Kummi

ధారావాహిక నవల


తల దించుకొని, కళ్ళు మూసుకొని, కొద్దిసేపు మౌనంగా నిల్చుని, తదుపరి అక్కడ నుండి బయటకు వచ్చింది ఆమె, అతి నమ్రతతో.

ఆమె, కుమ్మీ ... 20 యేళ్ల యువతి. అందమైంది. డిగ్రీ చదివింది. ఒక ప్రయివేట్ కాన్వెంట్లో టీచర్ గా జాబ్ చేస్తోంది.

నడుస్తున్న కుమ్మీ తల తిప్పింది, తనను ఎవరో పిలిచినట్టు కావడంతో.

అటు చూసింది.

బిట్టు కనిపించాడు.

కుమ్మీని చూస్తూ చిన్నగా నవ్వుతున్నాడు బిట్టు.

కుమ్మీ అటు కదిలి, బిట్టు ముందుకు వెళ్లింది.

"నీ కోసమే వేచి ఉన్నాను" చెప్పాడు బిట్టు తపనగా.

"తెలుస్తోంది" అంది కుమ్మీ ముభావంగా.

"సెలవులు రేపటితో ముగుస్తాయి. వెళ్లాలి. నువ్వు ఏం ఆలోచించావు" అడిగాడు బిట్టు.

"చెప్పాగా. నేను రాను" అని చెప్పింది కుమ్మీ టక్కున.

"అదే వద్దంటున్నాను. మనం ప్రేమించుకున్నాం. మన పెద్దలు మన పెళ్లికి కాదంటున్నారు. సో, మనం మన ఆశయాన్ని చేపట్టాలిగా" అన్నాడు బిట్టు.

"అది రూలా ఏం. వద్దు. పెద్దలు కాదన్నది మనం చేపట్టొద్దు" చెప్పేసింది కుమ్మీ.

"ఐనా మనం ఆ పెద్దల్ని అడిగే ప్రేమించుకున్నామా" టక్కున అనేశాడు బిట్టు.

"అయ్యో. నిజమే అది చెయ్యవలసింది. అలా ఐతే, ఈ గందరగోళం మనకు ఉండేది కాదు ఇప్పుడు" అంది కుమ్మీ నొచ్చుకుంటున్నట్టు.

"సరే, అప్పుడు అది అలా ఐపోయింది. ఇప్పుడు కూడా ఆ పెద్దల్ని పట్టించుకోవడం మానుకుందాం" అన్నాడు బిట్టు.

"నేను మళ్లీ తప్పు చేయను" చెప్పింది కుమ్మీ.

"అరె తప్పు ఏమిటి. నాకు అర్థం కావడం లేదు" అన్నాడు బిట్టు అసహనంగా.

"తప్పు అంటే, మనం ప్రేమించుకుంటున్నా పెద్దలుతోనే ఉన్నాం. మనం పెళ్లితో వారికి దూరం కావడం నాకు నచ్చడం లేదని" చెప్పింది కుమ్మీ నెమ్మదిగా.

"వాళ్లా ఒప్పుకోరు, నువ్వా నచ్చవు. నేనా పెళ్లితో స్వేచ్ఛగా ఉందామంటున్నాను. అయ్యో ఎలా?" అన్నాడు బిట్టు చిరుకోపంతో.

కుమ్మీ మాట్లాడలేదు.

"నాకు జాబ్ వచ్చే వరకు ఆగాను. అది వచ్చింది. ధీమా ఏర్పడింది. మనం హాయిగా ఇక ఉండొచ్చు అనుకుంటున్నాను. పెద్దలు, నువ్వు కానివ్వకుంటున్నారు" చెప్పాడు బిట్టు.

"మనం ఎంతగానో ప్రయత్నించాం. మన పెద్దలు మరి మన పెళ్లికి ఒప్పుకోరు. బిట్టూ, కష్టమైనా మనం ఎవరికి వారమైపోదాం. ఇది అందరికీ మంచిది" అంది కుమ్మీ.

"ఓ టీచరమ్మా, నీ పాఠాలు నాకు వద్దు. నేను నీ స్టూడెంట్‌ని కాను, నీ ప్రేమికుడ్ని" అన్నాడు బిట్టు విసురుగా.

తమ చుట్టు పక్కన కదులుతున్నవారు తమనే చూస్తున్నారని గ్రహిస్తున్న కుమ్మీ, మరి తన సంభాషణ కొనసాగించ రాదని తలచి, "బిట్టూ, ఇక చాలు. మరి ఆ విషయమైతే మాట్లాడవద్దు. పెధ్దల్ని వదిలి, నీతో ఖచ్చితంగా నేను రాను" అని చెప్పేసింది కుమ్మీ.

బిట్టు అదిరాడు.

కుమ్మీ కదిలింది.

"అంతేనా" అన్నాడు బిట్టు.

"ముమ్మాటికి" అనేసింది కుమ్మీ.
ఆ తర్వాత, ఆ ఇద్దరూ, ఎవరు ఇంటికి వారు వెళ్లిపోయారు.

*** *** *** ***

మర్నాడు -

నిద్ర లేచి, హాలు లోకి వచ్చిన కుమ్మీతో, ఆమె అమ్మ చెప్పింది, "బిట్టు రాత్రి ఉరితో చని పోయాడట" అని.

పక్కన పిడుగు పడ్డట్టైంది కుమ్మీకి.

చాలాసేపు అచ్చట అస్తవ్యస్తంగా తచ్చాడింది.

అప్పటికే అక్కడకు చేరిన కుమ్మీ నాన్న, అన్నయ్య మంతనాలు మొదలు పెట్టారు.

"వద్దు మనం అటు వెళ్ల వద్దు. వాళ్లు తప్పక మన మీద ఆవేశంతో ఉంటారు" అంటున్నాడు కుమ్మీ నాన్న.

"ముందు వాళ్లు మన ఇంటి మీదకు రాకుంటా చూసుకోవాలి. కుమ్మీని ఎటైనా పంపించేద్దామా" అన్నాడు కుమ్మీ అన్నయ్య.

కుమ్మీ అమ్మ ఏమీ మాట్లాడలేక పోతోంది.

"ముందు మన వాళ్లను పోగు చేసుకుందాం. వెళ్లి, చిన్నాన్నను పిలుచుకు రా" చెప్పాడు కుమ్మీ నాన్న.

కుమ్మీ ఇంకా అచేతనంలోనే ఉంది.

కుమ్మీ అన్నయ్య వెళ్లి, తన చిన్నాన్నతో పాటు తమ మనుషులైన మరి కొందరిని వెంటేసుకొని వచ్చాడు.
అంతా తర్జనభర్జన అవుతున్నారు.

అనుకున్నట్టే, బిట్టు మనుషులు అక్కడకు వచ్చేశారు.

గోల మొదలైంది.

"మా అమ్మాయి తప్పేమిటి" నిలదీస్తున్నాడు కుమ్మీ నాన్న.

"నీ కూతురు ప్రేమ ప్రేమ అని వెంట పడింది. వాడిని ఇలా నాశనం చేసింది" బిట్టు మామయ్య అరుస్తున్నాడు.

"చాల్లెండి. మీ అబ్బాయి తప్పు లేదనట్టు మాట్లాడకండి" అన్నాడు కుమ్మీ అన్నయ్య.

మాటలు తార స్థాయికి ఎగబ్రాకుతున్నాయి.

చుట్టు పక్కల జనం పోగవుతున్నారు.

రభస ముదిరి పోతోంది.

ఒకరిని ఒకరు కొట్టుకుంటారేమో అన్న పరిస్థితి అక్కడ కానవస్తోంది.

అంతలోనే, కుమ్మీ గమ్మున లేచింది. అరిచినట్టు, "ఆగండి" అని అంది.

అంతా తగ్గారు ఒక్క మారుగా.

"మీ పట్టింపులు, మీ పద్ధతులు వలన బిట్టును, నన్ను వంచించారు. చివరకు బిట్టు మీ మూలంగానే చనిపోయాడు. బిట్టును మీరే చంపేశారు, మీ పెద్దలందరూ కలిసి చంపేశారు, చంపేశారు" అంటూ భోరున ఏడుస్తోంది కుమ్మీ. ఆ పై పిచ్చి పట్టినట్టు తనను తాను హింసించుకుంటుంది.

కుమ్మీ అమ్మ, అప్పటికే అక్కడ మూగి ఉన్న మరి కొంత మంది ఆడవారు ఆమెను పట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

మిగతా అంతా గొణుక్కుంటున్నట్టు ఏవేవో మాట్లాడుతున్నారు.

అక్కడకు చేరిన చుట్టు పక్కల వాళ్లు సలహాలులా, సూచనలులా మంతనాలు జరిపి, ఆ రెండు కుటుంబాల వారిని అప్పటికి చెల్లా చెదురు చేయగలిగారు.

అయినప్పటికీ, ఆ తర్వాత, ఆ ఇరు కుటుంబాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. కానీ, ఆ ఊరు పెద్దలు, ఆ కుటుంబాల పెద్దలు కలుగ చేసుకొని, వారిని చాలా మేరకు తగ్గించారు, దూరం చేయగలిగారు. ఆ తర్వాత, వాళ్ల నడుమ ఎడ ముఖాలు, పెడ ముఖాలుతో పాటు, సంయమనం మాత్రం క్రమేపీ నిలిచింది.

ఆ పై, నెల తిరిగే సరికి, కుమ్మీ ఆరోగ్య పరంగా, మానసిక పరంగా కాస్తా కుదుట పడింది.

*** *** *** ***

తిరిగి తన మిలటరీ డ్యూటీకి పోవడానికి సిద్ధమైన కుమ్మీ అన్నయ్య, కుమ్మీ చెంతకు చేరి, "తల్లీ, జరిగింది ఏదో జరిగింది. ఇది ఊరు. ఏమీ కాదు. ఐనా నీ జాగ్రత్త నువ్వు చూసుకో. అమ్మ, నాన్న జాగ్రత్త. మరో ఆరు నెలల్లో వస్తాను, నా పెళ్లికై. ఈ లోగా అమ్మ, నాన్న నీకూ సంబంధం చూస్తారు. పెళ్లి చేసుకో. హాయిగా ఉండు. అందర్నీ ఆనందపరుచు" అని చెప్పాడు.

కుమ్మీ వెంటనే, "లేదన్నా. నేను పెళ్లికై ఆలోచించడం లేదు. కానీ మిగతా అన్నింటికీ నేను సహకరిస్తాను." అని చెప్పేసింది.

"అందేమిటి తల్లీ. నేను పెళ్లి చేసుకుంటాను. నాకో కుటుంబం ఏర్పడుతోంది. అమ్మ, నాన్న ఎన్నాళ్లని వ్యవసాయ కూలీలుగా సాగగలరు. వాళ్లకు భారం తగ్గించాలి. మనం ఇంకా వాళ్లకు భారం కాకూడదు. నీకూ ఒక కుటుంబం ఉండాలి" చెప్పాడు కుమ్మీ అన్నయ్య అనునయంగా.

"నాకంటూ వేరే కుటుంబం వద్దు. మీరే నా కుటుంబం. మొదట్లో నేను టీచర్‌గా ఆ కాన్వెంట్లో పని చేశాను. ఈ మధ్యన నేను పోకనే, నన్ను వారు తీసేశారు. నేను ఇప్పుడు తిరిగి వెళ్తాను. ఆ ఉద్యోగం చేస్తాను. ఆ సంపాదన సర్దుతాను" అంది కుమ్మీ.

కుమ్మీ అన్నయ్య ఏదో చెప్పబోతుండగా, కుమ్మీ నాన్న, "ఓరె నాన్నా, ప్రస్తుతానికి దానిని వదిలేయ్. కాలం గడవని. అన్నీ సర్దుకుంటాయి" అన్నాడు.

కుమ్మీ అమ్మదీ అదే అభిప్రాయమైంది.

*** *** *** ***

ఏడు నెలలు తర్వాత -

ఆ గడిచిన కాలంలో, కుమ్మీ అన్నయ్యకు పెళ్లయ్యిపోయింది, పెళ్లి కూతురు ఊర్లో. తన పెళ్లాన్ని తీసుకొని, అతడు, అటు నుండి అటే డ్యూటీ అంటూ వెళ్లి పోయాడు.

కుమ్మీ, తను గతంలో పని చేసిన తన ఊరు లోని క్వానెంట్లో ఉద్యోగానికి ప్రయత్నించింది. కానీ ఖాళీ లేక, వారు జాబ్ ఇవ్వలేక పోయారు. దాంతో కుమ్మీ, దగ్గర లోని పట్నంలో, ఓ కాన్వెంట్లో జాబ్ సంపాదించుకుంది. రోజూ తిరగ లేక, తను ఆ పట్నంలోనే ఒక రూం తీసుకొని ఉంటుంది, ఒక తోటి ఉద్యోగినితో కలిసి.

కుమ్మీ తల్లిదండ్రులు తమ ఊర్లోనే ఉంటూ, ఎప్పటి లాగే తమ పనులు తాము చేసుకుంటున్నారు. తమ పిల్లలు ఇద్దరూ, అవకాశం మేరకు, తమ సాయం వారికి అందిస్తున్నారు.

*** *** *** ***

ఉదయం, స్కూలుకు వెళ్తున్న కుమ్మీ, దార్లో అతన్ని చూసి చలించింది.

మరో సారి, ఈ మారు, నిటారుగా తలను నిలిపి, మరీ అతన్ని చూసింది.

అతను ఆ టీ షాపు వద్ద, పక్కగా నిల్చుని టీ తాగుతున్నాడు.

ఆగి మళ్లీ, మళ్లీ చూసింది అతన్ని కుమ్మీ.

మెల్లిగా తేరుకుంటూ, కదిలి, అతని ముందుకు వెళ్లింది.

అతను అప్పుడే కుమ్మీని చూశాడు.

"మీరు, మీరు" అంది కుమ్మీ తడబాటులా.

"నేను శేఖర్. మీరు" అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ సంశయంగా.

"మీది ఏ ఊరు" అని అడిగింది కుమ్మీ.

శేఖర్ చెప్పాడు. టీ గ్లాస్‌ను పక్కన పెట్టి, దాని డబ్బులు ఆ షాపువాడికి చెల్లించి, కుమ్మీ వైపు తిరిగి, "మీరు ఎవరో నాకు గుర్తు రావడం లేదు. నేను మీకు తెలుసా?" అని అడిగాడు.

"నేను మా ఊరు వారు అనుకున్నాను" అని చెప్పింది కుమ్మీ గజిబిజిగా.

"అవునా. ఏదో పొరపాటా. సరే వస్తానండి" అంటూ శేఖర్ కదలబోయాడు.

"అన్నట్టు మా ఊరులో మీకు బంధువులు ఉన్నారా" అని అడిగేసింది కుమ్మీ.

"ఇంతకీ మీ ఊరు ఏది" అన్నాడు శేఖర్ నవ్వేస్తూ.

కుమ్మీ చెప్పింది.

"అవునా. నాకు ఆ ఊరు తెలియదు. ఆ ఊరులో బంధువులు, మిత్రులు నాకు లేరు" అని చెప్పాడు శేఖర్.
ఆ వెంటనే, "ఇంతకీ మీ సందేహం ఏమిటి" అని కూడా అడిగాడు.

అక్కడ కష్టమర్స్ చేరుతుండడంతో, కుమ్మీ కదిలి, "చెప్తాను. మనం నడుస్తూ మాట్లాడుకుందామా" అని అడిగింది.

శేఖర్ సరే నని, కుమ్మీతో కలిసి కదిలాడు.

ఇద్దరూ పక్క పక్కగా, నెమ్మదిగా నడుస్తున్నారు.

కుమ్మీ తన హేండ్ పర్సులోని బిట్టు ఫోటోను శేఖర్‌కు చూపించింది.

బిట్టు ఫోటోను చూస్తూనే నడక ఆపేశాడు శేఖర్.

"ఇతను ఇతను, నా ఫోటో మీ దగ్గర ఏమిటి" అని అన్నాడు, అనాలోచనగా.

"ఆ ఫోటో నా బిట్టుది. నా బిట్టులానే మీరు ఉన్నారు కదా. ఏమిటిది. ఇదే నా సందేహం" అంది కుమ్మీ.

ఇద్దరూ నడక ఆపేశారు. ఒక పక్కకు జరిగారు. ఎదురెదురుగా నిల్చున్నారు.

"చిత్రంగా ఉంది. ఒకే పోలికలు వారు ఉండొచ్చు అంటారు. కానీ, ఇంత నిర్ధిష్టమైన పోలికలా. వండర్" అని అంటూనే, "మీ బిట్టు, మీ బిట్టు వాళ్లు నాకు తెలియదు. మీ ఊరే నాకు తెలియదు. నా పుట్టుక, పెరుగుదల, చదువు అంతా మా ఊరి లోనే. ఈ మధ్యనే ఉద్యోగ రీత్యా ఈ ఊరు వచ్చాను. అంతే" చెప్పాడు శేఖర్.

ఇంకా అతను తేరుకోలేదు.

"నిజమే కావచ్చు, మీరు చెప్పుతోంది. నా బిట్టు చనిపోయాడు. మీరు ఇప్పుడు ఇలా తారస పడే సరికి నాకే ఏమీ పాలుపోవడం లేదు" అని చెప్పింది కుమ్మీ.

"మీ బిట్టు చనిపోయాడా" అని అడిగాడు శేఖర్ గబుక్కున.

కుమ్మీ తన గతంలో, జరిగిన దాంట్లో, బిట్టుదే, క్లుప్తంగా చెప్పింది.

"అరె. అవునా. అలా జరిగిందా" అన్నాడు శేఖర్ విస్మయంగా.

కుమ్మీ ఏమీ అనలేదు. తల వంచుకొని ఉండిపోయింది.

"ఛఛ. పెద్దలు కాస్తా యోచించ వలసింది. ఇప్పటి జనరేషన్ వ్యూస్ ని ఇంకా చాలా మంది స్వాగతించలేక పోతున్నారు" చెప్పాడు శేఖర్ నొచ్చుకుంటున్నట్టు.

అప్పటికీ కుమ్మీ మాట్లాడలేదు.

"నాకు ఆఫీస్‌కు టైం అవుతోంది. నేను వెళ్తాను." అని అన్నాడు శేఖర్.

కుమ్మీ చెప్పింది, "నాకూ టైం అవుతోంది. నేను ఆ స్కూలులోనే పని చేస్తున్నాను టీచర్‌గా" అని.

"అవునా. మీ స్కూలు వెనుకన ఉన్న ఆ ఆఫీసే నాది." అని చెప్పాడు శేఖర్.

వాళ్లు అక్కడ నుండి కదిలారు.

"గమ్మత్తైన పరిచయం మనది" అన్నాడు శేఖర్.

"నేను ఇంకా నమ్మలేకపోతున్నాను" అని చెప్పింది కుమ్మీ.

తర్వాత ఇద్దరూ కుమ్మీ స్కూలు దగ్గర విడిపోతూ, ఇకపై 'తాము నిరభ్యంతరంగా వీలును బట్టి కలుసుకుంటూ ఉందాం' అని కూడా అనుకున్నారు సామాన్యంగానే.

*** *** *** ***

ఆ తర్వాత, వారం రోజులు గడిచాయి.

అంత వరకు తటపటాయిస్తున్న కుమ్మీ, పర్వాలేదనుకొని, శేఖర్ని కలిసింది, తన స్కూల్ కాగానే అతని ఆఫీస్‌కు వెళ్లి.

శేఖర్ మంచిగా ఆమె రాకను రిసీవ్ చేసుకున్నాడు.

తన సీటు నుండి వచ్చి, కుమ్మీని తన ఆఫీస్‌కు పక్కనే ఉన్న చెట్ల కిందకు తీసుకు వెళ్లాడు.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ