Varaveena


గత సంచిక తరువాయి »

శ్రీనాథుడి శృంగార నైషధములోని సరస్వతీ దండకము

దమయంతికి స్వయంవరం ప్రకటించినప్పుడు నలుదిక్కులనుంచి మహామహులైన రాజులు రావటమే గాక, ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని కూడా వస్తారు. ఈ రకముగా త్రైలోక్యములనుండీ వచ్చిన వారిని చూసి, భీమరాజుకు కొంచెం భయము పట్టుకుంటుంది. స్వయంవరం సమయములో దమయంతికి ఎవరినీ తక్కువ చేసి వర్ణించకూడదు. ఆ వర్ణనను సరస్వతీ దేవి మాత్రమే చేయగలదని తలచి "నీయున్న యందఱు బృందారక సంకీర్తనీయ చరిత్రులు, వీరి కుల లీలా వృత్త విధంబు లెఱింగి వర్ణించి దమయంతిం జూపి ద్రైలోక్య జనని నిత్య ప్రగల్భవాచాల భగవతి బారతీదేవి దక్కం దక్కినవారు వేర" అని విచారించి యమ్మహాదేవి నిట్లని ప్రస్తుతించె:

దండకము
(వచనం)

జయ జయ జనయిత్రి, కల్యాణ సంధాత్రి, గాంధర్వ విద్యాకళా కణ్ఠ నాళాం, త్రివేదీ వళీంసార సాహిత్య సాహిత్య నిర్వర్తిత ప్రోల్లన ద్దృక్తరఙ్గా||మనేకాభిచార క్రియా హోమ ధూ మావళీ మేచ కాథర్వ ణామ్నా య రోమావళిం
కల్ప శిక్షాక్ష రాకల్ప సాక్షా చ్చరిత్రాం నిరుక్త ప్రియోక్తిం||భుజ ద్వంద్వతా మశ్నువానేన సంశోభితాం ఛన్డసా జాతి వృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భజే||

భగవతి, గుణ దీర్ఘ భావోద్భవాం సంతతిం సందధానం మహా శబ్ద నిష్పాదకం వ్యాక్రియా శాస్త్ర కాఞ్చీకలాపం కటీ మణ్డలే భిభ్రతీం

జ్యోతిషా హారదణ్డేన  తారోదయ స్ఫూర్తి విద్యోతమానేన విభ్రాజితా||మాత్మప క్షానురా గాన్వితాభ్యా ముభాభ్యాం చ పూరోతరా భ్యాం మహా దర్శనాభ్యాం ప్రతిష్ఠాపితోష్ఠ ప్రవాళాం||

పర బ్రహ్మ కర్మార్థ భేదా ద్విధాయ ద్విధా స్వం శరీరం ప్రతిష్టాం పరాం ప్రాప్తయా చారు మీమాంసయా మాసలే నోరుయుగ్మేన సమ్యక్ప రాచ్ఛాదనం లాలయన్తీం||ముహుః పత్త్రదానే గుణాన్వీత పూ గాస్కృ త్ఖణ్డన్ ప్రౌఢి మౌఢౌకమా నేన దన్తాత్మనా తర్కతంత్రేణ కామ ప్యభిఖ్యాం ముఖే ఖ్యాపయంతీం||ధ్రువం దేవి వండేతమాం త్వా మహం||

ద్రుహిణి గృహిణి, మత్స్య పద్మాది సం లక్షితం పాణిపద్మ త్వదీయం పురాణమ్||శిర స్తావకం నిర్మలం ధర్మశాస్త్రమ్||దలాభ్యాం భ్రువా వోం క్రియా మంత్ర రాజస్య, తద్బిన్దునా  చిత్రకం ఫాలభాగే తద ర్ధేన్దునాతే విరిఞ్చీ కల క్వాణనా కోణ చాపం ప్రణిన్యే స్వయం||

భవతు మమ సదా శుభం భారతి త్వత్ప్రసాదా దసాధారణా త్సత్కృపాధారభూతాం ప్రభూతమ్. సమ స్సోమ సిద్ధాంత కాంతాననాయై; నమ శ్శూన్యవా దాత్మ మధ్యాన్వితాయై, సువిజ్ఞాన సామస్త్య గృత్పఙ్కజాయై, సమస్తే స్తు సాకారతా సిద్ధిభూమ్నే||

నమస్తే స్తు కైవల్య కల్యాణ సీమ్నే, సమ స్సర్వ గీర్వాణ చూడామణి శ్రేణి శోణ ప్రభా జాల బాలా తప స్మేర పాదాంబుజాయై, నమస్తే శరణ్యే, నమస్తే వరణ్యే, నమ శ్శర్మ దాయై, నమో నర్మదాయై, నమ శ్శాస్వతాయై, నమో విశ్రు తాయి నమ శ్శార్దాయై, నమస్తే నమస్తే నమః||


శ్రీనాదుడి హర విలాసము లోనుంచి

క.

వాణికి జరణానతగీ
ర్వాణికి నేణాంక శకలరత్న శలాకా
వేణికి బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాస్తి యొనర్తున్

కవయిత్రి మొల్ల రామాయణ గ్రంధములో చేసిన సరస్వతీ స్తుతి:

ఉ:

మేలిమి మంచు కొండ నుపమింపఁగఁజాలిన యంచ నెక్కి, వా
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి
ద్యాలయ, వాణి శబ్దముల నర్థములన్‌ సతతంబు మాకిడున్

ముక్కు తిమ్మన్న పారిజాతాపహరణములోని సరస్వతీ స్తుతి:

చ.

తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం
చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పుచున్నదో
యన నఖరాంకురంబుల నయమ్మునఁ దంత్రులు మీటి గాన మిం
పొనరఁగఁ జేయు వాణి ప్రతిభోన్నతుఁ జేయుతఁ గృష్ణరాయనిన్

తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్త్వంలోనుంచి:

శా.

కద్రూజాంగదుతోడబుట్టువు శరత్కాదబినీచంద్రికా
ద్రూపాంచిత పద్మగర్భముఖ రాజీవావళీ హంసి వ
ర్ణద్రాక్షా ఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యువే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్ధులన్

ప్రహ్లాద భక్తి విజయము ప్రథమాంకము

క.

వాణీ నిను వేడెదను పు
రాణీ నా రసనయందు రంజిల్లవె క
ల్యాణీ వీణాపుస్తక
పాణీ మాధుర్యవాణి పద్మజురాణీ

నౌకాచరిత్రములోని పద్యము:

క.

ఏణీలోచన పల్లవ
పాణీ యలినీలవేణి పావనసుత గీ
ర్వాణీ యనయము మ్రొక్కెద
వాణీ నా జిహ్వయందు వసియింపగదే

మధురవాణి పత్రిక కోసం చిలుకూరి సత్య దేవ్ గారు వ్రాసిన పద్యం:

సీ.

పరమేష్ఠి మదిలోన విరబూసినట్టిదౌ
        మల్లెపూతీవె యీ మధురవాణి
ధవళవసనములన్ ధరియించి రాయంచ
        నధిరోహణము సేయు మధురవాణి
కరమందు మాణిక్యవరవీణ మీటుచున్
        మధురవాగ్ఝరినిచ్చు మధురవాణి
సాహిత్య సంగీత సారమ్మునింపుగా
        మదిని నిల్పెడి తల్లి మధురవాణి

   
ఆ.

కథల కథనములను, కైతల హృదియందు
పద్యభావమందు, గద్యమందు,
వ్యాస, గీతములను పాండిత్యమధురిమల్
చిలుకు మధురవాణి, పలుకుపడతి!

 

...సశేషం...

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు – ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించగలగడం. అదే అసలైన దేశసేవ – మహాత్మాగాంధీ