tookiga


కృషితో నాస్తి దుర్భిక్షం – పట్టుదలే ఉంటే కాగలరు మరో బ్రహ్మ

latha bhagavan

జీవన్మరణ సమస్యలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మనమీద మనకు నమ్మకం ఏర్పరచి ఆ సమస్యలను ఎదుర్కొని నిలబడేట్టు చేస్తాయి. ఈ నిజసూత్రం అతి కొద్దిమందికి మాత్రమే అవగతమౌతుంది. కష్టాల ఊబిలో ఇరుక్కున్నప్పుడు మానసికంగా కృంగిపోయి ఏమీ చేతగాక మనలో చాలావరకు నిస్సహాయులుగా ఉండిపోతాము. అయితే మనలో ఉన్న మానసిక ధైర్యానికి శారీరక బలం తోడైతే, ఏ వయసులోనైనా, ఏ పరిస్థితులలోనైనా అనుకున్న విజయాన్ని సాధించవచ్చు అని 65 ఏళ్ల వయుసులో నిరూపించిన శ్రీమతి లతా భగవాన్ ఖరే నిజంగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత.

మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో ఒక గ్రామంలో ఉండే శ్రీమతి లతా భగవాన్ ఖరే తన భర్త, ముగ్గురు ఆడపిల్లలతో ముచ్చటైన సంసారంలో జీవిస్తూ ఉండేది. యుక్తవయస్సు వచ్చిన తరువాత అందరిలాగే ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లకి పెళ్లిళ్లు చేశారు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్న చందాన ఉన్న ఆడపిల్లలు ఆత్తవారింటికి వెళుతూ అప్పులను వారికి తోడుగా ఉంచి వెళ్ళారు. భార్య భర్తలు ఇరువురు కష్టపడుతూ ఆ అప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో భర్త అనారోగ్యంతో మంచానపడ్డాడు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అతని భార్య అతన్ని తీసుకువెళ్లింది. రెండు రోజుల్లోనే నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ అసుపత్రి లో సరయిన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమయిన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతిలోని 'టెర్మినల్ హాస్పిటల్' కి వెళ్ళి కీలకమయిన పరీక్షలు చేయించడం అత్యవసరం అని చెప్పారు.

latha bhagavanఅసలే డబ్బుకు గడ్డు రోజులు. ఇప్పుడు వేలకు వేల రూపాయలు రోగపరిక్షలకు వెచ్చించాలంటే ఎలా? ఆ సమయంలోనే ఒక చిన్న న్యూస్ పేపర్ మీద ఉన్న ఒక ప్రకటన ఆమెను ఆకర్షించింది. “బారామతి మారథాన్ గెలవండి_3000 వేలు నగదు పొందండి” అని ఉన్నది. అక్కడే ఆమెలోని ఆత్మవిశ్వాసం మేల్కొంది. ఒక నిర్ణయానికి వచ్చింది.

మర్నాడు 'బారామతి మారథాన్' మొదలయ్యే ప్రదేశానికి వెళ్ళింది. పోటీ దారులు అందరూ పరిగేట్టేందుకు అనువైన వేషధారణ తో సిద్ధంగా ఉన్నారు. మన లతాభాగవాన్ మాత్రం 9 గజాల నేత చీరతో, కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా, ఆ ముదిమి వయసులో కంటినిండా ఎదో తెలియని ఆత్మవిశ్వాసంతో నిలబడింది. మొదట ఆమెను పోటీకి అనుమతించలేదు కానీ చివరి అనుమతి ఆమెను పోటీదారునిగా చేయడమేకాదు, తన పట్టుదల, ఆత్మబలం ముందు అంతా దిగదుడుపే అన్న ధీమాతో ఆ పరుగుపందెంలో ప్రధమ విజేతగా ఆమెను నిలబెట్టింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను వీక్షించిన నిర్వాహకులు ఆమెను మరింత ప్రైజ్ మనీ తో సత్కరించారు. ఆ విధంగా తన భర్త ని కాపాడుకున్న ఆమె నేటి సతీ సావిత్రి, ఒక ప్రేమ మూర్తి.

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు