హెచ్చరిక
- ఆచంటహైమవతి

 


"ఒద్దు గిరీష్ ....! పారిపోవటం మన సమస్యకు పరిష్కారం కాదు. నువ్వు గౌరవప్రదమైన ఇంటి కొడుకువి. నా స్థితికి కూడా ఆ విషయం సరైన పరిష్కారం కాదు కూడా! ఎందుకంటే .....మా అమ్మ, నాన్నల స్థితే మళ్ళీ నాక్కూడా రావాలని నేను అనుకోవటంలేదు. మనిద్దరం వెళ్లి మీ అమ్మ-నాన్నలని ఎలాగైనా ఒప్పిద్దాం! ఆ ఒప్పించటం ఒక్కసారే కాదు. ఎన్నిసార్లైనా సరే ఓర్పుగా వ్యవహరిద్దాం! అదే మన భవిష్యత్తుకు మంచిది" అంది కళ్యాణి పట్టుదలగా.

"వాళ్ళ సంగతి నీకు తెలీదు. నువ్వెన్నిసార్లు బతిమాలినా వాళ్ళు ఒప్పుకుంటారని నాకేమాత్రం నమ్మకం లేదు. ముందు మనం దూరంగా వెళ్ళిపోయి - గుడిలో పెళ్లి చేసుకుని, సంసారం చేస్తూ....ఐదారేళ్ళ తర్వాత వద్దాం! అప్పటికి వాళ్ళ మనస్సులు మారి మనల్ని ఆదరించవచ్చననిపిస్తోంది" అన్నాడు గిరీష్.

"మావాళ్లు లోకాన్నెదిరించి ప్రేమవివాహం చేసుకుని ఏమీ సుఖపడలేకయారు. సరైన ఉద్యోగం దొరక్క మానాన్న, మరీ పాచి పనులకు వెళ్లలేక మా అమ్మ, ఇద్దరూ పస్తుల పాలై.... నీరసించి నాకు దక్కకుండా పోయారు. నాకు మాత్రం కొంచెం అన్నం పెట్టి, వాళ్ళు నీళ్లు తాగి పడుకోవటం గుర్తించి కూడా మనసులో బాధపడటం తప్ప నేనేమీ చేయలేకపోయాను !

చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుని తిరిగి చెప్పసాగింది కళ్యాణి "నా పేరు మాబామ్మ పేరే! అలా ఆమె పేరు పెట్టుకుంటే మమ్మల్ని ఆదరిస్తారని అనుకున్నారు మావాళ్లు. కానీ .... అడ్డమైన వాళ్ళకీ నాపేరు పెడితే నేనూరుకోను. నన్నెదిరించిపోయిన వాళ్ళు నాశనమైపోతారు ... అని శాపనార్ధాలు పెట్టిందట మా బామ్మ. ఇవన్నీ 'చవి' చూశాను కనుకనే - మనం తొందరపడి విపరీతాలు చెయ్యకూడదని నిన్ను వేడుకుంటున్నాను" అంది కళ్యాణి.

వింటూ తలొంచుకుని ఊరుకున్నాడు గిరీష్. అతడి మౌనం అంగీకారసూచనగా అర్ధం చేసుకుంది కళ్యాణి.

"నాకు తెలిసున్న ఒకమ్మాయి - ఇంట్లో వాళ్ళందర్నీ కాదనుకుని, వెళ్ళిపోయి కోరిన ప్రియుణ్ణి పెళ్ళి చేసేసుకుంది. ఆ పిల్ల చాలా అహంకారి! ఓర్పుగా బతిమాలి పెద్దల్ని ఒప్పిద్దామని అనుకోలేదు. తనకీ, ప్రియుడికీ కూడా 'క్యాంపస్ సెలెక్షన్స్' లోమంచి ఉద్యోగాలు వచ్చాయి గదా- మాకు ఇంకేమి కావాలి? అనుకుని... పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశారు. ఆరునెలలు పూర్తికాకముందే చిన్న, చిన్న విషయాలకే గొడవలుపడి..విడిపోయారు. పెద్దవాళ్ళని బతిమాలి, ఒప్పించి...వాళ్ళతో కలిసి ఉంటే – పెద్దవాళ్ళు బాధ్యత వహించి ఇద్దర్నీ సమన్వయపరచి కాపురం నిలబెట్టి ఉండేవారు గదా?? ఇలాంటివన్నీ ఆలోచించే నేను ఓర్పుగా ఉండి, పెద్దవాళ్ళని ఒప్పించి, నచ్చచెప్పే పెళ్లిచేసుకుందామని తాపత్రయ పడుతున్నాను గిరీష్. మనవల్ల మీ ఇంటి గౌరవం చెడకూడదుగదా?" అంది కళ్యాణి....అదే తన నిశ్చయం అన్న భావం స్పష్టంగా తెలియజేసిందామె. బాగా ఆలోచించగా అదే మంచిదేమో అనిపించింది గిరీష్ కి కూడా!

******************

ఆ తర్వాత రెండు రోజులకి కళ్యాణిని తన ఇంటికి తీసుకువెళ్లి - తన కుటుంబసభ్యుల్ని పరిచయం చేసి, తను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు గిరీష్.

తన ఇంట్లో వాళ్ళు.... ముందు ఒకరికొకరు సైగలు చేసుకుని, మూతులు - ముక్కులు ఒంకర్లు తిప్పుకుని, కళ్ళెగరేసుకుని... అసంతృప్తిని వ్యక్తoచేశారు – కాని.. అవన్నీ గమనిస్తూనే ఉన్న కళ్యాణి వినయం, సౌజన్యంతో కూడిన మాటలు విని కొంత తృప్తి పడ్డారు.

గిరీష్తండ్రి "వింత మనుషులు, విపరీతపు బుధ్ధులూను" అంటూ ధుమ ధుమలాడుతూనే ఉన్నాడు. తను కళ్యాణి తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబాల్నీ బాగా తెలిసున్నవాణ్ణేననీ- వాళ్ళు చేసినది ముమ్మాటికీ తప్పేననీ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు.

ఆయన అలా తన తల్లిదండ్రుల్ని తిడుతుంటే బిడియంగా తలదించుకుంది కళ్యాణి.

గిరీష్తల్లి మాత్రం కళ్యాణి అణకువనీ, ఆ పిల్ల సుహృద్భావనాన్నీ గమనిస్తూనే ఉంది. ఆ పిల్ల వల్ల ఆ ఇంటి గౌరవానికి ఏ ముప్పూ రాదనే నిశ్చయానికి వచ్చింది. ఆ పిల్ల స్థితికి జాలి కూడా కలిగిందామెకు.

ఉన్నట్లుoడి కళ్యాణి రెక్క పట్టుకుని పెరట్లో ఒక మూలకి లాక్కుపోయింది. ఏమేం ప్రశ్నలు వేసి, ఏమేం బోధలు చేసిందోగాని -తిరిగివచ్చాక "నాకు ఇష్టమే"అని ప్రకటించేసింది. అంత తొందరగా ఆమె నుంచి ఆ ప్రకటన విన్న అందరూ ఒక్కక్షణం నిశ్చేష్ఠులైపోయారు.

భార్య అభిప్రాయం విని కూడా గిరీష్తండ్రి ముఖం చిట్లిoచుకుని అలాగే కూర్చున్నాడు.

"ఇంక నాపెత్తనం ఏముంది....? చెప్పిందిగా ఆవిడ... ఏదో ఒకటి ఏడవండి" అన్నాడు ఇంకా ధుమ ధుమలాడుతూనే!

ఈసారి గిరీష్తండ్రి రెక్కపట్టుకుని వంటింట్లొకి లాక్కుపోయింది . సావధానంగా కుర్చోపెట్టింది." మనం తెచ్చిన సంబంధం ఇంతకంటే గొప్పగా ఉంటుందని నమ్మకమేమిటి ? ఇంకో పిల్లయితే ఈ పిల్లంత అణకువగా ఉండకపోవచ్చు కూడా! పూర్వపు విషయాలొకసారి గుర్తుచేసుకొండి! మనం ఒకర్నొకరు ఇష్టపడినా-మనపెళ్ళికి మీనాన్న సులభంగా ఒప్పుకున్నాడేమిటి? అదే గొడవ మళ్ళీ ఇప్పుడు పునరావృతం కావాలా? మీ నాన్న ఇవ్వాల్సిన లక్షరూపాయలూ'మాఫీ 'చేస్తానంటే గాని.... మీనాన్న దారికి రాలేదని మీరు కూడా అంటుండేవారు. గుర్తు లేదా? ఎటొచ్చి.... పాపం ఆ పిల్ల దిక్కులేనిది కావటం వల్ల మీరు ఒప్పుకోవటంలేదు గాని, ఆ పిల్లలో పేదరికం తప్ప - లోపమేమిటో చెప్పండి ! తాను ఈ పెద్ద ఇంట్లో అడుగుపెట్టగలిగిందనే కృతజ్ఞతా భావంతో మనకి తప్పకుండా అనుకూలంగానే ఉంటుంది... కదా? ఆలోచన సమంజసమే కదూ?" అందామె.

"గొప్పింటి నుంచి 'శంకరి' ని తెచ్చుకున్నాం గదా! ఇప్పుడు ఈ పేదింటి పిల్ల'కళ్యాణి'ని చేసుకుందాం! ఆ పిల్ల అణకువ గలది. మనతో కలిసిపోతుందని నాకనిపిస్తోంది. చిన్న చిన్న కలతలు లేకుండా ఏ సంసారాలు నడుస్తాయి? అందరూ సర్దుకునేవాళ్ళైతే ఎంతెంత గొడవలైనా సమసి పోతాయ్! ఏమంటారు? పిల్లల ముచ్చట– మన బాధ్యత కూడా తీరుతుంది!" నచ్చచెప్తున్నట్లు అంది గిరీష్ అమ్మ.

చిరునవ్వు మొహంతో బయటికొచ్చిన తండ్రిని చూసి -"ఏం నాన్నా...ధుమ ధుమలాడుతూ లోపలికివెళ్ళావ్! ఇప్పుడు దరహాసవదనంతో బయటికొచ్చావ్? అమ్మ ఏమి మంత్రం వేసింది?" తండ్రి దగ్గర మరికాస్త చనువెక్కువున్న యమున ప్రశ్నించింది.

"మీఅమ్మ నామీద చతుర్విధోపాయాలూ ప్రయోగించి నన్ను లొంగతీసేసిందమ్మా! ఏం చెయ్యను? ఒప్పుకోక  తప్పలేదు. పూర్తిగా కాకపోయినా...మా ఇద్దరి కథకీ, ప్రస్తుత వీళ్లిద్దరికథకీ కొన్నిపోలికలున్నాయ్! ఇంకా వివరాలు కావాలంటే మీఅమ్మనే అడుగు!" అన్నారాయన.

ఈ సంభాషణ విన్న గిరీష్-కళ్యాణి ల ముఖాలు అరవిందాల్లా విఛ్చుకున్నాయ్!

అత్తగారి ముఖం చూసిన కళ్యాణికి "ఒప్పుకున్నాను గదా...అని తలపొగరుగా ప్రవర్తించకు. అందరి మనస్సులూ చూరగొనటం ఇక నీ బాధ్యతే సుమా? జాగ్రత్త!" అనే హెచ్చరిక కనిపించింది.

శిరసావహిస్తున్నట్లు అత్తమామల కాళ్లకు నమస్కరించింది కళ్యాణి.

"తమరు స్వప్నలోకాల నుంచి బయటకొచ్చి జరుగుతున్నది గమనిస్తారా హీరోగారూ!" అన్న  తండ్రి మాటలకు తత్తరపడుతూ...తను కూడా తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాడు గిరీష్సిగ్గుగా.

"ఉడుతాభక్తి బాగానే ఉంది గాని....భార్యావిధేయుడివిగా మాత్రం తయారుకాకు సుమా?" అనేసి ....భార్యని క్రీగంట చూస్తూ 'నాలాగ' అనేసి, నాలుక కొరుక్కుoటూ బయటికి వెళ్లి పోయాడు గిరీష్తండ్రి.

 

…. సశేషం ....

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు