రంగుల ప్రపంచం
- వారణాసి భానుమూర్తి రావు

 


స్కోడా కార్‌లో హైటెక్‌ సిటీకి వెడుతున్నాను ఏదో పని మీద.

వెనుక సీట్లో శ్రీమతి మా చిన్ని గాడితో కూర్చోనుంది.

చిన్ని గాడి ఏడుపు.

ఏమయింది? మాటి మాటికీ ఏడుస్తున్నాడు? కొంచెం అసహనంగా అన్నాను.

మే నెల ఎండలు కాగి పోతున్నాయి. కార్‌ లో గూడా ఏసి ఎఫెక్ట్‌ బాగా ఉంటే గూడా ఉమ్మదంగా ఉంది.

''డైపర్‌ మార్చాలండి..కొంచెం పక్కకి కార్‌ ఆపుతారా?''

''అన్ని ఇంటిలోనే చూసుకొని రావాలి గదా శశి .... ఏమిటిది?''

జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర రెడ్‌ సిగ్నల్లో అపాను ...బంజారా హిల్స్‌ నుండి వస్తున్నాను.

Rangula Prapanchamఅంతలో ఒక ముసలావిడ కొన్ని వస్తువులు అమ్మ జూపుతోంది. అవి కార్‌ షేడ్‌  షీల్డ్స్‌ .. ఎండ ఆపడానికి పనికొస్తాయి.

దీనంగా ఆమె అడుగుతోంది. ఆమె కళ్ళల్లో దైన్యం, ముఖంలో నీరసం. ఆమె చేతిలో ఆరేడు నెలల పసికందు. ఎండకో, ఆకలికో గుక్క పెట్టి ఏడుస్తోంది.

శ్రీమతి డైపర్‌ మార్చడంలో బిజీ గా ఉంది.

''శశి ..కొందామా ..పాపం ఆమెకు హెల్ప్‌ చేసినట్లు ఉంటుంది'' అడిగాను నేను.

శ్రీమతి ఎగిరి గంతేసింది.

''ఛీ పాడు.. వాళ్ళ చేతుల్లో బాక్టీరియా. చూడండి ఆమె ఎలా ఉందో. లక్షణంగా షాపులో కొనవచ్చు గదా''

''ఎంతమ్మా?'' అడిగాను నేను.

''రెండు వందలు బిడ్డా  ..ఎంతిస్తారు చెప్పండి?''

ఆమె ముఖం విప్పారింది ..నేను కొంటానేమో అని.

''నూట యాభై ఇవ్వండి సారూ...'' అంది

శ్రీమతి విండో గ్లాస్‌ ఓపెన్‌ చేసినందుకు తిట్ల వర్షం కురిపిస్తోంది.

''డర్టీ భిక్ష గాళ్ళ దగ్గర కొంటారేమండి...'' అంది కోపంగా.

గ్రీన్‌ సిగ్నల్‌ పడింది.

''అమ్మా ... వద్దు లే!'' అన్నాను.. ''సారూ నా బిడ్డ పాలు తాగి రెండు రోజులయ్యింది. నీళ్ల మీదే బతుకుతున్నాడు.'' అని ఆమె రెండు చేతుల్తో నమస్కరించి ఏడుస్తోంది.

నా కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. జోబీలో ఉన్న రెండు వందలు తీసి ఆమెకు ఇచ్చాను.

''సారూ...'' అని ఒక కొత్త పాక్‌ తీసి ఆమె నాకు ఇవ్వబోయింది.

''నాకు అవి వద్దమ్మా .. ఈ రెండు వందలు పెట్టి పిల్ల వాడికి పాలు, బిస్కట్లు కొని ఇవ్వు'' అని కార్‌ హైటెక్‌ సిటీ వైపు పోనిచ్చాను.

''మీరు ఇంత పెద్ద జాబ్‌ చేస్తూ రోడ్ల మీద ఏమిటండీ ఆ కొనుడు? మీకసలు బుద్ది వున్నదా? వాళ్ళ దగ్గర నుండి ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి రోగాలు వస్తాయి'' అంది గట్టిగా అరుస్తూ.

''అనవసరంగా రెండు వందలు వేస్ట్‌ చేశారు. ఇలాంటి బిక్షగాళ్లు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. ఇలా  డబ్బులు పంచుకొంటూ పొతే మన ఆస్తులు అమ్ముకోవాల!'' అంది కాస్త ఉక్రోషంగా.

%%%%%%

కార్‌ హోటల్‌ వెస్ట్‌ఇన్‌ ముందర నిలిపాను.

మా ఫ్రెండ్స్‌ డాటర్‌ బర్త్‌ డే పార్టీ.

''గిఫ్ట్‌ కొనడం మరచి పోయాం..ఇప్పుడేం చేద్దాం ఎటిఎం పక్కనే ఉంది... పది వేల రూపాయలు డ్రా చెయ్యండి. గిఫ్ట్‌ కవర్లో పెట్టి ఇస్తాం'' అంది శ్రీమతి.

''ఏమిటి .. పది వేలా''

''వాళ్లు మన చంటిగాడి బర్త్‌ డేకి ఇరవై వేలిస్తారు లెండి. మన డబ్బులు ఎక్కడికీ పోవు'' అంది శ్రీమతి.

''అక్కడ కార్‌ సన్‌ షేడ్స్‌ కొనడానికి రెండు వందలు వద్దన్నావు. ఇప్పుడు పది వేలు పెట్టడానికి గూడా రెడీగా
ఉన్నావు''

శశి ఏమీ మాట్లాడలేదు. కారు దిగి పోయింది. బర్త్‌డే పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది.

''ఐదు లక్షలు ఖర్చు పెట్టాడట ఆనంద రావు వాళ్ళ అమ్మాయి బర్త్‌ డే పార్టీకి'' అంది శ్రీమతి నా చెవిలో గుసగుసలు పెడుతూ.

ఆశ్చర్యపోయాను. బర్త్‌డే పార్టీకి ఐదు లక్షలు పెట్టే ధనవంతులున్న ఈ దేశంలో పుట్టిన పిల్లలకి పాలు కొనలేని స్థితిలో ఉన్న ఆగర్భదరిద్రులూ ఉన్నారు. ఈ దేశంలో సమన్యాయం ఎప్పుడు జరుగుతుంది? నాకా రాత్రి నిద్ర పట్టలేదు. మాటి మాటికీ అడుక్కొన్న ఆమె గుర్తుకు వస్తోంది.

%%%%%%

''శశి ...ఈ రోజు మనము కర్నూలు వెళ్ళాలి. అర్జంటుగా ఆఫీసు పని మీద వెళ్ళాలి'' అన్నాను రెండు రోజుల తర్వాత.

''అలాగే మంత్రాలయం వెళ్లి వస్తామా?'' అంది శ్రీమతి.

''ఏమో చూద్దాం'' అన్నాను నేను. బ్యాగేజి అంతా సర్దుకొని డిక్కీలో పడేశాను. చంటి గాడికి కావల్సిన వన్నీ శ్రీమతి సర్దుకొని వెనుక సీట్లో పెట్టింది.

కారు రెండు గంటల్లో ఔటర్‌ రింగ్‌రోడ్ మీదుగా జడ్చర్ల చేరింది. టైం పదకొండు గంటలు దాటింది. మిట్ట  మధ్యాహ్నం ఎండలు మాడి పోతున్నాయి. రోడ్ల మీద మనుష్య సంచారమే లేదు. నలభై ఐదు సెంటి గ్రేడ్‌ దాటిందేమో! అన్నాను నేను.

''ఈ దరిద్రపు ఎండల్లో ఏమిటండి ఈ పాడు ప్రయాణం?'' అంది విసుగ్గా శ్రీమతి.

అవును నాకు గూడా అలానే అన్పిస్తోంది. కానీ ఏమి చెయ్యలేను. రాత్రి ఎండి గారు ఫోన్‌ చేసి కర్నూల్‌ లో డీలర్స్‌ కాన్ఫ్‌రెన్స్‌ అటెండ్‌ కమ్మన్నాడు. కారు జడ్చర్ల దాటి అరవై కిలోమీటర్లు ముందుకు ఉరికింది. రోడ్లు మాడి పోతున్నాయి. కారు టైర్లు కరిగి పోతాయేమో అన్న భయం వేసింది నాకు. అనుకొన్నట్లు గానే కారు టైర్‌ తుస్‌ అని ఒక్క పెద్ద శబ్దంతో పంచర్‌ అయిపొయింది.

స్టీరింగ్‌ బాలన్స్‌ తప్పి కారు అటు ఇటు కదిలింది పాము లాగా. శ్రీమతి కెవ్వుమని అరచి ఏడుస్తోంది. పిల్లాడు  గూడా భయపడి ఏడ్పు ఎత్తుకొన్నాడు. మెల్లగా స్టీరింగ్‌ కంట్రోల్‌ చేసి ఒక చెట్టు క్రింద ఆపాను.

''మీరు టైర్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసు కోవాలి గదా... స్టెప్ని ఉందా? మార్చడం వచ్చా?'' ప్రశ్నలు గాభరాతో వేసింది శశి.

కారు డోర్‌ వెనుక తెరచి చూసాను. ''ఓహ్ మై గాడ్‌ స్టెప్నిలేదు''

భయంతో కాళ్ళలో వణుకు పుట్టింది నాకు. ''మళ్ళీ జడ్చెర్లకి వెళ్లి ఈ కార్‌ టైర్‌ తీసుకెళ్ళి పంచర్‌ వేసుకొని మెకానిక్‌తో రావాలి. కనీసం ఇంకా మూడు గంటలయినా పడుతుంది.'' అన్నాను నేను.

శ్రీమతి ముఖంలో భయం .. ఏడ్పు..

బయటికి వచ్చి చెట్టు క్రింద పిల్లాడితో నిలబడింది. మొబైల్‌ తీసుకొని ఎండి గారికి ఉన్న విషయం చెప్పాను. ఆయన ఏమైనా అంటాడేమో అని భయం వేసింది నాకు. సరే కర్నూల్‌లో ఉన్న జోనల్‌ మేనేజర్‌ను అటెండ్‌ కమ్మని చెప్పారు ఎండి గారు. బ్రతుకు జీవుడా అని జోనల్‌ మేనేజర్‌కి ఫోన్‌ చేసాను.

''నీళ్లు లేవు. పాలు లేవు త్రాగడానికి ... ఇప్పుడెలా. కర్నూలులో అన్నీ దొరుకుతాయన్నారు.. ఎక్కువ పెట్టుక రాలేదు నేను'' అంది శ్రీమతి గాబరాగా.

అంతలో అక్కడున్న గుడిసెలోంచి ఒక ఆసామి వచ్చాడు. అతను అరవై సంవత్సరాల దాటిన ముసలాయన. చినిగి పోయిన బనీను, లుంగీ, తలపాగాతో వున్నాడు.

''ఏమి సారూ .. ఏమయ్యింది'' అడిగాడు అతను.

కథంతా చెప్పాను.

''తమరికి ఫికర్‌ అక్కర లేదు.. నా మనమడు ఉన్నాడు. ఆడు అంతా సూసు కొంటాడు. పరేషాన్‌ వద్దు. రండి నా గుడిసెలోకి'' అన్నాడు ఆ తాత. గుడిసెలోకి వెళ్ళగానే పాచిపోయిన అన్నం వాసన వస్తోంది.

''నీళ్లు త్రాగండి'' అని ఒక ముంతలో నీరు నింపి ఇచ్చాడు. నేను గడ గడ మని నీళ్లు త్రాగేశాను. శ్రీమతి తాగలేక పోయింది. అయినా తప్పలేదు. ఆ నీళ్ళే తాగింది. అక్కడున్న మేక దగ్గరికి వెళ్ళి మేక పాలు అప్పుడు పిండి, పిల్లాడికి తాపమని చెప్పాడు ఆ పెద్దాయన. అలాగే ఇష్టం లేక పోయినా తప్పదన్నట్లు చేసింది తాను.

ఎప్పుడు చేసినవో గాని ఆరేడు జొన్న రొట్టెలు, గొడ్డు కారం మా ముందు ఉంచాడు. ఆకలి అవుతోంది గదా నేను మా శ్రీమతి అవి మొత్తం లాగించేశాము. అప్పుడు నా శ్రీమతికి బాక్టీరియా, అపరిశుభ్రత, ఇన్‌ఫెక్షన్స్‌  గుర్తుకు రాలేదు.

''మీరు కాస్త ఈ నులక మంచం మీద పడుకోండి దొరా.. మా మనమడు ఈ పని సక్కబెట్టుకొని వస్తాడు''  అన్నాడు ఆ పెద్దాయన. వాళ్ళ మనమడు మోటార్‌ బైక్‌లో వచ్చాడు. నా కార్‌ వీల్‌ తీసుకొని జడ్చెర్లకి వెళ్లి రెండు గంటల్లో రిపేర్‌ చేసుకొని వచ్చి టైర్‌ వేసి అతనే బిగించాడు.

''ఇక మీరు ఆరాంగా ఎల్లండి'' అన్నాడు పెద్దాయన.

పెద్దాయన చేతిలో ఐదు వందలు పెట్టబొయ్యాను. పెద్దాయన గాని, మనమడు గాని ఒక్క పైసా గూడా ముట్టలేదు. బ్రతుకు జీవుడా అంటూ కారు మళ్ళీ వెనక్కి తిప్పి హైదరాబాద్‌ వైపు మళ్లించాను. ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది.

%%%%%%

రెండు రోజుల తరువాత...

శ్రీమతి ఆ సంఘటన తరువాత చాలా ముభావంగా ఉంది. ఏమి మాట్లాడం లేదు. ఏదో ఆలోచిస్తూ చాలా భాధగా ఉంది. ఆ రోజు సాయంకాలం మళ్ళీ మేము జూబిలీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర ఆగాం.

మళ్ళీ ఆమె  ప్రత్యక్షమైయింది.

''కార్‌ షేడ్స్‌ .. బిడ్డా కొనుండ్రి'' అనింది.

ఆమె చేతిలో పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. శ్రీమతి కారు డోరు తెరిచి తన చేతిలో ఉన్న ఒక్క పాకెట్‌ ఇచ్చింది.

''మా బాబు బట్టలు ఉన్నాయి.. ఇంకో పాకెట్లో నా చీరలు ఉన్నాయి.. తీసుకో అమ్మ..'' అని ఆమె చేతిలో వంద రూపాయలు పెట్టింది నా శ్రీమతి. మరుసటి రోజు రెండు గిన్నెలు నిండా పులిహోర, పెరుగన్నం తీసుకొని పక్కనున్న గుడిలో అక్కడ అడుక్కొన్న వాళ్ళకి పంచి పెట్టి వచ్చింది.

మా శ్రీమతిలో వచ్చిన ఈ మార్పు చూసి నేను చాలా సంతోషించాను.

ఆ రోజు రాత్రి ''శశి .. నీలో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది'' అని అడిగాను. శ్రీమతి కళ్లలో కన్నీళ్లు  ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

''కార్‌ ఏసీలో కూర్చోని, నీలి అద్దాల్లో ఇదే ప్రపంచాన్ని చూస్తే ఏడు రంగుల సినిమాలా కన్పించేది నాకు. కానీ ఒక్కసారి క్రిందకు దిగి చూస్తే నిజమైన బాధల ప్రపంచం కనపడింది. ఆ పెద్దాయన, ఆయన మనమడు చూపిన త్యాగం నన్ను, నా జీవితాన్ని మార్చి వేసిందండి.'' అంది నా భుజాల మీద వాలిపోతూ.

చిన్న పిల్లలా ఏడుస్తున్న నా శ్రీమతిని సముదాయించడానికి నాకు చాలా కష్టమైంది.

 

…. అయిపోయింది ....

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ