ప్రపంచ తెలుగు మహాసభలు
బాబురావు సుసర్ల

డిసెంబర్ 15-19, హైదరాబాద్

తెలుగుదనం వెల్లి విరిసింది.. తెలుగుతేజం మింటి కెగిసింది.. అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో భాగ్యనగరం మురిసిపోయింది.  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవులను, రచయితలను స్మరించుకుని.. వాగ్గేయకారులను యాదికి తెచ్చుకుని తెలంగాణ పులకించిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు  పరిపూర్ణమయ్యాయి. అయిదు రోజుల సాహిత్య యజ్ఞంతో రాజధాని పులకరించింది. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులు, కళాకారులతో ప్రాంగణాలు కళకళలాడాయి. చర్చలు, గోష్ఠులు, సమ్మేళనాలు, అవధానాలు, సమావేశాలు భాషాభిమానుల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తెలుగును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాధ్యక్షతలో ప్రారంభ ఉత్సవాల్లో ఉప వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొనడంతో మహాసభలకు నిండుదనం వచ్చింది.

ఈనెల 15న మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదిహేడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, నలభైరెండు దేశాలు, తెలంగాణలోని ముప్పై ఒకటి జిల్లాల నుంచి ఎనిమిది వేలమంది ప్రతినిధులు పేర్లను నమోదు చేసుకున్నారు. రోజూ 20 చొప్పున జరిగిన సదస్సులకు భాషాభిమానులు వెల్లువెత్తారు. సినిమా, రాజకీయ సభలను మించిన రీతిలో సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రోజూ ఎల్బీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య క్రమాలకు భారీగా జనం కదిలివచ్చారు.

మహాసభలు ప్రభుత్వానికి చక్కటి మార్గనిర్దేశం చేశాయి. దీని ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీ.ఎం. కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు జనవరి నెల మొదటి వారంలో సాహిత్యవేత్తలతో సదస్సు నిర్వహిస్తానని ప్రకటించారు.

మహాసభల చివరి రోజు ఎల్బీ క్రీడా మైదానంలో వేడు కలు ఘనంగా జరిగాయి. సాసాయంత్రం నాలుగు గంటలకే మైదానం జనంతో నిండిపోయింది. గ్యాలరీలు కిటకిటలా డాయి. రాష్టప్రతి, గవర్నర్‌, ముఖ్యమంత్రితో పాటు పరిషత్‌ ఛైర్మన్‌ నందిని సిద్దారెడ్డిలు వేదికను అలంకరించారు. ఆరంభంలో దీపికారెడ్డి నృత్యోత్సవం సాగింది. ఆ తర్వాత ప్రదర్శించిన బతుకమ్మ, హోలీ, అడుగేద్దాం లఘుచిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. అనంతరం 40 నిమిషాల పాటు సాగిన తెలంగాణ సంతోషం (జాయ్‌ ఆఫ్‌ తెలంగాణ) డాక్యుమెంటరీకి అద్భుత స్పందన లభించింది.

రాష్టప్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ, తెలుగు ప్రముఖులను స్మరిస్తూ స్ఫూర్తి దాయకంగా ప్రసంగించారు. దేశంలో అత్యధిక మంది మాట్లాడే రెండో భాష తెలుగు. తెలుగు సంస్కృతి, సాహిత్యం దేశానికి, నాగరికతకు ఎంతో తోడ్పాటును అందిం చాయి. తెలుగువారు తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అన్నట్లు ఎక్కడున్నా తమ మాతృభాషపై చూపే మమ కారం తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మగా వర్థిల్లుతోందని అన్నారు. దేశం గర్వించదగ్గది.. ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే వారధి తెలుగు భాష అని రాష్టప్రతి రామనాథ్‌ కోవింద్‌ అభివర్ణించారు. స్వేచ్ఛను కోరుకుంటూ నిరసన గళం వినిపించగలిగిన భాష అని అభిప్రాయపడ్డారు. సంస్కృ తం, అరబిక్‌, ఉర్దూ, ఆంగ్ల, తదితర భాషల పదాలను కూడా తనలో చేర్చుకుని ప్రవాహంలో సాగిపోతున్న భాష తెలుగని ప్రస్తుతించారు. ఖండాంతరాల్లో తెలుగు మాట్లాడుతున్నారని, చదువుతున్నారని, అందుకే నేడు తెలుగు ప్రపంచ భాష అని విశ్లేషించారు. జ్ఞాన సంపన్నమై, సార్వజనీన విలువలున్న ఈ భాషను సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు. తెలుగు నేలపై ఎందరో భాష కోసం కృషిచేశారు. రాష్ట్రపతులుగా వ్యవహరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి ముగ్గురు తెలుగు తెలిసిన వారే. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు బహుభాషా కోవిదుడు కూడా. కొమురంభీమ్‌, కాళోజి, భాగ్యరెడ్డివర్మలను మరువలేం. మరెందరో గొప్పవారు ఈ తెలుగునేలపై జన్మించారు.

1920-30 దశకంలోనే ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఖండాంతరాల్లో తెలుగు ఖ్యాతిని చాటారు. అమెరికాలో తెలుగువారు ప్రజా ప్రతినిధులుగా కూడా ఎన్నికవుతున్నారు. పారిశ్రామిక వేత్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలుగా ప్రాచుర్యం పొందారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా తెలుగువారే కావడం గర్వకారణమని అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. సభలో గవర్నర్‌ తెలుగులో మాట్లాడి ఆదర్శంగా నిలిచారు.
ఇక నుంచి ఏటా డిసెంబర్‌లో తెలంగాణ తెలుగు సభలను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సభల ప్రారంభం రోజు ఒకటి రెండు పద్యాలు చెప్పాను. చాలా మంది అభినందించారు. ఈ మహాసభల సందర్భంగా అందరూ సంతోషమైన హృదయంతో, నవ్వుతూ ఉన్నాం. కాబట్టి నా ప్రసంగాన్ని నవ్వుల పద్యంతో ముగిస్తాను అని సీఎం చెప్పారు.

నవ్వవు జంతువుల్‌, నరుడు నవ్వును
నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు
కొన్ని నవ్వులెటు తేలవు
కొన్ని విష ప్రయుక్తముల్‌..
పువ్వుల వోలే ప్రేమ రసమును విరజిమ్ము విశుద్ధములైనవే నవ్వులు...
సర్వ దుఃఖ దమనములు వ్యాధులకైన మహౌషధమ్ముల్‌ అంటూ సీఎం ప్రసంగాన్ని ముగించారు.

సీఎం కేసీఆర్‌ చేసిన తీర్మానాలివీ..

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాష కచ్చితంగా చదివేలా అమలు చేస్తాం. ఈ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే. భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామని మరోసారి మనవి చేస్తున్నాను. అనతికాలంలోనే పరిష్కారం చూపిస్తాం. భాషా పండితులకు పెన్షన్లో కోత విధిస్తున్నారని విన్నాం. అలాంటివి జరగకుండా చూస్తాం. భాషా పండితులతో సమావేశమై ప్రతి ఏడాది తెలుగు సభలను నిర్వహిం చడంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులను తెలుగులో వెలువరిం చడం. తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం.

ఇతర విశేషాలు

మూడవ రోజు విశేషాలు

రవీంద్ర భారతిలోని యశోదారెడ్డి ప్రాంగణంలో సభల మూడవ రోజు ఏర్పాటు చేసిన అక్షర గణితావధానం ఆకట్టుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో సిద్దిపేటకు చెందిన అవధాని పుల్లూరి ప్రభాకర్‌ గుప్తా పృచ్ఛకులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు మహాసభల్లో అక్షర గణితావధానం ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. ఎవరైనా పదం, వాక్యం, పాటపాడినా అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పడం దీని ప్రత్యేకత. తెలుగు, ఆంగ్లం, హిందీ.. ఏ భాషల్లో అడిగినా సరే టక్కున అందులోని అక్షరాల సంఖ్య చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే వాటిలోని ఒక పదాన్ని తొలగించి ఇంకా ఎన్ని ఉంటాయో చెప్పమన్నా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు.

అదేరోజు జరిగిన నేత్రావధానం, అంగుష్ఠావధానం వీక్షకులను అబ్బురపరిచింది. ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థినులు ఎన్వీ శిరీష, కె.శిరీష నేత్రావధానం, అంగుష్ఠావధానంతో అదరగొట్టారు. కార్యక్రమానికి వారి గురువు కె.ఆదినారాయణ స్వామి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న వీరిద్దరూ పృచ్ఛకుల ప్రశ్నలను ఒకరు కళ్లతో వ్యక్తీకరిస్తుంటే.. మరొకరు వాటిని కాగితంపై రాసి చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. చెరో పది నిమిషాల పాటు చేసిన ఈ అవధాన ప్రక్రియ అందరినీ ఆకర్షించింది. పృచ్ఛకులు వివిధ భాషల్లో రాసిన పదాలు, వాక్యాలను వీరు అవలీలగా నేత్రావధానంతో సమాధానం చెప్పారు. తెలుగులోనే కాకుండా ఆంగ్లం, హిందీ భాషల్లో కూడా ప్రదర్శించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఉన్న మిశ్రమ వాఖ్యాన్ని సైతం నేత్రావధానంతో సమాధానం చెప్పారు.

అంగుష్ఠావధానంలో కూడా వీరిద్దరూ విశేష ప్రతిభ కనబర్చారు. కేవలం బొటన వేలును మాత్రమే కదిలించి భావనలను వ్యక్తపరిచే అపురూపమైన ప్రక్రియే అంగుష్ఠావధానం. ఈ అవధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌ చిన్ననాటి గురువు మృత్యుంజయ శర్మ విద్యార్థినులను, వారి గురువును అభినందించారు. వీరు తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు.

ఇందిరా ప్రియదర్శిని సమావేశ మందిరంలో బృహత్‌ కవి సమ్మేళనాలు జరిగాయి. ఒక్కోటీ గంటన్నర నిడివిలో సాగిన ఈ క్రతువులో పెద్దసంఖ్యలో కవులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 3 నిమిషాలలోపే సమయం ఇచ్చినా ఆ కాస్త సమయంలోనే సరళమైన భాషలో పదునైన భావాలను పలికించే కవితలను చదవటానికి ఒకరికొకరు పోటీ పడ్డారు.

తెలంగాణ సారస్వత పరిషత్‌ సభాభవనంలోని మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం, శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై శతావధానం కమనీయంగా సాగింది. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా శ్రీరంగాచార్య సమన్వయం చేశారు. శతావధాని జీఎం రామకృష్ణ ఆలపించిన సమస్యాపూరణ లలితంగా సాగుతూ శ్రోతలను ఆకట్టుకుంది.

నాల్గవ రోజు

రవీంద్ర భారతిలోని డా.యశోదారెడ్డి ప్రాంగణంలో మహిళా సాహిత్యం అంశంపై చర్చ జరిగింది. ప్రాచీన సాహిత్యం గురించి సమాజంలో మహిళ పాత్ర అనే అంశంపై వక్తలు మాట్లాడారు. ప్రాచీన కవిత్వం, సాహిత్యం గురించి కవయిత్రి సుజాతారెడ్డి ప్రసంగించారు. తెలంగాణ విమర్శ+ పరిశోధన అంశంపై తెలుగు విశ్వ విద్యాలయంలోని సామల సదాశివ వేదికలో సభ జరిగింది. పదునైన విమర్శలు లేకపోతే సాహిత్య ప్రకాశమే జరగదని వక్తలు అభిప్రాయపడ్డారు. మల్లినాథసూరి విమర్శలతోనే కాళిదాసు కావ్యాలకు ఖ్యాతి వచ్చిందని పేర్కొన్నారు.

వివిధ తెలుగు ప్రక్రియలపై తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. శతకం, సంకీర్తన, గేయం, జానపదం, లలిత గీతం, తత్వం, ఇలా అన్ని భాషా ప్రక్రియల్లోనూ తెలంగాణ కవులు అనాదిగా అద్భుత ప్రతిభ కనబరిచారని ఆయా రంగాల్లోని నిష్ణాతులు వెల్లడించారు.

ఎల్‌బీ స్టేడియంలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భాషాభిమానుల్ని ఆకట్టుకున్నాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి వంద మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరయ్యారు. మలేషియాలో తెలుగు భాషాభివృద్ధికి జరుగుతున్న కృషిని అక్కడి విద్యార్థులు వివరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మలేషియా నుంచి వచ్చిన ప్రతినిధులు కూచిపూడి నృత్యం, ఘల్లుఘల్లు గజ్జెల బండినాట్యం, బతుకమ్మపై జానపదం, శ్రీనివాసునిపై కోలాట నృత్యం చేసి సభికులను ఆకట్టుకున్నారు.

చివరి రోజు

తెలుగు భాషా పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రవీందభ్రారతిలో యశోదారెడ్డి ప్రాంగణంలో అచ్చమాంబ వేదికపై విదేశీ తెలుగువారితో గోష్ఠి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ తెలుగు మహా సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులను పిలిచినట్లు పేర్కొన్నారు. మలేషియాలో తెలుగు విద్యాపీఠం ఏర్పాటుకు 200 దేశాల నుంచి ప్రతినిధులు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచదేశాల్లో కృషి జరగటం తెలుగువారు గర్వపడే విషయమన్నారు. అనేక దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు కూచిపూడి నృత్యాలు నేర్పిస్తున్నారన్నారు.

అనంతరం తెలుగు భాష ప్రాచీనతను వివరించే వీడియోను కవిత ఆవిష్కరించారు. కాకతీయుల కాలంలో గొప్ప కవి పాల్కురికి సోమన అనికొనియాడారు. సోమన తన జీవన గమనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని తెలుగు రచనలకు ప్రాణం పోశారన్నారు. తెలుగులో రంగనాథ రామాయణాన్ని రాసిన గోనబుద్ధారెడ్డి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. అంతకుముందు సినీ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ విదేశాల్లో తెలుగు భాష పరిపుష్టంగా ఉందన్నారు. తెలంగాణలో ఉంటే చరిత్ర మొదలైన చోటే ఉన్నట్లుంది. తెలంగాణ చరిత్ర వెలికితీయాల్సిన గురుతర బాధ్యత నేటితరం యువతపై ఉంది. మంచి పండితులే యువతను ఆ దిశగా సమాయత్తం చేయగలరు.

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ