aalayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

శ్రీ శివ సుబ్రహ్మణ్య ఆలయం, నడి, ఫిజి దేశం

Temple


బ్రతుకు తెరువు కోసం మనిషి తన సొంత గడ్డ ను వదిలి వేరే ప్రదేశాలకు, ప్రాంతాలకు, చివరకు ఇతర దేశాలకు వెళ్ళినను, తనకు మంచి జీవన ధర్మాలను బోధించిన పద్దతులను, పూర్వీకులు అందించిన ఆచారాలను కూడా తనతోనే తీసుకెళ్ళి వాటి ఉనికిని సదా కాపాడుకొంటాడు. అందుకే మానవజన్మ ఎంతో ఉత్తమమైనదని మనం నమ్ముతున్నాము.  ఏ మతంలోనైనా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది.  మన భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఎక్కడ ఉన్ననూ దైవచింతన అనేది సదా వెన్నంటే ఉంటుంది. కనుకనే మనం ఇన్ని దేవాలయాలను ప్రపంచం నలుమూలలా చూస్తున్నాం. ఈ నాటి సంచిక ఆలయసిరిలో ఫిజి దేశంలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయవిశేషాలను మీ కొఱకు అందిస్తున్నాను.

siva subramanya temple


ఫిజి ద్వీపం యొక్క చరిత్రను గమనిస్తే, న్యూజీలాండ్ దేశానికి ఈశాన్యంగా దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఈ దేశం దాదాపు 300 పైచిలుకు చిన్న చిన్న ద్వీపాల సమూహంగా ఎన్నో వందల సంవత్సరాల ఏర్పడింది. అనేకమంది విదేశీ వ్యాపారులకు సేదతీరే ప్రదేశంగా మారింది. పిమ్మట 1805లో ఈ ద్వీపంలోనే ఎర్రచందనం చెట్లను చూసిన తరువాత అనేకమంది ఐరోపా వ్యాపారులు ఈ ద్వీపాన్ని వ్యాపారకేంద్రంగా కూడా మార్చేశారు. పిమ్మట 1835 సంవత్సరం నుండి నెమ్మదిగా క్రైస్తవ మిషనరీలు కూడా ఏర్పడ్డాయి. ఎన్నో పరిపాలనా ఒడిదుడుకులతో స్థానిక ప్రభుత్వాలు అస్థిరమైతే నెమ్మదిగా విదేశీయులు ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్ళు మరియు ఆంగ్లేయులు తమ ఆదిపత్యంలోకి తీసుకొన్నారు. చివరకు 1874 తరువాత ఆంగ్లేయులు తమ ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా స్థాపించారు.  ఆ సమయంలోనే ఎన్నో వేలమంది భారతీయులను పనివారుగా ఈ దేశానికి తీసుకువచ్చారు. ఆ విధంగా మన భారతీయల జనాభా ఫిజి దేశంలో స్థిరపడి నెమ్మదిగా నేటికి 38 శాతం వరకు చేరింది.

siva subramanya temple


siva subramanya temple19 శతాబ్దంలో తాత్కాలిక పనివారుగా వచ్చిన భారతీయులు, తమతో పాటు తమ సంప్రదాయాలను కూడా తీసుకొని వచ్చి, తమ తరువాతి తరాల వారికి అందించారు. ఆ ప్రహసనం లోనే రామస్వామి పిళ్ళై అనే అతను ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1913 లోనే నిర్మించాడు, అటుపిమ్మట 1926 సంవత్సరంలో ప్రారంభించిన ఇండియా సన్మార్గ ఐక్య సంఘం (TISI Sangham) ఈ ఆలయ నిర్వహణను చేపట్టి నేటికీ నిర్వహిస్తున్నది.  198౦ దశకంలో ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తిగా ద్రవిడ వాస్తు శైలిలో చేపట్టి 1994 జూలై15న, సద్గురు శివాయ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం తో కార్తికేయుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ నిర్మాణానికి ఎంతోమంది దాతలు చేయూతనందించి తమ భక్తిప్రపత్తులను చాటుకొన్నారు. 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించిన ఈ ఆలయం దక్షిణార్థ గోళంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం గా ప్రసిద్ధిగాంచింది.  ఈ ఆలయ ప్రాంగణంలోనే శివుని ఆలయం మరియు వినాయకుని ఆలయం నిర్మాణం కూడా జరిగింది.

siva subramanya temple


సనాతన ద్రావిడ శిల్ప సంప్రదాయంతో నిర్మించిన ఆలయం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకునేందుకు వీలైన పరిసరాలతో ఈ ఆలయం ఎంతో మనోహరంగా ఉన్నది.  ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలను సందర్శించే వారు, ఈ సుందర మనోహర ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా దర్శించవచ్చు.


siva subramanya temple

 

Source1, Source2, Source3, Source4, Source5, Source6, Source7

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు