Ankurarpana


గత సంచిక తరువాయి »

క్షణికావేశం

ఇది చాలా ప్రమాదకర ఆవేశం..క్షణం లో ఉద్భవించే కోపముతో..క్షణ కాలం లో నిర్ణయం తీసుకుని.. క్షణం లో బలవన్మరణానికి పాల్పడుతున్నారు...చిన్న వాళ్ళు మొదలుకుని ముసలివాళ్ల వఱకు...రకరకాల కారణాల వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు...అమ్మ కొట్టిందని ఒకరు...మాస్టారు దండించారు అని ఇంకొకరు.. ప్రియురాలు మోసగించిందని ప్రియుడు..పంటలు పండలేదని రైతు...భార్యతో వేగలేక భర్త...చదువుల ఒత్తిడి, ర్యాంక్ ల పోటీని తట్టుకోలేక విద్యార్థి...పిల్లలు ఆదరించలేదని ముసలి తల్లితండ్రులు...ఇలా చెప్పుకుంటూపోతే ..ఎంతమందో బలవన్మరణానికి పాలుపడుతున్నారు...ఆరు నెలల క్రితం మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది..మా పిన్ని, వాళ్ళమ్మాయిని గారాబముగా పెంచింది..ఇంజనీరింగ్ చదువుతున్నపుడు ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పింది..అబ్బాయి ఒక జల్సారాయుడని తెలిసి మా పిన్ని-బాబాయి పెళ్ళికి నిరాకరించారు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి గొడవ చేయడముతో..మా పిన్ని వాళ్ళమ్మాయిని ‘ఇలాంటివన్నీ నీవలనే జరుగుతున్నాయి. అతను ఇప్పుడు గొడవపడుతూ మన ఇంటివరకు వచ్చాడు’ అని రెండు మాటలు కోపముగా అన్నది. అంతే ఆ మాటలకే వాళ్ళమ్మాయి మనస్థాపము చెంది..ఉరి వేసుకుని చనిపోయింది..మా పిన్నిబాబాయిలకు పుట్టెడు శోకం మిగిల్చి వెళ్లిపోయింది..ఈ విషయం నన్ను బాగా కదిలించింది...అందుకే మీతో ఇలా పంచుకుంటున్నాను...ప్రాణం తీసుకోవడం అంతా సులభమా? మనకి ఇంత మంచి మానవ జన్మ వచ్చినందుకు ఎంతో సంతోషించాలి..అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి..చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోకూడదు...ఎవరి జీవితమూ పూల బాట కాదు..కానీ, మనమే మన జీవితాన్ని అందముగా మలుచుకోవాలి. అందుకు కొంత సమయము పడుతుంది అంతే ..సహనము వహించాలి...కానీ నేటి తరానికి ఆ ఓపిక, సహనము కొఱవడుతున్నాయి...జీవితము అంటే వడ్డించిన విస్తరిలా ఉండాలి అనే అభిప్రాయములో ఉన్నారు... ఏదికోరితే అది నిమిషాలలో ఇచ్చే మనలాంటి తల్లితండ్రులు ఉన్నంతవరకు వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. అదే అలవాటుతో వాళ్ళు కోరినవన్నీ వెంటనే దక్కాలి అనే వెర్రి ఆలోచనలో ఉన్నారు...జీవితము ఎంత విలువైనదో...మనం చిన్నప్పుడు ఎదుర్కొన్న సంఘటనలను పిల్లలకు చిన్నప్పటి నుండే వివరించి.. జీవితములో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? ...తదితర అంశాలను వివరిస్తూ వాళ్ళని మానసికముగా అన్నింటికీ సంసిద్ధులను చేయాలి...ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు ఒక ఉద్దేశ్యపూర్వకముగా పంపించాడు...కానీ కొంతమంది మాత్రమే సమాజ శ్రేయస్సుకు పాటుపడి తమ జన్మ సార్థకము చేసుకుంటున్నారు. నేను కూడా చాలా రోజులు అసంతృప్తి గా ఉండేదాన్ని..జీవితం నిస్సారముగా అనిపించేది..కానీ ఎప్పుడయితే వ్రాయడము మొదలుపెట్టానో..నాలో ఒక నూతన ఉత్సాహం చిగురించింది...నా జీవితానికి పరమార్ధం గోచరించింది...నా వ్రాతలతో కనీసం ఒక్కరిలోనైనా మార్పు తీసుకురాగలిగితే నా జన్మకు సార్ధకత చేకూరుతుంది...ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవితపు లక్ష్యాన్ని తెలుసుకుని ...గమ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు పడే తపనే ఆత్మ సంతృప్తి...అప్పుడు ఈ నిరాశ, నిస్పృహ, నైరాశ్యం ఉండవు...మీకు నిజముగా ఈ జీవితాన్ని ముగించేయ్యాలి అనుకుంటే సమాజం కోసం పాటుపడండి...మీ లాంటి బాధితులను ఆదుకోండి...మీ జీవితాన్ని ఒక గుణపాఠ౦గా భావించి..మీ అనుభవాలను ఇతరులతో పంచుకోండి...వాళ్ళ జీవితాలలో వెలుగును తీసుకురండి..ఆ వెలుతురు మీకూ ఒక దారి చూపుతుంది. దీనికి అంకురార్పణ మనవైపు నుండే రావాలి...

 

(...సశేషం...)

 

divider

 

ఈ శీర్షిక గురించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చును. ఎడిటర్@సిరిమల్లె.కాం ద్వారా మాకు ఇ-మెయిల్ చేయండి.

సంపాదకులు: మధు బుడమగుంట, ఉమ బుడమగుంట (కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ.)

మనమీద మనకున్న అదుపు ఒక గొప్ప సంపద. అందుకే మనల్నిమనము సదా పరీక్షించుకుంటూ ఉండాలి – రస్సెల్