Sravanthi

 

(ధనుర్మాస సందర్భమున శ్రీరంగశాయి యైన విష్ణుమూర్తిని ప్రార్థిద్దాం)

   
సీ.

వైకుంఠపురవాస! వాసవత్ర్యంబకా
ద్యమరసంచయమనోఽభ్యర్చితపద!
పదపద్మభవలోకపావనీభ్రాజిత!
        జితదైవరిపులోకపతినికాయ!
కాయకాంతినితాంతకాంత! కాంతారదం
        తావలేశానంతదరవిదారి!
దారిద్ర్యదుఃఖసంసారఘోరాంభోధి
        తరణి!(1) తరణి(2)సితోత్పలహితాక్ష!

   
తే.గీ.

అక్షయశ్రీకరా! శ్రీకరాంబుజాత
జాతవిమలారుణద్యుతిస్ఫారకలిత
పాదయుగ! యుగయుగనిర్ణయాది
సకలకార్యకారణ! కరుణతో కావరావె

[ఈ పద్యములో ప్రతిసంబోధనచివరి పదంతో తరువాతి సంబోధన ప్రారంభమౌతుంది. దీన్నే ముక్తపదగ్రస్తాలంకార మంటారు. (1) నావ (2) సూర్యుడు]

   
ఉ.

హారికి శ్రీరమాహృదయహారికి మత్తగజేంద్రవైరిసం
హారికి భక్తమానసవిహారికి భూరిగభీరికిన్ క్షమా
ధారికి వార్ధ్యహంకృతివిదారికి వందితమౌనిసంఘజం
భారికి భక్తిమ్రొక్కెద మురారికి శౌరికి చక్రధారికిన్

   
కం

రంగని మనసారంగని
రంగనిపురమందు నంతరంగం బేపా
రంగ నితాంతము మన సా
రంగని జేరంగ కొలువు రంగారంగన్

   
కం.

ఎందఱి విడదీసినదో
కొందలపడి చేతులూపి కొనదాక కనన్
తొందరపడువారల క్షణ
మందున కనుమఱగుచేసి ఆర్ద్రత నింపున్

   

త్రిప్రాసకందము

 

మాజీవనరథసారథి!
రాజీవనయన! రమావిరాజితవక్షా!
రాజావన(1)నుత! సామజ
రాజావన!(2) పాహి సుజనరక్షాదక్షా!

(1) దక్షయజ్ఞములో చంద్రుని రక్షించిన శివుడు (2) గజేంద్రరక్షకుడు

   
ద్విప్రాసమానిని
 

కుండలమండితకర్ణదరస్మితకోమలగండవిభానన!(1) యా
ఖండలవందితచందనచర్చితకౌస్తుభపీతదుకూలయుతా
ఖండలసద్ఘనగాత్రమయూఖవిఖండితదాసజనాఘతమో
మండల!(2) పాహి! ధరాధరవాస! రమాపృథివీశ! దయాంబునిధీ!

(1) కుండలములతో అలంకరింప బడిన చెవులు, చిఱునవ్వు, కోమలమైన చెక్కిళ్ళ కాంతితో కూడిన ముఖము కలవాడా!

(2) దేవేంద్రునిచే నమస్కరింపబడి, గంధపు పూతతో, కౌస్తుభమణి, పట్టువస్త్రములతో కూడిన సమగ్రమైన ప్రకాశము కలిగి మేఘమువంటి నీలిరంగుగల శరీరము నుండి వెలువడు కిరణములచేత దాసుల పాపము లనెడి చీకటిని పోగొట్టువాడా!

   
సీ.

ఏ కొండపైనెక్కియేపూజ కొనుచుంటి
        వేమొ నాకెట్టుల యెఱుక స్వామి?
ఏ భక్తుపాటల నెదనిండ నాలించి
        నిదురపోయితివయ్య పదిలముగను?
ఏ భక్తురాలింట నే కార్యమును జేతబూని
        చేయుచు నుంటొ పురుషవృషభ?
ఏ కవీశ్వరుపద్యసౌకుమార్యము చూచి
        మాలగా ధరియించి మఱచినావొ?

   
తే.గీ.

ఎందు నిను కనుగొందునో యేమొ స్వామి
నన్ను కూడను దయజూచి నాదు విన్న
పాలు వినవలె నెటనున్న పరమపురుష!
కావరావయ్య యీ మూర్తికవికులజుని

   
కం.

గోదాపాశురములె(1) కా
లేదా పాశములు(2)? నీదు లీలయె కాదా?
మోదావహభక్తిరసా
స్వాదన కవి పాత్రలయిన సత్కవితలెగా

    1. గోదాదేవిచే సమర్పింపబడినవి
    2. భక్తి బంధములు

ఈ పద్యరచనలో ఖండబిందువులను పాఠకుల సౌలభ్యము కోసం కావాలనే వదిలేశాను.

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ