Teneloluku


నన్నయ్య ప్రతిపాదించిన తెలుగు భాష నుడికి నేటి రచనా ఒరవడికి, వాడుక భాష శైలికి ఎంతో వ్యత్యాసం చూడవచ్చు. కారణం భాష అనేది ప్రజల మధ్యన సమాచారాన్ని చేరవేసే ఒక మాధ్యమం కావాలి కానీ భాషను చూసి సామాన్య మానవుడు భయపడే పరిస్థితి రాకూడదు. అటువంటి పరిస్థితిని గమనించి 20వ శతాబ్ద ప్రారంభంలో, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి వంటి భాషా పండితులు వచన కవిత్వాన్ని ప్రోత్సహించి తద్వారా పద్యానికి-గద్యానికి మధ్యన ఉన్న అంతరాన్ని తగ్గించారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని వాడుక భాషలో రాయడానికి గిడుగే ఆదర్శం. గ్రాంథికవాది అయిన వీరేశలింగం సైతం తన అవసాన దశలో గిడుగును మెచ్చుకొని ఆధునిక తెలుగు భాషా ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన చేశాడు. గిడుగు రామ్మూర్తి వంటి అభ్యుదయ వాదుల వలన ప్రస్తుత కాలంలో మనం మన భావాలను వాడుకభాషలో వెలువరిస్తున్నాం, వచన కవితలు రాస్తున్నాం, పుస్తకాల్లో చదివేది మాట్లాడేది ఇంచుమించు ఒకేలా ఉండి భాషాసౌఖ్యాన్ని పొందుతున్నాం.

అయితే అదే సమయంలో ఆంగ్ల భాష మన దేశంలో ప్రాచుర్యంలోకి వస్తున్నందున ఈ ఆధునిక తెలుగు భాషలోకి అనేక ఆంగ్ల పదాలు చొచ్చుకుపోయాయి. పర్యవసానం తెలుగులోకి ఆంగ్ల పదాలు వచ్చాయి అనే బదులు ఆంగ్లంలో అక్కడక్కడ తెలుగు భాష తళుక్కుమనే స్థాయికి వెళ్ళింది.

‘విద్య, పని ప్రదేశాలు, ప్రసార, ప్రచురణ మాధ్యమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో వాడుకలో ఉండే భాష మాత్రమే ఎల్లకాలం నిలుస్తుంది’ అని ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ చెప్పిన సత్యాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, అమరావతి డిప్యూటీ కలెక్టర్  నూర్ భాషా రహంతుల్లా గారు ఈ మధ్యనే తెలుగు సమాచార పత్రికలో సెలవిచ్చారు. ఇది అక్షరసత్యం. అందుకు తెలుగు భాషాభిమానులుగా మనం చేయవలసిన ప్రథమ కార్యం, వీలైనన్ని తక్కువ ఆంగ్లపదాలను వాడుతూ తెలుగును మరింత సులభతరం చేసి సరళమైన తెలుగులో మనలను మనం పలుకరించుకోవడం.

*** *** ***

పద్యమైనా గద్యమైనా హృద్యంగా ఉంటే చాలు. అందరికీ అందుబాటులో ఉండాలి. సరియైన అర్థాన్ని అందజేయాలి. చదివేవారిని లేదా వినేవారిని కష్టపెట్టేలా ఉండకూడదు. కష్టమెవరికీ ఇష్టంకాదు కాబట్టి జటిలపదాలు తారసపడితే వాటిని వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం సహజం. దీనివలన ముఖ్యమైన విషయాన్ని విస్మరించవచ్చు. అంటే భాష యొక్క ప్రయోజనమే లోపించడం అన్నమాట.

ఇంతేకాదు. మార్పు మార్పు కోసమే అన్నట్లు ఉండకూడదు. మార్పువలన జాతికి మంచి కలగాలి. భాష  సుసంపన్నం కావాలి. తప్పుడుప్రయోగాలిని గొప్ప మార్పు అనుకొని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ పోతే తిప్పలు తప్పవు. చివరికి మాతృభాషకే ముప్పు; దానివలన ముందుతరాలకి భాషాపరంగా చిప్పే మిగులుతుంది. ఇటువంటివి ప్రచారం చేయకూడదు. ఉదాహరణకి “లైటు తీసుకో”. ఇది ప్రస్తుతం విస్తృతంగా వాడుకలో ఉన్న ఒక దిక్కుమాలిన ప్రయోగం. దీని ఉద్దేశము “ఎక్కువగా పట్టించుకోకు” అని. దీని తల్లిదండ్రు లేవరోకాని, ఇది ఎలా ఉంది అంటే “నెమ్మదిగా వెళ్ళు” బదులు “నెమ్మది వెళ్ళు” అన్నట్లు ఉంది. యథాతథంగా చూస్తే దీని అర్థం “దీపం చేతిలో పట్టుకో” అని. ఇలాంటి ప్రయోగాల వలన భాష పతనమై పోతుంది. చివరికి అర్థం కాని అయోమయస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఆపడానికి ప్రయత్నం ప్రతియొక్కరి ఇంట్లోనుంచే ప్రారంభం కావాలి.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ