adarshamoorthulu


కల్పనా చావ్లా

Kalpana Chawlaమనిషి జన్మకు ఒక సార్థకత అనేది ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవనాన్ని సాగించాము అనేది ముఖ్యం కాదు. మన జీవన ప్రయాణంలో ఏవైనా స్ఫూర్తినందించే కార్యక్రమాలు చేపట్టి అందులో సఫలీకృతులు అవడమనేది ఉండాలి. అయితే అది అందరికీ సాధ్యంకాదు. పట్టుదల, బలమైన సంకల్పం, సామాజిక పరిస్థితులను అనుసరించి అవసరమైతే ఎదురొడ్డి నిలిచే ధైర్యం కూడా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అందుకే అటువంటి వారు మిగిలిన వారికి ఆదర్శమౌతారు.

సంకల్ప బలం, కృషి పట్టుదల ఉంటే కన్న కలలను సాకారం చేసుకోవడానికి లింగ బేధం లేదని, మనిషైతే చాలని నిరూపించిన ఆధునిక వ్యోమగామి, ధీరోదాత్త మహిళ, మన భారతీయురాలు డా. కల్పనా చావ్లా, ఈ సంచిక ఆదర్శమూర్తి. సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక జీవనశైలిలో కూడా ఇమిడిపోయి ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందంజ వేసిన ఈ శాస్త్రవేత్త ఎంతో మంది భావితరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.

Kalpana Chawla1961 సంవత్సరంలో హర్యానా రాష్ట్రం లోని కర్నల్ పట్టణంలో కల్పన జన్మించారు. తల్లిదండ్రులకు చివరి సంతానంగా జన్మించిన కల్పన, చిన్నతనం నుండే ప్రముఖ పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. టాటా ఆదర్శం గా గాలిలో ఎగరాలనే కోరికతో ఎప్పుడూ విమానాల బొమ్మలను గీస్తూ, వాయుప్రయాణానికి సంబంధించిన శాస్త్రంమీద పట్టును సాధించేందుకు కృషి చేయడం మొదలుపెట్టింది. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసమే ఆమె ఆశయ సాధనకు వాహకాలు. సాధించాలనే పట్టుదలే ఆమెను ఖండాంతరాలను దాటి విశ్వం వైపుకు దూసుకుపోయేటట్టు చేసింది.

Kalpana Chawlaఅభ్యుదయ భావాలను మనసులో బలంగా నాటుకొని పిల్లల అభిప్రాయాలకు అనుగుణంగా పెద్దలు చేయూత అందించాలని కల్పన గారు భావించేవారు. అట్లని పూర్తిగా ఆధునిక అలవాట్లకు పోకుండా సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ, చదువులో మొదటితరం వారసురాలుగా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్’ కోర్సు చేరి పట్టాను పుచ్చుకొన్నది. తరువాత తన చిరకాల వాంఛ అయిన అంతరిక్ష పరిశోధనలో అనుభవం సంపాదించుటకు నాడు ఆ రంగంలో అభ్యున్నతిని సాధిస్తున్న అమెరికా దేశానికి ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే మాస్టర్ డిగ్రీ మరియు పి.హెచ్.డి పట్టాను కూడా పొందింది. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉన్ననూ, ఆమె ఎప్పటికీ మన భారతీయ అంకురమే.

Kalpana Chawla1988 లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో కొలరాడో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన తరువాత, మిగిలిన అందరివలే ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తరువాత పెళ్లి కుటుంబం అని కాక,  ఆమె నిరంతరం పరిశోధనలకే తన సమయాన్ని కేటాయించింది.  అప్పుడే ‘నాసా ఎమ్స్ పరిశోధన కేంద్రం’లో పనిచేస్తూ మిథ్యాప్రతిరూప శాస్త్రం మీద పరిశోధనలు చేయడం ప్రారంభించింది. తదుపరి, ఆమె పరిశోధనల ఫలితాల ప్రచురణతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చి నాసా పరిశోధనల బృందంలో తనకు కూడా చోటు లభించింది. ఈ బృందం అంతరిక్షవాహనం లో వెళ్లి పరిశోధనలు చేస్తారు. అందుకొఱకు ఆమె దాదాపు సంవత్సరం పాటు అన్ని రకాల శిక్షణలను తీసుకొన్నారు. ఆ విధంగా ఆమె తన చిరకాల కోరిక అయిన అంతరిక్ష విహారం చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళా మన కల్పనా గారు మరియు రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలో విహరించిన రెండవ భారతీయ వ్యోమగామి.

Kalpana Chawlaనవంబర్ 1996 న కల్పనా చావ్లా మిషన్ స్పెషలిస్ట్ గా ఎన్నికైనారు. అటుపిమ్మట STS-87 కొలంబియా అంతరిక్ష వాహనం లో వెళ్లి భారరహిత పరిస్థితులలో భౌతిక విధానాలు ఏ విధంగా మార్పు చెందుతాయి అనే అంశం మీద పరిశోధనలు సాగించారు. దాదాపు 377 గంటలు అంటే 15 రోజులు అంతరిక్షంలో గడిపి భూమి చుట్టూ 252 ప్రదక్షిణలు చేసి 6.5 మిలియన్ మైళ్ళు ప్రయాణించారు. నిజంగా ఆ అనుభూతి ఆ అనుభవం మాటలో వర్ణించాలంటే భూమి మీద ఉన్న మనలాంటి వారికి చేతకాదు. ఆ గొప్పతనం ఆవిడకు మాత్రమే సొంతం.

Kalpana Chawlaఆమె తరువాతి అంతరిక్ష యాత్ర STS-107 కొలంబియా జనవరి 16 న మొదలైంది. ఈ మిషన్ ముఖ్యోద్దేశం వివిధరకాల శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడమే. దాదాపు 80 పైచిలుకు పరిశోధనాత్మక ప్రయోగాలు జరిపి తిరిగి ఫిబ్రవరి 1న భూమికి వస్తున్నప్పుడు, వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష వాహనం భూవాతావరణంలోకి ప్రవేశించే తరుణంలో దురదృష్టవశాత్తూ విపరీతమైన వత్తిడికి గురై, అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పేలిపోయింది.

కల్పనా చావ్లా వంటి నిబద్దతతో పనిచేసే  పరిశోధనావేత్తలు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె ప్రతిభకు గీటురాళ్ళుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎటువంటి వాతావరణంలో అయినా చివరకు అంతరిక్షంలో కూడా ఎంతో ధైర్యంగా తన పరిశోధనలను సాగించి, తన చిరకాల వాంఛను తీర్చుకొని ఎందరికో స్ఫూర్థిగా నిలిచింది. తన అంతరిక్ష పరిశోధనలు, తన తరువాత వచ్చిన రోదసీ యాత్రికులకు మరియు అంతర్జాతీయ రోదసీ స్థావరం యొక్క నిర్మాణంలో కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఈ శీర్షిక ద్వారా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి స్మరించుకుందాం.

 

 

Source1, Source2, Source3

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు