నోరూరించే రుచి

 

శ్రీమతి వెంపటి హేమ గారు అందిస్తున్న తెలుగింటి సంప్రదాయ వంటకాలలో భాగంగా మరికొన్ని రుచికరమైన వంటలను గురించి తెలుసుకొందామా?

తెలుగింటి వంటకాలు

బుంగ మిరపకాయల (కాప్సికం) తో -

కాప్సికం – బంగాళాదుంప కూర :

½  కిలో కాప్సికం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ¼ కిలో బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి , సగం చేసి 1tsp ఉప్పు వేసి, నీళ్ళతో ఉడికించి, చల్లారాక ఒలిచి పెట్టుకోవాలి.  ¼ కిలో ఉల్లిపాయలు, 2 tsp సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నటి ముక్కలు చేసిన 3పచ్చి మిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, ఒక అరకప్పు పచ్చి బటానీలు  అమర్చి పెట్టుకోవాలి.  ఇప్పుడు బాణలిలో 4 TbSp నూనె వేసి, దానిలో ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు ఒక్కొకటి 1 tsp చొప్పున పోపులో వెయ్యాలి. ఆపై అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి, వేయించి, దానిలో ఉల్లిపాయముక్కలు కూడా వేసి, వేగనిచ్చి, కాప్సికం ముక్కలు, బటానీలు  వెయ్యాలి. అవి మెత్తబడ్డాక, ఉడకబెట్టి ఒలిచిన బంగాళా దుంపల్ని సన్నగా చిదిమి దానిలోవేసి, కదిపి మూతపెట్టి 2 – 3 నిమిషాలు పాటు మధ్యలో కదుపుతూ మగ్గ నివ్వాలి. తరవాత మూత తీసి 2 tsp పోడికారం కూడా వేసి కలిపి, మరో కొంచెం సేపు మగ్గనిచ్చి దింపాలి.

దీనిలో పావుకప్పు కొత్తిమీర తురుముకూడా జతచేస్తే, ఇంకా బాగుంటుంది.

కాప్సికం కప్సు :

ఇదికూడా ఒకరకం కూరే! కాని, కాప్సికంని కప్పుల మాదిరిగా తయారు చేసి, కేప్సికం లేకుండా వండిన బంగాళాదుంప కూరను కాప్సికం కప్పుల్లో ఉంచి, “అవెన్లో” సన్నటి సెగపైన మగ్గనివ్వాలి. మరీ మెత్తన కానివ్వకూడదు. ఆ తరవాత ముచికల్ని తీసేసి,ఈ కాప్సికం కప్పులతో సహా కూరను అన్నంతో తినాలి.

వండే పధ్ధతి : ఉడికించిన బంగాళా దుంపల్ని ఒలిచి, సన్నగా చిదిమి ఉంచుకోవాలి. పచ్చి బటానీలనుకూడా తగినంత ఉప్పు చేర్చి ఉడికించి ఉంచాలి. పైకూరలాగే పోపువేసి, పావుకిలో ఉల్లిపాయ ముక్కల్ని అందులో మగ్గించి, ఉడికిన బటానీలు, చిదిమి ఉ౦చుకున్న బంగాళాదుంపలు, తగినంత ఉప్పు చేర్చి పోపులో వేసి, చక్కగా కలిసేలా కలపాలి. 2 tsp పొడికారం కూడా వేసి కలిపి, కొంతసేపు మగ్గనిచ్చి దింపి చల్లారబెట్టాలి.

½ కిలో చిన్నసైజు కాప్సికం తీసుకుని, నేర్పుగా వాటి ముచికలని మూతల్లా ఉండేలా తీసి వేరే ఉంచాలి. దేనిమూత దానికే గుర్తుగా ఉంచాలి. ఇప్పుడు కప్పుల్లాఉన్నవున్న ఆ కాప్సికంలో పట్టినంత బంగాళా దుంప కూరని నింపి, మూత పెట్టాలి. దేని మూత దానికే పెడితే చక్కగా మూసుకుంటుంది. అలా అన్నీ సిద్ధం చేసుకున్నా “అవెన్” లో గాని, ఆవిరిమీదగాని ఉంచి తగుమాత్రం మెత్తబడీలా చేసి తియ్యాలి. కాప్సికం మరీ మెత్తన కానక్కర లేదు. ఒక్కరవ్వ బిరుసుగా కూడా బాగుంటుంది.

(ఆవిరిలో ఉడికి౦చడం ఎలా : ఇడ్లీ స్టాండుకి మూడు ఇడ్లీ రేకులు తగిలించి, ఆ మూడవరేకుమీద ఈ కాప్సికం కప్పుల్ని పట్టినంత వరకు ఉంచి తగుమాత్రంగా ఉడికించాలి. కాప్సికం సైజు పట్టకపోతే రెండు ప్లేట్లతోనే సరిపెట్టాలి.)

కాప్సికం బజ్జీ :

పచ్చిమిరపకాయ బజ్జీలు కారమని తినలేనివాళ్ళు కాప్సికంతో బజ్జీలు చేసుకుని తినవచ్చు.

పావు కిలో కాప్సికం తెచ్చి, దానిలోని గింజలు వగైరాలు తీసేసి, ఆకుపచ్చని ముక్కని తీసుకుని, దానిని సన్నగా పొడవుగా, పచ్చి మిరపకాయ ఆకారంలో తరిగి ఉంచాలి. ఒక పావుకిలో సెనగపిండి, ఒక TbSp వరిపిండి, చిటికెడు సోడా, 2 tsp కారం, ½ tsp వాము కూడా వేసి, బజ్జీ పిండి కలిపి, పాకం వచ్చేలా చిలకోట్టాలి. అప్పుడు పచ్చి మిరపకాయ ఆకారంలో ఉన్న కాప్సికం ముక్కల్ని ఆ పిండిలో ముంచి, పోయ్యిపైన కాగుతున్న నూనెలో దోరగా వేయించి, నూనె బాగా ఓడ్చి తియ్యాలి. అవి పచ్చ్మిర్చి ఘుమఘుమలతో ఓ మాదిరిగా బాగుంటాయి. ఉత్తినే తిన్నా, చట్నీతో తిన్నా బాగుంటాయి.

.... అయిపోయింది ....

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనిషి క్రోధాన్ని దయాగుణంతోనూ, చెడుని మంచిగుణంతోనూ జయించాలి – గౌతమ బుద్ధుడు