Pakshula Prapancham


ఈ సకల చరాచర సృష్టిలో అనేక వేల ప్రాణులు, జీవరాశులు నివశిస్తున్నాయి. ప్రతి జీవికి ఒక నిర్దిష్టమైన జీవన విధానం ఉంది. మనిషి మేధస్సు మరింత విస్తృతమై, తనలాగే ప్రాణమున్న ఇతర జీవరాసుల గురించి, సూక్ష్మ క్రిముల గురించి పరిశోధనలు మొదలుపెట్టి వాటి పరిశీలించడం మొదలుపెట్టాడు. అదే జీవ శాస్త్రంగా మరియు జంతు విజ్ఞాన శాస్త్రంగా అవతరించింది.

మన సిరిమల్లె లో సాహితీ సమాచారంతో పాటు కొంత శాస్త్రీయ విజ్ఞానాన్ని కూడా జోడించాలనే మా ఆలోచనకు స్పందించి శ్రీమతి ఆదూరి హైమవతి గారు, ఈ శీర్షికకు తమ రచనా మరియు సేకరణ సహకారం అందిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు.

పక్షులకు సంబంధించిన విజ్ఞానశాస్త్రాన్ని'ఆర్నిథాలజీ'అంటారు. రెండు కాళ్ళు, రెక్కలు ఉండి, అతి తక్కువ బరువుతో గాలిలో ఎగురగలిగే అండోత్పాదక జీవులు పక్షులు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 జాతుల పక్షులున్నాయి. కొన్నిఅతి చిన్న పరిమాణంలో ఉంటే మరికొన్ని 6 అడుగుల వరకూ ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుండే ఈ పక్షి జాతులు మన భూమి మీద సంచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఈ శీర్షికలో, ప్రపంచంలోని వివిధ పక్షుల జీవనశైలి వాటి శరీరాకృతి, అలవాట్లు, తదితర అంశాలతో మా విజ్ఞాన పరిధి మేర మీకు సమాచారాన్ని అందించాలనే భావనతో మొదలుపెడుతున్నాం. మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే మాకు పంప మనవి.

మనం ఆకాశంలో పక్షులు ఎగరటం చూసి ఆనందిస్తుంటాం కదా! మరి పక్షులను గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుందాం. ఆకాశంలో హాయిగా తమ రెక్కలను అలా అలా ఆడించుకుంటూ కావల్సిన ప్రదేశాలకు ఎగిరి పోగలిగినవి పక్షులు మాత్రమే! ’ఆహా స్వేఛ్ఛా జీవులు’ అనుకుంటాం కానీ, వాటి కెన్ని గండాలు? అడుగడుగునా భయాలే! వేటగాళ్ళ వలలు, షూటర్ల తుపాకులు, ఇంకా ఎన్నెన్నో!

బాణం తో కొట్టబడి మరణించిన మగపక్షి చుట్టూ తిరుగుతూ దుఃఖిస్తున్న ఆడపక్షిని  చూసిన వాల్మీకి మొదటి శ్లోకాన్ని ఇలా ఆశువుగా చెప్తారు.

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు. ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో  మగ పక్షిని చంపితివి.

ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం.

ఆ తర్వాత నారద మహర్షి సందేశంతో రామయణ మహాకావ్యాన్ని రచించారు వాల్మీకి. అంటే రామాయణ కావ్య రచనకు ముందు శ్లోకాన్ని వాల్మీకి మహర్షులు పఠించను ప్రేరేపణ తను పక్షిని బాణంతో కొట్టడమే కదా! ఇలానూ పక్షులు  పౌరాణిక ప్రాశస్త్యాన్ని గడించాయని చెప్పుకోవచ్చేమో!

ఒకానొకప్పుడు ఒక గొప్ప ఉపన్యాసకుడు, ఒక స్వామి వారిని "స్వామీ! మీరు నాకు రెండు రెక్కలిస్తే మీ గొప్ప తనాన్ని, మహిమనూ విశ్వమంతా చాటివస్తాను." అన్నాట్ట! దానికా స్వామి చిద్విలాసంగా నవ్వుతూ, "నీకున్న అహంకారం, గర్వం అనే రెండు రెక్కల్నీ నేను కత్తిరించాలని అనుకుంటున్నాను, నీవేమో మరో రెండు రెక్కల్ని అడుగుతున్నావ్!" అన్నారుట. రెక్కలంటే మనకంత క్రేజ్! ఎగరాలని ఆత్రం! పక్షులు వాటి రెక్కలను నమ్ముకుని చిటారు కొమ్మమీద సైతం హాయిగా కూర్చుని ఊగుతుంటాయి. మనకే మన శక్తి మీద నమ్మకం తక్కువ! కోపమొస్తే పూర్వం పెద్దలు ‘ పక్షీ' అని తిట్టేవారు. నిజంగా అలా మారిపోతే ఎంతో హాయిగా తీయని పళ్ళు ఉచితంగా తినవచ్చు కదా! ‘ఛీ పాడు బుధ్ధి’ ఉచితం, అనగానే నడుం నిక్కబొడవదూ మనకు!

పక్షులను ఆంగ్లంలో ‘బర్డ్స్ (birds) అంటాం. రెండు కాళ్ళు, రెక్కలు ఉండి ఎగురగలిగేవి, అండోత్పాద క జంతువులు పక్షులు. కొన్నిఅతి చిన్న పరి మాణంలో ఉంటే మరికొన్ని 6 అడుగుల వరకూ ఉన్నాయి. పిచ్చుక వంటి పక్షులు ఆకాశంలో చక్కర్లు కొడుతూ కొంత వేగంగా ఎగురగలవు. అదే డేగ, గ్రద్ద వంటివి అమిత వేగంతో ఆకాశంలో పైపైకి చాలా ఎత్తుగా ఎగురుతాయి. కాకి వటివి కొంతమేరకే ఎగురుతాయి కోడివంటివి రెక్కలున్నా, ఎక్కువ దూరం, ఎత్తుగా వేగంగా ఎగుర లేవు. ఎక్కువసమయం నేలమీదే ఉంటాయి.ఇలా పక్షుల్లో ఎంతో  తేడాలున్నా రెక్కలు, రెండుకాళ్ళూ, తల దానికో ముక్కు  ఉన్న వాటిన్నన్నింటినీ పక్షులనే అంటాం.

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ