Kummi

ధారావాహిక నవల

గత సంచిక తరువాయి »

అక్కడ విజిటర్స్ కై ఏర్పాటు చేసిన బెంచీల్లో, ఒక బెంచీన ఆ చివర, ఈ చివరగా ఆ ఇద్దరూ కూర్చున్నారు.

తమ మాటల మధ్యన శేఖర్, "మీరైనా కాస్త బ్రాడ్ గా ప్రవర్తించవలసింది. మీరు ఒప్పుకొని ఉంటే మీ బిట్టు ఉరిని చేపట్టేవాడు కాదు" అని అన్నాడు.

"బిట్టు ఆలోచన అలా ఉంటుందని నాకు తెలియనే తెలీదు. కనీసం తను అట్టి అఘాత్యంకు మొగ్గి ఉన్నట్టు ప్రవర్తించనూ లేదు. అలా ఐతే నేనే ఏదోలా సర్ది చెప్పి బిట్టును అటు పోకుండా తప్పక ఆపేదాన్ని" అని చెప్పింది కుమ్మీ.

"అంతంతే. క్షణికావేశాలు, అనాలోచనలు. ప్చ్" అని అనేశాడు శేఖర్.

కుమ్మీ, "నా దురదృష్టం" అని అంది.

"అయ్యో అలా అనుకోకండి. డీలా పడవద్దు. ఆ టాపిక్ కదిపి మిమ్మల్ని కలిచి వేస్తున్నట్టు ఉన్నాను నేను. సారీ" అన్నాడు శేఖర్.

"అలా అనుకోకండి. అనకండి. మిమ్మల్ని చూసిన తర్వాత బిట్టు బాగా గుర్తు వస్తున్నాడు. మీతో మాట్లాడితే ఏదో కుదురు కుదురుతోందని వచ్చాను ఇలా. మీ టైంను నేనే వృధా పరుస్తున్నాను" అని చెప్పింది కుమ్మీ.

"ఇలా మనం మాట్లాడుకోవద్దు ఇకపై. వీలుతో తప్పక కలుద్దాం. మీకు నా వైపు నుండి అంతా హాపీయే. మీ మనసు ఎఱిగాను. ఫ్రీగా మూవ్ కండి" అని చెప్పాడు శేఖర్ నవ్వుతూ.

"థాంక్సండీ." అని అంది కుమ్మీ.

తర్వాత వాళ్లు కొంతసేపు మాట్లాడు కున్నారు. పిమ్మట, "మరి వస్తాను" అంటూ లేచింది కుమ్మీ.

శేఖర్ లేచాడు. "సరే! టేక్ కేర్" అన్నాడు.

పిదప, ఆ ఇద్దరు ఎవరి దారి వారు పట్టారు.

************

ఆ తర్వాత, ఒక మారు, వరుసగా మూడు రోజులు సెలవులు కుదరడంతో కుమ్మీ తన తల్లిదండ్రులు వద్దకు వెళ్లింది.

ఐనా, శేఖర్ గురించి వాళ్ల వద్ద ఎత్తలేదు.

కానీ, కుమ్మీ పెళ్లి విషయం మాత్రం ఆమె తల్లిదండ్రులు మళ్లీ ఎత్తారు.

ఈ మారు, కుమ్మీ అయిష్టంగా మాట్లాడలేదు. సరి కదా ఈ మారు వచ్చినప్పుడు తేల్చి చెప్పుతానని మాట ఇచ్చింది.

ఆ తల్లిదండ్రులు సంబరమయ్యారు.

************

ఆ సెలవులు తర్వాత, తిరిగి స్కూలుకు వచ్చిన కుమ్మీ, రెండు రోజులు పిమ్మట, శేఖర్ని కలిసింది, పలుమార్లు హోంవర్కు చేసుకొని.

ఈ మారు, ఆ ఇద్దరూ అనుకొని, ఒక కాఫీ షాపులో కలుసుకున్నారు.

ఆ కాఫీ షాపులో, ఓ ఓరగా కూర్చుని కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

"ఏదో అడిగి తెలుసుకోవాలి, అందుకు మనం కలవాలన్నారు. కానీ ఇంత వరకు ఏవేవో మాట్లాడుతున్నాం" అన్నాడు శేఖర్ ఇంకా కుతూహలాన్ని నొక్కిపట్టలేక.

"అదే, మీ గురించే తెలుసుకుందామని" చెప్పింది కుమ్మీ మెల్లిగా.

"నా గురించా. ఇది వరకే చెప్పానుగా" అన్నాడు శేఖర్.

"అవి కాదు. మీ పర్సనల్ విషయాలు" అంది కుమ్మీ.

"ఏం చెప్పాలి" అని ఆగాడు శేఖర్.

అప్పుడే కుమ్మీ, "నాకు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఉన్నారు. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు.  అన్నయ్యది మిలట్రీ జాబ్. అందుకే తను వదినతో కలిసి మన హిమాలయాల వైపు బోర్డర్లో ఉంటున్నాడు. నేను డిగ్రీ చదివాను. ప్రయివేట్ కాన్వెంట్లో టీచర్ గా జాబ్ చేస్తున్నాను. ఇక మీకు తెలిసిందే. నేను, బిట్టు ప్రేమించుకోవడం, మా పెద్దల చొరవ అందక, మేము పెళ్లి చేసుకోలేకపోవడం, బిట్టు నా సహకారం అందక చనిపోవడం" అని చెప్పి ఆగింది కుమ్మీ.

"ఓ పర్సనల్ అంటే ఇలాంటి డిటేల్సా. సరే, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ గృహిణి. నాన్నది ఓ బట్టల షాపులో క్లర్క్ లాంటి జాబ్. వాళ్లు మా ఊరులో సొంత ఇంటిలో ఉంటున్నారు. నాకు తోబట్టువులు లేరు. నేనూ డిగ్రీ చేశాను. ఆఫీస్ అసిస్టెంటుగా జాబ్ చేస్తున్నాను. ఈ ఊరులో ఒక రూంలో ఉంటున్నాను. నాకు పెళ్లి ఐంది." అని చెబుతున్న శేఖర్ కు అడ్డై,

"మీకు పెళ్లయ్యిందా" అని అనేసింది కుమ్మీ గమ్మున.

"ఐంది. నా భార్యకు ఫస్ట్ డెలివరీ. ఎంతగానో ఎదురు చూపులు. అంతలోనే ఏదో ఆటంకం. తల్లి, బిడ్డ ఇద్దరూ దక్కలేదు చివరకు" చెప్పాడు శేఖర్ చాలా అలజడిగా.

కుమ్మీ వెంటనే ఏమీ మాట్లాడలేక పోయింది.

శేఖరే ఆగి, "నాకు ప్రాప్తం అంతే" అని అన్నాడు.

"సో సారీ" అంది కుమ్మీ.

శేఖర్ ఏమీ అనలేదు.

కొంత సేపు పిమ్మట, "మళ్లీ కలుద్దాం." అంది కుమ్మీ భారంగానే.

సరే నన్నాడు శేఖర్.

************

మర్నాడు -

తన నాన్న ఫోన్ చేయగా కుమ్మీ ఎకాఎకిన ఇంటికి బయలుదేరింది. తన అమ్మకు ఒంట్లో బాగోలేదట.
ఇంటికి వెళ్లే సరికి హడావిడిగా ఉంది అక్కడ.

లోకల్ డాక్టర్ పట్నం హాస్పిటల్ కు వెంటనే తీసుకు వెళ్లమన్నాడు.

కుమ్మీ తన నాన్నతో కలిసి వచ్చి, అమ్మను తను ఉంటున్న పట్నం హాస్పిటల్లోనే చేర్పించింది.

వైద్యం జరుగుతోంది. ఆవిడకు బిపి, సుగర్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతున్నాయి.

వెళ్లి స్కూలుకు సెలవ్ పెట్టి వచ్చింది కుమ్మీ.

ఆ సాయంకాలంకు కుమ్మీ అమ్మ ఆరోగ్యం నిలకడకు వచ్చింది.

అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

డాక్టర్ల సూచన మేరకు మర్నాడు కూడా హాస్పిటల్ లోనే ఉంది కుమ్మీ అమ్మ.

కుమ్మీ స్కూలుకు వెళ్లి తన సెలవును మరో రెండు రోజులుకు పొడిగించుకుంది. తిరిగి స్కూలు నుండి హాస్పిటల్ కు వస్తోంది. అప్పుడే, శేఖర్ ఆమెకు తారసపడ్డాడు.

కుమ్మీ వాలకం చూసి ఆమె ఎందుకో ఆందోళన పడుతోందని గ్రహించాడు శేఖర్. అదే అడిగాడు.

కుమ్మీ మొదట ఏదో చెప్పినా, శేఖర్ తిరిగి అడిగే సరికి, తన అమ్మ విషయం చెప్పేసింది.

కుమ్మీ కాదన్నా, వద్దన్నా, శేఖర్ మాత్రం కుమ్మీతో కలిసి, హాస్పిటల్ కు వచ్చాడు.

అలా శేఖర్ని చూసిన, కుమ్మీ తల్లిదండ్రులు హడలిపోయారు.

కుమ్మీ నెమ్మదిగా చెప్పింది వాళ్లకు శేఖర్ సంగతిని.

"మరీ ఇంతగా మక్కికి మక్కియా" అన్నాడు కుమ్మీ నాన్న.

"బిట్టూ బాబే అనుకున్నాం బాబూ" అంది కుమ్మీ అమ్మ.

శేఖర్ నవ్వేసి, "మరే నేనూ బిట్టూ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను" అని అన్నాడు వాళ్లతో.

తర్వాత, కొన్ని కబుర్ల పిమ్మట శేఖర్ లేచి, "నేను ఆఫీసుకు వెళ్లాలి. వస్తానండి" అని, కుమ్మీని చూస్తూ, "మీకు ఏ అవసరమైనా ఫోన్ చేయండి" అంటూ తన ఫోన్ నెంబరు చెప్పాడు. పైగా ఆ నెంబరు కుమ్మీ తన ఫోన్లో ఫీడ్ చేసుకున్నంత వరకు ఉండి వెళ్లాడు.

అలా వెళ్లిన శేఖర్ గురించి ఆ ముగ్గురూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

చివరగా కుమ్మీ నాన్న, "ఏదైనా మన హద్దుల్లో మనం ఉందాం. ఆ బిట్టు వాళ్ల వాళ్లకు ఈ శేఖర్ కంట పడితే ఎలా ఉంటుందో. ఐనా మనకు ఎందుకులే అంత వరకు. ఇక్కడితో వదిలేద్దాం" అని అన్నాడు కాస్తా గట్టిగానే.

కుమ్మీ ఏమీ అనలేదు.

************

ఆ మర్నాడు -

కుమ్మీ తన తల్లిదండ్రులును తిరిగి తమ ఊరికి తీసుకు వెళ్ళి దిగపెట్టింది. అలాగే తన అన్నయ్య తన తల్లిదండ్రులకై తన బాంక్ అకౌంట్లో జమ చేసిన డబ్బును డ్రాచేసి, దానికి తనూ కొంత కలిపి, అదే చెప్పి, తన తల్లిదండ్రులకు ఆ మొత్తాన్ని అంద చేసింది. ఆ సాయంకాలమే తిరిగి తను పట్నం బయలు దేరింది.

అప్పుడూ ఆమె నాన్న, "జాగ్రత్త తల్లీ. దేనికీ ముందులా తొందర పడకు" అని అన్నాడు హెచ్చరికలా.

కుమ్మీ మాత్రం తన నాన్న, శేఖర్ ను దృష్టిలో పెట్టుకొనే అలా చెప్పాడు అని అనుకుంది. ఐనా "అలానే" అని అనేసింది.

************

కుమ్మీ తిరిగి తన రూమ్ కు చేరే సరికి, తన రూమ్మేట్ రూంలో కనిపించగానే, "ఎప్పుడు వచ్చావు మీ ఊరు నుండి. ఎలా ఉంది మీ నాన్నగారికి" అని అడిగింది.

"అర గంట అవుతోంది. ఇప్పుడు బాగానే ఉంది మా నాన్నకు. ఏమిటి ఈ మధ్య నువ్వూ ఊరు వెళ్లావా" అని అడిగింది ఆ రూమ్మేట్ కుమ్మీ చేతిలోని బాగ్ చూసి.

కుమ్మీ ఈ మధ్య జరిగింది చెప్పింది.

"అవునా." అని అంది ఆ రూమ్మేట్.

************

మర్నాడు -

స్కూలుకు వెళ్లిన కుమ్మీ సాయంకాలం తిరిగి తన రూంకు వచ్చేసింది నేరుగా.

రాత్రి తన అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది.

కుమ్మీ మాట్లాడింది.

అప్పుడే తన అన్నయ్య, "తల్లీ నాన్నతో ఇప్పుడే మాట్లాడేను. అచ్చు బిట్టులా ఉన్నారట ఆ శేఖర్ ఎవరో. నాన్న, అమ్మ ఎందుకో బెదురుతున్నారు. నేను వాళ్లకు చెప్పాలే. నాన్న నీకు త్వరగానే సంబంధం సెటిల్ చేస్తానంటున్నాడు. ఒప్పుకో. పెళ్లి చేసుకో. ఏ హైరానా ఉండదు." అని చెప్పాడు.

కుమ్మీ ఊఁ కొట్టింది. తర్వాత అటు వైపే ఆ ఫోన్ కట్టయ్యింది.

కుమ్మీ కళ్లు మూసుకుందే కానీ తనకు నిద్ర పట్టడం లేదు. శేఖర్ కోసమే ఆలోచిస్తుంది.

శేఖర్లో బిట్టు కనిపిస్తుండడంతో నిజంగా శేఖర్ వైపు మొగ్గింది కుమ్మీ. కానీ అతనికి పెళ్ళి కావడం, భార్య చనిపోవడం తెలియడంతో కాస్తా తగ్గింది. ఐనా తర్కించుకుంటుంది.

బిట్టు రూపం కుమ్మీ మనసున మరుగున పడడం లేదు.

************

మర్నాడు -

స్కూలుకు వెళ్తున్న కుమ్మీకి ఎదురు వచ్చాడు శేఖర్.

"మీ అమ్మగారికి ఎలా ఉంది" అని అడిగాడు.

కుమ్మీ, "తగ్గింది. ఇంటి దగ్గర దింపి వచ్చాను కూడా" అని చెప్పింది.

"అవునా. ఇక్కడే మీ రూంలోనే రెండు మూడు రోజులు ఉంచి పంప వలసింది" అని అన్నాడు శేఖర్.

"వాళ్లు ఒప్పుకోరు. పైగా రూం చిన్నది. ఉంటుంది ఇద్దరం" చెప్పింది కుమ్మీ.

ఇద్దరూ నడుస్తున్నారు.

"మీకు ఫోన్ చేద్దామంటే మీ నెంబరు నా వద్ద లేదు. ఏదీ మీ నెంబరు చెప్పండి" అని అంటూనే తన ఫోన్ తీశాడు శేఖర్.

కుమ్మీ తన ఫోన్ తీసి శేఖర్ నెంబరుకు కాల్ చేసింది.

శేఖర్ ఫోన్ మోగగానే తన ఫోన్ కట్ చేసి, "అది నా నెంబరు" అని అంది కుమ్మీ.

శేఖర్ ఆ నెంబరును కుమ్మీ పేరున సేవ్ చేసుకున్నాడు.

స్కూలు రాగానే ఆగి, "నేను వెళ్తాను" అని చెప్పింది కుమ్మీ.

"అలాగే. మళ్లీ మరో మారు కలుద్దాం" అని చెప్పాడు శేఖర్.

తలాడించి స్కూలు వైపు కదిలింది కుమ్మీ.

శేఖర్ ఆఫీస్ వైపు నడిచాడు.

************

వారం తర్వాత -

ఉదయం -

స్కూలుకు వెళ్లేందుకు తయారవుతున్నప్పుడు, కుమ్మీ నాన్న నుంచి కుమ్మీకి ఫోన్ వచ్చింది.

"అమ్మా, పెళ్లి సంబంధాలు చూసే పెద్దాయన్ను కలిశాను. నీ ఫోటో, వివరాలు ఇచ్చాను. త్వరలో మంచి సంబంధం చూపుతానన్నాడు" అని తన నాన్న చెప్పగా, సరే అనేసింది కుమ్మీ.

ఆ తర్వాత, తన అన్నయ్య నుండి ఫోన్ వస్తే కుమ్మీ మాట్లాడింది.

కుమ్మీ అన్నయ్యదీ అదే సందేశం. పైగా, "అణుకువగా మసులు" అని కూడా అతడు చెప్పాడు.

************

సాయంకాలం -

స్కూలు కాగానే, నేరుగా వెళ్లి శేఖర్ని కలిసింది కుమ్మీ.

కుమ్మీ కోరిక మేరకు, ఆ ఇద్దరూ కాఫీ షాపులో ఓ కేబిన్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

"మంచిదే. అన్నీ కుదిరితే పెళ్లికి సమ్మతించండి" అని చెప్పాడు శేఖర్.

"నేను మీ వద్దకు వచ్చింది ఒక విషయమై మాట్లాడాలని" అని అనేసింది కుమ్మీ.

"ఏ విషయం. చెప్పండి" అని అడిగాడు శేఖర్.

"బిట్టు రూపం నన్ను వెంటాడుతోంది. ఆ తలంపులు మరవలేను" అని చెప్పింది కుమ్మీ.

"మీరు కాలంతో నడవండి. బిట్టుగారికై మీరు ఎంత ఆలోచించినా ఫలితం ఉంటుందా. మరిచి పోవాలి. తప్పదు. మనసును మార్చుకోవాలి. రాని దానికై, అందని దానికై ఆలోచించడం అవివేకమే" అని చెప్పాడు శేఖర్.

"మీరు కంట పడిన తర్వాత నాకు మరింత చేరువయ్యాడు బిట్టు" అని చెప్పేసింది కుమ్మీ.

"మా రూపాలు ఒకటైనా నేను బిట్టును కాను. బిట్టు బిట్టూయే. నేను నేనే. ఆ తేడా గుర్తించండి. రూపాలు కాదు. మనసులు కావాలనుకోవాలి" అని అన్నాడు శేఖర్.

ఒక్క నిమిషం ఆగి, "తప్పక సూటిగా అనేస్తున్నాను. ఎంతో తర్కించుకొనే వచ్చాను కూడా. మీతో ఉంటే బిట్టుతోనే నేను ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఇక ఏ వెలితీ ఉండదనుకుంటున్నాను." అని చెప్పేసింది కుమ్మీ.

"అదే, అందుకే ముందే చెప్పాను. రూపాలు వద్దు. మనసులు కావాలి అని" అని చెప్పాడు శేఖర్.

"ఏం మీ మనసుకేం. మీరూ చక్కగా నన్ను ట్రీట్ చేస్తున్నారుగా. నాకు మీ సాయం  కూడా అందిస్తామంటున్నారుగా" అని అంది కుమ్మీ.

"నిజమే. ఓ, మీరు మీకు తగ్గట్టుగా అన్వయించుకుంటున్నారు. నా భావం మరోటి" అని చెప్పాడు శేఖర్.

 

.... సశేషం ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు