Pakshula Prapancham


గత సంచిక తరువాయి »

పరిశోధకులకు దొరికిన శిలాజాల ఆధారంగా పక్షులు ‘జురాసిక్ యుగం - 150-200 మిలియన్ల కు పూర్వం నుండే పరిణామం చెందాయి.

పక్షులకు సంబంధించిన విజ్ఞానశాస్త్రాన్ని'ఆర్నిథాలజీ'అంటారు. పక్షుల శరీర నిర్మాణం చాలా చిత్రంగా ఉంటుంది. పక్షులు 'అంతరోష్ణ' లేదా 'ఉష్ణ' రక్తజీవులు. ఎగరడానికి అనుకూలంగా వీటి దేహం సాధారణంగా 'కదురు'(నూలు వడికే పనిముట్టు, A spindle) ఆకారం లోఉండి కుదించినట్లు అమరి ఉంటుంది.

వాయుగోణులు’ ఉండటాన శరీరం తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి పక్షుల  దేహంబరువు ను మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు [కాళ్ళవేళ్ళు వంపు తిరిగి ఉండి] ఉపయోగపడతాయి. శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి.

పాపం కొన్ని పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారమైనందున వాటి జీవన ప్రమాణానికి ముందే అవి మర ణించడం జరుగుతుంటుంది.

వీటిలో ముఖ్యమైనవి కోడి, కోడి గుడ్లు, బాతు, టర్కీ కోడి, ఈము, పావురం, నెమలి ఇంకా [కొందరు పిచ్చిక మాంసం కూడా తింటారు , ఇటీవల కాకి మాంసం కూడా] మొదలైన పక్షుల మాంసం కూడా మానవులు ఇష్టంగా తినడంవల్ల వాటి పెంప కమూ అధికంగానే ఉంటున్నది. పురాతన కాలం నుండీ పక్షుల్ని వేటాడుతుండటంతో కొన్నిపక్షి జాతులు అంతరించి పోయాయి. పక్షుల ఈకలు, దుస్తులు మరియు పరుపులు తయారు చేయనూ, కొన్ని రకాల ఎరువుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.

పూర్వం మహారాజులు 'హంసతూలికాతల్పా'లలో పవళించేవారు. హంస మెత్తని ఈకలతో వీటిని చేసే వారంటే ఎన్ని హంసలు ఖతమైపోయి ఉంటాయో ఊహించవచ్చు. చిలుక, మైనా వంటి రంగు రంగుల అందమైన పక్షులను పెంచుకోను కొందరు ఎంతో ఇష్టపడుతుంటారు. ఇది పెద్ద వ్యాపారంగా మారి కొన్నిఅరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించి పోయాయి. ఎందుకంటే ఆ పక్షులకు క్రొత్త ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు సరిపడక మరియు కొన్ని పక్షులు మానసికంగా కూడా క్రుంగిపోయి మరణించడం జరుగుతుంది. పునరుత్పత్తి శాతం కూడా క్రమేణా తగ్గిపోయి ఆ జాతులు అంతరించి పోయాయి. పావురాలను పురాతనకాలంలో వార్తాహరులుగా ఉపయోగించేవారు. అందుకే తెల్ల పావురాన్ని ‘శాంతి కపోతం’ అని కూడా పిలుస్తారు. ప్రయోగాల కోసం ఎక్కువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు.

నీటిలోని చిన్నచేపలను, నత్త గుల్లలనూ, ఎండ్రకాయలనూ, కప్పలనూ ఆహారంగా స్వీకరించి జీవించే పక్షులు అధిక కాలం, ఇంచుమించు రోజంతా నీటిలోనే ఉంటాయి. వీటిని నీటిపక్షులని వ్యవహరిస్తాం. బాతు, హంస, కొంగ వంటిని ఎక్కువగా నీటిలోనే ఉంటాయి.

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు