెప్పాలనుకుంది అనూరాధ. ఆమె చెప్పబోతూంటే, ఆపింది కాంచన, "ముందు కాఫీలు అవ్వనీయి" అంది చనువుగా.

కాఫీ తాగి మగ్గులు క్రిండపెట్టగానే చెప్పడం మొదలుపెట్టింది అనూరాధ.

"క్రితం శివరాత్రికి మనమందరం లక్ష్మణేశ్వరం వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాము కదా, గుర్తుందా? అప్పుడు మా నాన్న ఊళ్ళో లేరు. అమ్మని అడిగా ... అమ్మ నన్ను మీతో పంపడానికి ఒప్పుకుంది. ఆమాట నీతో చెప్పాలని ముందురోజు సాయంకాలం నేను మీ ఇంటికి వస్తే, అప్పటికే మీరు మీ అక్కగారి ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంట్లో మీ అన్న ఒక్కరే ఉన్నారు. ఆయనే చెప్పారు నాకు, మీరు మీ అక్కగారి ఊరు వెళ్ళారని. అప్పుడే ఇదీ చెప్పారు, తనకు రెండు రోజుల్లో కాలేజీ లెక్చరర్ పోస్టుకి ఇంటర్వ్యూ ఉండడం వల్ల తను వెళ్ళడములేదని. అందుకే నాకు తెలిసింది. కుతూహలం పట్టలేక రిజల్టు ఏమిటని అడిగా" అంది అనూరాధ.

చూస్తూండగా కాంచన మొహం చిన్నబోయింది, "అన్నయ్య మాథ్సులో యూనివర్సిటీ గోల్డు మెడలిస్టు, అన్నింటిలో ఫస్టు! వాడికి ఉద్యోగం రావడంలో పెద్ద గొప్పేమీ లేదు. ఉద్యోగం వచ్చింది. వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరిపొమ్మని అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. కానీ ఏమి లాభం! ఆ ఉద్యోగంలో చేరడానికి వస్తూంటేనే, ఈ ఊళ్ళో బస్సు దిగగానే హఠాత్తుగా పోలీసులు వచ్చి, వాడిని చుట్టుముట్టి "అరెస్టు" చేసి తమ వెంట తీసుకెళ్ళిపోయారుట!

వెంటనే, ఆ మాటకు "షాక్" తిన్న అనూరాధ, "అరెష్టా" అంటూ, "కెవ్వు"న కేకపెట్టినట్లుగా అరిచింది.

"ఔను! అన్నయ్యకు దొంగనోట్లు అచ్చు వేసే ముఠాతో సంబంధం ఉందని అరెస్టు చేశారుట! దానికి తగినట్లుగా మా అన్నయ్య చేతిలో ఉన్న సూట్కేసులో బట్టలకు బదులు కట్టలు కట్టలు దొంగనోట్లు దొరికాయిట!" అది నా పెట్టి కాదు, ఎలాగో మారిపోయింది. ఒకేలా ఉండడం వల్ల పొరపాటున నేను దాన్ని నాదనుకుని తీసుకున్నాను" అంటూ "మొర్రో" మని ఎంత మొత్తుకున్నా వినిపించుకున్న నాధుడే లేకపోయాడుట. ఆపై కేసు నడిపి జైల్లో పెట్టారు. తరవాత తప్పించుకు పారిపోడానికి ప్రయత్నిస్తున్నాడని, శిక్షను పెంచి, రాజమండ్రీ సెంట్రల్ జైలికి పంపేశారుట! మా పెద్దనాన్నగారు బెయిల్ కోసం ఎంతో ప్రయత్నించారు కానీ కుదరలేదు. మా వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు, పాపం! గారాబంగా పెంచుకున్నారు. కొడుక్కి వచ్చిన ఆపదకు పెద్దమ్మ తట్టుకోలేకపోయింది. పగలూ రాత్రీ ఏక ఇదిగా ఏడుస్తున్న పెద్దమ్మకు కాస్త ఊరట కలగాలని, ఆమెను తీసుకుని పెద్దనాన్నగారు యాత్రలకని చెప్పి ఊరువదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు" అంటూ ఏకబిగిని జరిగినదంతా చెప్పి, తలెత్తి చూసిన కాంచన అనూరాధ పరిస్థితి చూసి తెల్లబోయింది.

స్థాణువులా కొయ్యబారి ఉన్న అనూరాధ కళ్ళనుండి ధారాలు కడుతున్న కన్నీరును చూసి, అసలే తల్లి మరణంతో మనసు చెదిరి ఉన్న అనూరాధ, ఎవరి కష్టాలు విన్నా సహించుకోలేకపోతోంది కాబోలు - అనుకుంది, అసలు సంగతి ఏమీ తెలియని కాంచన. మంచినీళ్ళు తెచ్చి స్నేహితురాలి మొహాన జల్లి, ఆమెచేత రెండు గుక్కల నీరు తాగించి, దగ్గరగా తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది కాంచన. అంతలో నిద్రలేచిన పసివాడి ఏడుపు వినిపించడంతో ఆమె హాల్లోకి వెళ్ళక తప్పలేదు.

అసలు సంగతి కాంచనకు తెలిసేలాచేసి, కాంచన దుఃఖాన్ని మరింత పెంచడం మంచిపని కాదనుకున్న అనూరాధ, బలవంతాన మనసు చిక్కబట్టుకుని, లేచి వెళ్ళి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుని, బొట్టు, జుట్టు సరిదిద్దుకుని హాల్లోకి వచ్చింది. పిల్లవాడికి పాలుపడుతున్న కాంచనను చూసి, "బాబుకి పేరేమని పెట్టేరు" అని అడిగింది అనూరాధ, తెచ్చిపెట్టుకున్న ఆనందంతో పసివాడి బుగ్గ పుణికి. .

ఆమె తెప్పరిల్లినందుకు సంతోషించింది కాంచన. "ప్రభాస్!" అక్క పేరు ప్రభావతి కదా! అక్క గుర్తుగా వీడికి "ప్రభాస్" అని పేరు పెట్టాము. అక్క పేరుతోనే వీడిని కూడా "ప్రభా" అనే పిలుస్తున్నాము. ఇక మాకు మా అక్క కనిపించేది వీడిలోనే కదా!" నిట్టూర్చింది కాంచన.

కడుపు నిండడంతో పసివాడు కాంచన ఒడిలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు. మురిపెంగా వాడినే చూస్తూ, వాడిని గురించి స్నేహితురాలికి చెప్పసాగింది కాంచన, "చూడవే అనూ వీడిని, ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో! పాపం, వీడు కన్నతల్లి ముఖమైనా చూసి ఎరుగడు కదా! పుట్టగానే తల్లిని పొట్టన బెట్టుకున్నాడంటూ అంతా తలోమాటా అంటూ వీడికి నష్టజాతకుడని పేరు పెట్టారు. జరిగిన దానికి వీడి బాధ్యతేముంది చెప్పు..." అంది వాడిని ప్రేమగా తడుముతూ.

అనూరాధ తన కడుపులోని బిడ్డను గురించి తలుచుకుంది, "అలాగైతే నా బిడ్డ మరీ పెద్ద నష్ట జాతకుడు, పుట్టకుండానే తండ్రిని జైలుకి పంపించాడు." మనసులోనే అనుకుంది ఆమె, ఉప్పెనలా ఎగదన్నుతున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ.

కాంచన ఒంగి పసివాడి నుదుటిని మ్ముద్దాడి, "అనూ! వీడు నన్నే అమ్మనుకుంటున్నాడు, పాపం!" అని స్నేహితురాలితో అని, "ఔనా!" అంటూ వాడిని గమ్మున లేవనెత్తి గుండేలకు హత్తుకుంది కాంచన.

స్నేహితురాళ్ళిద్దరూ బరువెక్కిన హృదయాలతో కొంతసేపటివరకూ అవాక్కై మౌనంగా ఉండిపోయారు. నెమ్మదిగా కాంచనే తెప్పరిల్లి ముందుగా మాటాడడం మొదలుపెట్టింది...

"అక్క పోయాక, దిగులుతో బావ చాలా పాడైపోయాడు. ఈ పసికందును ఒళ్ళో ఉంచుకుని, పిచ్చిచూపులు చూస్తూ, మాటా పలుకూ లేకుండా గంటలతరబడీ ఒకేచోట కదలకుండా కూర్చుండిపోయేవాడు. బావమీద నాకు మొదటినుండీ మంచి మనిషన్న గౌరవం ఉండేదేమో, ఆయననలా నేను చూడలేకపోయేదాన్ని. ఆ బాధ తగ్గించాలంటే ఏమి చెయ్యాలి - అని ఆలోచించేదాన్ని ఎప్పుడూ. ఏమీ తోచేది కాదు. కర్మకాండలన్నీ ముగిశాక పెద్దవాళ్ళంతా కూడి, ఒక నిర్ణయం తీసుకున్నారు - అక్క స్థానం నాకివ్వాలని! బావ దుఃఖం తగ్గించడం ఎలాగన్న నా ప్రశ్నకు, నాకూ ఇదే సరైన జవాబనిపించింది. వెంటనే ఒప్పుకున్నా. నెల తిరిగేసరికి బావతో నా పెళ్ళి జరిగిపోయింది. పసివాడి భవిష్యత్తుకి సఱైన భరోసా దొరికిందని అందరూ సంతోషించారు. ఎంత చెడినా, పినతల్లి సవితితల్లి కాలేదు కదా - అనుకుని తృప్తిపడ్డారు.

పెళ్ళికి ముందే బావ నాతో చెప్పారు, కాంచనా! నేను నీకు అన్యాయం చెయ్యను. కానీ నాకు కొంత టైమ్ కావాలి... ఏటి సూతకం గడిచిపోయేదాకా మనము వీడికి అమ్మా నాన్నలుగానే ఉండాలి, ఆ తరవాతే మనం భార్యాభర్తలమ్" అని. నాకూ ఆ నిర్ణయం నచ్చింది. అక్క పోయిన వెలితి తట్టుకోవాలంటే నాకూ కొంత వ్యవధి కావాలి మరి!"

"అడ్మిరేషన్" తో ఆశ్చర్యంగా చూసింది స్నేహితురాలిని అనూరాధ. తరువాత కొంతసేపు ఆ పసివాడిని ఎత్తుకుని ముద్దు చేసింది. తరవాత ఆ కబురూ ఈ కబురూ చెపుతూ, ఆ కబుర్లమధ్యలో అడిగింది కాంచనను అనూరాధ, "కాంచనా! మీ అన్నయ్య కబురు ఏమైనా తెలిస్తే నాకూ తెలియజెయ్యావూ" అంది అభ్యర్ధనగా.

కానీ, కాంచన ఆమె కళ్ళల్లో కళ్ళుకలిపి తేరి పారజూసేసరికి గతుక్కుమని, "ఇంతవరకూ జరిగిన ఘోరం విన్నా కదా, తరవాత ఏమయ్యిందో, ఊరికే కుతూహలంతో తెలుసుకుందామని అడిగానంతే" అంటూ మాట సద్దుకుంది.

కాంచన నిట్టూర్చి అంది, "అనూ! మా అన్నయ్యను అపార్ధం చేసుకోకు సుమీ, వాడు ఎట్టి పరిస్థితులలోనూ అలాంటి తప్పుడు పనులు చేయడు - చెయ్యలేడు! ప్రయాణంలో ఎవరి పెట్టెతోనో తన పెట్టె మారిపోడం జరిగి ఉంటుంది. లేదా, ఎవరైనా కిట్టనివాళ్ళు కావాలని ఈ పని చేశారో! నిర్దోషికి నింద వచ్చింది! సాత్వికుల ఉసురు ఊరికేపోదు, దీనికి కారణమైనవాళ్ళు ఇంతకింతా అనుభవించక పోరులే."

"ఇప్పుడు మా బ్రతుకులు ఇలా బండ లయ్యాయి కదా, ఎప్పుడో ఎవరికో శిక్ష పడితే మాత్రం మాకు మేలు ఔతుందా ఏమిటి" అనుకుంది అనూరాధ మనసులో. వెంటనే, ఇందులో తన తండ్రి తాలూకు భస్మాసురహస్తం ఉందేమో నన్న అనుమానం వచ్చింది అనూరాధకు.

అంతలో వీధి గుమ్మం ముందు కారు హారన్ మోగింది, డ్రైవర్ వచ్చినదానికి గుర్తుగా. తప్పనిసరి కావడంతో స్నేహితురాళ్ళిద్దరూ ఎంతో కష్టం మీద వీడ్కోలు చెప్పుకున్నారు. అనూరాధను కౌగిలించుకుని, ఆమె దగ్గర సెలవు తీసుకుని, ఆయా పసివాడిని ఎత్తుకుని వెంటరాగా కారెక్కింది కాంచన.

*** *** ***

కాంచన వచ్చివెళ్ళాక అనూరాధ గుండెబరువు మరింతగా పెరిగింది. కాలం స్తంభించినట్లై క్షణమొక యుగంలా అనిపిస్తోంది. ఏడ్వగా ఏడ్వగా కన్నీరుకూడా కరువైపోయి పొడిబారిన కళ్ళు భగభగా మండసాగాయి. శ్రీనివాసు అరెస్టు వెనుక తన తండ్రి ప్రమేయం ఉండే ఉంటుందన్న ఆలోచన ఆమె మనసును మరింత గాయపరచింది. తన గదిలోకి వెళ్ళి మంచంమీద చెంపకు చెయ్యి చేర్చుకుని, మహాదుఃఖంలో మునిగివున్న అనూరాధ దగ్గరకు వచ్చింది రత్నకుమారి.

“దూరం నుండి సూశా, వైనం తెలవలేదు, ఎవరాళ్ళు? బందుగులా?”

అసలే మనసుకి కుదురులేదేమో, హఠాత్తుగా వచ్చి రత్నకుమారి అలా అడిగేసరికి అనూరాధకు తిక్కెత్తుకొచ్చింది. ఐనా తమాయించుకుని జవాబుచెప్పింది, “కలిసి చదువుకున్నాం. చూసిపోదామని వచ్చింది” అంది, చిరాకుపడుతూ ముక్తసరిగా.

అదేం పట్టించుకోలేదు రత్తాలు. “ఆ బాబు ఆయమ్మ బిడ్డా! మా ముద్దుగున్నాడు. నే నొచ్చీదాకా ఆపాల్సింది. నేను గుమ్మం కాడికొచ్చీసరికి కారు బయల్దేరిపోయింది. అలాంటి పసోళ్ళను సూత్తే నాగుండె గుబగుబలాడుద్ది. కన్నబిడ్డసేత “అమ్మా” అని ముద్దుగా పిలిపించుకోవాలని ఉంటది” అంది ఆశగా.

అలా అంటున్నప్పుడు రత్తాలు కంఠంలో ధ్వనించిన ఆర్ద్రతకు విస్తుపోయిన అనూరాధ ఆమెవైపు తెల్లబోయి చూసింది. రత్తాలే మాటాడింది మళ్ళీ, “నలుగురు నడిసీకాడ నాసైనా మొలవదంటారు! నాలాటోళ్ళకు బిడ్డలు కలగరంట! బిడ్డల్ని కనీ అదురుస్టమ్ నా మొగాన రాసిలేదు” అంటూ నిట్టూర్చింది రత్నకుమారి.

అనూరాధ, “అలా ఎందుకనుకోవాలి? మీ అమ్మకు నువ్వు పుట్టలేదా” అంది యధాలాపంగా.

ఒక వెర్రినవ్వు నవ్వింది రత్నకుమారి. “నిజం చెప్పాలంటే నన్నుకన్నతల్లి ఎవరో నాకు తెలవదు. నేను అమ్మని చెప్పుకునే తల్లి నన్ను కన్నది కాదు, కొన్నది! చిన్నప్పుడే నన్ను కన్నోళ్ళు అమ్మేస్తే కొనితెచ్చి, పెంచి పెద్దచేసి ఈ పాపపు వృత్తిలోకి దింపింది. ఆమె తల్లని చెప్పుకున్న తల్లి కూడా కొన్నతల్లేగాని కన్నతల్లి కాదుట! ఈ ఉర్తిలో ఉన్నోళ్ళకి సాదారణంగా పిల్లలు పుట్టరు, అరుదుగా గర్బం వచ్చినా - పిల్లలు వుర్తికి అడ్డౌతారని, లేత నెలల్లోనే ఆ కడుపు తీయించేసుకుంటారు. ఎవరైనా బిడ్డను కన్నా, ఆ బిడ్డను కన్నతండ్రి ఎవరో ఆ యమ్మికి కూడా తెలవదు, ఇక బిడ్డకేం తెలుస్తాది. జిగి, బిగి తగ్గేవరకూ సంపాయించడం, తరవాత ఎక్కడో ఓసోటసేరి బతుకు వెల్లమార్చడం... ఇయ్యే మా బతుకులు. సివరాకరికి మణిసి వాడిపోయాక, మమ్మల్ని సూసి పారిపోయేటోళ్లే గాని, మా మొహo జూసి “బాగున్నావా” అని పలకరించేటోల్లు కూడా ఎవరూ ఉండరు.” నిట్టూర్చింది రత్నకుమారి.

జాలిగా తోచింది అనూరాధకి. “పొట్టకోసం పడే తిప్పలు ఎన్నిరకాలో! పాపం, జానెడు పొట్టకోసం అంత నీచానికి దిగజారాలా” అనుకునే సరికి రత్నకుమారి మీది కోపం పోయింది అనూరాధకి. అకస్మాత్తుగా జాలిపుట్టింది!

రత్తాలు తన ధోరణి అక్కడితో ఆపలేదు, మాట్లాడుతూనే ఉంది. "మేము వృత్తిలో ఉన్నప్పుడుకూడా మా గోడు ఎవరికీ పట్టదు! ఒక్కో యబ్బి ఉన్నాడంటే తను చెల్లించిన డబ్బుకి మించిన కిట్టుబాటు ఉండాలనుకుంటాడో ఏమో, మేముకూడా సాటి మణుసులమేననీ, ఆ మణిసికీ ఓ మనసుంటదనీ మరిసిపోయి ..." రత్నకుమారి వాగ్ధోరణికి అడ్డొచ్చింది అనూరాధ. “అబ్బా! ఊరుకో రత్తాలూ, ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. ఇక చాలు, ఆపు” అంది.

“ఏంటో! మణిసి తోడు కోసం వెంపర్లాడతాది నా మనసు! నాకు నీతో కబుర్లు చెప్పాలని ఉంటది, నువ్వేమో మాటాడనీవు, కూరాకులో పురుగు నిదిలించినట్లు ఇదిలించి పారేత్తావు” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పి, విసురుగా అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయింది రత్తాలు.

రత్నకుమారి వెళ్ళాక అనూరాధ తన గదిలో మంచం మీద పడుకుని శూన్యదృక్కులతో సీలింగ్ మీద దృష్టి నిలిపి తన ఆలోచనలలో తాను ఉండిపోయింది.

సందెపడి, దీపాలవేళ అయ్యింది. రత్నకుమారి ఇంటిలో దీపాలు వెలిగిస్తూ, పనిలోపనిగా అనూరాధ గదిలో దీపం కూడా వెలిగించింది. గదంతా వెలుగుతో నిండింది. తన ఆలోచనలనుండి బయటపడి, అనూరాధ మంచంమీద లేచి కూచుంది. ఆమె మనసు రత్నకుమారిపైన ఆర్ద్రతతో నిండి ఉంది. “ఎంత చెడినా ఆమె కూడా మనసున్న మనిషేకదా” అనుకుంది. ఆమె ఎడల తాను దురుసుగా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడి ఆమెను పలకరించింది, “ఏమిటి రత్తాలూ! నీకు నా మీద కోపం వచ్చిoదా” అని అడిగింది.

అనూరాధ అలా మాటవరసకు పలకరించినా, దానికే సంతోషించింది రత్నకుమారి. “నాలాంటోళ్ళకు కోపమేoటమ్మా! దీపం వెయ్యడానికొచ్చా. మణిసి వోపిరికొట్టుదాన్ని, ఎవరితోనూ మాటాడకుండా ఒక్క క్షనం కూడా ఉండలేను. ఏవేవో ముచ్చట్లు  ఎట్టుకోకపోతే తోసిసావదు నాకు.”

“అదేమిటి రత్తాలూ! నాకు మాత్రం మనిషితోడు ఉండొద్దా! అర్ధాంతరంగా మా అమ్మ పోవడంతో మనసుకి కుదురులేక ఎవరితోనూ మాటాడాలనిపించడం లేదు, అంతే. ఏమీ అనుకోబోకు” అంది అనూరాధ.

“నిజం సెప్పాలంటే అనూరాదమ్మా! తల్లీ, తోడూ ఎవరూ లేని నేను, ఎవరైనా కాసంత పలకరిస్తే సాలు, వాళ్ళు నావాళ్ళే అనుకుంటా. మాకూ ఏవేవో ఆశలుంటాయి గాని, అవి తీరవు. ఒక్క మొగుడు, ఇద్దరు పిల్లలు, నాదని చెప్పుకునే ఇల్లు, ఏ బాదరబందీలూ లేని నిండైన సంసారం – ఇలాంటి మంచి జీవితం కావాలని ఉంటుంది మాకు కూడా. కానీ ఇవేవీ ఈ జనమలో తీరే ఆశలు కావని మాకూ తెలుసు. ఇక - ఉంచుకున్నోడికి మా సంగతి అస్సలు పట్టదు. పైపై సుట్టరికాలేగాని, మనసున్న బంధాలూ, బంధుత్వాలూ మాలో ఉండవు. అది కూడా మాకు బాగా తెలుసు. మేమూ అందుకే రాబట్టగలిగినంత సొమ్ములు రాబట్టడం కోసం ఎన్ని టక్కర్లైనా సేత్తాము. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకి ఆ ఊరూ అంతే దూరం - అనేది మా యమ్మ ఎప్పుడూ ఊతపదంలా. ఏంటో, సెప్పుకునేందుకేముందిట, ఎదవన్నర ఎదవ బతుకులు మాయి” అంటూ నిట్టూర్చింది రత్నకుమారి. అనూరాధ జవాబుచెప్పలేదు, మౌనంగా వింటూ ఉండిపోయింది.
అంతలో గుమ్మంలో కారు ఆగిన శబ్దం వినిపించింది. శేషగిరి ఊరునుండి రావడంతో వెంటనే అక్కడనుండి వెళ్ళిపోయింది రత్నకుమారి.

*** *** ***

వచ్చినప్పటినుండి శేషగిరి ఎందుకనో చాలా ఉషారుగా ఉన్నాడు. ఆ రాత్రి భోజనం చెయ్యకముందే ఏదో పనుందన్న మిషతో ఇంటినుండి బయలుదేరి తిన్నగా బారుకి వెళ్ళాడు - తాగేయందుకు మందు, ఆపై తినేందుకు తిబండారాలూ కొనితేవడం కోసం. ఆరోజు అతనికి జల్సా చెయ్యాలనే కోరిక కలిగింది. కానీ, వెడుతూ రత్నకుమారికి ఒక పని పురమాయించి మరీ వెళ్ళాడు. అదే పనిమీద వెంటనే అనూరాధను వెతుక్కుంటూ బయలుదేరింది రత్తాలు.

అప్పుడే వాంతిచేసుకుని వచ్చి తల్లి గదిలో ఉన్న మంచం మీద అలసటతో కళ్ళు మూసుకుని పడుకున్న అనూరాధ, మీద చెయ్యి పడేసరికి ఉలికిపడి కళ్ళు తెరిచి రత్తాలును చూసి “నువ్వా” అంది నిస్త్రాణగా.

రత్నకుమారి ఆమె వెన్నురాస్తూ అంది, “అమ్మదొంగా! నాకు మొదటినుండీ అనుమానంగానే ఉంది, ఇప్పుడు నీకు నాలుగోనెలoటగా! నువ్వు దాసినా నాకు తెలిసిపోయిందిలే! అదేపోయినాదిలే! నువ్వు సెప్పకపోయినా ఫరవాలేదులే, దాన్నలా వదిలేయ్. మీ అయ్య నాకు పురమాయించినది సెవుతా, ఇనుకో...  రేపు సందలడేటేలకి మంగి మనింటికి వస్తాది..."

"మంగి ఎవరు? ఇక్కడేంపని ఆమెకి?" ఆత్రంగా అడిగింది అనూరాధ,

మూతి గుండ్రంగా తిప్పింది రత్తాలు."అయ్యో! నీకు నిజంగానే తెలవదా ఏంటి? మంగి ఎరకలోళ్ళ మణిసి! మంతరసాని ఎవరింటికైనా ఎందుకు వస్తాది ... మహా అయితే పురుడుపొయ్యడానికి, లేదా - కడుపు తియ్యడానికి వస్తాది. నీ పరువేం పోదులే, అంతా ఆ యమ్మి నాకోసం వచ్చిందనే అనుకుంటారు. ఆ ఏరుపాటు నే జూసుకుంటా. నే నెవరికీ సచ్చినా సెప్పను. నిన్నంతా కన్నె మాలచ్చిమివనే అనుకుంటారులే! కాదన్న సంగతి కట్టుకున్నోడికి కూడా తెలీనీకుండా దాసోచ్చు. అలా దాసి నాకు మా యమ్మ మూడుసార్లు కన్నెరికం సేపించింది. ఒక్కడూ కనుక్కోలేపోయాడు. సమయం వచ్చినప్పుడు ఆ సిటీకా నీకూ సేవితాలే! ఇంకా ఎన్నిసార్లు సేపించేదోగాని, అంతలోనే మా యమ్మ, సిటికెలో జారిపడి గుటుక్కుమంది. అది సరేగాని, రేపు మంగి వచ్చేటేళకి మనం సిద్దoగుండాల. దాని కదేం పెద్ద ఇశేసంగాదు, ఇట్టే అయిపోద్ది. ఎరుకల మంగి గొప్ప పనిమంతురాలు! అది - ఇట్టే వచ్చి, అట్టే సక్కాపోద్ది. సిటికెలో పనైపోద్ది. ఒక్క నాల్రోజులు పత్తెంగుంటే సాను. ఆ తరువాత అంతా మామూలే.

మీ అయ్య మంచి కుశాలుగున్నాడు. నన్నుపిలిసి, “ఒసే రత్తాలూ, అడ్డు తొలగిపోయిందే! ఇంకొక్క సిన్న ఇబ్బంది మాత్తరం మిగిలుంది, అది కూడా తీరిపోతే మనకిక ఏ అడ్డూ ఉండదు. నీవల్నే జరగాలి అది” అంటూ ఎంతో ఇదిగా నాకీ పని అప్పగించాడు. సరే ఆన్నా... అనూరాధమ్మా! ఇప్పుడింక నువ్వు నా మాట నిలబెట్టాల” అంది ఉబలాటంగా.

అనూరాధ ఎప్పటిలాగే తన ఆలోచనలలో తానుండి రత్తాలు మాటలు సరిగా పట్టించుకో లేదు. అది తెలియని రత్తాలు తెగ చెప్పుకు పోతోoది. “నీకు వచ్చే బయమేం లేదు. నేనెన్నిసార్లు సేపిచ్చుకోలేదంట! మంగి మాదొడ్డ మంతరసాని. గొప్పగొప్ప ఇళ్ళలో ఎంతమందికో పరువు నిలపెట్టింది, తెలుసా!"

ఇక ఈ జన్మకి తనూ రత్తాలూ కలిసి ఉండేది ఈ ఒక్కపూటే కదా! రేపటినుండి తానెవరో, ఆమె ఎవరో! ఇంక రత్తాలుకి తోడు ఎవరో మరి! ఈ ఒక్కపూటా ఆమెతో తను  మంచిగా ఉంటే పోయీదేముంది - కేవలం మాటలేకదా, అంతా గెస్ - అనుకుంది అనూరాధ,  “నాకు చాలా భయమౌతోంది రత్తాలూ! చచ్చిపోతాననిపిస్తోంది” అంది భయం నటిస్తూ.

“మరేం బయం లేదు. నీ వెంట నేనుంటాగా! బితుకుపడకు. మనకీ బూమ్మీద తినడానికి నూకలు మిగిలుంటే సాలు, సముద్దరంలోపడ్డా కూడా సావు రాదు. అనూరాదమ్మా! నీప్రాణానికి నాప్రాణం అడ్డేస్తా. బయపడకు, నీకేంగాదు” అంది రత్తాలు.

“అమ్మయ్య! ఇప్పుడు నీ మాటలతో నాకు భయం తగ్గి, ధైర్యం వచ్చింది రత్తాలూ!” అంది అనూరాధ.

“ఐనా, నీకీ సావు కబుర్లెందుకు అనూరాదమ్మా! సక్కగా కోట్లకు పడగెత్తినాయన్ని పెళ్లాడి, బోలెడు భాగ్గెమంతురాలివౌతావు! అప్పుడీ పేదరత్తాలి ఊసు మరిసిపోకేం” అంది రత్నకుమారి. అంతలో శేషగిరి ఇంటికి రావడంతో రత్తాలు అక్కడినుండి వెళ్ళిపోయింది.

“ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తును గురించి. కానీ, “మాన్ ప్రపోజస్ అండ్ గాడ్ డిస్పోజస్ “ అంటారు. చాలావరకూ ఎవరి ఆశలూ తీరవు. నాన్నా! నువ్వు నిర్దాక్షిణ్యoగా నా ఆశల్ని భగ్నం చేశావు. నేను నీ ఆటల్ని ఒక్కనాటికి సాగనివ్వను, చూడు . ఇక నుండి  పులిమీద నువ్వే స్వారీ చేస్తావో లేక - పులి నీమీదే స్వారీ చేస్తుందో మీరూ, మీరూ తేల్చుకుందురుగాని! తెల్లవారనియ్యి నీకు నా థడాకా తెలుస్తుంది” అనుకుంది అనూరాధ ధృఢ నిశ్చయంతో.

రాత్రి చాలా పొద్దుపోయీదాకా శేషగిరి పడకగదిలోనుండి నవ్వుల, సరస సల్లాపాల తాలూకు కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సందడి తగ్గి, అంతా నిశ్శబ్దంగా మారేవరకూ, తనగదిలో ని్ద్రపోతున్నదానిలా డుప్పటి కప్పుకుని పడుకుని ఉండిపోయింది అనూరాధ. తండ్రి, రత్తాలు గాఢనిద్రలో ఉన్నారన్న నమ్మకం కుదిరాక, నెమ్మదిగా ఆమె మంచం దిగింది. కట్టుకున్న చీరమార్చి సెల్వారు, కమీజూ వేసుకుని, బుజము మీడుగా మూడు గజాల వల్లెవారు వేసుకుని, దాన్ని తన నడుముచుట్టూ తిప్పి, రెండు కొసలు కలిపి, మరి పైట చెదరకుండా గట్టిగా ముడివేసింది. తల్లి ఫోటోకి నమస్కరించి నెమ్మదిగా దొడ్డితలుపు తెరుచుకుని బయటికి వచ్చింది.

వీధి తలుపుకి అలంకారంగా కట్టిన మువ్వలున్నాయి. వీధితలుపు తెరవగానే అవి కదిలి చప్పుడు చేస్తాయి - అందుకని ఆమె దొడ్డిదారిని ఎంచుకుంది.

అనూరాధ కాలు బయట పెట్టగానే, రాత్రులు ఇంటిని కాపలా కాసే కుక్క పరుగున వచ్చింది. మొరగబోయి మనిషిని గుర్తుపట్టి, మొరగడానికని తెరిచిన నోరు చటుక్కున మూసేసుకుని, అనూరాధ మొహంలోకి చూస్తూ, నిశ్శబ్దంగా తోకాడిస్తూ నిలబడింది.

అమావాస్య దగ్గరకు వచ్చిందేమో గాఢాంధకారం అలమి ఉంది అంతటా. అర్ధరాత్రి కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడా, ఇక్కడా తిరిగీ, తాగీ ఒళ్ళుతెలియని స్థితిలో తూలుతూ నడుస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ఒకరొకరు ఎదురుపడుతున్నారు అనూరాధకు. ఎవరికీ కనిపించకూడదని క్రీనీడల్లో నడుస్తూ ఊరికి దగ్గరలోనే ఉన్న పడవలకాలువ వైపుగా నడవసాగింది ఆమె. కుక్క తోడుగా వెంట నడిచింది.

ఆ ఊరిమీదుగా వెళ్ళే పడవలకాలువ, రెండు రహదారీ పడవలు ఒకదానినొకటి యధేఛ్ఛగా తప్పించుకుని తిరిగేటంట విశాలంగా ఉంటుంది. ఆ కాలవ, సస్యశ్యామలమైన ఆ ప్రదేశంలోని పంటపొలాలకు నీరందించడమే కాకుండా, అక్కడ పండిన పంటలను దూరప్రాంతాలకు పడవలపై తరలించే రహదారీగా కూడా ఉపయోగిస్తుంది. నీరు వృధాగా గోదావరిలో కలిసిపోనీకుండా కాలువపై లాకులు ఉన్నాయి. అంతేకాదు, కాలువకు అటూ - ఇటూ నివసించే జనుల సౌకర్యంకోసం ఆ కాలువ మీదుగా అక్కడక్కడా వంతెనలు కట్టబడి ఉన్నాయి. అలాంటి ఒక ఒంతెనవైపుగా నడవసాగింది అనూరాధ.

చుట్టూ ఉన్నవి పొలాలు కావడంతో ఎక్కడా మనిషి అలికిడిలేదు. దగ్గరలో తీతువు ఒకటి, పొలాలమీదుగా ఎగురుతూ హృదయవిదారకంగా కూస్తోంది. వంతెనను చేరిన అనూరాధ నెమ్మదిగా మెట్లెక్కి, వంతెన మధ్యకుచేరి, కమ్మీని ఆనుకుని నిలబడి చేతులు రెండూ జోడించింది. అంతవరకూ ఆమె ననుసరించి వచ్చిన కుక్క, కీడును శంకించిన దానిలా మోరపైకెత్తి దీనంగా ఏడవసాగింది.

అనూరాధ దాని మెడచుట్టూ రెండుచేతులూ చుట్టి, దానిని దువ్వుతూ, "నీ కున్నపాటి దయ కూడా నా మీద ఎవరికీ లేదన్నది నిజం. కానీ, నీ మాట విననందుకు నువ్వు నన్ను క్షమించక తప్పదు. నా సంగతి నువ్వు అర్ధం చేసుకుంటే నువ్వు నన్నిలా వారించవు. టామీ! పోక తప్పదు, నువ్వింక నాకు సెలవియ్యి" అంటూ దానికి వీడ్కోలు చెప్పిoది. ఆపై కాలువలోని నీటి నుద్దేశించి, “తల్లీ, గంగా భవానీ! నేను ఏ ఆడపిల్లా చెయ్యకూడని తప్పుచేశాను. నన్ను మన్నించి, నన్నూ, నా బిడ్డనూ కూడా నీలో కలుపుకో! నా మూలంగా శ్రీనివాసు బలైపోయాడు, నావంటి నిర్భాగ్యురాలు ఎక్కడా ఉండబోదు. మన్నించి, దయతో నన్ను నీ అక్కున చేర్చుకుని స్వర్గంలో ఉన్న నా శ్రీనివాసు దగ్గరకు నన్ను చేర్చు“ అంటూ చేతులు జోడించి ప్రార్ధించి మరుక్షణంలో ఆ కాలువలో దూకేసింది అనూరాధ.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ