నోరూరించే రుచి

 

శ్రీమతి వెంపటి హేమ గారు అందిస్తున్న తెలుగింటి సంప్రదాయ వంటకాలలో భాగంగా మరికొన్ని రుచికరమైన వంటలను గురించి తెలుసుకొందామా?

తెలుగింటి వంటకాలు

బుంగ మిరపకాయల (కాప్సికం) తో -

కాప్సికం వేపుడు కూర :

అరకిలో కాప్సికంని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మూడు ఉల్లిపాయలు కూడా ముక్కలుగా తరుక్కోవాలి. సెనగపప్పు, మినప్పప్పు తలో కాస్తా, రెండు ఎండు మిరపకాయల ముక్కలుకూడా చేర్చి, అర టీస్పూన్ ఆవాలతో, అంతే జీలకర్రతో, ఒక రెబ్బ కరివేపాకుతో రెండు టేబుల్ స్పూన్ల నూనెలో పోపు వెయ్యాలి. ఆ పోపులో ఉల్లిపాయలు కూడా వేసి, దోరగా వేగనివ్వాలి. అప్పుడు దానిలో తరిగి ఉంచుకున్న కాప్సికం వేసి, మూత  పెట్టకుండా, అప్పుడప్పుడు కదుపుతూ నీరు ఇగిరే వరకూ వేయించి, ఒకటిన్నర టీస్పూన్ల పొడికారం, తగినంత ఉప్పు వేసి కలిపి, మరికొంచెం సేపు వేగనిచ్చి దింపాలి.

కాప్సికం – వాము కూర :

½ కిలో కాప్సికంని తొడిమలు తీసేసి, అరంగుళం స్క్వేర్సుగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. రెండు లేక మూడు పెద్దుల్లిపాయల్ని పెద్దా, చిన్నా కాని ముక్కలు తరుక్కోవాలి. బాణలి పొయ్యి మీదు౦చి 3 TbSp నూనె వేసి కాగనివ్వాలి. దానిలో 1 ½ tsp వాము వేసి అది వేగడం మొదలవ్వగానే ఉల్లిపాయముక్కలు వేసి, అవి ట్రాన్స్పరెంట్ గా వేగాక దానిలో కాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. కాప్సికంలో నీరు ఎక్కువ ఉంటుంది. నీరు ఇగిరీవరకూ వాటిని వేయించాలి. నీరుపోయి నూనె పైకి వచ్చినప్పుడు దానిలో 1 ½ tsp ఉప్పు, 2 tsp పొడికారం వేసి బాగా కలిసేలా కలపాలి. (మిరపకాయ వాసన ఉంటుందిగాని కాప్సికంలో కారం రుచి కొంచెం కూడా ఉండదు. మనకి ఎంత కారం కావాలనిపిస్తే అంత కారం వేసుకోవాలి.) ఆపై ¼ కప్పు సెనగపిండి తీసుకుని, బాణలిలో వేగుతున్న కాప్సికంపై చల్లి, బాగా అన్ని ముక్కలకీ అంటీలా కలపాలి. తరచూ కలుపుతూ, కూరని అడుగంటనీకు౦డా చూసుకోవాలి. సెనగపిండి వేగి, కమ్మని వాసన వచ్చాక దింపాలి. దీనిలో కావాలనిపిస్తే చల్లారాక నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది మిరపకాయ బజ్జీల రుచితో అన్నంలోకి బాగుంటుంది.

కాప్సికం సెనగలు కూర :

మరునాటి కూరకోసం ముందు రాత్రికే ½ కప్పు సెనగలు నానబెట్టుకోవాలి. దేశవాళీ సెనగలకంటే కాబూలి(తెల్ల) సెనగలు ఈ వంటకంలో బాగుంటాయి. ముందుగా సెనగలు బాగా కడిగి, అరకప్పు నీళ్ళు , అర tsp ఉప్పు వేసి ఉడికించాలి. సెనగలు మెత్తపడ్డాక వాటిలో మరో tsp ఉప్పు, అరకిలో కాప్సికం ముక్కలు వేసి, ఆ ముక్కల్ని మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన వాటిని నీరు ఓడ్చి ఒక పళ్ళెంలోకి తీసి, బాణాలిలో పోపు వేయించాలి.

పోపు : 4 ఎండు మిరపకాయల ముక్కలు, 1 tsp సెనగపప్పు, 1 tsp మినప్పప్పు, ¾ tsp ఆవాలు, ½ tsp జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలతో పాటుగా అర సెం. మీ. స్క్వేరు అల్లం ముక్క చేర్చి నూరిన ముద్దా, రెండు రెబ్బల కరివేపాకు కావాలి. ముందుగా పొడిగా ఉన్న పోపు సామగ్రిని వేయించి ఆ తరువాత కరివేపాకు, ఆఖరున పచ్చిమిర్చి అల్లం ముద్దా వేసి వేయించి, ఆపై ఉడికిన కూరలో నీరుంటే తీసేసి, దానిని పోపులో వెయ్యాలి. కూరను అన్నివైపులా కలిసేలా కలిపి, కొంతసేపు ఇగరనిచ్చి దింపాలి. కూర కమ్మటి రుచితో మధ్య మధ్య సెనగలు వస్తూ బాగుంటుంది.

వచ్చే సంచికలో మరికొన్ని వంటలను గురించి తెలుసుకొందాము.

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ