అన్నాచెల్లెలి గట్టు

ధారావాహిక నవల


గత సంచిక తరువాయి »

“వంతెన తాలూకు ఆర్చి కాబోలు – ఏదో గట్టిగా తలకు కొట్టుకున్నట్లు గుర్తు, ఆపై స్పృహ పోయింది. ఆ తరవాతి గాథ నాకంటే బాగా నీకే తెలుసు” అంటూ చెప్పడం ముగించి కన్నయ్య మొహంలోకి చూసింది రాధమ్మ. ఏకాగ్రతతో కధనం వింటున్న కన్నయ్య తెప్పరిల్లి, “ఏందది రాదమ్మా! ఎందుకలా సూత్తన్నావు” అని అడిగాడు.

“ఏమీ దాచకుండా మనకు సంబంధించినంతవరకు నీకు చెప్పేశా, విన్నావుకదా? ఇప్పుడు చెప్పు కన్నయ్యా! అంతా విన్నాక నీ కేమనిపిస్తోందో ...”

“ఏమనుకోడానికి ఏముంది రాదమ్మా! అయ్యన్నీ ఎనకజలమ తాలూకు ఇశేసాల్లాంటియి, ఆటిని తప్పుపట్టే సత్తువ నాకు లేదు."

“మరి నీకేమీ అనిపించడం లేదా, నేనూ, శ్రీనూ...”

“ఈసీ! ఇందులో కొత్తగా అనుకోడాని కేముందంట! నీకు మరో అబ్బితో సమ్మంధమ్ ఉన్నాదని నాకు ముంగటే తెలుసు. నిన్ను ఆసుపత్తిరిలో సేరిపించినప్పుడు సెప్పారు ఆల్లు నువ్వు గరబవతివన్న సంగతీ, అది నిలబడలేదన్న ఇసయమూనూ! నాకప్పుడప్పుడూ, నీకు ఎనకటి ఇశేసాలన్నీ గురుతొస్తే నువ్వు ఆ యబ్బి కాడికి ఎలిపోతావేమోనని నా గుండెల్లో బితుకు పుట్టేది రాదమ్మా! నువ్వు నన్ను ఒగ్గేసి ఏరేసోటికి ఎలిపోకపోతేశాను, నా జలమంతా నీ రునాన్నుంటా! నిన్నిడిసి నేను ఛెనమైనా బతకలేను రాదమ్మా, ఒడ్డునబడ్డ సేపనైపోతా...”

వెంటనే రాధమ్మ ఒకచేత్తో అతని నోరు మూసి, రెండవచేత్తో అతన్ని, మనసులోని గుబులుతీరా గట్టిగా కౌగిలించుకుని మాటాడకుండా ఉండిపోయింది. కానీ, “నీకొచ్చిన భయమేమీ లేదు. నిన్నుకాదని నే నెక్కడికి పోతానుట! నువ్వు కాక నా కింకెవరున్నారు కన్నయ్యా!! చావులోనైనా బ్రతుకులోనైనా మనం వీడని జంటగానే పయనిద్దాము” అనుకుంది మనసులో. కాసేపలా ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా ఆ తన్మయత్వం నుండి తేరుకున్నాడు కన్నయ్య...

“ఐనా రాదమ్మకి ఇప్పుడింక ఎవరున్నారు గనక! ప్రేమగా చూసుకునే తల్లీ పాయే, ప్రాణం పెట్టి ఆదుకోవలసిన పెనిమిటి కావలసినోడూ పాయే! ఇక సూత్తే - నా రాదమ్మ నన్నిడిసి యాడకో పోతాదన్న నా బయమూ పాయే..." అనుకున్నాడు తనలో. కానీ అంతలోనే స్వార్ధపూరితమైన తన ఊహకు తానే సిగ్గుపడ్డాడు.

తన పూర్వజీవితం మాత్రం ...? తను కూడా చుక్కను మనువాడాలని చిన్నప్పటినుండి అనుకున్నవాడు కాదా! చుక్కకు వేరేవాడితో మనువైనాక మనసు మార్చుకుని, రాదమ్మ మెడలో తాళి కట్టలేదా ఏమిటి నేనుమాత్తరం - అనుకున్నాడు. జీవితంలో ఆశలకూ, అవసరాలకూ పొంతన కుదరదు తనలాంటి చాలా మందికి - అని మనసు సరిపెట్టుకున్నాడు కన్నయ్య.

"రాదమ్మా! నీకీతలికి సఎవరైనా సెప్పేవుంటారు - సుక్కా నానూ సిన్నప్పటినుండి‌ అనుకునీటోల్లమ్ – మే మిద్దరమూ పెల్లి సేసుకుని కలిసి కలకాలం బతకాలని! కానీ రుద్రయ్యమామ కూతుర్ని కలిగిన సోట ఇవ్వాలనుకున్నాడు. సావుకారు గవురయ్యకిచ్చి చేశాడు. నా అదురుట్టం నిన్ను నాకాడికి సేర్చింది. నాను ఒంటరోడుగా ఉండిపోకుండా కడలమ్మ తన బిడ్డను నాకాడికి పంపింది – అన్నారు మంది. ఆశీర్వోదించి అచ్చింతలు సల్లేరు మనమీన. ఆ కాడినుండీ నాకు నువ్వు, నీకు నేను – నువ్వు నాకాడుంటే సాను, నాకు సకల వయిబోగాలూ ఉన్నట్టే “ అంటూ గారాలు పోయాడు కన్నయ్య, రాధమ్మ పైటచెంగులో తల దాచుకుని. అతని తలని ఎదకు హత్తుకుని తన్మయత్వంతో మౌనంగా ఉండిపోయింది రాధమ్మ.

“కన్నయ్యా! నీకున్న మంచి మనసు, తీరైన ఆలోచన, నాగరీకుల మనుకునేవారిలో ఎంతమందికి ఉంటుందిట! నీ వంటి గొప్ప ధీరోదాత్తుడు (hero) నా కింతవరకూ ఎక్కడా కనిపించలేదు. నీకున్నంత విశాలహృదయం ఎంతమందికి ఉంది కనుక! నువ్వు బెస్త కులంలో పుట్టిన ఉత్తమజాతి పురుషుడివి. నా పెనిమిటివైనందుకు నీకు నా జోహార్లు. నువ్వు నా వాడివైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది సుమీ” అని మనసులోనే అనుకుని మురిసింది రాధమ్మ.

కన్నయ్య కౌగిలిలో ఒదిగి తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న రాధమ్మ, మాటలమధ్యలో అలాగే కొద్ది సేపట్లో నిదురలోకి జారిపోయింది. ఆమెను ఎత్తి పడకపై తీరుగా పడుకోబెడుతూ, తనలో అనుకున్నాడు కన్నయ్య, “ నా రాదమ్మ గొప్పింటి బిడ్డకదా, సుకుమారి! పడవ ప్రయాణం సేసి, అలల కుదుపులకి అలసిపోయింది గావును, సిటికెలో నిదరోయింది సంటిపిల్ల మాదిరిగా!”

# # # # # # # # #

రాయగా రాయగా రాయైనా అరిగిపోక తప్పదు. ఎంత గట్టి వస్తువైనా గాని, వాడగా వాడగా సడలిపోక మానదు. ఆ లెక్కల్లో వేటికీ మినహాయింపు లేదు. ఎటొచ్చీ పాడైపోడానికి పట్టే సమయంలోనే మార్పులు ఉంటాయి. సముద్రంలో చేపలవేటకు వాడే తన పడవ, వలలు చిరకాలపు వాడకం వల్ల బాగా పాతవైపోయాయని గుర్తించాడు ధర్మయ్య. వాటికి వెంటనే మరమ్మత్తులు చేయించడం, కొన్నింటిని మార్చి కొత్తవి కొనడం అవసరమని అనుకున్నాడు. సముద్రం పైన వేట బాగా సాగాలంటే, చిరిగిన వలలను బాగు చేసుకోడం, పనికిరానివాటిని పారేసి కొత్తవలలు కొనడం తప్పనిసరి. పడవని కూడా లోనికి నీరూరకుండా బాగు చేయించడం అవసరం.

ఇదివరకు చెక్కలమధ్యన దూర్చి, పడవలోకి నీరు ఊరకుండా పైన కీలు పూసి సీలుచేసిన కొబ్బరి పీచును – పాతదైనాక దాన్ని లాగి పారేసి, కొత్తపీచును బిగువుగా పట్టేలా దూర్చి, సందులు మిగలకుండా ఉండేందుకు మళ్ళీ కొత్తగా పడవ కంతకు కీలు ఉడికించి పూయవలసి ఉంటుంది. అలా చెయ్యకపోతే పడవలోకి నీరు ఊరి పడవ నిండి బరువెక్కి మునిగిపోయీ ప్రమాదముంది.

అలా పడవలోకి నీరూరడం ప్రమాద సూచన కావడంతో తొందరగా పడవకు మరమ్మత్తులు చేయించాలనుకున్న ధర్మయ్య , కావలసిన సరుకులు కొని తేవడానికి కొడుకుని పట్నం పంపుతూ, తోడుగా కన్నయ్యని కూడా వెళ్ళమని పురమాయించాడు.

పట్నం నుండి తిరిగివస్తూ, కన్నయ్య ఏవేవో సరుకులు కొని ఇంటికి తెచ్చాడు.

ఇంటికి రాగానే తెచ్చినవన్నీ రాధమ్మకు అందించాడు. వెంటనే ఆ సంచీ తెరిచి చూసింది రాధమ్మ . దానిలో ఆమెకోసం ఒక సిల్కుచీరా, దానికి తగిన మేచింగ్ జాకెట్ ముక్క, రంగు రంగుల మట్టి గాజులు, ముగ్గురు తినడానికి సరిపడేటంత జిలేబీ ఉన్నాయి. అంతేకాదు, స్వంతానికి కొన్ని గాలాలు, బలమైన దారపు కండెలూ కూడా తెచ్చుకున్నాడు అతడు. ఎన్నాళ్ళనుండో కన్నయ్యకు ఒక కోరికుంది - సాయంకాలాలు చిన్న దోనే మీద సముద్రం మీదికి కొద్ది దూరం వెళ్ళి, గాలం వేసి కొన్ని చేపల్ని దొరకబుచ్చుకుని, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే బాగుంటుండని. ఇన్నాళ్ళకైనా అది కుదిరిందని అతనికి చాలా సంతోషంగా ఉంది.

రాధమ్మ తలపైకెత్తి భర్త మొహం లోకి చూస్తూ," సంచీ బరువు చూసినప్పుడే నాకు అర్థమైపోయింది, ఇన్నాళ్ళూ కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఖర్చైపోయిందని! ఇప్పుడు ఈ చీరా, రవికా ఎందుకు? కావాలని నేనడిగానా?”

"నువ్వాడగాలా ఏంటీ! నాకు మనుసై నేను తెచ్చుకున్నా. ఈ సీర నా రాదమ్మ కడితే సీరకే అందమొస్తాదనిపించింది. అది సూడాలని తెచ్చా. తలారా తానం సేసి, ఈ సీర కట్టుకు రా, మన మోపాలి రాములోరి గుడి కెడదారి, ఒద్దనకు రాదమ్మా!"

"సర్లే, వెడదాం. ఇంతకీ నేను చెప్పేది - డబ్బు అవసరం మనకి ..."

రాధమ్మను మాట పూర్తిచేయ్యనీలేదు కన్నయ్య.

"డబ్బు దేముంది రాదమ్మా! దమ్ముంటే శాను, మళ్ళీ సంపాయించొచ్చు. బెస్తోడికి డబ్బుకి కొదువా ఏంటీ ! మేవు కడలమ్మకు వోరసులం. కడలమ్మ కడుపులో ఎంత తీసినా తరగని సంపద వుంది. ఎల్లి తోడితెచ్చుకోడమే ఆలీసమ్! నాకేటి తక్కువ" అన్నాడు కన్నయ్య ప్రగల్భంగా.

"ఔను! నువ్వు అందరిలాంటి వాడివి కావుగదా కన్నయ్యా!" అంది రాదమ్మ అతన్ని ఆటపట్టించాలని.

కన్నయ్య నవ్వాడు. "ఔనవును! నేనందరిలాటోడినికాను, శానా గొప్ప అదురుట్టమంతుణ్ణి! నిజమే! మరిసేపోయాసుమీ, ఈడ నెవరికీ లేని రాదమ్మ నాకొక్కడికే ఉంది కదా..." అంటూ తిరిగి మేలమాడాడు కన్నయ్య. 

"చ్ఛీ! ఫో బాబూ! నువ్వు మాటలు మాబాగా నేర్చావు" అంటూ సిగ్గుపడింది రాధమ్మ. "ఈ మధ్య బెస్త కన్నయ్య గొప్ప మాటకారి అయ్యాడు! ఓయబ్బో, ఇంక ఆ యబ్బితో వేగలేను బాబూ" అంటూ సరదాగా గునిసి, కళ్ళనిండా ప్రేమ నింపుకుని భర్తవైపు ఓరచూపులు చూసింది రాధమ్మ. "నేనన్నది నీకు మిగిలిన వాళ్ళలా ఏదురలవాట్లూ లేవుకదా! అందరిలా తాగవు, బీడీకూడా కాల్చవు. అసలు రాధమ్మ వెంటరాకుండా సినిమాకు కూడాపోవు కదా" అంది.

"రుద్రయ్య మావ ఒలికి నిక్కచ్చి చేస్తాడని తెలిసి, డబ్బు కూడబెట్టడం కోసం సాటి కుర్రాళ్ళతో ఏ సరదాలకీ పోకుండా ఇలా ఉండిపోయా! కానీ అది మంచిదే అయ్యింది, ఈ రోజు రాదమ్మసేత గనమైన మెప్పును పొందగలిగా. ఈ ఎర్రి రాదమ్మ అంతా నా పెగ్నే అనుకుంటున్నది" అనుకున్నాడు కన్నయ్య మనసులో. పైకిమాత్రం, "ఎంది రాదమ్మా ఇది! ఏంటా ఎర్రి మొర్రి ఆలోశనలు, సక్కగా కొత్తకోక కట్టి సరదా సేసుకోకుండా ... ఐనా మనకిప్పుడు పెద్దపెద్ద కారుసులేమున్నాయి సేప్పు" అన్నాడు.

రాధమ్మ మరి మాటాడకుండా అతనివైపు అదోలా చూసింది. అక్కడితో కన్నయ్యకు తెలిసిపోయింది ఏదో పెద్ద విశేషమే ఉందన్న సంగతి.

"రాదమ్మా! ఏమిటి నువ్వoటున్నది? అదేదో నువ్వే సెప్పు" అన్నాడు.

"నేనన్నది ... నీకు తక్కిన వాళ్ళకిలా ఏ దూరలవాటూ లేదు కనుక నువ్వు రాదమ్మకోసమని చిల్లర మల్లర ఖర్చులు చేసి డబ్బు దూబరా చేయకపోతే ముందుముందు పెరగబోయే ఖర్చులవల్ల మనకు ఇబ్బంది ఉండదు - అని. తెలిసిందా!"

కానీ, రాధమ్మ మెరిసే కళ్ళతో చెపుతున్న మాటలు వింటూంటే, దానిలో అంతరార్థం ఇంకా తెలుసుకోవలసింది ఏదో ఉందనిపించింది కన్నయ్యకు." ముందుముండు ఖర్చు పెరగనుందా? అంటే!" తెల్లబోయి ఆశ్చర్యంగా చూశాడు కన్నయ్య రాధమ్మవైపు.

కన్నయ్య ప్రేమలో కరిగిపోయిన రాధమ్మ ఇక దాచలేక, కన్నయ్య చెవిదగ్గర నోరు ఉంచి గుసగుసగా అసలు విషయం చెప్పి, ఆపై సిగ్గుతో కిలకిలా నవ్వుతూ అతని గుండెల్లో తలదాచుకుంది.

కన్నయ్య ఒక్క క్షణం దిగ్భ్రాంతుడై చేష్టలుదాక్కి ఉండిపోయాడు, ఆపై ఆనందం తలమునకలు కాగా, "అమ్మదొంగా, ఇదా ఇసయం" అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని, గిరగిరా తిప్పి దింపి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

పంచలో కూర్చుని తాటాకులతో బుట్ట అల్లుతున్న ఎల్లమ్మకి ఆ కిలకిలలు వినిపించి తనుకూడా ముసిముసిగా నవ్వుకుంది. ఎప్పుడో గమనించింది ఆమె కోడలులో వచ్చిన మార్పును. నలతగా ఉండడం, లేస్తూనే వెళ్ళి వాంతి చేసుకోడం వగైరా లక్షణాలు దేనికి గుర్తో, అనుభవమున్న ఎల్లమ్మకు ఎవరూ చెప్పనక్కరలేదు. తాను త్వరలోనే నాయనమ్మ కాబోతోందన్న సంగతి ఆమెకు ఎప్పుడో తెలిసిపోయినా, కొడుకూ కోడళ్ళ నోట ఆ మాట వినడం కోసం మౌనంగా ఎదురుచూస్తోంది ఆమె.

అంతలోనే కన్నయ్యా రాధమ్మలు కలిసికట్టుగా వచ్చి, జిలేబీ పొట్లం చేతిలో ఉంచి, ఆమె నాయనమ్మ కాబోతున్నట్లు శుభవార్త చెప్పారు. వంగి తన కాళ్ళకు నమస్కరిస్తున్న వాళ్ళిద్దరినీ శుభాశీస్సులతో చేరదీసుకుని, ఆనంద భాష్పాలతో తన్మయురాలైపోయింది ముసలి ఎల్లమ్మ.

# # # # # # # # #

కొడుక్కి పెళ్లైనాక ఇక కొడుకు సంరక్షణ బాధ్యత కోడలుకి అప్పగించేసి తెరిపినిపడ్డ ఎల్లమ్మ, ఇదివరకులా చీకటితోనే లేవడం మానేసింది. కావాలని కల్పించుకుని చెయ్యాలేగాని, రాధమ్మ ఏ పనీ అత్తగారిని ముట్టుకోనీకుండా అన్నిపనులూ తానే చక్కబెట్టుకుంటోంది. ఎల్లమ్మ ఇదివరకటిలా ఇప్పుడు అడపా తడపా మూలగటల్లేదు. ఆమెకు కావలసినంత విశ్రాంతి దొరికింది. ఉదయం చద్దిగంజి తాగి, కాలక్షేపం కోసం ఎటో అటు పెత్తనానికి వెళ్ళడం అలవాటు చేసుకుంది ఆమె. అందరినీ పేరు పేరునా పలుకరించి, కుశలమడిగి, పూజవేళకు రామమందిరానికి చేరుకుంటుంది ఎల్లమ్మ. పూజ ముగిశాక తీర్థప్రసాదాలు పుక్ఛుకుని, నెమ్మదిగా నడుచుకుంటూ ఇల్లు చేరుకునీసరికి, కోడలు వంట ముగించి అత్తగారి రాకకు ఎదురుచూస్తూ ఉండేది. అత్తగారు రాగానే రాధమ్మ వేడివేడి అన్నం మీద చేపలపులుసు వేసి కంచం చేతికి ఇచ్చేది. ఇన్నాళ్ళూ పడ్డ కష్టమంతా మరచిపోయి, సంతోషంగా బ్రతుకుతోంది ఇప్పుడు ఎల్లమ్మ.

ఆ రోజు తొందరగా లేచి, వేగంగా స్నానం ముగించి, చలువ మడతలు కట్టుకుని రాదమ్మతో చెప్పి, రామాలయానికని బయలుదేరింది ఎల్లమ్మ. వెడుతూ, తాను అప్పుడప్పుడూ పిడతలో వేసిన డబ్బు మొత్తం కొంగునకట్టుకుని, గుడిలో స్వామికి అర్చన జరిగేవేళకి అక్కడకి చేరుకోవాలని తొందర తొందరగా వెళ్లిపోయింది. పూజారి రాకముందే గుడికి చేరిన ఎల్లమ్మ గుడి మెట్లమీద కూర్చుని ఆయన రాకకోసం ఎదురుచూడసాగింది. క్రమంగా గుడిచుట్టు ఉన్న దుకాణాలు ఒకటొకటిగా తెరవసాగారు. నెమ్మదిగా భక్తులు ఒకరొకరే గుడికి రావడం మొదలుపెట్టారు.

పూజారి సకాలంలోనే వచ్చాడు. గుడితలుపులు తెరిచి, పూజకు కావలసిన ఏర్పాట్లు చేసుకోసాగాడు. ఎల్లమ్మ పూజకు కావలసిన సామగ్రి కొనుక్కుని, తీసుకు వెళ్ళి కొడుకూ కోడళ్ళ పేరు మీద పూజ చేయించింది. ఆపై గుప్పెడు చిల్లర హుండీలో వేసి స్వామివారికి నమస్కరించింది.

పూజ పూర్తిచేసి పూజారి అందరికీ ప్రసాదాలు ఇవ్వసాగాడు. ఎల్లమ్మకు ప్రసాదం ఇస్తూ పూజారి, రోజూ చూస్తూండడంతో చనువుగా పలకరించాడు, "ఏంది ముసలమ్మా! అంత సంతోషంగున్నావు, ఏమిటి విశేషం?"

ముసిముసిగా నవ్వుకుంటూ జవాబు చెప్పింది ఎల్లమ్మ, "సంబరం కాకేంటి మారాజా! నా కోడలు తొలిసారి నీళ్ళోసుకుంది. రాములోరి ఆశీర్వోదమ్ కోసం వచ్చానండి" అంది.

"భేష్! బాగుంది. ఐతే త్వరలో నువ్వు నాన్నమ్మ వౌతున్నావన్నమాట!"

ఆయన తక్కినవాళ్ళకు ప్రసాదాలిస్తూ ముందుకి వెళ్ళిపోయాడు.

ప్రసాదం తీసుకుని ఇంటికివచ్చి దానిని రాధమ్మకి ఇచ్చింది ఎల్లమ్మ. ఆ తరవాత వానరాజు ఇంటికని బయలుదేరింది. రామాలయం నుండి వస్తూ దారిలో తానుకొన్న పటికబెల్లం ముక్కల్ని వెంట తీసుకెళ్ళింది.  దారిలో తనను పలకరించిన వాళ్ళందరికీ శుభవార్త చెప్పి, ఒకో పటికబెల్లం ముక్క చేతిలో పెట్టింది ఎల్లమ్మ. అందరికీ నోరు తీపీచేసి, వారితో తన సంతోషాన్ని పంచుకుంది.

ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గుమ్మాలెక్కి వస్తున్న ఎల్లమ్మను చూసి, గుమ్మంలోనే పలుకరించింది ధర్మయ్య కోడలు లక్ష్మి. "ఏంది ఎల్లమ్మత్తా! నీలోనువ్వే తెగ నవ్వుకుంటున్నావు, ఏదైనా ఇశేసమా?"

"ఔను, ఇశేసమే! రాదమ్మ నీల్లోసుకున్నాది. శుబవోర్త మీ సెవినేసి పోదారని వొచ్చా. దరమయ్య బాబుకి గూడా సెప్పాల ..."

"నే సెవుతాలే, నీకెందుకు స్రెమ. పనిమాలా మళ్ళీ రామోకు."

"సంతోసంతో ఒల్లిడిపోతావుంటే స్రెమెక్కడ తెలుస్తాదే పిల్లా!" కొంగు ముడివిప్పి ఒక పటికబెల్లం ముక్క తీసి, లక్ష్మీచేతిలో పెట్టి వెనుదిరిగింది ఎల్లమ్మ.

ఇంటికి తిరిగివస్తూ ఎల్లమ్మ దారి మధ్యలో రాగమ్మ ఇంటికి వెళ్ళింది. గుమ్మంలోకి వచ్చిన ఎల్లమ్మని ఆప్యాయంగా పలకరించింది రాగమ్మ.

"ఎందమ్మో ఇయ్యపురాలా! ఇయ్యేల గాలి ఇటు మల్లినాదేంటి!"

"అన్నాళ్ళాయి పెల్లి సేత్తివిగందా, బిడ్డను సూసుకోడానికి ఒక్కపాలైనా నా గడపలోకి వచ్చావా? ఆ యమ్మి అత్తోరింటికాడ కట్టాలే పడతావుందో, సుకాలే అనుబాగిస్తావుందో ఈశారించుకోవద్దా కన్నోళ్ళు?"

"నీ సంగతి నాకు తెల్దా ఏంటి ఇయ్యపురాలా! నీకాడ కట్టాలేముంటాయిలే! అస్సరేగాని, పనిమాలా ఇటోచ్చిన ఈశేసమేంటో ముందదిసెప్పు? ఓయమ్మ, నా కూతురు సింతకాయలు గీని తెమ్మన్నాదా ఏంటీ?"

"బలే గమ్మత్తుగున్నాదే! నే సెప్పకుండానే నీ కెలా తెలిసిపోయింది ఆ ఇసయం!" ఆశ్చర్యపోయింది ఎల్లమ్మ.

"అరిసెయ్య సూసుకోడానికి అద్దం కావాలా ఏంటి ఇయ్యపురాలా? నీ మొగంలోని సంతోసం సూత్తావుంటే  నాకల్లా అనాలనిపించింది. నిజమే గందా!"

ఎల్లమ్మ ఒక పటికబెల్లం ముక్క తీసి రాగమ్మ చేతిలో ఉంచి, "నిజమేనో ఇయ్యపురాలా! అజ్జెప్పడానికే వచ్చా. ఓపాలి అటు రాకూడదూ ... ఈ టయమ్ లోనే ఎవరికైనా పుట్టింటిమీన బ్రెమ పుడతాదంటారు. ఆ యమ్మికి ఏందినాలనుందో - వచ్చి మంచీ, సెబ్బర కనుక్కోరాదా... సాయం సేత్తానంటే కూన్ని బియ్యం నీళ్ళలో పోస్తా. కుసిన్ని పోకుండలు సేసి పెడితే, బెమారినప్పుడల్లా ఒకోటి నోట్టో ఏసుకుంటాది. ఓపలేని మణిసి ఇద్దరి తిండి తినాల!"

సరిగా అప్పుడే అచ్చమ్మ ఆదాటుగా అక్కడకు రావడం జరిగింది. ఎల్లమ్మ మాటలు వింది ఆమె.

అచ్చమ్మను చూడగానే ఎల్లమ్మ ముఖం వికశించింది. "ఔనో అచ్చమ్మా! నేను నీ కాడికే వద్దారనుకుంటన్నా. అంతలో నువ్వే వచ్చావు. నా కోడలు నీలోసుకుంది" అంటూ శుభవార్త చెప్పి, అచ్చమ్మ చేతిలో పటిక బెల్లంముక్క ఉంచింది ఎల్లమ్మ.

"పెద్దాదానివి, నువ్వేడ దేవులాడతావు గాని, నే జేసి తెస్తాలే పోకుండలు. నువ్వు గమ్మునుండిపో" అంది అచ్చమ్మ.

"ఇంటో సామాను నిండుకున్నాయి, ఈలు సూసుకుని నేను బెల్లపు తాలికలు సేసి, అయ్యట్టుకుని వస్తా మీ ఇంటికాడికి" అంది రాగమ్మ.

"తొలి కానుపిది! తెలియని తనం వల్ల పాపం! ఏయేయో బయాలు ఉంటాయి. నేనయ్యన్నీ ఎప్పుడో మరిసిపోయా. ఇకనుండీ మీ ఇద్దరూ సూసుకోవాలి రాదమ్మని" అంది ఎల్లమ్మ , రాధమ్మ బాధ్యత వాళ్ళమీద ఉంచుతూ.

"నీకేం బయం వద్దు, అయన్నీ మేం చూసుకుంటాము. రాదమ్మ ఇట్టే నెలలునిండి పడంటి మగబిడ్డను కంటాది, సూత్తా ఉండు" అంటూ ఎల్లమ్మకు హామీ ఇచ్చింది అచ్చమ్మ.

# # # # # # # # #

చిరిగిన వలలు బాగుచెయ్యడం, ఎరల్ని సిద్ధం చెయ్యడం, గాలాలకు చిక్కులువిప్పి సరిజేయడం మాత్రమే కాకుండా ఉప్పు చేపల్ని తయారుజేసి, ఎండబెట్టి, తరువాతి అవసరాలకోసం పొదుపు చెయ్యడం, రొయ్యపొట్టు బాగు చెయ్యడం లాంటివి కూడా త్వరలోనే నేర్చేసుకుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - బెస్తవాడలో పుట్టిపెరిగిన ఏ మరక్కత్తెకు తీసిపోని విధంగా వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకంటే కూడా నేర్పరితనంతో చెయ్యసాగింది రాధమ్మ అనతికాలంలోనే. చేపలమ్మడానికి తోటివారితో కలిసి వెళ్ళిరావడమే కాకుండా, చేపల్ని శుభ్రపరచి, ముల్లూ గట్రా తీసేసిన, శుద్ధమైన చేపమాంసం వతనులున్నచోట ఇచ్చి మరింత ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది రాధమ్మ. ఎక్కడ పుట్టినా, ఎక్కడపెరిగినా ఇక్కడికి వచ్చాక, స్వయంకృషితో కొద్దికాలంలోనే సాటివారిలో మేటి మరక్కత్తెగా పేరు తెచ్చుకుంది ఆమె.

ఇదివరకటి కంటే ఆదాయం మెరుగవ్వడంతో డబ్బు కూడబెట్టి, ఎల్లమ్మతాలూకు ఒంటి నిట్రాటి పాకని మార్చి, రెండంకణాల పూరింటిని కట్టుకోగలిగారు వాళ్ళు. రాధమ్మ వచ్చాక ఆయింటి పద్ధతులలోకూడా నేవళీకo, శుచీశుభ్రాలూ కనిపించసాగాయి.

రాధమ్మకు పూర్వ స్మృతి కలిగాక కూడా ఆమెలో మార్పేమీ రాలేదు. ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని కన్నయ్యతో గట్టిగా చెప్పేసింది రాధమ్మ. అసలు రాధమ్మకి పాత విషయాలు గుర్తొచ్చిన విషయం మూడోమనిషికి చెప్పాలనుకోలేదు వాళ్ళు. ఆ రహస్యం ఆ భార్యాభర్తల మధ్యన మాత్రమే పదిలంగా ఉండిపోయింది.

బెస్తవాడ సముద్రానికి దగ్గరలో ఉండడం వల్ల, నుయ్యి తవ్వినా సముద్రపు పోటు పాటుల అలజడి వల్ల నూతిలోని నీరుకూడా ఉప్పగా మారిపోతుంది. అందుకనే వాళ్ళు తమ వాడకట్టున నుయ్యి తవ్వే ప్రయత్నం చేయలేదు. వాళ్ళకి నీటి యెద్దడి తప్పనిసరి సమశ్య! ప్రతిరోజూ వాళ్ళకి వేరే బావులనుండి తాగడానికి, వాడకానికి నీరు తెచ్చుకోక తప్పదు.

రాధమ్మ గర్భవతి అయ్యాక, ఆమెకు కొన్ని పనులు వెనక్కిపెట్టక తప్పలేదు. ఒకపాటి వేవిళ్ళతో సతమతమౌతున్న రాధమ్మను చూసి బేజారయ్యాడు కన్నయ్య. కొన్ని పనులలో ఆమెకు సహాయపడాలని అనుకున్నాడు. వెంటనే ఒక గాబు కొని, సాయంకాలపు తీరిక సమయంలో రామ మందిరం నూతినుండి కావడి వేసి నీళ్ళు తెచ్చి, ఆ గాబు నింపేవాడు. ఎల్లమ్మకూడా పెత్తనాలు కట్టిపెట్టి, ఇంటిపనుల్లో కోడలికి సాయపడేది. కోడలు "ఊ" అన్నా, "ఆ" అన్నా భయపడిపోయి, సలహా సంప్రదింపులకు  ఎల్లమ్మ పరుగున వెళ్ళి, రాగమ్మనో, అచ్చమ్మనో పిలుచుకువస్తోంది. అలా అపురూపంగా తొమ్మిది నెలలూ నిండి, పదవనెలకూడా సగం గడిచాక రాధమ్మ పండంటి మగబిడ్డను కన్నది. వాడికి కన్నయ్య తండ్రి పేరు, "నారాయణ మూర్తి" అని పెట్టారు. ఎల్లమ్మ ఆనందానికి అవధుల్లేవు.

# # # # # # # # #

రాధమ్మా కన్నయ్యల సంసారం అయిదేళ్ళలా సుఖసంతోషాలతో సజావుగా నడిచింది "నాని" పుట్టిన నాలుగేళ్ళకి మరో అమ్మాయి కలిగింది వాళ్ళకి. రాధమ్మ కోరికపై రామమందిరంలోని స్వామివారికి దేవేరి యైన జానకి పేరు పెట్టారు పాపకి! మనుమల్ని చూసుకుని, తన జన్మ సార్ధకమయ్యిందని తోటివారికి చెప్పి చెప్పి మురిసిపోయింది ఎల్లమ్మ.

కాల క్రమంలో కొత్త కొత్త జీవులు పుట్టుకురావడం ఎంత సహజమో, పాతబడి శక్తి ఉడిగినవి నిష్క్రమించడం కూడా అంతే సహజం సృష్టిలో. అలాకాకపోతే, ఈ భూమిపై పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చే కొత్తజీవులకు చోటెక్కడిది! ఈ తులామానంలో వ్యత్యాసం వచ్చి మనుష్యుల సంఖ్య పెరిగిందంటే భూభారం పెరిగిపోతుంది. అంతేకాదు, వ్యక్తిత్వపు విలువలు పడిపోయి, భూమిపై మనుగడ అల్లకల్లోలంగా మారుతుంది కూడా!

బెస్తవాడలో వయోవృద్ధుడైన పెద్దయ్య కాలం చేశాడు. ఆ తరవాత ధర్మయ్య, రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్లే సునాయాసంగా చెల్లిపోయాడు. ఆ వాడకట్టున ఇంకా కొందరు వయసుమళ్ళిన మగవాళ్ళు, ఆడవాళ్ళూ కూడా చిటుకూ పొటుకూ రాలిపోయారు. వాళ్ళ వారసులు ఇప్పుడు వారి వారి స్థానాలు భర్తీ చేశారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. కాలచక్రం ఏలోటూ లేకుండా తనదారిన తాను అవిశ్రావంతంగా సాగిపోతూనే ఉంది.

ధర్మయ్య మరణానంతరం అతనికి ఏక పుత్రుడైన వానరాజు వాళ్ళ పడవకు కామందైనాడు. కన్నయ్య ఇప్పుడు అతనికి కుడిభుజంగా ఉంటూ, అతని దగ్గర పాలికి పనిచేస్తున్నాడు. చేపల ధర పెరగడంతో కూలికి పని చేసినా, పాలికి పనిచేసినా చేతికి డబ్బు బాగానే వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ, రోజురోజుకీ పెరుగుటూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలవల్ల ఎంత సంపాదించినా బ్రతుకులు అంతంత మాత్రం గానే సాగుతున్నాయి. అందుకే, ఏ సంసారాన్ని చూసినా ఎదుగుదలన్నది లేకుండా, “ఎక్కడున్నావే గొంగళీ” అంటే, “ఎక్కడ వేశారో అక్కడే ఉన్నానే కంబళీ” అన్నట్లుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఎప్పటిలాగే ఉంది, ఒక్క కన్నయ్య రాధమ్మల సంసారంలో తప్ప! రోజంతా తను కష్టపడి సంపాదించడమే కాకుండా, ఖర్చుపెట్టడంలో కూడా రాధమ్మ చూపించే నేర్పరితనమే దానికి కారణం. అది కూడా కొందరికి కన్నెర్రకు కారణమయ్యింది. ఎదుటి పచ్చను ఓర్వలేని జనంలో ఆ కుటుంబంపైన పుట్టిన అసూయ, అగ్నిపర్వతంలోని సెగలా నానాటికీ పెరుగుతోంది.

కన్నయ్యా రాధమ్మల కుటుంబం పెరిగింది, ఖర్చూ పెరిగింది. కన్నయ్య సంపాదించి తెచ్చిన డబ్బు మొత్తం ఇంటి ఖర్చులకు సరిపోతోంది. డబ్బుకి ఏ ఇబ్బందీ లేకుండా ఇంటిఖర్చులన్నీ సజావుగా జరిగి, ఆపై కొంత డబ్బు మిగలాలంటే తనుకూడా ఏవైనా అదనపు పనులు చెయ్యక తప్పదు అనుకుంది రాధమ్మ. పిల్లల్ని విడిచి వెళ్ళనక్కరలేకుండా ఇంటిపట్టూనే ఉండి చేయదగిన పనులకోసం వెతుక్కుంది ఆమె. ఆ విధంగా వచ్చిన డబ్బుతో వాళ్ళ సంసారం పచ్చగా కనిపించేది. "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్నది నానుడి.

చేపల అమ్మకానికి వెళ్ళినప్పుడు మాత్రమే – ఆ కొద్దిసేపూ పిల్లల్ని ఎల్లమ్మకి అప్పగించి, ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళేది రాధమ్మ. మిగిలిన సమయాల్లో వాళ్ళ సంరక్షణ తనే చేస్తూ, వాళ్ళనే కనిపెట్టుకుని ఉండేది. ఎల్లమ్మ ముద్దులమనుమడికి ఐదేళ్ళు వచ్చాయి, పి‌ల్ల ఇంకా నెలలపిల్ల. ఇక నానికి అక్షరాభ్యాసం చెయ్యడం బాగుంటుంది అనుకుంది రాధమ్మ. కానీ, బడికోసం చాలాదూరం, ఊళ్ళోకంతా వెళ్ళాలి. పసివాడైన కొడుకుని అంతదూరం పంపించలేక రాదమ్మ వాడికి ఇంట్లోనే చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పు డామె, కొడుకుకే కాకుండా ఇష్టపడి వచ్చిన బెస్తవాడపిల్లలు మరికొందరికి కూడా చదవనూ, రాయనూ నేర్పసాగింది. అక్కడిజనం ఆ చదువులబడిని ప్రియమారా "రాదమ్మ బడి" అంటున్నారు.

# # # # # # # # #

“భారత సముద్ర తీర జలాల్లో నార్వే దేశం నుండి జాలరులు మరపడవలపైవచ్చి చేపలవేట చేసుకునేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది నార్వే ప్రభుత్వం” అని వార్తల సమయంలో ఘోషించాయి రేడియోలు.

ఆ రోజు రేడియోలో వచ్చిన ఆ వార్త బెస్తవాడల్లో కలకలం రేపింది. విదేశ ప్రభుత్వం మన ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి వినగానే బెస్తలు, మిన్ను విరిగి మీదపడినట్లుగా తల్లడిల్లారు. అసలే శ్రమకు తగిన ఫలితమివ్వని పరిశ్రమ వాళ్ళది. ఆపై విదేశీయులు స్టీమ్ బోట్లపై, ట్రాలర్లపై వచ్చి సముద్రంలోని చేపల్ని, ఆధునిక విధానాలతో ఎడతెగకుండా తోడుకుపోతూంటే, తీరజలాల్లోని చేపల సంఖ్య నానాటికీ తరిగిపోడా... నాటు పద్దతిని చేసే చేపలవేటే కులవృత్తిగాగల పల్లెకారులు ఇంక ఏమి తిని బతకాలిట!?

ఎక్కడవిన్నా ఇదే ప్రశ్న! భారతదేశపు తూరుపు తీరంలో కన్నా పశ్చిమ తీరంలో నార్వే నుండి వచ్చిన మరపడవల జోరు ఎక్కువగా కనిపించింది. కేరళ లోని విద్యావంతులైన భారతీయ మత్యకారులు ఈ అన్యాయాన్ని చూస్తూ సహించలేక తిరుగుబాటుకు తయారైపోయారు.

ముందుగా, “ఇది ఉచితం కాదు, మా కడుపులపై కొట్టొద్దు” అంటూ ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పంపుకున్నారు. కానీ ఫలితం శూన్యం. ప్రభుత్వం నుండి ఏ స్పందనా లేదు. ఒక్క అర్జీకి కూడా జవాబు రాలేదు. దాంతో స్వయంగా తామే విదేశీయుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డారు కడుపులు మండిన దేశీయజాలర్లు. ఆకలికి మలమలా మాడి, కృంగి, కృశించి చచ్చినకంటే - న్యాయం కోసం  పగవాళ్ళతో తలపడి, విజయమో వీరస్వర్గమో తేల్చుకోడమే ఉచితమైన పని - అనుకున్నారు వాళ్ళు. ముందుగా భారత దేశపు పశ్చిమ తీరంలో మొదలయ్యింది ఘర్షణ. కేరళ రాష్ట్రంలోని మత్యకారులు గుండెనిబ్బరంతో విదేశీయులకు ఎదురు నిలిచారు. ఇరు పక్షాలమధ్య పోరు మొదలయ్యింది.

రోజూ సరిగా రామమందిరంలోని రేడియోలో వార్తలు చదివేవేళకి మంచినీళ్ళు తేడానికి బిండి చేతపట్టుకుని వెళ్ళేది రాధమ్మ. వార్తలు విని, ఆకళించుకుని బిందితో మంచినీళ్ళు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేది.

రాధమ్మ నోట వార్తలు వినడానికి వాళ్ళ ఇంటిగుమ్మంలో బెస్తవాడలోని పెద్దమనుషులు కొందరు ఎదురుచూస్తూ ఉండేవారు. అనాలోచితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బెస్తలకు వచ్చిన ఇబ్బందిని, సాటి బెస్తలు దాన్ని ప్రతిఘటించి పోరాడుతున్న విధానాన్ని, ఇంకా ఇతరములైన వార్తలని "అరటిపండు ఒలిచి అరచేతిలో ఉంచిన తీరుగా", వారికి చక్కగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పేది రాధమ్మ. బెస్తవాడలోని జనం వార్తల్లోని విషయాలే చర్చించుకునీవాళ్ళు వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా. ఇక్కడివాళ్ళు పశ్చిమతీరంలోని ఉద్యమకారులకు సానుభూతి పరులుగా ఉండి, వాళ్ళ విజయం కోరి దేవుణ్ణి ప్రార్ధించేవాళ్ళు.

ఎప్పటిలాగే,  కొంత ఆస్తినష్టం, ధననష్టం, ప్రాణనష్టం, పరువునష్టం అయ్యాక తమ తప్పు తెలుసుకున్న మన ప్రభుత్వం - పూర్తిగా ఒప్పందం రద్దు చెయ్యకుండా - ఉభయతారకంగా ఉండే విధంగా సముద్రంపై ఒక "లక్ష్మణ రేఖ"ను గీసి, ఆ గీత దాటి లోని జలాలలోకి ఎట్టి పరిస్థితిలోనూ మరపడవలు వచ్చి వేట చేయకూడదని ఖండితమైన ఆంక్ష పెట్టింది. అది మొదలు తీరం నుండి ముఫ్ఫైకిలోమీటర్ల వరకు నాటుపద్దతిలో వేటచేసే జాలర్లకు వదలి, ఆ పైనున్న సముద్రంలో మరపడవలతో తమ వేట చేసుకోవచ్చు నార్వేదేశపు జాలర్లు - అన్నారు. ఇరుపక్షాలవారి మధ్య రాజీ కుడిరింది. సమస్య తీరింది. బెస్త వాడలన్నీ జయజయ ధ్వానాలతో ఊరేగింపులు జరిపి పండుగ చేసుకున్నాయి.

# # # # # # # # #

రుద్రయ్య పడవకు కామందు అయినాకా అతని సంపాదన బాగా పెరిగింది. కానీ, ఏటేటా పెరుగుతున్న పిల్లలతో, ఆకాశాన్నంటిన ధరలతో ఎంత సంపాదించినా ఖర్చుకూడా దానికి బరాబరీగా పెరుగుతూనే ఉండడంతో, పెద్దగా మిగిలేదేమీ ఉండక అతడు అసంతృప్తి పడుతున్నాడు. అచ్చమ్మ మాత్రం, ఇదివరకులా,  ప్రతీ చిన్నదానికీ, పెద్దదానికీ కూడా డబ్బుకి తడుముకోవలసిన అగత్యం ఇప్పుడు తప్పిపోయిందికదాని సంతోషించింది. కానీ ఆమెకు కూడా ఒక చింత మిగిలి ఉంది - 

పెళ్ళయి నాలుగేళ్ళు దాటినా కూడా ఇంకా చుక్క కడుపు పండలేదు. రావిచెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా, దేవుళ్ళకు ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని తాయెత్తులు కట్టించినా, ఎన్ని దిగదుడుపులు తీసిపోసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది - అదే ఆమె బెంగ. దానికి తోడు, ఆ వాడకట్టునున్న అమ్మలక్కలందరూ తలోరకం మాటా అంటూండడంతో ఆమెకు పుండుమీద కారం రాసినట్లై బాధపడసాగింది.

అది చాలనట్లు గవరయ్య అనాలోచితంగా ఎక్కడో అన్న పొల్లుమాట ఒకటి ఆమె చెవిని చేరింది.

యధాలాపంగా మాటల మధ్యలో గవరయ్య, తన మొదటి భార్య రోగిష్ఠిది కావడంతో తనకు పిల్లరు లేరు అనుకుంటే ఈ రెండవ భార్య ఏకంగా గొడ్రాలే కాబోలు - అన్నాడుట!

నెమ్మదిగా ఆ మాట బయటపడి, అమ్మలక్కలు చెవులు కొరుక్కోడం మొదలు పెట్టారు. అసలే తలవాల్చుకు తిరిగే చుక్క తల మరింతగా వాలిపోయీలా చేసింది అది. అచ్చమ్మ ఆ మాట అసలు ఇంతపిసరు కూడా జీర్ణించుకోలేకపోతోంది.

అచ్చమ్మ అంత తేలికగా పరాజయాన్ని ఒప్పుకునే మనిషి కాదు. వెంటనే చుక్కను తీసుకుని, పట్నంలోఉన్న పెద్దాసుపత్రికి బయలుదేరింది. పరీక్షలన్నీ జరిపించి, నాల్రోజులుపోయాక వస్తే ఫలితాన్ని తెలియజేస్తాము- అని చెప్పి వాళ్ళని ఇంటికి పంపేశారు ఆసుపత్రి వాళ్ళు.

# # # # # # # # #

కొత్తనీరు వచ్చి పాతనీటిని వెళ్ళగొడుతుంది - అన్నట్లు, భేతాళుడి రాకతో, బెస్తవాడలోని గుసగుసలు చుక్కమీదనుండి భేతాళుడిమీదకు మళ్ళాయి. ఒకానొక అసురసంధ్య వేళలో, కబురూ కాకరకాయీ - ఏమీ లేకుండా, ఉరమని పిడుగులా హఠాత్తుగా వాడు ఊరిలోకి వచ్చి పడ్డాడు.

దీపాలవేళ అయ్యిందని, చిమ్నీబుడ్డి వెలిగించి గడపలో పెడుతూ, గుమ్మంలో నిలబడివున్న భేతాళుణ్ణి చూసి, ఏ దెయ్యాన్నో, భూతాన్నో చూసినట్లుగా బేజారై, కొయ్యబారి చేష్టలుదక్కి ఉన్నచోటనే నిలబడి ఉండిపోయింది నీలమ్మ. తేరుకుని, ఏమీ మాటాడకుండా వెనుదిరిగి లోపలకు వెళ్ళిపోయింది.

పిలవని పేరంటానికి వచ్చిన ముత్తైదువులా, ఏ పలకరింపూ లేకపోయినా తనంతట తానే ఇంటిలోకి ప్రవేశిస్తూ, "అప్పా! బావున్నావా" అంటూ నవ్వుతూ పలకరించాడు నీలమ్మను. 

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు