Sahithi Pudota

భాస్కర శతకము

 

చేరి బలాధికుండెరిగిఁ | చెప్పిన కార్యము చేయకుండినన్
బారము ముట్టలేఁడొకనె | పంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్
బోరక పాండుపుత్రులకు | భూస్థలిభాగము పెట్టుమన్న కం
సారిని గాకుచేసి చెడఁ | డాయెనె కౌరవ భర్త భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! కంసునకు శత్రువగు శ్రీ కృష్ణుడు దుర్యోధనుని వద్దకు పోయి నీ సోదరులగు పాండవులకు రాజ్యమిమ్మని చెప్పెను. కానీ, ఆ దుర్యోధనుడు అందుకు తిరస్కరించి కౌరవ పాండవ యుద్ధమున ప్రాణములు పోగొట్టుకొనెను. అట్లే బలశాలి తనకడ కేతెంచి ఒక పని చేయమని అడుగగా, ఆ పనిని చేయకుండా ధిక్కరించిన వాని కెప్పుడైనను ముప్పు వాటిల్లునని భావము.

 

 

తగిలి మదంబుచే నెదిరి | దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుఁ | డై చెడు టింతెగాక తా
నెగడి జయింప నేరఁడది | నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్
డెగియొక కొండతోఁదగరు | ఢీకొని తాకిననేమి? భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  గొర్రె పొట్టేలు సాహసించి నొక పర్వతమును ఢీకొని మరణించునే గాని లాభామేమియును పొందలేదు. అట్లే బలవంతునితో విరోధము పెట్టుకొని పోట్లాడుట తానే ముప్పునకు గురి అగును. ఫలితము పొందలేక మరణించును.

 

 

తడవగరాదు దుష్టగుణుఁ | దత్వమెరుంగక యెవ్వరైన నా
చెడు గుణమిట్లు వల్వదని | చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై
గడుఁదెగఁజూచుఁగా మఱుగఁ | గాగిన తైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణం బెగసి | భగ్గున మండక యున్నె భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  కాగుచున్న నూనెపై నీటిబొట్టు పడినచో భగ్గున మండును. అట్లే చెడ్డవానిలోని అవగుణములు ఉన్నను వాని గుణము ఇట్టిది అని తెలుసుకొనకుండా ఆ అవగుణమును గురించి చెప్పకూడదు. అట్లు మంచిని చెప్పిన వారి మీద కూడా కోపము వహించి మిక్కిలిగా సాహసించుటకు ప్రయత్నించును.

 

 

తనకు ఫలంబులేదని యె | దం దలఁపోయఁడు కీర్తిగోరు నా
ఘనగుణశాలి లోకహిత | కార్యము మిక్కిలి భారమైన మే
లను కొని పూను;శేషుఁడు స | హస్ర ముఖంబుల గాలిగ్రోలి తా
ననిశము మోవడేమఱి మా | హాభారమైన ధరిత్రి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  ఆదిశేషుడు తన వేయి నోళ్ళతో గాలిని పీల్చుకొనుచూ, ఇంచుక లాభము లేని భూమిని మ్రోయుచుండెను. అట్లే కీర్తిని ఆకాంక్షించువాడు తనకు దాని వలన వచ్చు లాభమును మదియందు తలవక లోకహితము చేయుచూ తన కార్యము కష్టమైనదైననూ సాధించగలడని భావము.

 

 

 తనకు నదృష్టరేఖ విశ | దంబుగఁగల్గినగాని లేనిచో
జనునకు నెయ్యడన్ బరుల | సంపద వల్ల ఫలంబులేదుగా;
కనుగవ లెస్సగాఁదెలివి | గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్
కనఁబడునెట్లు వెన్నెలలు | గాయగనందొక రూపు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!  రెండు కన్నుల సంపూర్ణ దృష్టియున్న వానికే ప్రకాశించుచున్న వెన్నెల చందమామ కన్పించునుగానీ | గ్రుడ్డివానికి వెన్నెల రూపము కన్బడదు. అట్లే మనుష్యుడు తనకు భాగ్యరేఖ ఉన్నచో లాభము పొందగలడు. ఎదుట వానికి ఉన్నచో వాని వలన అతడికి ఏమి లాభము కలుగును? సంపద వానికి లభించదు గదా.


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ