Sahithi Pudota

భాస్కర శతకము

 

తాలిమితోడుతం దగవు | దప్పక నేర్పరి యోప్పుదప్పులం
బాలన సేయుఁగా కటను |పాయవిహీనుడు సేయ నేర్చునే?
పాలను నీరు వేరుపరు | పంగ మరాళ మెరుంగుఁగాని మా
ర్జాల మెరుంగునే తదురు | చారు రసజ్ఞతబూన భాస్కరా!

తాత్పర్యము: ఓ భాస్కరా! పాలను, నీరును విడదీయుట హంస యొక్క సహజ లక్షణము. పిల్లి గొప్పదైననూ ఆ మిశ్రమమును విడదీయలేదు. అటులనే ఓర్పుతో తగవు యొక్క మంచి చెడులు విచారించి తీర్పు చెప్పుట విజ్ఞునికి సాధ్యముగాని, తెలివితక్కువ వానికి సాధ్యపడదు.

 

 

తాలిమితోడఁగూరిమిఁగృ | తఘ్నున కెయ్యడ నుత్తమోత్తముల్
మేలొనరించినన్ గుణము | మిక్కిలికీడగుఁ,బాముపిల్లకున్
బాలిడి పెంచినన్విషము | పాయఁగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంతకొక | చాయను హెచ్చునుగాక భాస్కరా!

తాత్పర్యము: ఓ భాస్కరా! పామునకు పాలు పోసి పెంచిననూ క్రమముగా దాని కోరలందు విషమే పెంపొందును. అట్లే మంచి వాడు ఓర్పుతో ప్రేమతో పాములాంటి చెడ్డవానికి మేలు చేసిననూ ఆ మేలు విషము వలే కీడునే పెంపొందించును.

 

 

తెలియని కార్యమెల్లఁగడ | తేర్చుట కొక్కవివేకిఁజేకొనన్
వలయునట్లైన దిద్దుకొన | వచ్చుబ్రయోజనమాంద్యమేమియుం
గలుగదు, ఫాలమందున దిల | కంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగిన జక్కఁజేసికొనుఁ | గాదె నరుండది చూచి భాస్కరా!

తాత్పర్యము: ఓ భాస్కరా! మనుష్యుడు నుదిటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతియందు గల అద్దము సహాయముతో ఆ బొట్టును సరిచేసుకొనవచ్చును. అట్లే, తనకు తెలియని పనిని నెరవేర్చుకొనుటకు ఒక నేర్పరి సహాయముతో ఆ పనులను చక్కపెట్టుకొని పని నిర్వహణలో ఎటువంటి లోపము ఆలస్యము లేకుండా చేసుకొనవచ్చును.

 

 

దక్షుఁడు లేని ఇంటికిఁ | బదార్థము వేఱొకచోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ | బలాయనమై చను గల్లగాదు, ప్ర
త్యక్షము వాగులున్ వఱద | లన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగి | నట్టితటాకములోన భాస్కరా!

తాత్పర్యము: ఓ భాస్కరా! కొండకాలువలు, నీటి ప్రవాహములు నుండి వచ్చిన నీరు విస్తారముగా చెరువులో చేరి గండిపడినచో ప్రవహించి పోవును! అట్లే, సమర్థుడైన యజమాని లేనిచో ఆ కుటుంబమునందు ఎంత సంపాదన ఉన్ననూ వ్యర్థముగా వ్యయమగును. ఏమియూ నిలువ ఉండదు.

 

 

దానపరోపకార గుణ | ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేక శూన్యునకు | లేములు వచ్చిన వేళ, సంపదల్
పూనినవేళ, నొక్కసరి | పోలును, జీకునకర్థరాత్రియం
దైన నదేమి, పట్టపగ | లైన నదేమియు లేదు భాస్కరా!

తాత్పర్యము: ఓ భాస్కరా! గ్రుడ్డివానికి అర్థరాత్రియైననూ, మిట్టమధ్యాహ్నమైననూ భేదము కొంచెము కూడా తెలియదు, కానరాదు. అట్లే ఇతరులకు ఇచ్చుట, ఉపకారము చేయు గుణములు లేని మానవునకు పేదరికము వచ్చిననూ, భాగ్యము వచ్చిననూ కొద్దిగా కూడా తేడా ఉండదని భావము.


వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

.....సశేషం.....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు