Sravanthi

 

గోవు

   
తే.గీ.

సకలదివ్యత్వరూపంబు; జనని కన్న
మేలు చేసెడి మాత యీ మేదినిపయి
గోవు; గోపూజ హరిపూజ; గోప్రదక్షి
ణంబు భూప్రదక్షిణసమానంబు గాదె?

   
తే.గీ.

గోవు లెచ్చట సుఖమయజీవనంబు
గడపు నట దేవతల్ కలకాల ముండి
సర్వ శుభములు చేకూర్చి సంతసింతు
రట్టి గోసేవకన్న భాగ్యంబు కలదె?

   
కం.

గోపాలకుఁడై వర్తిలె
శ్రీపాలకుఁడైన హరియె; చెల్వొందు కదా
గోపృష్ఠమందు లక్ష్మియు;
మూపురమున బ్రహ్మ; కంఠమున భారతియున్

   
కం

గోదానపుణ్యవశమున
కాదా వైతరిణి దాటఁగల్గును జీవుం
డేదైన కార్యసిద్ధికి
ఆ దేవతలైన సల్పరా గోపూజన్?

   
ఆ.వె.

ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యియు పంచి
తంబు, గోమయంబు తథ్య మొసఁగు
తుష్టి పుష్టి శుద్ధి దోషపరీహార
మావు సృష్టి లోనె అమృతవరము

 

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు