Ankurarpana


గత సంచిక తరువాయి »

వివాహ వ్యవస్థ

నేటి తరం అమ్మాయి/అబ్బాయి పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. ఆ బంధానికి కట్టుబడి.. బాధ్యతలను స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండడము లేదు.. ఒక వేళ వివాహం చేసుకున్నా చీటికీ మాటికీ గొడవలు పడుతూ విడిపోతున్నారు.. పెళ్లి పేరు చెబితేనే మేము ఇంకా బాగా డబ్బులు సంపాదించి జీవితములో సెటిల్ అవ్వాలి.. అప్పుడే చేసుకోము అని తప్పించుకుని తిరుగుతున్నారు.. కొంత మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. మరికొందరు ప్రేమలో విఫలులై బార్లలో తిరుగుతున్నారు.. ఇంకొందరు లివింగ్ టుగెదర్ అంటూ పెళ్లికాకుండానే సహజీవనం సాగిస్తున్నారు.. మరికొందరు ప్రేమ ఒకరితో.. పెళ్లి ఇంకొకరితో అంటూ వింత వైఖరి చూపిస్తున్నారు.. అయిదు రోజుల పెళ్లిసందడి పోయి చేవ్రాలు చేసుకునే పెళ్లిళ్లు వచ్చాయి.. ఇప్పుడు అవీ పోయి పెళ్లి చేసుకోము కలిసి ఉంటాము అంటున్నారు... ఏమయినా అర్ధం ఉందా? ఇందులో... ఈ పరిస్థితిని చూసిన ఎవరికైనా మన వివాహవ్యవస్థ, సంప్రదాయం అంతా సమసిపోతుందనే భయం పట్టుకుంటున్నది.

ఈ మధ్య నాకు బంధువుల అబ్బాయి తారసపడ్డాడు.. వాడి వయస్సు ముప్పై ఉంటుంది.. ఏమిరా! ఇంకా పెళ్లి చేసుకోవా? అని అడిగా ..దానికి ‘అమ్మో’ అని బదులు ఇచ్చాడు.. నేను ఏమి, ఎందుకు అని అడిగితే...అక్కా! ఈ కాలం అమ్మాయిలను చూస్తుంటే భయం వేస్తుంది.. వాళ్ళ అలవాట్లు.. వేషధారణ... వాళ్ళ వేగము.. ఎదిరించి మాట్లాడటము.. ప్రతీ విషయానికి గొడవపడటము.. అమ్మో! నా వల్ల కాదు ...నీలాగా..మా అమ్మ లాగా ఉండే ఒక్క అమ్మాయిని చూపించు .. కళ్లుమూసుకుని తాళి కట్టేస్తా అన్నాడు.. ఇంకా అవాక్కవడము నా వంతయ్యింది..

నిన్ననే మా అత్త కూతురుని కలిసాను.. తనకీ ఇరవై ఎనిమిది ఏండ్ల వయస్సు.. ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఏమి! ఇంకా పెళ్లి చేసుకోవా? అని అడిగితే నా స్వేచ్ఛ పోతుంది అంది.. అవునా! అన్నాను. అవును అక్కా! ఇప్పుడు ఉండేటట్లు పెళ్లి అయ్యాక ఉండలేము.. పెళ్లి అయ్యాక ప్రతీదీ సర్దుకు పోవాలి.. అన్నింటికీ అనుమతి తీసుకోవాలి.. సంజాయిషీలు చెప్పుకోవాలి.. స్వతంత్రత ఉండదు అని అంటుంది.. మరి ఎప్పటికీ చేసుకోవా అని అడిగితే జీవితం కొంత అనుభవించనీ అని అంటూ వెళ్లిపోయింది.. ఇదండీ పరిస్థితి... ఇంకా కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమించడం.. వేరొకరిని పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయిన తరువాత విషయము బయటపడేసరికి ఇద్దరి మధ్యన గొడవలు.. చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్ళడం.. రివాజుగా మారిపోయింది.. మరికొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్లి హింసాత్మక ధోరణిలో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడుటలేదు... మరి ఈ వ్యవస్థ లో మార్పు తీసుకురాలేమా!

మనసుంటే మార్గముంటుంది... సమస్య ఉన్న చోటే పరిష్కారముంటుంది.. ఇంతవరకు నేను చెబుతున్నదే మళ్ళీ మళ్ళీ మీకు చెబుతున్నట్లుగా అనిపించవచ్చు.. కానీ అదే పరిష్కారం..జీవితం యొక్క విలువలను పిల్లలకు నేర్పించాలి. కుటుంబంలో అందరిమధ్యన ముఖ్యంగా పిల్లల మధ్య ఒక స్నేహపూర్వక అనుబంధాన్ని కలుగజేయాలి.. పెద్దల మాట చద్దన్నం మూట అని బోధించాలి.. పెద్దవాళ్ళ అనుభవాలు పిల్లలకి ఎంతో అవసరం.. తల్లి, కూతురికి.. తండ్రి కొడుకుకు... వివాహం గురించి ..భార్యాభర్తల బంధం గురించి ..విలువల గురించి.. ఆ అనుబంధం లో ఉండే మాధుర్యం గురించి వివరించాలి.. ఓపిక.. సహనము నేర్పించాలి. చిన్న వయసులోనే డబ్బు సంపాదన మీద పెరుగుతున్న వ్యామోహం తగ్గించాలి.. సంపాదనకు, సుఖమయ జీవితానికి సంబంధం లేదనే విషయాన్ని తెలియజెప్పాలి. ఇది కొంచెం కష్టమైన పనే అయినా తప్పదు.. అలనాటి అయిదు రోజుల పెళ్లి వైభవాన్ని మళ్ళీ తీసుకు రావాలి.. ఈ కార్యానికి మనమే అంకురార్పణ చెయ్యాలి...

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు