Alayasiri


మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

శ్రీ కాళహస్తి ఆలయం, శ్రీ కాళహస్తి, ఆంధ్రప్రదేశ్

Kalahasti temple


త్రిమూర్తులందరిలో, భోళాశంకరుడైన ఆ మహాశివుడు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నింటా వ్యాపించి పంచభూతాత్మ స్వరూపుడైనాడు. ఆ లయకారుని పంచభూత లింగాలు, పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం, తేజోలింగాలు మన భారత దేశంలో ఐదు పుణ్యక్షేత్రాలలో వెలసి పంచభూతలింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ పుణ్యక్షేత్రాలు  కాంచీపురం, చిదంబరం, జంబుకేశ్వరం, శ్రీ కాళహస్తి మరియు అరుణాచలం.

  1. పృథ్విలింగం: కంచిలో ఏకాంబరేశ్వర స్వామి గా ఈ మట్టి లింగం పూజలందుకుంటున్నది. సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే ఈ లింగాన్ని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.
  2. ఆకాశలింగం: చిదంబరం లోని నటరాజస్వామే ఈ ఆకాశలింగం. చిదంబర రహస్యం లాగే ఈ ఆకాశలింగం మనకు కనపడదు.
  3. జలలింగం: జంబుకేశ్వర క్షేత్రంలో వెలసిన ఈ లింగం క్రింద ఎల్లప్పుడూ నీరు ఊరుతూనే వుంటుంది. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చింది.
  4. వాయులింగం: శ్రీ అంటే సాలీడు, కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు వెరసి శ్రీ కాళహస్తి. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు పై మూడు జంతువులకు మోక్షం ప్రసాదించి, వాటి పూజలను గుర్తించి శ్రీ కాళహస్తీశ్వరుడుగా వెలిశాడు. శ్రీ కాళహస్తి ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు.
  5. తేజోలింగం: అరుణాచలంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు.  ఇక్కడ ఏర్పడిన అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని నమ్మినందున ఈ కొండకు తూర్పువైపున అతిపెద్ద దేవాలయం నిర్మించి, ఆ అరుణాచలేశ్వరుణ్ణి భక్తితో కొలిచే పూజావిధానం గౌతమ మహర్షి రూపొందించారని ప్రతీతి.

అరుణాచలేశ్వరాలయము, అరుణాచలం (తిరువణ్ణామలై) గురించిన సమాచారము సిరిమల్లె నవంబర్ 2015 సంచికలో వ్రాశాను. http://sirimalle.com/issues/2015/11/aalayasiri.html.

ఈ ఉగాది సందర్భంగా, దక్షిణ కైలాసం గా పిలువబడుతూ శివుడు వాయులింగ రూపంలో వెలసిన, శ్రీ కాళహస్తి ఆలయ విశేషాలు, ఈ సంచిక ఆలయసిరి గా మీ కందిస్తున్నాను.

దక్షిణ కైలాసం గా పిలువబడే శ్రీ కాళహస్తి ఆలయం క్రీ.శ. ఐదవ శతాబ్దంలోనే చోళ రాజులచే నిర్మింపబడినదని శాసనాలు తెలుపుతున్నాయి. ఐతే 15 శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు ప్రధాన రాజగోపురం మరియు  బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం నిర్మించారని తెలుస్తుంది. ఇక్కడ ఉండే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు ప్రతిబింబాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల పనినైపుణ్యానికి కాణాచిగా నిలుస్తాయి. ప్రధాన ఆలయంలో గల రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. అంటే ఒక దీపానికి మాత్రమే గాలి వీస్తూవుండడం నాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సాక్షం. శ్రీ కాళహస్తి కళంకారీ కళకు పుట్టినిల్లు.

Kalahasti temple

మహాకవి శ్రీ ధూర్జటి, శ్రీకాళహస్తీశ్వరుడి మీద ఒక శతకం వ్రాశాడు. అందులో శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ;

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

ఆ భోళాశంకరుని దృష్టిలో సకల జీవరాసి అంతా ఒకటే. తనను మనసుతో అర్చించిన అందరికీ ఒకే రకమైన ముక్తిని ప్రసాదిస్తాడు.

Kalahasti temple

‘ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి ఆయన వివరించిన విశేషాలు ఆయన మాటలలోనే విందాము....

శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. వాయువంతటి గొప్పక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి. అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది. అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదు. ఇక్కడ ఆలయ శిఖర దర్శనం చేసుకుంటే కైలాసం చూసినట్లే. భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా ఇదే. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని ముఖ్య భక్తుడైన భక్తకన్నప్పకు మొదటి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఈ మహా క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞాన ప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి.

Kalahasti temple

శ్రీకాళహస్తిలో స్వామివారి ఆలయం పశ్చిమాభిముఖాన ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి, మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది. నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది. అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది. పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వ రుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి తల ఓ వైపువాల్చి ఉంది. ఇలా ఏ క్షేత్రంలో కూడా లేదు. మృత్యువును జయించిన గురుదక్షిణామూర్తి కూడా ఈ క్షేత్రంలో దక్షిణాది ముఖాన ఉన్నాడు. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఒక క్షణం కళ్లు మూసుకుని ఆయనను స్మరించుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుంది. చిన్నారులకు గురుదక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాళహస్తి క్షేత్రం పరమశివుని ఆవాసం. ఈ క్షేత్రంలో ఉండటం ఎంతో అదృష్టం. శ్రీకాళహస్తిలో అడుగు పెడితే పుణ్యం లభించినట్లే.

పంచభూత లింగాల్లో కేవలం ఒక్క వాయులింగం మాత్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో మన తెలుగునాట వెలసింది.  శ్రీ (సాలెపురుగు), కాళం(పాము), హస్తి(ఏనుగు)ల పేరిట ఏర్పడ్డ ఈ క్షేత్రం ఆ మూడు మూగజీవుల దైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. అంతే కాక మహా భక్తుడైన ‘భక్త కన్నప్ప’ ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయనలో ఇక్యం అయ్యింది కూడా ఈ మహాస్థలంలోనే. అందుకే ఇక్కడ భక్త కన్నప్ప ఆలయం కూడా మనం చూడవచ్చు.

Kalahasti temple

ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది. ప్రత్యేక దర్శన టికెట్టుకూ ఇదే వర్తిస్తుంది. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది.

పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన ప్రధాన రాజగోపురం గత సంవత్సరం కూలిపోయింది. దాని స్థానంలోనే క్రొత్త రాజగోపురాన్ని వెంటనే నిర్మించి శ్రీ కాళహస్తి ఆలయ వైభవాన్ని యధావిధిగా నిలిపారు. అందుకు సంబంధించిన కార్యకర్తలు, అధికారులు అందరినీ మనం అభినందించాలి.

 

 

Source1, Source2

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్