స్వాగతం – సుస్వాగతం
మల్లాది సావిత్రి

2018 నూతన ఆంగ్ల సంవత్సర శుభాభినందనలు.

వ్యవహార యోగ్యంగా ప్రపంచం అంతా అంబరాన్ని అంటే సంబరాన్ని కొత్త సంవత్సరంలో జరుపుకోవడం ఆనందదాయకమే. ఈ విషయం మనలో ఎంతగా జీర్ణించుకుపోయిందంటే, నిజంగా జనవరి 1 మన ‘ఉగాది పండగేమో? అన్నంతగా. కాలక్రమేణా ‘ఉగాది పండగ’ మనది అన్న విషయం మరుగునపడ్తే, మనదైన పండుగల్ని మర్చిపోతామేమోనని, విషయాన్ని వివరంగా తెలియజేసే యత్నం చేస్తాను.

మనకి ‘సంవత్సరాది’ అంటే ‘ఉగాది పండగే’ జనవరి ఒకటవ తేదీ 2018 నాడు ఆంగ్ల సంవత్సరం ఆరంభం. మనకున్న సంప్రదాయంలో సంవత్సర ఆరంభంలో ఉన్నట్టుగానే సంవత్సరం పొడుగునా విజయం చేకూరాలని “సర్వేభవంతుః సుఖనః” గా మానవాళి జీవించాలని, ధర్మానికి పట్టం కట్టాలని ఆశిస్తాం. అందరికీ శ్రేయస్కరమైన రీతిలో మెలగాలని ఆకాంక్షిస్తాం. అర్థరాత్రి ప్రవేశించే రోజు 2018 జనవరి 1 కాబట్టి సంవత్సర తొలిరోజుని అందరికీ శ్రేయస్కరంగా ఉండాలని కోరుకుందాం. అట్లాగే డిసెంబర్ 31 దాకా పయనించాలని భగవంతుని ప్రార్ధిద్దాం. జనవరి 1 రోజున కొత్త కాలెండరుని తెచ్చుకుంటాం. కాలెర్ అంటే రోమన్ భాషలో చంద్రుని పొడుపు. చంద్ర దర్శనం అని అర్థం. చంద్రుని చూడగానే రోమన్ ప్రజలు గట్టిగా కేక వేసేవారుట. అప్పటి నుండే పద్దులు, లెక్కలు రాయడం ఆరంభించేవారుట. ఆ సంవత్సరం అంతా తమ పనులన్నీ సజావుగా సాగాలని తలచేవారుట. అదే కాలండర్ నెమ్మదిగా నెలలు, వారాలు, రోజులతో తయారై నేటి వ్యవహారానికి అనుకూలంగా అమలులోకి వచ్చింది. క్రీ.శ. 532 సంవత్సరంలో హేక్సేగన్ అనే వ్యక్తి ఒక దైవాన్ని ఏర్పాటుచేసుకోవాలని యోచించి క్రీస్తుని డిసెంబర్ 25న జన్మించినట్టు, జనవరి నూతన సంవత్సర వేడుకలకి నిలయంగా ఉంచాలన్న భావాన్ని వ్యక్తం చేశాడు. కొంతకాలానికి “ఛల్సా బిషప్ సభ” క్రీ.శ.800 లో అంగీకరించింది.  పోప్ గ్రెగరీ దీన్ని 10 నెలల నుండి 12 నెలల కాలెండరుగా అమలు చేశాడు. దీన్నే మనం నేడు ఆచరణలో చూస్తున్నాం. దీన్ని ప్రపంచం అంతా ఆమోదించింది.

లౌకిక వ్యవహారానికి ఒప్పుకున్నా, మన సంప్రదాయానికి మన పంచాంగం ఉపయోగించుకుందాం. దశ-దిశ ని అందించేది పంచాగం. గ్రహాల కదలికలతో ముడిపడి ఎక్కడో మారుమూలలో ఉన్న సిద్ధాంతులు అందించే సంవత్సర ఫలితాల శక్తిని ఎప్పుడైనా గ్రహించారా? ఈ పంచాంగాల్లో చెప్పబడింది అక్షరాలా అమలై తీరుతుందన్న స్థితిని యోచించారా? వ్యక్తిగతంగానే కాకుండా, రాజ్యాన్ని, దేశాన్ని సుసంపన్నం చేసుకునే వివరణ కూడా ఈ పంచాగకర్త అందిస్తాడన్న సత్యాన్ని గ్రహించారా? వేదాల్లో విధించబడ్డ నిత్య కర్మానుష్టానికి తగిన కాలం నిర్ణయించడం జ్యోతిశ్శాస్త్ర ముఖ్య ప్రయోజనం. కాలగమనాన్ని గుణిస్తూ ప్రతి సంవత్సరం పంచాంగాన్ని పెద్దలు గణిత సాధ్యమైన తిధి,వార,నక్షత్ర,యోగ, కరణాల ద్వారా నిష్ణాతులై అందిస్తున్నారు. అనుష్ఠాది కార్యక్రమాలు చక్కగా నిర్ణయించుకుంటూ గృహ, వీధి, రాష్ట్ర, దేశ, ప్రపంచ శాంతి పొందేవిదంగా జీవించడానికి అనువుగా మన పంచాంగాలు అందించబడుతున్నాయి. ప్రకృతి పరంగా ఖగోళ శాస్త్ర రీత్యా ఏర్పడింది మన ఉగాది. యుగ అంటే కాలం, ఆది అంటే ఆరంభం అంటే ‘కాలారంభం’ అని అర్థం. క్రమేణా యుగాది ఉగాది గా వ్యవహరించబడుతోంది. కొంగ్రొత్త చిగురుటాకులతో, అన్ని చెట్ల పచ్చదనంతో వసంత ఋతువు ఆవిర్భావం ఈ క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.

‘జాతకభరణం’ రచయిత దుంధిరాజ్ అనే పండితుడు “సంహిత” గ్రంధాన్ని చదివి 60 సంవత్సరాల సమయ ప్రభావం మనిషి జీవితంపై ఏ విధంగా ఉంటుందో తెలియజేశాడు. అందరికోసం సంవత్సర ఫలితాన్ని చెప్పడం వలన వారి-వారి భవితవ్యాన్ని ఆ సంవత్సరంలో చేయగలిగేట్టుగా వర్తించవచ్చు అని తెలుసుకున్నారు. సంవత్సరం-మాసం-పక్షం-తిధి-రోజుల ప్రభావం చాంద్రమానంగా మనిషిపై ఎలా ఉంటుందో తెలియజేశాడీ పండితుడు. దీనివల్ల ఆయా విషయాలపై అధిక జ్ఞానాన్ని, జీవన మనుగడని, ఆర్ధిక వ్యవస్థని, ఆరోగ్యాన్ని సాధించే కార్యక్రమాల విధి-విధానాన్ని ఆనందంగా జీవన యానం సాగించడాన్ని పొందడంవల్ల ప్రతి మనిషి ఫలితాలకనుగుణంగా మసలుకుంటాడు.

బృహత్ సంహిత లో వరాహమిత్రుడు – “ప్రభవ, విభవ నుండి అక్షయ” దాకా 60 సంవత్సరాలుగా సంవత్సర చక్రాన్ని నియామకం చేశాడు. మనం అదే చక్రనియమాన్ని అనుసరిస్తున్నాం. అందరూ అనుసరించాలి. ప్రకృతి  పరంగా మనం వర్తిస్తే, ప్రకృతి కూడా మనల్ని ఆదరించి రక్షిస్తుంది. మన కాలగణన విధానం సశాస్త్రీయం. భారతీయ సనాతన ధర్మం అందరికీ ఆదర్శప్రాయం. అట్లా సనాతన ధర్మానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ మన సంస్కృతిని సంప్రదాయాన్ని పాటించాలి అంటే పంచాంగాన్ని అనుసరించాలి.

ధర్మం అని చెప్పుకున్నాం కదా! ఒక ఉదాహరణ ఊటంకిస్తాను. కుంభమేళాలో జరిగిన ఇటీవల సంఘటన ఇది. ఆసక్తితో అందరూ చదవండి. ఈ మేళాలో తండోపతండాలుగా వస్తున్న జనవాహిని చూసిన ఓ ఆంగ్లేయుడు, ఒక హిందూ సన్యాసిని ఇట్లా ప్రశ్నించాడు: “కుంభమేళాలో ఇన్ని లక్షలమంది ఓ క్రమపద్ధతిలో తమ పనిని తాము చేసుకుంటూ ఎంతో సౌభ్రాతృత్వంతో ఉండటం ఆశ్చర్యం. వీరు వివిధ ప్రాంతాల వారు, విభిన్న భాషల వారు, విభిన్న ఆచారవ్యవహారాలూ కలవారు, అయినా ఇంతటి కలయికకి కారణం ఏమిటి? ఇదే మా దగ్గర ఎన్నో గొడవలకి దారి తీస్తుంది.” అని అన్నాడు.  దానికి ఆ సన్యాసి సమాధానం: “మీ ప్రకారం చెప్పాలంటే కాలెండరు లో విశేష దినాలుగా ఈ కుంభమేళ ఉత్సవాన్ని మా పూర్వీకులు ముందే రాసి పెట్టారు. ఒక చిన్న గుర్తుని చూసి ఇన్ని లక్షల మంది ఇక్కడికి రావడం జరిగింది. హిందూ ధర్మం పాటించేవాళ్ళు శాంతితో ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసే గుణం కలిగి ఉంటారు. అట్లా చూడగల్గింది నా హిందూ ధర్మం మాత్రమే.” ఇంతకీ ఈ సమాధానం చెప్పిన సన్యాసి ఎవరు? ఆయనే అపర ఆదిశంకరులు శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములు. నమోన్నమః మనసా శిరసా వాచా పాదాభివందనం.

మరో ఉదాహరణ! ప్రపంచంలో ఏ దేశానికీ లేని జ్ఞానసంపద మన భారతీయలు సొత్తు. మనం నిత్యం వాడే ఏడు రోజుల వివరణ చూద్దాం. ఎన్నో వేల సంవత్సరాల నుండి, మిగతా దేశాలు గ్రహాలూ అంటే ఏమిటో తెలియకముందే నవగ్రహాలను మనవాళ్ళు అందించారు. సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు, సూర్య, చంద్ర గ్రహణాలు, ఏయే కార్తెలో ఏ పంటని పండించాలో మొ|| విషయాలు వేళ్ళ మీద లెక్కపెట్టి, ఆ లెక్కలను మనకు అందించారు. అందిస్తున్నారు ప్రస్తుతం పంచాంగం రూపంలో.

సరే! ఇప్పుడు ఇంకొక విషయం : ఆది-శని వారాల పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నాయి.

భారత కాలమానంలో హోరా! అంటే గంట అని అర్థం. ఇదే ఆంగ్లంలో Hour గా వ్యవరింపబడుతోంది. రోజుకున్న 24 గంటలు ఏడు హోరాల చక్రంలో ఈ క్రమంలో తిరుగుతాయి. అవి శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు. ప్రతిరోజూ ఉంటాయి. ఇవే 24 గంటల్లో ఉంటాయి. 7 గంటలకొకసారి ఈ హోరాలు పూర్తయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి, మళ్ళీ శని హోరాకి. ఆదివారం రవి హోరాతో ప్రారంభమై మూడు సార్లు పూర్తి కాగా (3*7 = 21), 22 హోరాగా మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు శుక్ర అవుతుంది. 24 బుధ హోరా అవుతుంది. అప్పటికి ఒక రోజు పూర్తవుతుంది.

ఆ తర్వాత 25వ హోరా చంద్ర హోరా అవుతుంది అంటే సోమవారం చంద్ర హోరాతో ప్రారంభం అవుతుంది. ఏ రోజు ఏ హోరాతో ప్రారంభమౌతుందో ఆ రోజుకు ఆ హోరా పేరే ఉంటుంది. రవి హోరాతో ప్రారంభం అయ్యే రోజును రవి వారం (ఆదిత్య వారం, భానువారం, ఆదివారం) గా చెప్పుకుంటాం. ఇట్లా ఆయా హోరాలను బట్టి రోజుల పేర్లు వచ్చాయి.

ఆదివారం తరువాత సోమవారం అని ఎందుకు రావాలి మంగళవారం రావచ్చు కదా అంటే ‘రాదు’ అన్నది సమాధానం. ఎందుకంటే ఆదివారం రవి హోరాతో ప్రారంభం అయ్యింది. అట్లాగే చంద్ర హోరాతో ఆ మరుసటి దినం ప్రారంభం అయ్యింది కాబట్టి సోమవారం గా విదితం. ఇదీ మన భారతీయుల గొప్పతనం.  ఇంత నిర్దిష్టమైన పద్ధతిలో వారానికి పేర్లు ఏర్పడ్డాయి. కాబట్టే, ప్రపంచం భారతసంప్రదాయాన్ని అనుసరిస్తోంది.

ఇంతటి విశిష్టతను పొందిన మన సంప్రదాయాన్ని అనుసరిద్దాం. ఉమ్మడి దేశ సౌఖ్యతకై ఆంగ్ల సంవత్సరాదిని గుర్తిద్దాం. మన భారతీయ ఉన్నత తత్వాన్ని తెలియజేయడానికి “తెలుగు సంవత్సరాదిని” ఆచరిద్దాం.

 

సర్వేజనః సుఖినో భవంతు

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ