adarshamoorthlu


బ్రహ్మర్షి రఘపతి వెంకట రత్నం నాయుడు

Raghupathi Venkata Ratnamసకల జీవరాశిలో మానవ జన్మ అత్యుత్తమమైనది. అందుకు కారణం మన మేధోసంపత్తి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఈ మేథోపరిజ్ఞానం వివిధ రకాలుగా నిక్షిప్తం అయివుంటుంది. ఆ జ్ఞానాన్ని, ఆ ఆలోచనలకు వాస్తవరూపం కల్పించాలంటే అందుకు అక్షరజ్ఞానం ఎంతో అవసరం. కానీ, వంద సంవత్సరాల క్రితం వఱకు ఆ అక్షరాస్యత అనేది కేవలం కొద్దిమంది మాత్రమే పొందగలిగారు. అందుకు కారణాలు అనేకం. 19వ శతాబ్ద చివరలో ఎంతో మంది విద్యావేత్తలు, అందరిలోనూ  అక్ష్యరాస్యత కలిగిచాలని, ముఖ్యంగా బడుగు వర్గాలలో విద్య యెక్క విలువలను, చదువు వలన కలిగే లాభాలను, తద్వారా జీవితంలో పొందే అభ్యున్నతిని వివరించి వారిలో నిరక్షరాస్యతను రూపుమాపాలని కృషి చేశారు. వారిలో ప్రధముడుగా నిలిచిన పరమ భాగవత్ శిఖామణి, గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త శ్రీ రఘుపతి వెంకట రత్నం నాయుడు నేటి మన సంచిక ఆదర్శమూర్తి.

1862 అక్టోబరు ఒకటవ తేది కృష్ణాజిల్లా లోని మచిలీ పట్నంలో అప్పయ్య నాయుడు, శేషమ్మ దంపతులకు మన వెంకటరత్నం గారు జన్మించారు. వెంకటరత్నం నాయుడు బాల్యం, విద్యార్ధి దశ ఎక్కువగా ఉత్తర భారతంలో గడిచింది. ఆ తరువాత హైదరాబాదులో, ఆచార్య అఘోరనాధ్ ఛటోపాధ్యాయ శిష్యుడుగా ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం జరిగింది. రాజారాంమోహన్ రాయ్ బ్రహ్మసమాజ ఆదర్శాలకు ఆకర్షితుడై నాటి ఆంధ్రదేశంలో బ్రహ్మ ధర్మ వ్యాప్తికి వెంకటరత్నం కారణభూతుడయ్యాడు. ఆయన ఉన్నత పాఠశాల విద్య హైదరాబాదులో పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం నేడు చెన్నై అనే పిలువబడే నాటి మద్రాసుకు వెళ్లాడు. ఆ తర్వాత మద్రాసు విశ్వ విద్యాలయంలో ఎం,ఎ. పట్టభద్రుడయునాడు.

Raghupathi Venkata Ratnam1886లో ఉపాధ్యాయవృత్తిని చేపట్టినది మొదలు ఆయన వివిధ కళాశాలల్లో ఉపన్యాసకునిగా, ప్రధానాధ్యాపకుడిగా వివిధ హోదాలలో ఉంటూ విద్యావ్యాప్తికై ఎంతో కృషి చేశారు. స్త్రీలకు, దళితులకు, బడుగువర్గాలకు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టించిన ఘనత మన నాయుడు గారికే దక్కుతుంది. నాడు అన్నిరంగాలలో పాతుకుపోయిన సాంఘీక అసమానతను రూపుమాపి ఒక నవ సమాజ సమానత్వాన్ని నిర్మించడానికి ఆయన సల్పిన కృషి అమోఘం. సామాజిక అసమానతలు తొలగి నేడు అందరూ, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించారంటే అది ఆనాడే మన వెంకటరత్నం నాయుడు వంటివారు వేసిన బీజాల ఫలితమే.

పి.ఆర్ కళాశాలలో 1911 వ సంవత్సరంలో మొదటిసారిగా స్త్రీలు చదువుకొనుటకు ప్రవేశం కల్పించిన ఘనత మన నాయడు గారిదే. అంతేకాక బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశాడు. ఎంతోమంది అనాధ విద్యార్థులకు తన సొంత ఖర్చుతో చదువు చెప్పించి వారిలో అక్షర జ్ఞానాన్ని కలిగించిన ఉదారస్వభావి. 1925 లో మద్రాసు విశ్వవిద్యాలయ మొట్ట మొదటి ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మొదటి ఆంధ్రుడు కూడా మన వెంకటరత్నం నాయుడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

ఆయన నిరంతరం కృషిచేస్తూ నాటి సామాజిక రుగ్మతలపై అలుపెరుగక పోరాడారు. అందులో కొన్ని ;

మద్యనిషేధం కొఱకు అలుపెరుగక పోరాటం చేసి చట్ట సభలలో తన గళాన్ని నిర్భయంగా వినిపించారు.

Raghupathi Venkata Ratnamమన తెలుగునాట మొట్టమొదటగా ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రప్రధమంగా బిల్లును రూపొందించి నాటి శాసనమండలికి సమర్పించిన మేధావి మన వెంకట రత్నం నాయుడు. 1927లో అదే విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను పొందిన ప్రధమ వ్యక్తి కూడా ఆయనే. నాటి ఆంగ్ల ప్రభుత్వం ఆయనను దివాన్ బహదూర్, సర్ వంటి బిరుదులతో సత్కరించింది.

 

ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఎన్నో సాంఘీక సంస్కరణలకు కారణభూతుడై పలురంగాల ప్రజల మన్ననలందుకున్న శ్రీ వెంకటరత్నం నాయుడు 1939 మే 26న స్వర్గస్థులయ్యారు. కానీ నాడు ఆయన వేసిన సంస్కరణ విత్తనాలు నేడు వృక్షాలై ఫలాలను అందిస్తుంటే, ఆ సమసమాజ అభ్యున్నతిని అనుభవిస్తున్న మనం ఆయనను ఎలా మరిచిపోగలం.

 

 

Source1, Source2, Source3, Source4

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్