Teneloluku


మన మనసులోని ఆలోచనలను అక్షరరూపంలో వ్యక్తీకరించడానికి భాష అవసరం ఉంది. అదీ మాతృభాష, అమ్మ, నాన్నలు పలుకరించిన భాష అయితే ఆ భావ వ్యక్తీకరణ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. సులభతరంగానూ ఉంటుంది. మన పూర్వీకులు అందించిన ఆచార సంప్రదాయాలే మన భాషకు మరో భాష్యాలు. సాహితీ రచనలు ఎంత సులభతరమైన భాషలో ఉంటే అంతగా జనాదరణ పొందుతాయి. అట్లని అర్థంపర్థం లేని పదాలు, వాక్యాలు వాడి కవితలు, రచనలు చేస్తే అదే జనులు చీత్కరించుకునే అవకాశం కూడా ఉంది.  మన ఆచార వ్యవహార సంప్రదాయాలపై అవగాహన పెంచుకొని ఆచరించడం అనేది అత్యంత ముఖ్యమైనది. ఎవరో చెప్పారు, ఎందుకో అర్థం కాకుండా ఆచరిస్తే, ఆ సంప్రదాయం యొక్క ముఖ్యోద్దేశం మరుగునపడిపోతుంది. భాష కూడా అంతే. మనం పలికే, వాడే ప్రతి పదానికి సరైన భావం, అర్థం తెలుసుకొని తీరాలి. అపుడే భాష మనుగడ కూడా స్థిరంగా ఉంటుంది.

ఈ మధ్యన నేను లక్ష్మీదేవి దేశాయి గారి వెబ్ పేజి ని చూశాను (క్రింద లింక్ ఇచ్చాను) అందులో మన తెలుగు సాహిత్యంలో చేసిన ఒక ప్రక్రియ ఎంతగానో నన్ను ఆకొట్టుకుంది.

సాధారణంగా మొదటినుండి చివరకు, చివరినుండి మొదటికి, ఎటువైపునుండైనను ఒకే రకంగా ఉండే అక్షరాలు ఉన్న పదాలను చూశాము (ఉదా: వికటకవి ). అయితే పారిజాతాపహరణం లో నందితిమ్మన గారు ఏకంగా పద్యాలనే మొదటి అక్షరం నుంచి చివరికి, చివరి అక్షరం నుంచి మొదటికి అక్షరాల క్రమం ఒకేలా ఉండేటట్లు వ్రాశారు. అదే మన భాష యొక్క గొప్పదనం, మన సాహితీ పండితుల అత్యద్భుత పరిశోధనా పటిమ.  ఆ పద్యాలను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.

http://mandaakini.blogspot.in/2009/01/blog-post_24.html?show

ఇటువంటి ప్రక్రియను నాటినుండి నేటివరకు అనేకమంది కవులు తమ రచనలలో చూపిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఇటువంటి విభిన్న ప్రక్రియలను మన పండితులు తమ రచనలతో సృష్టిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారు రచించిన క్రింది పద్యం గమనించండి. ఈ పద్యం చదువుటకు మన పెదవులను కలపనవసరం లేదు. ధన్యవాదములు మూర్తి గారు.

------ ------ ------ ------

నిరోష్ఠ్యకందము
కరినరసురనాథశ్రీ
కర! శరధరనీలగాత్ర! కరుణాశరధీ!
శరధితనయేశ! శశధర
ధరనుతగుణనికర! ధరణిధరధరధీరా!

ఈపైన వ్రాసిన నేను రచించిన పద్యాన్ని చదవడానికి పెదవుల అవసరము లేదు. చదివి చూడండి. మీకే
తెలుస్తుంది. ఇది చిత్రకవిత్వములో ఒక ప్రక్రియ.

ఇక దీని అర్థం చూద్దాం.

కరి(ఏనుగు) నర(మానవ) సుర(దేవతల) నాథ (అధిపతులకు) శ్రీకర! (శుభము కలిగించిన వాడా!),
శరధర (నీటిని ధరించు మేఘము వంటి) నీలగాత్ర! (నీలిరంగు శరీరము కలవాడా!), కరుణా (కరుణకు)
శరధీ (నీటికి నిలయమైన సముద్రమా! అంటే అపారమైన కరుణ కలవాడా!), శరధితనయేశ! (సాగరపుత్రి
యైన లక్ష్మికి భర్తయైనవాడా!) శశధరధర(కుందేలును ధరించిన చంద్రుని ధరించిన ఈశ్వరునిచే)నుత (నుతింపబడిన)గుణనికర! (గుణములు కలవాడా!) ధరణిధర (కొండను) ధర (ధరించిన) ధీరా (ధీరుడా!)

ఇది విష్ణువుని వర్ణించే పద్యము. ఇందులో గజేంద్రమోక్షణము, గోవర్ధనోద్ధరణం, త్యాగరాజు పాడిన “భవనుత నా హృదయమున...” అను కీర్తనలోని సంబోధన, విష్ణు లక్షణాలు కూర్పబడ్డాయి.

 

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు